Tuesday, November 10, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిన్న ఒక పీడకల నేడే శుభోదయం

రేపనేది ఉండదిక నేడే శుభోదయం

ఆచితూచి అడుగే వేస్తే నేడే శుభోదయం

పంచదార పలుకే నుడివితే నేడే శుభోదయం

శుభోదయం శుభోదయం శుభోదయం


1.వినడాన్ని పెంచుకుంటే నేడే శుభోదయం

మౌనాన్ని ఆశ్రయిస్తే నేడే శుభోదయం

చిరునవ్వులు రువ్వుతుంటే నేడే శుభోదయం

నలుగురికి నొవ్వకుంటే నేడే శుభోదయం

శుభోదయం శుభోదయం శుభోదయం


2.తొందరపాటు మానుకుంటే నేడే శుభోదయం

    బాధ్యతను వీడకుంటే నేడే  శుభోదయం

    ఫలితం ఆశించకుంటే నేడే శుభోదయం

    ఉండీలేనట్టు ఉంటే నేడే శుభోదయం

   శుభోదయం శుభోదయం శుభోదయం


https://youtu.be/QBmDnUqSnlE?si=wdpPumZj7HPEnpzh


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఆకృతి ప్రణవనాదమై-నీ జాగృతి చతుర్వేదమై

ప్రకృతి నీ భౌతికత్వమై- పంచభూతాత్మకమై

సంసృతియే విశ్వతత్వమై -తాపత్రయాత్మకమై

జగతియే అర్ధనారీశ్వరత్వమై అద్వైతతత్వమై

పంచాక్షరి మంత్రమే పవిత్రమై భవతారక సూత్రమై

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.గజముఖుడే సంకల్పమాత్రుడై

షణ్ముఖుడే కార్య కృపాపాత్రుడై

సంకేతాలతో సాఫల్యము కూర్చగా

ఉపాసన బలముతో ఈప్సితమీడేర్చగా

జగతియే అర్ధనారీశ్వరత్వమై అద్వైతతత్వమై

పంచాక్షరి మంత్రమే పవిత్రమై భవతారక సూత్రమై

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2. నిను శోధించగా అంతర్ముఖుడనై

నను నివేదించగా కార్యోన్ముఖుడనై

బంధాలు తొలగ బ్రహ్మానందమునై

తామరాకు మీది నీటి బిందువునై

జగతియే అర్ధనారీశ్వరత్వమై అద్వైతతత్వమై

పంచాక్షరి మంత్రమే పవిత్రమై భవతారక సూత్రమై

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విషయం చిన్నదే మగటిమికెంత గడ్డు

చూపుతిప్పుకునుటకు అదేపెద్ద అడ్డు

పనిలేక పడుండదేం నంగనాచి బొడ్డు

పడతి పొంకాలలో ఊరించేదా లడ్డు


1.దోసగింజ పోలికతో మది దోస్తుంది

   ముత్యమంత సొగసుతో మత్తిస్తుంది

   లోతెంతో తెలియకుండ వలవేస్తుంది

   తొంగితొంగిచూస్తూనే కనికట్టు చేస్తుంది


2.గర్భాన ఉన్నప్పుడు నాభితానె సాకింది

   బ్రహ్మావిర్భావానికీ కారణభూతమైంది

   దృష్టిదాటి పోనీడు తన సృష్టిని విధాత

   మణిపూరక చక్రానికి నాభియే అధినేత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందమా అభివందనం

వయసుకు నువుశ్రీ చందనం

వలపునకే  సులువైన ఇంధనం

మనసుకు నీవే మాయాబంధనం

ప్రకృతి చిత్రమే ప్రన్నదనం విశ్వరూపమే విన్నాణం


1.సర్వేంద్రీయాణాం నయనం ప్రధానం

ప్రధాన నయనానికి సౌందర్యమె ప్రమోదం

అతివ అంగాంగం అనతిశయ సుందరం

మతికే చూపునిస్తె మహదానందకరం 

నడక వయ్యారం నగవు మణిహారం రమణి రమణీయం


2.పురుషుడికిల అస్తిత్వమె ధీరత్వం 

వర వక్షస్థల విశాలతే వనితాకర్షకం

మెలితిరిగిన మగటిమిగల బాహువులు

గాఢ పరిష్వంగ కామనా హేతువులు

మూతికి మీసం చేతల రోషం వెరసి మగతమే మురిపెము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోపానికి పెద్ద దిక్కు అందాలముక్కు

