Tuesday, March 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విష్ణు పాదాబ్జ జనిత

బ్రహ్మకమండల సంభూత

శివజటాఝూట విలసిత

హిమ శిఖర ప్లావిత

గంగా సమ పునీత నా కవిత

పుట్టేది ఏ విధో,తట్టేది ఏ మదో


1.భవమే అనుభవమే ఒక భావమై

హృదిని ఉత్తేజపరచు అనుభూతియై

అంతశ్చేతనలో అస్పష్టరూపమై

అక్షరమే జీవ కణమై పదతతి ప్రాణసద్మమై

అవతరిస్తుంది నాదైన కవిత 

తరింపజేస్తుంది ఏ సరస మదో


2.ఊహయే అనూహ్యమై భవ్యమై

గత కవితల తలమానికమై నవ్యమై

శైలీ శిల్పములో మాన్యయై అనన్యమై

కవనమంత రసాలఫలరసమై రమ్యమై

అలరింప జేస్తుంది నాదైన కవిత

రంజింపజేస్తుందే పాఠక మదో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలనైనా కలవాలని ఉంది

నీ కౌగిట వాలాలని ఉంది

వరమొసగెడి దేవతనడిగి

నా మనసుకు రెక్కలు తొడిగి

ఉన్నఫళంగా- నీవున్నతావే నాకు దేవళంగా


1.తపిస్తున్నాను నీకై ఒక మునిలా

పరితపిస్తున్నా సీతకై రామునిలా

నిరీక్షిస్తున్నా పికముకై ఆమనిలా

ప్రతీక్షిస్తున్నా తారకకై సోమునిలా


2.అల్లుకున్న బంధనాలే అశనిపాతం

పెల్లుబికే కన్నులలో అశ్రుజలపాతం

వెల్లువెత్తు వేదనకు నీ తలపే నవనీతం

వెల్లడించలేని ప్రేమే నా హృదయగతం

Monday, March 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


తామరాకు మీది నీటిబొట్టు నీ గుట్టు

బ్రహ్మకైన బోధపడదు నీ తాత్విక పట్టు

చూడబోతె ఇరుపత్నుల సంసారివి

వాడవాడ బిచ్చమెత్తు సన్యాసివి

ఎంతవింతదయ్య నీమాయ సదయ్య

చింత మాయ  నీ చింతన హాయి కదయ్య


1.ఆది అంతమే అసలులేనివాడివి

అనాదిగా దైవమైన పరమశివుడివి

ఇల్లూ వాకిలీ నీకంటూ పట్టవేవి

ఏనుగుతోలునే ఎపుడూ కట్టితివి

నిన్నుచూస్తె తెలియదా నిరాడంబరమేంటో

అడిగిందల్లా ఇచ్చే నీవల్ల త్యాగమంటేమిటో


2.అందాలను ఏమాత్రం నువు ఆశించవు 

బంధాల వలలోన ఎన్నడూ చిక్కవు

సత్రపు భోజనం మఠంలో నీ నిద్ర

నాకు తోడు నీవేరా కరుణా సముద్ర

నీ కంటె సుఖపురుషుడు ఎవ్వరీ లోకంలో

నిన్నుమించి స్థితప్రజ్ఞులున్నారా ఈ ఇలలో


Pic courtesy: Agacharya Artist

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


పట్టీలతొ మది కట్టేసే నీ పాదాలకు ముద్దు

పట్టుచీర అంచుకు నే పెట్టెదనొక ముద్దు

పట్టపురాణిగ చేకొని చేసితి నినుముద్దు

పట్టుగొమ్మ పరువాలకీవేనని ఇచ్చితినొకముద్దు


1.పట్టుతేనెకాటపట్టు నీపెదాలపై ముద్దు

పట్టుబట్టిపెట్టితి నీ నుదుటిపైన ముద్దు

పట్టరాని ఆనందం నీవిచ్చే ప్రతి ముద్దు

పట్టిపట్టి నువుపెట్టే ప్రతిముద్దూ నాకు ముద్దు


2.పట్టువిడుపు ఉన్నప్పుడు బెట్టైనా ముద్దు

పట్టించుకోనప్పుడు చేదౌను పెట్టే నా ముద్దు

పెట్టకుంటెమానె నన్ను తిట్టుకుంటు నువు ముద్దు

పెట్టేబేడా సర్దుక పుట్టింటికెళ్ళకుంటే బతుకంతా ముద్దు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కుప్పబోసిన అచ్చర ముత్తెము లసలేకాదు

