Saturday, April 16, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏడు జన్మల తోడు ఏడు కొండలవాడు

ఎడబాయని మిత్రుడు శ్రీ శ్రీనివాసుడు

ఎలమి అలమేలుతో కూడి చెలఁగెడివాడు

ఏకాదశి వ్రతమున్నచాలు ప్రీతిజెందెడివాడు

ఏడేడు లోకాలకాప్తుడు భవతాప హరుడు


గోవిందుడు గోవిందుడు సుందరాకారుడు

గోవిందుడు గోవిందుడు భక్తమందారుడు


1.ఏనాడు ఏ పాపమే రీతిచేసేమో

ఏచోట ఏదోషమెందకొనరించితిమో

ఎక్కడకు వెళితేమి దక్కదేమాత్ర పుణ్యము

ఎక్కినంతనె గిరులు ముక్తి బొందుట తథ్యమ


గోవిందుడు గోవిందుడు కరుణాంతరంగుడు

గోవిందుడు  గోవిందుడు భవసాగర నౌకా సరంగుడు


2.ఎదుట స్వామి కనబడితే ఎదకెంతో మోదము

ఎన్నగ  ఎవరి తరము పన్నగశాయి చరితము

ఏకాగ్రచిత్తమే స్వామిని చేర్చెడి ఋజు మార్గము

ఎరిగి మెలిగినంత జనులు పొందగలరు మోక్షము


గోవిందుడు గోవిందుడు అరవింద నేత్రుడు

గోవిందుడు గోవిందుడు శరణాగత త్రాణుడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వేమో బిజీ బిజీ

నా మదిలో గజిబిజి

నిను చూడక పడలేను పరిస్థితులతో రాజీ

నను బుజ్జగించ  జూసి అలసె -మా ఇంటి సన్నజాజి


1.పున్నమి నాడే నింగిలో నిండు జాబిలి

నీ శశివదనాన నిరతము వెన్నెలే నాచెలి

తాళజాల నువులేక ఈ మండు వేసవి

నీవు నాతావునుంటే చిరుగాలి విరితావి

నువ్వేమో నల్లపూస

నాకేమో నీదే ధ్యాస


2.వనమున మంజులము సౌరభము గులాబి

రసనకు కడుమధురము కమ్మదనము జిలేబి

అదికన్నా ఇదితిన్నా ఔనన్నా కాదన్నా నీదే తలపు

ఎన్ని ఉన్నా నీవులేక గడుపుట గగనమే ప్రతిమాపు

నీకు నేను మామూలే

నువ్వు పంచప్రాణాలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఉదయరవిచంద్రిక


ఇంటింటి దేవుడు మాయింటి దేవుడు

యుగయుగమందునూ కనిపించు దేవుడు

శ్రీరామ భక్తుడు మా వీరాంజనేయుడు

కొండగట్టులోనా కొలువై యున్నాడు

గుండెగుండెలోనూ స్థిరవాసముంటాడు


వందనాలు వందనాలు అంజనానందన

సుందరాకాండ ధీర మాకు ఆనందమీయర


1.త్రేతాయుగములో సీతారాములకు వారధియైనాడు

ద్వాపరమందున పార్థుని రథమునకు కేతనమైనాడు

రామ భజన వినిపించిన తావేదైనా ప్రత్యక్షమౌతాడు

రోమరోమ మందున రాముని నిలుపుకొన్న పవనాత్మజుడు

శ్రీరామ భక్తుడు మా వీరాంజనేయుడు

కొండగట్టులోనా కొలువై యున్నాడు

గుండెగుండెలోనూ స్థిరవాసముంటాడు


వందనాలు వందనాలు అంజనానందన

సుందరాకాండ ధీర మాకు ఆనందమీయర


2.పెదవులపై రామ స్మరణ ఎప్పుడూ తప్పనివాడు

హృదయములో శ్రీ రాముని ప్రతిష్ఠించుకున్నవాడు

సూర్యుడినే పండుగా మ్రింగేసిన ఘన శూరుడు

సిందూర ధారణతో సీతమ్మను అలనాడు అబ్బురపరచిన వాడు

శ్రీరామ భక్తుడు మా వీరాంజనేయుడు

కొండగట్టులోనా కొలువై యున్నాడు

గుండెగుండెలోనూ స్థిరవాసముంటాడు


వందనాలు వందనాలు అంజనానందన

సుందరాకాండ ధీర మాకు ఆనందమీయర

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనులలో ఏదో తెలియని కసి ఉంది

మనసునే మరీ మరీ ఉసి గొలుపుతోంది

అందం మాత్రమే నీ సూత్రంకానే కాదు

నీ ఆకర్షణ ఎవ్వరినైనా చిత్తు చేయకపోదు

 

1.కన్నులనొదిలెయ్ కురులదే కట్టిపడేసే ఘనత

ముంగురులేమో లేమా నీ ముక్కుపుడుకదే గొప్ప

పెదవుల పాత్రా తక్కువె కాదు చూపుకె ఆరును నా మోవి

అధరాలటుంచి మత్తులొ ముంచును నీ

మేని తావి


2.దబ్బపండు ఛాయ ఒళ్ళు అబ్బా… అనిపించు

పట్టులాంటి ప్రతితావు తనువును తాకు

తపనే పెంచు

తమలపాకు తలపించే పాదాలు ఎంతో మురిపించు

అణువణువున ఆమని సొబగే అనవరతం నీలో

వికసించు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విరి బుట్టలో కూర్చున్న ఓ బుట్టబొమ్మ

పలువన్నెలు రువ్వుతున్న పూలకొమ్మ

ఏడు రంగులున్న నింగి సింగిడి నీవమ్మా

సప్తవర్ణ సంకీర్ణ శ్వేత కిరణమే నీవమ్మా


1.నా సప్తవ్యసనాల సంకలనం నువ్వు

సప్తస్వరాల సమ్మిళితం గలగల నీ నవ్వు

సప్తమహా ఋషులైనా దాసులౌదురంటె నమ్ము

సప్తగిరీశుని చలవతో నను నీవాడినవనిమ్ము


2.సప్తపదే నడవగ నీతో పదే పదే మదికోరే

సప్తతాళాలలో హృదయం నీకై సందడి చేసే

సప్త సముద్రాలొకటైనా మారదు నా తీరే

సప్త ముక్తిధామాలే ఇల నీవుగ సమకూరే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ భారత నిర్మాత-రాజ్యాంగపు నిర్ణేత

బహుజనులకు వెలుగిచ్చిన దివ్యజ్యోతి

సబ్బండవర్గాల ఆశాజ్యోతి అసాధారణ ప్రజ్ఞాజ్యోతి

నేడు అంబేద్కర్ మహాశయుని జయంతి

యుగాలు మారినా చెదరదు ఆయన ఖండాంతర ఖ్యాతి


1.అట్టడుగు వర్గంలో జనియించినా

వెనకడుగేవేయలేదు ఏనాడు

అంటరానితనం వింతరోగమంటూ

సమాజానికెదురొడ్డి నిగ్గదీసినాడు

ఉన్నత చదువులు చదివి దేశానికె వన్నె తెచ్చినాడు

గాంధీజీ ఎదుటనిలిచి తన తత్వం తెలిపినాడు


2.ప్రపంచాన అతి పెద్దదైన 

రాజ్యాంగం పొందుపరిచాడు

హక్కులు బాధ్యతలను విధిగా 

దేశ పౌరులకేర్పరచినాడు

కులమత రహితమైన సమాజానికై పోరు సలుపినాడు

అసాధ్యాలనెనన్నొ సుసాధ్యాలుగా మలచిచూపినాడు