Friday, July 31, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎన్నాళ్ళైందో గుండెనిండా గాలిపీల్చి
ఎంతకాలమైందో బ్రతుకుపట్ల భయం మరచి
అడుగుతీసి అడుగువేస్తె కరోనా పంచన
ఏమరుపాటేమైనా మరణం అంచున
మనదీ ఒక బ్రతుకేనా నిత్యం ఛస్తూ
మనకూ ఇక భవితుందా ఆంక్షలన్ని భరిస్తూ

1.రోజు గడుపుతున్నాం గతస్మృతులను నెమరువేస్తు
బ్రతుకువెళ్ళదీస్తున్నాం అద్భుతాలనూహిస్తూ
విందులూవినోదాలు ఎపుడో బందైనాయి
బంధాలు ఇంటికే బంధీలైపొయినాయి
మనదీ ఒక బ్రతుకేనా శ్వానాల్లా స్వేఛ్ఛేలేక
మనదీ ఒక బ్రతుకేనా శవాల్లా ఇఛ్ఛే లేకా

2.పండగ పబ్బము పెండ్లీ పేరంటాలన్నీ మృగ్యము
ఎన్నడూలేనంతగా శ్రద్ధవహించాలి ఆరోగ్యము
సినీహాళ్ళు షికార్లు దుర్లభమైనాయి
స్నేహాలు మోహాలు పరిమితమైనాయి
మనదీ ఒక బ్రతుకేనా లక్ష్యమే శూన్యమై
మనదీ ఒక బ్రతుకేనా  గమ్యమే దైన్యమై

SRI.V.JANAKIRAMARAO' POST inspiration

https://m.facebook.com/story.php?story_fbid=4169565813118855&id=100001964310859
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:ముల్తాన్

కొడుకునైనా కాచలేక తల్లికెంత తపన
అమ్మ ఆతృత కానలేక బిడ్డకెంతటి వేదన
సంసార సాగరంలో ఉన్నఫళమున పడవ మునక
బిక్కుబిక్కని బిక్కచచ్చిరి దిక్కుదెసనే తోచక

1.కార్చిచ్చే కాల్చివేసెనొ-వరదలొచ్చే ఊరు ముంచెనొ
అయినవారికి దూరమైనా-బ్రతుకు వారికి భారమైనా
భవిత సంగతినెరుగకున్నా-దారితెన్నూ తెలియకున్నా
పయనమైరీ కాలమే చేర్చు తీరానికి
సాగసాగిరి దైవమే కూర్చు గమ్యానికి

2.ఒంటిపైని బట్టమినహా-చేతబట్టిన పొట్టతోసహా
గడిపితీరాలిక పోరుతీరు అనుదినం వెతలేలా తీరు
మానవతపై ఆశచావక-మనుషులంటే వెర్రి నమ్మిక
పయనమైరీ కాలమే చేర్చు తీరానికి
సాగసాగిరి దైవమే కూర్చు గమ్యానికి

For AUDIO plz contact whatsapp no.9849693324
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:బృందావన సారంగ

పుట్టింది ఎక్కడో పెరిగింది ఎక్కడో
చేసే పని ఏమిటో తెలిపే నీతేమిటో
ఎక్కడ తానున్నా ఆనందనందనం
ఏ పనిచేస్తున్నా మహిమాన్వితం
వందే గోకులబాలం వందే నందకిశోరం

1.గోపికల చీరలే ఎత్తుకెళ్ళినా
ద్రౌపదికి చీరలెన్నొ అందించినా
ఎంతగానొ వెన్ననే దొంగిలించినా
సుధాముని అటుకులే ఆశించినా
ప్రతిచర్యలోను అంతరార్థమెంతొ ఉంది
నమ్ముకున్న వారికెంతొ ప్రతిఫలముంది
వందే గోపికాలోలం వందే యశోదానందనం

2.రాసలీలలో మునిగి తేలినా
రాయభారమే చెలగి చేసినా
సారథిగా ధర్మ యుద్ధం నడిపించినా
జీవన సారమున్న గీతను బోధించినా
ప్రతికర్మలోను పరమార్థముంది
ప్రభావవంతమైన తాత్వికత ఉన్నది
వందే గోవర్ధన గిరిధరం వందే కృష్ణం జగద్గురుమ్
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అతిథిగా వస్తేనే ఆ కాస్త ఆదరణ
ఏకైవచ్చి మేకైపోతే ఎవరికైనా ఛీత్కరణ
కరోనా నువు వచ్చిన కొత్తలొ మాకెంత జాగరూకత
పాతబడిపోయావిపుడిక  నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత

1.తొలుదొలుత ఆనాడు చప్పట్లు తప్పెట్లూ
ఉత్సాహపూరితంగా హారతులు లైట్లూ
దేశమంతా లాక్డౌన్లు మూసాము ఇంటిగేట్లు
వార్తల్లో నీ గొప్పలు కూడళ్ళలొ నీ కటౌట్లు
పాతబడిపోయావిపుడిక  నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత

2.మా మొహాల మాస్కులు ఆన్లైన్ల టాస్కులు
సానిటైజర్ యూజర్లు ఫిజికల్ గ్యాప్ సిటిజన్లు
బ్రతికితే చాలనుకొంటూ బలుసాకు భోజనాలు
అలవాటైనావు కదా మాకు నీతో సహజీవనాలు
పాతబడిపోయావిపుడిక  నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత

INSPIRATION:ATTACHED VIDEO
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అడ్డుకాదు మూతిగుడ్డ అందానికి
కనులు చాలు భావాలను తెలుపడానికి
మహరాణులు వాడలేద జలతారు ముసుగులు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో మరుగౌను లొసుగులు

1.దుమ్ము ధూళి నాపుటలో సాధనాలు
వాహనదారులకు కాలుష్య రోధకాలు
వైద్యవృత్తి వారికైతె నిత్యాభరణాలు
పారిశుధ్యకార్మికులకు రక్షణ కవచాలు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో కట్టడౌను వ్యాధులు

2.ఎదలోని వేదనలను దాచుటకై నగవులు
సుందరీకరణనైతె ఇనుమడించ రంగులు
రాతిరి చీకటిని కప్పిపుచ్చగా వెన్నెలలు
బహుళార్థ సాధకాలు అలనాటి బురఖాలు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో మట్టికఱచు వైరస్ లు
రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

సాయి నామం జపించరా
సాయి కోసం తపించరా
సాయినాథుని విశ్వసించర
సాయి సాయని శ్వాసించరా
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥

1.షిరిడి ధాముని చిత్తాన నిలుపు
సాయి రాముని దీవెన గెలుపు
సాయి గాధలు మేలుకొలుపు
సాయి బోధలు బ్రతుకున మలుపు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥

2.సాయికర్పణ చేయి కర్మలు
సాయి ఇచ్చును సత్ఫలితములు
సాయిని శరణన సకల శుభములు
సాయి చరణముల అక్షయ సుఖములు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