ఏర్చికూర్చిన పదముల పగడములైతే కాదు

తలకూ తోకకు పొంతనలేని వాక్యాలు కాదు

పటాటోపమై వింతనుగొలిపే శైలి శిల్పం కాదు

కవితంటేనే హృదయ జన్యమౌ భావుకత

కవితంటేనే మనసును మనసుతొ కలిపే గీత


1.ఉల్లాసానికి నిలమైయ ఉద్వేగానికి ఆలవాలమై

నవరస సుసంపన్నమై ప్రకృతితో మమేకమై

శివజటాఝూటమౌ ఆకాశగంగయై

అర్జున శరాఘాతజనిత పాతళగంగయై

కవి మనమున ఉద్భవించు బ్రహ్మకమలమే కవిత

కవితంటేనే మనసు మనసుతో పలికే భాష


2.అందరి అస్పష్టానుభూతి అందరికిష్టమైన విభూతి

సరస్వతీమాతృ స్తన్యమే సాహితి ఇది మేధోసంపతి

జానపదుల శ్రమజీవన సౌందర్యమై

సమసమాజ నిర్మాణ సాధనమై

కవి కరమున తిరుగులేని ఆయుధమే కవిత

కవితంటేనే మనసుకు మనసుకు అనుసంధానత

Saturday, March 20, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎక్కడ నీకు నొప్పైనా

కలుక్కుమంటుంది నా గుండె

ఏ మాత్రం నీకు బాధైనా

నలిగిపోతుంది నా మెదడె

ప్రియా నీవూ నేనూ వేరువేరా

ఏనాడో నేను నీవుగా పూర్తిగా మారా


1.గరికమీదనీవు నడవగా నొచ్చే

నీపాదాలకా, అదినా ఎదకుగుచ్చే

బొడ్డుమల్లె నీపైన రాలిపడ్డ నొప్పే

ఇంకా మానలేదు నా నెత్తిబొప్పే

ప్రియా నీవూ నేనూ వేరువేరా

ఏనాడో నేను నీవుగా పూర్తిగా మారా


2.సీతాకోకచిలుక నీ పెదాల వాలి

చేసినగాయాలు నాకెపుడు మాయాలి

సూర్యరశ్మి పడినంత నీ మేను కమిలే

రగిలెనా కన్నుల్లో కన్నీటి మంటలే

ప్రియా నీవూ నేనూ వేరువేరా

ఏనాడో నేను నీవుగా పూర్తిగా మారా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విశ్వసించెద మిమ్ము అశ్వినీ దేవతలారా

నా మనోవాక్కాయకర్మల ద్వారా

నమస్కరించెద తథాస్తు దేవతలారా

ఆయురారోగ్యములందించే విధాతలారా


1.రవిఛాయా పుత్రులై ఆవిర్భవించినారు

ఉషాదేవినే సోదరిగా బడసియున్నారు

హిరణ్యావర్తారద విహారమొనరించెదరు

సంధ్యాసమయమందు వ్యాహళికేగుదురు

మంచిని తలచడమే వాంఛించియున్నారు

సద్భావననే సర్వదా స్మరించమన్నారు


2.ఆయుర్వేదానికే అధిష్ఠాన దేవతలు

వ్యాధిపీడితుల పాలిటి జీవన వరదాతలు

సాధువర్తనులు మీరు దయాహృదయ సంపన్నులు

ఆపన్నుల ఆర్తితీర్చు కరుణా సముద్రులు

నా కుమరుని నయము జేయ ప్రాధేయ పడుచుంటిని

అన్యధానాస్తి తమేవ శరణమని విన్నవించుచుంటిని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండెనెంతొ కెలికెనే కలికీ నీ కులుకులు

