Friday, March 9, 2018

దయగనరా నను నరహరి బిరబిర
కరుణను బ్రోవర శ్రీహరి వేగిర
ధర్మపురీశా ధర నిజ భక్తపోషా
ప్రహ్లాద వరదా ఆర్తత్రాణ బిరుదా

1.ఊహ తెలిసినాడే ఊరి దేవుడవంచు
శేషప్ప పద్యాల నీ గుణగణముల వినుచు
పొద్దూమాపు నిను దరిశించుకొంటూ
నిను నెఱనమ్మితి ననుగాతువంటూ

2.ఏ సుఖములు బడసె నీదాసులు
ఎపు డానందించిరి నీ సిసువులు
బ్రతుకంతా నిను బ్రతిమాలుకొనుడే
మతిమాలి గతిలేక నిను స్తుతించుడే

3.నీ మైమలు మాకూకదంపుడే
నీ లీలలు ఇల పుక్కిటి గాథలే
ఋజువు పరచుకో ఇక నీ ఉనికిని
స్పష్టపరచు స్వామీ కలవని కలవుకావని
రాతి గుండె నాతి
ఎరుగలేము నీ రీతి
కవ్వింతలు నీకాన వాయితి
చితి పేర్చుటే పరిపాటి

1.చిరునవ్వుకె దాసులై
కరస్పర్శకె బానిసలై
చూపులవలచిక్కి చేపలై
ఆకర్షణజ్వాలన శలభాలై
బలిచేసుకునే అర్భకులు
ఈ పురుష పుంగవులు

2.స్నేహ మనే మాయలో
ప్రేమయనెడి భ్రమలో
తడిలేని వింతబంధాలలో
వృధా క్షణికా నందాలలో
కాలంమంత కరగదీయు మగవారు
బ్రతుకంత వేదనలో మునుగుతారు

3.ఏ చరిత్ర చూసినా
భామా బాధితులే
దేవదాసు మజ్నూలు
వనితోపహతులే
లేమయన్నదెవ్వరీ శిలాహృదయను
నఖశిఖపర్యంతము కనలేము దయను
విద్దెల తల్లి ఓ పాలవెల్లి
ముద్దు సేయవే నను వద్దనక
నీ బాలుడనే పలుకుల నెలత
నను దయగనవే గొనవే చేజోత

1.మదిలో మెదిలిన సుద్దులనన్ని-ఒద్దికగా నుడివించవే
మతిలో చెలగెడి చింతనలన్ని-సుగతినెప్పుడు నడిపించవే
పెదవులు దాటెడి పదముల-నొడుపుగ సడిసేయవే
తలపుకు మాటకు పొంతన నెఱపి-తెఱకువ నీయవె

2.తేనియలొలికే సుతినే-స్వరమున వరమీయవే
నయమును గూర్చెడి అనునయ బాసను-దయసేయవే
చెవులకు చవులూరు నాదము గొంతున-వెలయించవే
కవితా పాటా పాటవమున-నొప్పారగా దీవించవే