Saturday, July 4, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

పరులకోసం బ్రతుకడ మన్నమాట అటుంచు
నీకోసమె నీకు నీవుగ ఇకనైనా జీవించు
కోల్పోతే తిరిగిరాదని తెలుసుగా సమయం
నీఎడల నీవే శ్రద్ధగా చేసుకో కాలాన్ని వినిమయం

1.ఎన్నాళ్ళైనదో నిలువుటద్దం ముందు నిలిచి
తేరిపార ఆసక్తిగా నిన్ను నీవే పరికించి చూచి
ఎన్నిమార్పులు చేర్పులో నీదైన దేహస్థితిలో
వన్నెలెన్ని తరిగెనో వడిగ సాగే కాలగతిలో
ఎపుడుతీరునొ బ్రతుకు పరుగున ఆయాసం
ఎపుడుదొరుకునొ నీది మాత్రమే ఐన నిమిషం

2.నీలొకి నీవే తొంగిచూసిన సందర్భమే లేదు
నీతొ నీవే గడుపగలిగిన క్షణమొక్కటైన లేదు
చల్లగాలిని చందమామను అనుభూతి చెందావా
వాన ధారను వాగు ఈతను ఆస్వాదించావా
సమయమేదను సాకును నీకోసమైనా మరచిపో
బాల్యమిత్రుల స్నేహితాన్ని ఇపుడైన అందిపుచ్చుకో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కళ్యాణి

నిష్కామకర్మలే ఉత్కృష్టమైనవి
కర్మఫలాలేవైనా అన్నీ దైవానివి
కర్తవ్యపాలనయే కర్మానుష్ఠానము
నిస్పక్షపాతమే ఆచరించ శ్రేష్ఠము
వెంటాడును జన్మలు దాటి మన కర్మలు
వేధించును వ్యాధులతోని దుష్కర్మలు

1.యథాతథంగ స్వీకరించు జీవితం
అతిగా ఆశిస్తే అడియాసయె సంప్రాప్తం
వెతలన్నీ కతలేలే కలతల జతలేలే
అహమునొదల ఇహమున సుఖమేలే
వెంటాడును జన్మలు దాటి మన కర్మలు
వేధించును వ్యాధులతోని దుష్కర్మలు

2.సమర్పణ భావనే శిరోధార్యము
స్వీయాపాదనే ఫలితమందు వ్యర్థము
వికసించాలి ఎద ఎద ఔదార్యము
వసుధైక కుటుంబమే మనుగడ ఔషధము
వెంటాడును జన్మలు దాటి మన కర్మలు
వేధించును వ్యాధులతోని దుష్కర్మలు