Thursday, February 23, 2023

 వలపుల వలవేసి పట్టావే సూరమ్మా

సూదంటురాయి సూపుల్తో పడగొట్టావే సుప్పనాతి ముద్దగుమ్మా

గుట్టుగా నను బుట్టలొ పెట్టావే సూరమ్మా

జెగజ్జెట్టీనే  గాని ఒట్టిగనే నీకు లొంగానే రామసక్కనమ్మా


1.పిక్కలమీదికి నువ్వు సుక్కల సీరనెగ్గట్టి

ఏడేడు తులాల ఎండికడియాలే కాళ్ళకు బెట్టి

నడుము ముడతల్లో సింగారమంతా దాపెట్టి

గోచీకట్టుతో తిప్పుకు పోతుంటే చూసా నోరెళ్ళబెట్టి


2.పొడుగాటి నీజుట్టు తట్టెడు సిగజుట్టి

సిగలోన ఎర్రనీ ముద్దమందార పువ్వెట్టి

పువ్వులాంటి నీ ఒళ్ళు నా మతిపోగొట్టి

కాళ్ళబేరమాడిందే నామతి నిను కాకాపట్టి



 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:సిందుభైరవి


హే దీనదయాళా హే పరమ కృపాళా

శరణాగత వత్సలా చూపరా నీలీల

కరుణాలవాల ఆదరించరా నన్నీవేళ


1.నీ మోహన మధుమురళీ సుధలు గ్రోలనీ

  నీ పదపద్మాల మ్రోల నా శిరసు వాలనీ

నీ దివ్య సన్నిధిలో సచ్చదానందమందు తేలనీ

అలౌకికానుభూతిలో నను శూన్యమై మిగలనీ


2.ఎన్ని జన్మలెన్ని వెతలు ఎన్నెన్నియాతనలు

ఎన్నగలేను నా దోషాలు  కోరితి మన్ననలు

అలసినాను  సొలసినాను ఐనా నిను వీడను

కలవనీ నీలో నను స్వామీ ఏదిక మరి వేడను


 https://youtu.be/iA3qTLNC12M?si=cbWdfG5daqgMtMZf

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


సత్యదేవాస్వామీ పక్షపాతరహితా మహిమాన్వితా

శ్రీ సత్యనారాయణా శరణు శరణు నారద వినుతా

నీరాజనమిదె  నీలోత్పల నేత్రభాసితా

కర్పూరహారతిదే కమలాసన పూజితా


1.బ్రాహ్మణ శూద్ర వైశ్య క్షత్రియ భక్తుల కథలు

కలిగించును నీ మహిమల అనుభూతులు

నీ వ్రతమొనరించినంత దాసుల వెతలు

ఎలా తొలగెనో తెలిపెడి నీ లీలల గాథలు


2.షోఢషోపచారములతొ నిను అర్చించి

శ్రద్ధాసక్తులతో నిష్ఠగ నీ  వ్రతమాచరించి

సూత ప్రోక్తమగు నీ నోము విధి నిర్వర్తించి

నీ కృప నొందేము తీర్ధ ప్రసాదాల స్వీకరించి


 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చిచ్చు పెడుతోంది పెదవిమీది పుట్టుమచ్చ

రెచ్చగొడుతుంటే పయ్యెద నా ఎదన రచ్చ

మచ్చుకైనా చూపించవే నామీద నీకున్న ఇచ్ఛ

గిచ్చుతోంది నీపొంకం నా శీలానికి తెస్తూ మచ్చ


1.బంగారం రంగరించి శృంగారం బోధపర్చి

సృజించాడు  సృష్టికర్త  నిన్ను  నా గురించి

రసకృతులు రతి కిటుకులు కడు నేర్పించి

నా ముందుంచాడు కుందనాల బొమ్మగ కూర్చి


2.నీ హావభావాలతొ నాలో పెల్లుబికే లావాలు

నీ కులుకులొలుకు పలుకులతో రసనస్రవాలు

మునిపంటితొ నొక్కిన పెదవి రేపేను ఉద్వేగాలు

క్రీగంటితొ విసిరిన శరము తీసేను నా ప్రాణాలు


 మా ఇంటి వాకిట్లో మల్లెపూల పరిమళాలు

మా సింహద్వారానికి మామిడాకుతోరణాలు

బంధుమిత్రులారా మీకివే హార్దిక స్వాగతాలు

మా నూతన గృహప్రవేశ సాదర ఆహ్వానాలు

స్వాగతాలు ఆప్తులారా మీకివే సుస్వాగతాలు


1.ఎన్నాళ్ళుగానో కన్న మా కలల పంట

చిన్నదైనా ఇది మా స్వప్న సౌధమేనంట

తోడునీడగా నిలిచింది నిలువెత్తు రూపంగా

మా ఆశలు నెరవేర్చి వెలుగిచ్చే బ్రతుకుదీపంగా


2.మదిలో దాగిన మమతలు పునాదిగా

ఆదరణే రూపుగొని కిటికీలు గమ్మాలుగా

ఆప్యాయత కలబోసి మూల స్తంభాలుగా

వెలిసింది మాఇల్లు వీడని బంధాలే  గోడలుగా


3.హృదయాన్ని పరిచాము చలువరాయిగా

తీరిచిదిద్దాము ఉన్నంతలొ కలికితురాయిగా

అడుగిడు అతిథులకు  అనుభూతే హాయిగా

మా ఇల్లే ఇలలో స్వర్గసీమగా జనులే తలపోయగా