Saturday, January 15, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కాటుక కనులే కథలు చెబుతున్నాయి

నల్లని కురులైతే మతులు పోగొడుతున్నాయి

అరవిరిసిన నవ్వులే వరములౌతున్నాయి

జిలిబిలి నీపలుకులే మరులు రేపుతున్నాయీ

ఓ సఖీ  చంద్రముఖీ అందీయవే నీ చేయీ

ఓ చెలీ నెలజాబిలీ నేనోపలేనే ఈ రేయీ


1.తప్పునాది కానేకాదు నీ అందం గొప్ప అది

 చెప్పలేక నామది తిప్పలెన్నొ పడుతోంది

ఏది పోల్చినాగాని నీకది తక్కువగా తోస్తోంది

కలం కదలలేనంటూ కడు తికమక పడుతోంది

ముందుకెళ్ళనా అంటూ తటపటాయిస్తోంది

హద్దుదాటడానికెంతో ఉబలాటపడుతోంది


2.నీ ప్రతి ఒక చిత్రమే వెలుస్తోంది పదచిత్రమై

నీ జతగా ప్రతీకలా ప్రేమకే ప్రతీకలా పవిత్రమై

నీతోటి కలయికలన్నీ తృటిలా ఈషణ్మాత్రమై

కనబడని బంధమేదో ఒక మంగళ సూత్రమై

ముడివేసె మన ఇరువురిని విధి తెగని రీతిగా

అమరమౌ మన అనురాగం ఎడతెగని రీతిగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఈశ్వరా వేంకటేశ్వరా కావరా సర్వేశ్వరా

శివుడవు నీవై  కేశవుడవు నీవై

కాలస్వరూపుడవై ద్రవ్యస్వరూపుడవై

శక్తిసంయుక్తుడవై కాంతిసంయుతుడవై

ఏకమేవాద్వితీయమౌ పరబ్రహ్మవై అమ్మవై


1.సృష్టి స్థితి లయ కార్యోన్ముఖుడవై

సత్వరజస్తమో గుణత్రయాత్మకుడవై

తాపత్రయాతీతమైన అభివ్యక్తుడవై

శ్రీ పరా విద్యా దివ్యపద సంప్రాప్తుడవై

ఏకమేవాద్వితీయమౌ పరబ్రహ్మవై అమ్మవై


2.ఐహికాముష్మిక ఐశ్వర్య వరదుడవై

శరణాగతవత్సల బిరుదాంకితుడవై

మనోవాక్కాయకర్మలతో నమ్మిన వశుడవై

నవవిధ భక్తికి మురిసెడి పరమేశుడవై

ఏకమేవాద్వితీయమౌ పరబ్రహ్మవై అమ్మవై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ పాటే ప్రతిపూట

నీ వెంటే నా బాట

నీవున్న తావే వన్నెల విరితోట

మరులు రేపుతావే నీ సందిట

నీతోటే నా అచ్చట ముచ్చట

నీవులేని బ్రతుకే మరుభూమట


1.కనులే కలువ రేకులు

చూపులే వలపు తూపులు

పెదవుల విరిసేను మందారాలు

పలుకుల కురిసేను అమృతాలు

కలుపుకోనను నీలో కంజదళాయతాక్షి

పంచభూతాలే నా మనసుకి ఇక సాక్షి


2.నగవులే సహజపు నగలు

తలపులే  మరి రేయి పగలు

రేగుతాయి ఏవేవో ఎదలో సెగలు

జాగుమనకేల ఐపోదాం ఆలుమగలు

కనికరించవే నన్ను నీ కరమందించి

అలరించవే నన్ను వినతులాలకించి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాక్షాత్కరించావు కల సాకారమవగా

ప్రత్యక్షమైనావు తపమే ఫలించగా

నువు తప్ప ఇతరమైనదేదదీ వలదునాకు

నీకనులలోనే ఇహము పరము కలదునాకు

వరించనీయవే మది పులకరించగా

తరించనీయవే నాకై అవతరించగా


1.ఎరుగని వారికి శిలవు నీవు

దొరకని వారికి కలవు నీవు

నిను గ్రహించిన జనులకు కలవు నీవు

నీవనుగ్రహించిన మునులకు దైవమీవు

నీ మాయకు నేవశుడను నీ మమతకు పరవశుడను

నీ అనురక్తుడను ఆసక్తుడను నీ ప్రియ భక్తుడను 


2.నను బంధించినావే నీ వీక్షణతో

నే మననిక నిమిషము నీ నిరీక్షణతో

అక్కున నను జేర్చుకో మిక్కిలి మక్కువతో

చక్కని దృక్కులతో చక్కెర పలుకులతో

నీనుండి వెలిసినవాడను నీలో కలిసెడి వాడను

నీ సుతుడను సన్నితుడను సదాతనుడను