Tuesday, September 25, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సుఖించనీయవే సఖీ
నీపరిష్వంగ పంజరాన విహంగమై
రమించనీయవే చెలీ
నీ అనంగ రంగానా మయూరమై
తపించనీ అధరసుధలు గ్రోలగా భ్రమరమై
జపించనీ కపోల కిసలయాల కొసరు పికమునై

1.చెరిపేయనీ అంతరాల్ని చంద్రికాచకోరమై
చెలరేగనీ ఆదమరిచి శుకశారిక మిథునమై
మరిమరి మురియనీ శకుంతాల యుగళమై
రసజగమేలనీ పెనవేసీ నాగ ద్వయ చందమై

2.నెరవేరనీ కలలన్నీ సీతాకోక చిలుకలై
కొనసాగనీ జీవనాన్ని సరోవర మరాళమై
ముడివడనీ బంధాన్నీ చక్రవాక యుగ్మమై
తడవనీ తపనలనీ వర్షకారు చాతకమై

https://www.4shared.com/s/fhFk0jkxmgm

https://youtu.be/n-5pwABwdbA?si=nIRG_-xXnb0n0Uot


ప్రజల కొరకు పజల చేత ప్రజాపాలన
సాధ్యమైతీరుతుంది మన ఓటు వలన
ఎనలేనిది కొనలేనిది ఓటుకున్నవిలువ
వినియోగించితీరు తగు ఏలిక గెలువ

1.విశిష్ట ప్రజా స్వామ్య వాద దేశము మనది
ప్రపంచఖ్యాతినొందిన రాజ్యాంగము మనది
అంబేద్కర్ మహాశయుని మేధాశక్తితో
అవిరళంగ ప్రగతి బాట సాగుతున్నది
దేశపౌరులందరికీ పాలనలో సమభాగము
ఓటుహక్కు వాడుకతో కలిగిన సౌలభ్యము
ఎనలేనిది కొనలేనిది ఓటుకున్నవిలువ
వినియోగించితీరు తగు ఏలిక గెలువ

2.ఓటువిలువ మారిపోదు వ్యక్తి వ్యక్తికీ
ఓటు లొంగిపోనెపోదు ఏ దుష్టశక్తికీ
కులమతాలు మార్చలేవు అభిమతాలను
ప్రలోభాలు తార్చలేవు మనోగతాలను
జాతినిర్మాణమందు ఓటొక ఇటుక
ఆత్మాభిమానాన్ని పెట్టబోకు తనఖా
ఎనలేనిది కొనలేనిది ఓటుకున్నవిలువ
వినియోగించితీరు తగు ఏలిక గెలువ