Thursday, January 30, 2020

పున్నమి నిశిలో నీవే శశివి
ఎన్నగ మేధకు నీవే నిశితవి
అన్నుల మిన్నా నీ మనసు వెన్న
కన్నుల దాచుకో సఖీ ననునీవెన్న

1.నీ ప్రతి ఉదయాన రవి నేనౌతా
నీ రస హృదయాన కవి నైఉంటా
పరసువేది నీవై నన్ను మార్చుకోరాదా
పరకాయవిద్యతో నాలొ చేరిపోరాదా

2.అలమటించు వేళలో ఆసరానౌతా
పలవరించువేళలో కమ్మని కలనౌతా
మూడుతో ముడివడి ఏడుగ తోడౌతా
ఏడేడు జన్మలకూ నీవాడిగ నేనుంటా
అతిసామాన్యమే నీ అందం అతివా
రతిదేవిలాగా నా మతిపోగొట్టితివా
గతిగానను నిను వినా ననుగను లలనా
తగనివానినా నను చేకొనవీవెందువలన

1.నిను ప్రేమించే నీ చెలికాడను
ఆరాధించే నీ ప్రియ భక్తుడను
నీ క్రీగంటి చూపుకైన నోచని వాడను
బ్రతుకంతా ధారపోయు నీ దాసుడను
గతిగానను నిను వినా నను గను లలనా
జవదాటను నీ మాటను నమ్మి చేయందుకొనుమ

2.ఎందరో నీకై పడిగాపులు పడెదరు
ఇంకెందరొ నీకు బ్రహ్మరథం పడుదురు
అనురాగం ఆలపించు వారెవరో ఎరుగవా
ఎదరాణిగా నీస్థానం ఎచటగలదొ గ్రహింపవా
గతిగానను నినువినా నను గను లలనా
ప్రతినిమిషమునీదిగా నా మనుగడ సాగుగా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నమ్మకుంటే నువ్వే ఓ పిచ్చి ఫకీరు
విశ్వసిస్తే సద్గురు దత్తుడికి నువ్వే మారుపేరు
అవధూతవు నీవూ షిరిడీ సాయిబాబా
అనాథనాథుడవు ద్వారకామాయివాసా

1.షిరిడీలో అడుగిడితే కష్టాలు దూరమౌను
మసీదు మెట్లెక్కితె సంతోషము చేరువౌను
భౌతికంగ లేకున్నా బాబా నీ ఉనికిని ఎరిగేము
సమాధినుండీ సమస్యలకు సమాధానమొందేము
పటమైనా శిలయైనా బాబా నీప్రతిరూపమే
పిలిచిన పలికేటి సాయి నువు ప్రత్యక్ష దైవమే

2.బాబా నిను శరణంటే ఆదుకొనుట సత్యము
బాబా నిను తలచుకొంటె నిబ్బరమే తథ్యము
మా వ్యాధులన్నిటికీ నీనామమె ఔషధము
నీపై భారం వేసిన చేర్చగలవు భవతీరము
నవనిధులను ప్రసాదించు కల్పవృక్షమే నీవు
శ్రద్ధ ఓర్మిల మాత్రం దక్షిణగా కోరుదువు
కలవడం అన్నది కలైతే ఖేదం
తొలగునా ఎప్పటికైనా మన మధ్య భేదం
కలిసినట్టె ఉంటుంది మన ఇద్దరి మనోగతం
కలతలేల తలపులలో కలగనీ ఆ మోదం

నాలోని లోపమేదో ఎరిగించమంటాను
పునర్నిమించి తత్త్వం సవరించుకొంటాను
ఎదలోన కాసింత చోటుకోరుకుంటాను
నేనంటూ మిగలకుండా నీవై పోతాను

చేరువగా  రావడానికి అంతజంకు ఏలనో
దూరమై మనలేకా చింత ఇంక ఏలనో
వద్దనీ అనలేవూ నా వద్దకూ రాలేవూ
లోలకమై అటూఇటూ ఊగిసలే ఆడేవూ

జలతారు ముసగుల్లో వెతలెన్నొ దాచేవు
చిరునవ్వు మాటున నొప్పినంత కప్పేస్తావు
గాయాలకు పూసే మలాం ఉంది నా కవితల్లో
గుండెమంట చల్లార్చే జల్లుంది నా గీతాల్లో
వేనోళ్ళ పొగడినా వేంకటేశ్వరా
విలాసాలు నీవెన్నో వివరించ తరమా
లక్షల పుటలతో  నీ కృతి లిఖియియించినా
నీ లీలలన్నీ కూర్చగ నా వశమా
సుందర వదనారవింద ఫణిపతి శయన
వందనమిదె మందార మకరంద మాధురీ వచన

1.వాల్మీకీ వ్యాసులు నారదాది మునివర్యులు
త్యాగయ్య అన్నమయ్య పురందరాది కవివర్యులు
పురాణాల నుడివినా పదముల నుతియించినా
ఒడవలేదు స్వామీ అతులితమౌ నీ మహిమలు
సుందర వదనారవింద ఫణిపతి శయన
వందనమిదె మందార మకరంద మాధురీ వచన

2.నేనెరిగినదెంత యనీ నీ చరితను వ్రాయనూ
నీ వరముల అనుభవాలు పొందలేదేనాడును
విన్నవీ చదివినవీ పుకారులై చెలఁగినవీ
ఎన్నుతు మన్నన జేతు దోషాలను మన్నించు
సుందర వదనారవింద ఫణిపతి శయన
వందనమిదె మందార మకరంద మాధురీ వచన