Friday, September 4, 2020

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో...

రచన,స్వరకల్పన&గానం::డా.రాఖీ

ఉత్ప్రేరకం ఛాత్రునికి ఉపాధ్యాయుడు
పరసువేది విద్యార్థికి అధ్యాపకుడు
అపర బ్రహ్మ ఆభ్యున్నత సమాజానికి
దినకరుడే అజ్ఞాన తిమిరానికి
వందనాలు తీరిచిదిద్దే గురువర్యులారా
కృతజ్ఞతలు సన్మార్గాన నడిపే ఆర్యులారా

1.మట్టిముద్దనైనా మలిచేరు పసిడి బొమ్మగా
గడ్డిపూవుకైనా కూర్చేరు పరిమళాన్ని నేర్పుగా
ఏ వేదమంత్రమున్నదో ఏ ఇంద్రజాలమున్నదో
కాలాంతరాన మీ శిశ్యులే ఏలేరు ఏడేడు లోకాలే
వందనాలు తీరిచిదిద్దే గురువర్యులారా
కృతజ్ఞతలు సన్మార్గాన నడిపే ఆర్యులారా

2.నాణ్యమైన బోధనయే ఏకైక లక్ష్యంగా
విలువలు నేర్పడమే ప్రాథమిక బాధ్యతగా
సందేహ నివృత్తియే  అంతిమ ధ్యేయంగా
సానబట్టి మార్చుతారు రాయినైన వజ్రంగా
వందనాలు తీరిచిదిద్దే గురువర్యులారా
కృతజ్ఞతలు సన్మార్గాన నడిపే ఆర్యులారా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వాలిపోతాను గాలితొ కబురంపినా
ఎదుట నిలిచేను ఎదలోను తలచినా
ఊహల ఝరి దరులకు మనం చెరోవైపు
కల్పనే మన మనసులను ఒకటిగ కలుపు

1.ఆశించడానికి ఏముంటుంది ప్రత్యేకంగా
అనిర్వచనీయమైన మనబంధానా
భావాలు ప్రవహిస్తూ మధురానుభూతులుగా
కలయికలు పరిణమిస్తూ భవ్యమౌ అనుభవాలుగా

2.మూటగట్టుకుందాము క్షణాలనే ఏరుకొని
స్నేహాన్ని ప్రతిఫలించే లక్షణాలనే కోరుకొని
పరస్పరం హితమును కూర్చే నిస్వార్థ లక్ష్యంగా
అపురూపం అపూర్వమయ్యే మైత్రికి సాక్షంగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా మాటలు పాటలతోటే
నా భావాలు పాటల 'తోటే'
నా కవనాలు పాటల బాటే
నా బ్రతుకంతా పాటలతోబాటే
విరులన్ని ఒలికించే నవరసాలు
స్వరాలన్ని కురిపించే హావభావాలు

1.చిరునవ్వుల సిరిమల్లెలు
పలుకుల పారిజాతాలు
చూపుల అరవిందాలు
మూతి విరుపు మందారాలు
విరులన్ని ఒలికించే నవరసాలు
స్వరాలన్ని కురిపించే హావభావాలు

2.ప్రణయ రాయబారులు గులాబీలు
విరహాగ్ని ప్రతీకలు అగ్నిపూలు
పల్లెపడుచు అందాలు ముద్ద బంతులు
సాంప్రదాయ వనితల తీరు సన్నజాజులు
విరులన్ని ఒలికించే నవరసాలు
స్వరాలన్ని కురిపించే హావభావాలు