ఎందుకమ్మా ఓ కమ్మా-నీకు అంత సహనం (కమ్మ=కాగితం=paper)
నేలకైనా ఉందా అమ్మా-నీ అంత సత్వగుణం
ఎపుడైనా వస్తే భువికే కోపం-తెస్తుంది తెగటార్చే భూకంపం
దెబ్బతింటె భూ పర్యావరణం-రాస్తుంది జీవ జాతికే మరణ శాసనం
1. స్వఛ్ఛమైన నీ మనసుపై-పిచ్చి రాత రాస్తారు
శ్వేతవర్ణ దేహం పైన -గీతలెన్నొ గీస్తారు
కలాలతో కఠినంగా రాసి గాయం చేస్తారు
ముద్రించే తరుణంలో-యంత్రాల్లో నలిపేస్తారు
చరిత్రనే మోసుక వచ్చిన ఘన చరితే నీదమ్మా
నిన్ను మఱచి ఏమరిస్తే మాకు భవిత లేదమ్మా
2. వ్యాసవాల్మీకాదులు –అక్కున నిను జేర్చారు
కవిత్రయము నిన్నెపుడూ పుత్రికగా చూసారు
అష్ట దిగ్గజాలు నీకు సాష్టాంగ పడ్డారు
జ్ఞానపీఠాధిరోహులు వేలుపుగా కొలిచారు
వెదురు నిన్ను కన్న తల్లి మా కల్పవల్లి
వేణువే నీకు చెల్లి ఓ పాలవెల్లి
3. జ్ఞానమొసగు దేవతగా నిన్నారాధిస్తారు
నేర్చుకున్న అనుభవాలు నీలొ పదిల పరిచేరు
అనుభూతులు పంచుకొని చరితార్థను చేస్తారు
తప్పుగా భావించకమ్మా-తల్లిగ నిను ప్రేమిస్తారు
ఏది చేసినా గాని ఉభయ కుశలోపరే నమ్మా
బాధ కలిగించినా సదుద్దేశమే గదమ్మా
OK