Tuesday, September 29, 2020

 పెద్దపెద్ద మాటలేవి చెప్పను

ధర్మపన్నాలు వల్లించను

తత్వబోధచేయగా కోరను

ముక్తి ప్రాప్తించమని వేడను

సాయీ నీ మనుగడ సత్యమని నమ్మెద

నా కడగొట్టుపుత్రుని కనిపెట్టు కొమ్మనెద


1.సృష్టిలోని బాధనంత మూటగట్టి ఇచ్చావే

   ఓర్చుకోతగనంత వేదన కలిగించావే

  తీవ్రమైన యాతనలో మము పడద్రోసావే

  పరిష్కరించుకోలేనివి ప్రసాదించినావే

సాయీ నీ మనుగడ సత్యమని నమ్మెద

నా కడగొట్టుపుత్రుని ఎదపెట్టు కొమ్మనెద


2.మొక్కని మొక్కులేదు ఇన్నాళ్ళుగా సాయీ

కట్టని ముడుపులేదు ఇన్నేళ్ళుగా నమ్మవోయీ

తిరుగని జాగలేదు తిరునాళ్ళుగా ప్రతిదీ నీదయీ

వాడని వైద్యమూ వేడని వేలుపూ లేడోయీ

సాయీ నీ మనుగడ సత్యమని నమ్మెద

నా కడగొట్టుపుత్రుని ధ్యాసపెట్టు కొమ్మనెద


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీలి నీలి బాలగోపాలా మోహన నందలాలా

నీ లీలలు ఎన్నని  కొనియాడుదు వందలా వేలా

నా కలములొ స్థిరపడి నీవే నుడువాలవి చాలా

నీ ధ్యాసలొ మునిగితేలి నేను పరవశించాలా


1.నాది మట్టిబుర్రే నీవు మన్ను తినగ

నీ బుల్లినోటిలోపడగ విశ్వగతిని చనగ

నీఅగడాలు సైచనైతి యశోదమ్మలానేను

నా గుండెరోలుకే  బంధించెద స్వామి నిన్ను


2.పంచేద్రియాలు నావి  పశుప్రవృత్తులు

అదిలించి మళ్ళించవేల సక్రమ మార్గాలు

గోవర్ధనగిరిని కాదు మోయగ నీ ఘనత

నా సంసారభారానికి ఇచ్చిచూడు చేయూత

 రచన,స్వరకల్పన&గానై:డా.రాఖీ


ఎలా చిక్కుబడతామో-ఎపుడు రాలిపోతామో

ఒంటిగా మొదలౌను పయనం-ఒంటిగానే చేరేము గమ్యం

కాలం నదిలో కొట్టుక పోయే కట్టెపుల్లలం

ఏవెంతవరకు కలిసిసాగునో  

ఏవెప్పుడు వేరై వీడిపోవునో 


1.విధిచేతి కీలుబొమ్మలం మనం తోలు బొమ్మలం

భగవంతుడు ఆడుకొనే చదరంగపు పావులం 

పాత్రోచితంగా నటిస్తున్న రంగస్థల పాత్రలం

పాములు నిచ్చెలు ఆశానిరాశలౌ వైకుంఠపాళీ గవ్వలం

ఎవరు ఎలా ఆడాలో ఎప్పుడెవరు ఓడాలో

 సూత్రధారి నిర్ణయాన మనం నిమిత్త మాత్రులం


2.తలిదండ్రులు భార్యాబిడ్డలు వింతైన బంధాలు

చరాచరాలపైనా వదులుకోలేని అనుబంధాలు

రక్త సంబంధాలు తెగని ఆత్మ బంధనాలు

కలిసిన బాంధవ్యాలు వ్యామోహ పాశాలు

ఏవీ మనను పట్టి ఉంచలేవు కాలమాసన్నమైతే

వద్దన్నా వదిలి వెళ్ళిపోతాము కాలుని ఆనతి ఐతే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనులు పలికె కవితలెన్నో

చూపు తెలిపె మమతలెన్నో

ప్రశాంత సరోవరం నీ వదనం

మనోజ్ఞ రసాలరసం నీ రూపం


1.ఊపిరాగిపోతోంది చూస్తూఉంటే

చూడకుంటెనూ శ్వాస అడడంతే

కాలమెంతగడిచేనో కన్ను కదపలేకుంటే

అద్వితీయ అనుభూతికెద లోనౌతుంటే


2.నవ్వుకు తావులు నయనాలో

దరహాసపు నెలవులు అధరాలో

ముదముకు ముదల కపోలాలో

అంతస్మిత అంకం చుబుకం కాబోలో

 శ్రీగంధం రంగరించి బంగారం పోతపోసి

సృజించబడిన శృంగార దేవతనీవు

విప్పారిన కమలమల్లె విరహోత్కఠింతవలె

వగరు వగల వగపు ద్యోతకమాయె నీలో

మునీశ్వరులు సైతం నీ మురిపానికి మరి వశులే

కవీశ్వరులు మాత్రం నిను పోహణించ పరవశులే


1.బ్రహ్మచారులందరికీ అపురూప కలల రాణివి

వరులకు మాయా ప్రవరులకు ఊహా సుందరివి

కాపురాల పునాదులే కుదుపగలిగే నెరజాణవీ

వార్ధక్యం యవ్వనంగ మార్చగలుగు ఓషధివీ

మునీశ్వరులు సైతం నీ మురిపానికి మరి వశులే

కవీశ్వరులు మాత్రం నిను పోహణించ పరవశులే


2.నిను చూసి గుంభనంగ ఉండిపోయె రంభ

నీమెరుపులు తళుకులు తాళకుంది మేనక

పురుషుడవగ సిద్ధపడే నిను మోహించి ఊర్వశి

తత్తరపాటే చెందే నీ సొగసుకు అప్సర తిలోత్తమ

మునీశ్వరులు సైతం నీ మురిపానికి మరి వశులే

కవీశ్వరులు మాత్రం నిను పోహణించ పరవశులే