Wednesday, January 4, 2023

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


దిగజారుతున్నది దినందినం రాజకీయం

మితి మీరుతున్నది పరస్పరం నిందారోపణం 

వ్యక్తిగత తీవ్ర దూషణలతో

అశ్లీల పద ప్రయోగాలతో

సభ్యత అన్నదే మరచిపోయి

సంస్కారానికే దూరమయి


1.ఆరోగ్యకరమైన స్పర్ధ వాంఛనీయమే

వెన్నుపోట్లు కప్పదాట్లు అతిహేయమే

ఏ పార్టీ వాలకమైనా ప్రతి వాదనలో డర్టీ డర్టీయే

నను ఫోర్టొంటీవంటే నేనంటా నువు ఎయిట్ ఫార్టీయే


2.అధికార దాహానికి అంతూపొంతూ లేదే

అవకాశం దొరికిందంటే అవతలి పక్షం ఖైదే

దాడులు ఎదురుదాడులు పగలు ప్రతీకారాలు 

కార్యకర్తల మధ్యన వికారాలు హాహా కారాలు


3.మంచి ఇంచుకైన చేసి గెలవవచ్చు ధీమాగా

 ఐనా తీర్చని హామీలు వాగ్దానాల వింత డ్రామాగా

కుల మత ప్రాంత పక్షపాతాలే తమ ప్రాతిపదికగా

అప్పచ్చులిచ్చి నోటుకు ఓటుకొనే ఎన్నికల వేదికగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భైరవి


ఇసుకమీది రాతాయె నా జీవితం

మార్చుకుంటివేల ప్రియా నీ అభిమతం

బంగారు కలలన్నీ కల్లలైన ఆ క్షణం

బ్రతుకున మిగిలింది మరుజన్మకై నిరీక్షణం


1.చేయి సాచినావు నీవు భావించి చెలిమిగా 

ఊహించుకొన్నాను నాకు నేను నీ చెలియగా

సాయమందించే  సహజాతమైన నీ సుగుణం

నిను ప్రేమించేలా నను మార్చేసింది ఆ ఆకర్షణం


2.కలవరమే రేపాయి నా మదిలో కలయికలు

చనువును పెంచాయి మన మధ్యన గీతికలు

గానమే ప్రాణమనే నీ అంకిత భావం అనుపమానం

నా పాటనే మైత్రికి బాసటగా తలచె నీ అభిమానం

 https://youtu.be/i2qCWqTWx7k


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:శంకరాభరణం


వాగధీశ్వరీ అమ్మా బాసర జ్ఞాన సరస్వతీ

శ్రీ చక్రనగర సింహాసనేశ్వరీ మాతా భారతీ

వ్యాస ప్రతిష్ఠిత వేదాగ్రణీ వాణీ నమస్కృతి

నా ధ్యాసవు శ్వాసవు నీవే పారాయణీ శరణాగతీ


1.విద్యయు వివేకము విచక్షణా నీ వరమే

  ఆలాపన ప్రేలాపన ఆలోచన అన్నీ నీ చలవే

సుభాషితాలు మాత్రమే వాక్కున దయచేయవే

అనురాగ రాగాలే ఇలలో వెలయింపజేయవే


2.బుద్దిని మనసును చిత్తమును శుద్ధిచేయవే

అహంకారమంతటినీ అణచి పారవేయవే

ఉచితా నుచిత వివేచన మదిలో వికసించనీవే

మాలో నీ నిజరూపునీ దేవీ ప్రకటింప జేయవే