కోటేరులాంటి ముక్కు కోరుకునే మొక్కు

సంపంగి ముక్కైతే సుముఖకు లక్కు

చప్పిడిముక్కైతే పోల్చగ చచ్చే చిక్కు


1.నాసికయే సూర్యచంద్ర నాడుల మార్గం

నాసికయే ప్రాణవాయు సింహద్వారం

నాసిక  వాసన కొరకై పరిశీలనాంగం

నాసిక రామాయణ కావ్య ప్రధానాంశం


2.ముక్కు ముక్కెరది వీడలేని బంధం

ముక్కులేక కళ్ళజోడు తిప్పలేమనందాం

ముక్కుసూటితనమే బహు చక్కని వ్యక్తిత్వం

ముక్కుమూసుకుని చేసే తపమే నిస్సగత్వం

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


జన్మ ఖైదు జైళ్ళు నీ కళ్ళు

చూపులు వేస్తాయి మనసుకు సంకెళ్ళు

ఆ కళ్ళు పెంచేను తమకాల ఆకళ్ళు

చూస్తూనె ఉండిపోతాం బ్రతికినన్నాళ్ళు


1.నీ అందచందాలు నేనెంచలేను

నీ మేని పొంకాలపై దృష్టైన లేదు

నీ హావభావలు గమనించలేను

స్థాణువైపోయాను కనగానె నీ కన్నులను


2.హాయిగొలుపు నీ కళ్ళు వెన్నెల లోగిళ్ళు

మత్తైన నీకళ్ళు ఎదలోకి గుచ్చే ముళ్ళు

ఆకర్షించు నీకళ్ళు సూదంటురాళ్ళు

మాయచేయు నీకళ్ళు అమ్మవారి గుళ్ళు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమన్న ఉందా నీ అందం

నా ముందరి కాళ్ళకది బంధం

గాలిమోసుకొచ్చింది నీ సుగంధం

పరవశించిపోయింది నా డెందం


1.ఇష్టపడుతోంది మిళింది  నీ మోవి మకరందం

పోల్చుకుంటోంది హరివిల్లు నీ మేని చందం

కళ్ళలోనె ఇల్లుకట్టి నిన్ను దాచుకుంట 

గుండెనే తొలగించి నిన్ను నిలుపుకుంట


2.వందలాది కైతలకు చాలకుంది  చక్కదం

కలం రాసి అలసిపోక పొందుగా ఆనందం

నే పడిచస్తాను నీ నవ్వుకోసం

అర్రులు చాస్తాను ఔననుట కోసం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


మహాదేవి మనసా స్మరామి

వాగ్దేవి వచసా భజామి

శ్రీదేవీ శిరసా నమామి

శూలధరీ శుభకరీ యశక్కరీ

ప్రణతోస్మి సౌందర్య లహరి

నీరాజనం నీకిదే శాంకరి


1.మలక్పేట స్థిరవాసిని

మహిషాసురమర్ధినీ

మానస సంచారిణీ

మహదానందకారిణి

ప్రణతోస్మి సౌందర్య లహరి

నీరాజనం నీకిదె శివకామిని


2.మనో వికాస కారిణి

చతుషష్టికళా విలాసినీ

కవిగాయక వరదాయిని

వీణా పుస్తక హస్తభూషిణీ

ప్రణతోస్మి సౌందర్య లహరి

నీరాజనం నీకిదే పూత్కారీ


3.సౌభాగ్య దాయిని శ్రీకరి

  జననీ సకల సంపత్కరి

డోలాసుర భయంకరీ

ధర్మపురి నరహరిసతి సిరి

ప్రణతోస్మి సౌందర్య లహరి

నీరాజనం శ్రీహరి మనోహరి