ఉండబట్టకుంటినే నీతో కలుప పలుకులు

మరణమేకాస్త మేలు నిను పొందనినాడు

స్వర్గమేనేల వాలు నీవుంటె తోడు నీతోడు


1.ఆగమంటె ఆగలేను మరుజన్మదాకా

అరక్షణమూ వేగలేను నిన్ను చూడకా

 చేరరావు నిను చూస్తుంటే ఆకలీదప్పికా

నిదురపారిపోతుంది రెప్పైనా వాలకా


2.ఇల కాంతలెవరు తూగరు నీకాలిగోటికి

గంధర్వకన్యలైన రారు నీతో పోటీకి

అప్సరసలు దిగదుడుపే నీసాటి పాటనకి

నా పుట్టి ముంచావే అందంగా పుట్టి నీ పాటికి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వేంకట నారాయణా నమో

దివ్యాలంకార భూషణా ప్రభో

శంఖచక్రగదాపద్మ చతుర్భుజ ధారణ

ఆశ్రితజన సంరక్షణ మునిజనవందిత చరణ


1.కుతూహలమున్నది నిను వర్ణించగా

తాహత్తు తగకున్నది నీ భక్తకవిగా

రాసేదెవరైనా రాయించుకొనుట నీ పని

అక్షరాలనావహించ నే నిమిత్తమాత్రుణ్ణి


2. నీవె నిండినావు నా మానసమంతా

పదములు పునీతమాయె నీ పదముల చెంత

నీదే ఇక భారమంటి నా కేలస్వామీ చింత

అనంతపద్మనాభా కనికరించు రవ్వంత

Friday, March 19, 2021

 https://youtu.be/XrG5M-GlKCI

https://youtu.be/80WPuCZWcbo


https://youtu.be/_ra-TS341Og?si=hEsAxRBk1RtiH5p5

పారింది ప్లవ ఉగాది స్వరఝరియై
పాడింది తెలుగులమది మత్తకోయిలై 
లలితలలిత పదయుత సుమకోమలమై
మధుర మధుర తర శ్రావ్య గీతికయై
నవవత్సరాది ప్లవ ఉగాది శుభాగమనం
తెలుగు జగతికిది తొల్త పర్వదినం

ఆరురుచుల పచ్చడినే సేవించగా
ఆర్గురు వైరుల పచ్చడిగా మధించగా
ఆరుఋతువుల కాలగమన నాందిగా
ఆరుచక్రాలు మేల్కొని మేలుకూర్చగా
నవవత్సరాది ప్లవ ఉగాది శుభాగమనం
తెలుగు జాతికిది ఆనందనందనం

పంచమ స్వరాన ఇంపగు పికగానం
పంచభక్ష్యపరమాన్న విందుభోజనం
పంచానన శివమందిర దివ్య దర్శనం
పంచాంగ అంచనాల శుభ శ్రవణం
నవవత్సరాది ప్లవ ఉగాది శుభాగమనం
తెలుగుజనుల సమైక్య విశ్వకేతనం

 ఒకే ఒక గమ్యం ఒకే ఒక ధ్యేయం 

ఒకే ఒక లక్ష్యం ఏకైక మార్గం

భవసాగరం నుండి పయనం

చేరాలి ఆనంద తీరం మనం....


సదానందమై అనంత దిగంతం  నిండినది

చిదానందమై చిరంతనం సాంతం ఉండినది

మహదానందమై మన మది నిలుచునది

సచ్చిదానందమై వరలెడి అద్వైతమేఅది


దేహాలు దగ్ధం కాగా మోహాలు మాయం కాగా

సోహమే యోగంకాగా త్వమేవాహమైనది

ప్రారబ్ధ కర్మలు ఎడబాసి ఐహికమౌ కామనలే బడసి

సంతృప్తితో మనసే అలసి పొందగలము తత్వమసి.

