Monday, November 18, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:అఠాణా

ప్రకృతికీ పడతికీ ఎంతటి పోలిక
అందుకేగా సృష్టికే అతివ ఏలిక
లలనలోన అణువణువు
జగతిన సుందర తావు 
కవులెంత వర్ణించినా
జిలుగులెపుడు తరిగిపోవు

1.కృష్ణవేణి సింగారం-తరుణి శిరోనయగారం
గోదావరి గంభీరం-సుదతి వదన సౌందర్యం
ఉషఃకాల రవిబింబం-రమణి నుదుటి సింధూరం
కుసుమ సమకోమలం-కలికి మేని లావణ్యం

2.హిమగిరి తగు  ఔన్నత్యం-హేమ హృదయ వైశాల్యం
కేసరి సరి వయ్యారం-నెలత కటి లతా తుల్యం
ఘన జఘన విన్యాసం-నితంబినీ అతులిత లాస్యం
పల్లవ పద సదృశ మానం-మంజరి మంజీర ధ్వానం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మోహన

సౌందర్యోపాసన
సరస హృదయ భావన
సొగసుల ఆరాధన
మనసుకెంత సాంత్వన
సుందర దృశ్యాల ఆస్వాదన
పూర్వజన్మ పుణ్య వశానా

1.బ్రహ్మ సృజనకు విలువను ఇచ్చి
అందగత్తెల సొబగుల మెచ్చి
మురియని మది ఏమది సమాధి
పులకించని మతి నిజమైన చితి
సుందర దృశ్యాల ఆస్వాదన
పూర్వజన్మ పుణ్యవశానా

2.పరస్పరం పడతీ పురుషులు
అనుక్షణం వలపుతొ ఆకర్శితులు
భేషజాల ముసుగులు ఏలా
గుంభనాల లొసుగులె చాలా
సుందర దృశ్యాల ఆస్వాదన
పూర్వజన్మ పుణ్య వశానా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:భీంపలాస్

దోసిటిలో కాసిన్ని నీళ్ళుతెచ్చి
అభిషేకించగా నను నీవు మెచ్చి
మహాలింగ శంభో చూడునన్ను కనువిచ్చి
కనికరించరా ప్రభో నీ అక్కున ననుజేర్చి

1.తిన్నడు చేసినా పున్నెమేమిటో
తిన్నగ కైలాసవాసమొసగినావు
కరినాగులూ మరి సాలెపురుగూ
చేసిరే పూజలని మురిసినావు
ఆపాటిచేయదా నా నోటి పాట
దూర్జటీ నుదుటికంటి జగజ్జెట్టి శరణంటీ

2.లక్ష్మీపతి కమలాక్షుడు దీక్షగా
నిను లక్ష కమలాల అర్చన జేసే
రావణబ్రహ్మ కుక్షినరములతో
రుద్రవీణమ్రోగించి నిను తృప్తిపరచే
మామూలు మానవుణ్ణి నినునమ్ముకున్నవాణ్ణి
మహాదేవ పంచాక్షరి మాత్రం జపియించువాణ్ణి

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
అరిచిమొత్తుకొంటోంది ఆరాటపు అంబులెన్సు
వాహనాలకేదీ కామన్ సెన్సు
ఏనాటికి తీరేనో ట్రాఫిక్ న్యూసెన్సు
చేష్టలుడిగి చూస్తోంది గవర్నెన్సు

1.రూల్సెన్ని పెట్టినా పెనాల్టెంత వేసినా
తిరిగి పోయలేము కదా పోయిన ప్రాణాలని
మనమో మన ఆప్తులో ప్రమాదంలొ గాయపడితె
 ఓర్చుకోలేము కదా ఏ అవాంతరాలని
మరుగున పడిపోయిందా సివిక్ సెన్సు
ఆశించినామంటే అత్యాశే సిక్త్ సెన్సు

2.అత్యవసర వాహనాల ప్రాముఖ్యత ఎంతటిదో
ఫైర్  పోలీస్ వైద్యశాఖల విలువ ఏపాటిదో
ఉన్నంతలొ చోటిచ్చి మార్గాన్ని సుగమ పరచి
సహాయపడలేమా సహానుభూతి వ్యక్తపరచి
మరిచామా మనలోని మానవతా ఎస్సెన్సు
ఉంచగలిగితే చాలు మమనసుని ప్రెసెన్సు