Thursday, March 18, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దాహం పెంచే తరంగిణీ

మోహం పంచే రమణీ

ఎలా తీరుతుందో ఈ తాపము

మృగతృష్ణ కానీకు నీ రూపము


కణకణాన నిండావే నీవే ప్రాణమై

ప్రతి శ్వాసలోనూ నీవే జీవమై

నేనంటూ లేనేలేనూ నా ఎరుకలో

అస్థిత్వం కోల్పోయానే నీ ధ్యాసలో


వాలిపోతా ఉన్నపళంగా నీ ఎదుటన

తిలకమౌతా శాశ్వతంగా నీ నుదుటన

నిను కౌగిట బంధిస్తా ఒక్క ఉదుటన

నటనకాదు నమ్మవే మన కలయిక దైవఘటన

Monday, March 15, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలసట తొలగించే మలయ పవన అనుభూతి

అలకను మానిపించె అనునయ స్పర్శరీతి

ఆహ్లాదం ప్రసరించే పూర్ణేందు మాలతి

ఉల్లాసం కలిగించే సమ్మోహన స్నేహగీతి

నీ ముఖమే అపూర్వ దివ్య బ్రహ్మ కమలం

ఇందిందిరమై గ్రోలెద పుష్కల పుష్ప మరందం


1.ప్రత్యూష కిరణాల హాయిగొలుపు వెచ్చదనం

చిన్ననాటి అమ్మచేతి గోరుముద్ద కమ్మదనం

తొలిప్రేమ ప్రియురాలి అధరాల తీయదనం

పారమార్థ సాధకమౌ ప్రశాంతధ్యానసదనం

అలౌకికానంద దాయకం నీ దివ్య వదనం

వీక్షణ మాత్రాన ధన్యం అనన్యం నా జీవనం


2.నడివేసవి పగటి పూట దాహార్తికి చలివేద్రం

నిశ్చలమౌ నిర్మలమౌ పావనమౌ పాల సంద్రం

కవిగాయక ఉత్ప్రేరక నిత్య పరమ మంత్రం

ఆహారనిద్రా అవ్యయాన్వయ ఏకైక సూత్రం

సౌందర్య లహరియై ఒప్పారెడు నీ ఆననం

పరవశమే కలిగించెడి అద్భుతమౌ ఇంధనం


తెల్లవారదు నాకు నువ్వులేక

పొద్దుపోనెపోదు నువ్వురాక

ఏ పూట గడవదు నీ ఊసులేక

నా కాలు నిలవదు నిన్ను కలవక

ఓ నేస్తమా నా సమస్తమా

అస్తమానమూ నీదేలే నా ధ్యాస

ఆస్తమాలా నువువినా కష్టమే నా శ్వాస


నీకు నేనెంత ముఖ్యమో కాదో

నువ్ లేక బ్రతుకు నాకెంత చేదో

వస్తేరానీ నాకే ఏ అపవాదో

కలనెరవేరనీ కనీసం నీదో నాదో

ఓ నేస్తమా నా సమస్తమా

అస్తమానమూ నీదేలే నా ధ్యాస

ఆస్తమాలా నువువినా కష్టమే నా శ్వాస


మూడునాళ్ళే కదా జీవితం

ముచ్చటగా సాగనీ స్నేహితం

ఉండనీ నీగుండెలో ఓ మూలన

గత జన్మ వాసనే తీరుతీరున

ఓ నేస్తమా నా సమస్తమా

అస్తమానమూ నీదేలే నా ధ్యాస

ఆస్తమాలా నువువినా కష్టమే నా శ్వాస

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వక్కడ-నేనిక్కడ

నిను కలవడానికి చోటెక్కడ

మనిషిక్కడ మనసక్కడ

నా బింకాలన్నీ కప్పల తక్కెడ


1.కలవాలనీ నినుకలవాలనీ

నను నీ రెప్పలపై కలగా వాలనీ

తలవాలనీ ననునీవానిగ తలవాలనీ

కలలోనైనా నీ ఒడిలో నా తల వాలనీ


2.  మోయనీరేయినీ  మోయని హాయినీ

కరిగించగా సరసాల నీ గుండె రాయినీ

అందని ఆనందాలనే ఇక నాకందనీ

పొందని పొందునే నీవల్ల నను పొందనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


 నీ పని నువు చేయి హరా సరా

నను చేసుకోనీయి నా పని తీరా

నా జోలికి రాబోకు  ఆటంక పరుస్తూ

మాటిమాటికీ మనసును చంచలింపజేస్తూ

వరములిచ్చు మాటన్నది నీ పరిధి

కర్తవ్యపాలనయే నాకేకైక విధి


1.జన్మలు కర్మలు పుణ్యపాప ఫలములు

ఎవరికెరుక ఎవరని కర్తలు దాతలు

ఇప్పటికిప్పుడే వేసేయి నేరాలకు శిక్షలు

ప్రక్షాళన గావించి దయచేయి మోక్షము

నీకు చెప్పుడెందుకు తెలవదా ఆ మాత్రము

నిను కోరుడెందుకు తీర్చేవా ప్రతి ఆత్రము


2.పూజలు వ్రతాలు యజ్ఞయాగాదులు

చేస్తేనే ఔతాయా సార్థకాలు జీవితాలు

బదులుకు బదులిస్తే పక్కా వ్యాపారము

ఆత్మ పరమాత్మల బంధమెలా అక్షరము

వికసించనీ నాలో సహస్రార కమలము

అపుడే నే చేరగలను భవసాగర తీరము

Tuesday, March 9, 2021

 "శివలీలలు"


భూనభోంతరాళ సుస్థిరా ఆదిమధ్యాంతరహిత హరా
లింగరూపోద్భవ స్వయంభో శంభో శంకరా
ఎందరు తరించిరో నీ ఉపవాస దీక్షా వ్రతులై
ఎందరు లయించిరో నీలో జాగృత మతులై

శివరాతిరి నిరంతరం శివా నీ నామ స్మరణమే
అహరహం జాగారం భవా నీ గుణగానమే

1.సాలీడు నిర్మించె నీడ నిచ్చుగూడు
సామజమూ అర్పించె పూలూ మారేడు
భుజగము పుణికరించె నాగమణుల వీడు
కన్నులనే పూన్చె నీకు భిల్లుడయీ తిన్నడు

శివరాతిరి నిరంతరం శివా నీ నామ స్మరణం
అహరహం జాగారం భవా నీ గుణగానం

దశకంఠుడు మెప్పించె రుద్రవీణ మీటి
మార్కండేయుడాయె చిరంజీవి నమ్మికతోటి
సిరియాళుడు ధన్యడాయె నీ లీలను చాటి
దుర్గుణ గుణనిధీ ముక్తినొందె నీ మైమకేది సాటి

శివరాతిరి నిరంతరం శివా నీ నామ స్మరణం
అహరహం జాగారం భవా నీ గుణగానం

 "శివపాద రజం"


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)



భోభో భోళాశంకరా శాంభవీ విభో

సామగానలోల సాంబసదా శివా  ప్రభో

మహా లింగ రూపా విశ్వేశా స్వయంభో

భవా మాం పాహి పాహి పాహి నమశ్శంభో

శరణు శరణు శరణాగతవత్సల హరహరా



1.హరిబ్రహ్మార్చిత  అభిషేక ప్రియ ఈశ్వరా

మునిజన వందిత  బిల్వదళాలంకార సుందరా

దేవ దానవ మానవ పూజిత పన్నగ ధరా

వృషభవాహన పంచానన హిమవన్నగ చరా

శరణు శరణు శరణాగతవత్సల హరహరా


2.దిగంబరా ఋతంబరా చర్మాంబర ధరా

కాలకంఠ హే నీలకంఠ హే గరళకంఠ శబరా

త్రయంబకా వైద్యనాథా మృత్యుంజయ శశిధరా

జటాఝూటధర గంగాధర వర జంగమ దేవరా

శరణు శరణు శరణాగతవత్సల హరహరా

Sunday, March 7, 2021

 https://youtu.be/47BOQ6lh_aY


అంతర్జాతీయ మహిళా దినోత్సవ(08/03/2021)

సందర్భంగా మాననీయ మానినులందరికీ శుభాకాంక్షలు*


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)


అమ్మనురా నే ముద్దుగుమ్మనురా

తడియారని కంటి చెమ్మనురా

ఆడదానిగా పుట్టిన గాజుబొమ్మనురా

మనుజాళికి జన్మనిచ్చు నిజమైన బ్రహ్మనురా

నేను కోరుకున్నదేమి స్వాభిమానమే కదా

నేను పొందదలచినది స్వావలంబనే సదా


1.అక్కనై నిను చంకనెత్తుకొంటిరా

చెల్లినై నీకు ముద్దులిచ్చి ఉంటిరా

నేస్తమై నీకు నవ్వులెన్నొ పంచిఉంటిరా

ఆలినై నీకు నిండు బ్రతుకునిచ్చుచుంటిరా

నేను ఆశించినది మరియాదనే కదా

నేను నడిగినదేమున్నది సమానతే సదా


2.వైద్యురాలిగా నీకు పురుడుపోసినాను

దాదిగా చిననాడు సేవలందించినాను

ఉపాధ్యాయినిగా నీకు చదువు సంధ్యనేర్పినాను

అధికారిణిగా నీకు ఉన్నతి కలిగించినాను

భావించకు నను విలాసాల  సామగ్రిగా

ఎంచకు,నను,వాడి పారవేయు వస్తువుగా


3.అంతరిక్షానికెగసినా అవనైతి ఆకసాన సగం

అవనిని పాలించినా నామమాత్ర అధికారం

చోదనలో వాదనలో తీసిపోను నీకే మాత్రం

అర్ధనారీశ్వరత్వమే అనాదిగా సృష్టి సూత్రం

చిరకాల వాంఛ మాది మానభంగ చరమగీతి

నెరవేరని ఇఛ్ఛమాది  అబల సబలయన్న ఖ్యాతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవనం ఎడారైంది-గాత్రం తడారింది

ఎటుచూసినా మృగతృష్ణలే

ఎదురాయెలే శిశిరమ్ములే


1.భాషనింక ఎలాకూర్చను

భావుకతకు స్ఫూర్తే లేదు

పదములనిక ఎలా అల్లను

అనుభూతి ఆర్తే ఆరదు

ఎలా కదిలించను నా కలమును

కలత పండించదు నా కలలను


ఏమని నే పలవరించినా

ఆమని ఆచూకే లేదు

ఎంతగా వెదకి చూసినా

మావికి చిగురాకే లేదు

ఎలా సవరించను నా గొంతు

పాటకొరకు చింతే ఇక నా వంతు

Friday, March 5, 2021

 నన్ను నన్నుగా నువ్వు చూడాలనుకుంటే

పూర్తిగా చూడగలవు కనులు మూసుకుంటే

మిరుమిట్లుగొలుపుతుంది నా ఔన్నత్యం

రంగులీనుతుంది నాతో సాంగత్యం


నేను నీవుగా మారింది తెలియలేదా

అద్దంలో నారూపే అగుపించలేదా

తడిచివెయ్యి మనం వేరువేరన్న భావం

తనివితీర చేసుకో నన్నాలింగనం


ఈ ప్రేమలోపిచ్చోణ్ణౌతున్నా

నీ ప్రేమలో వెర్రోణ్ణౌతున్నా


సంగీతం పలుకుతోంది నా ఊపిరి నీ ఊహల్లో

వాసంతం చిలుకుతోంది నీ సన్నిధి నా తలపుల్లో

ఈ క్షణాన్నే చేసేద్దాం వేల ముక్కలు

ఈ యుగాన్నే తాగేద్దాం కొన్ని చుక్కలు


తెమలవేలనే ఓపలేను జాప్యాన్ని

దాటవేలనే ఈ కట్టుబాట్ల కూపాన్ని

నీవు లేక నేనెపుడూ అనంత శూన్యాన్ని

నీవల్లనే పొందగలను జీవితానికర్థాన్ని


ఈ ప్రేమలోపిచ్చోణ్ణౌతున్నా

నీ ప్రేమలో వెర్రోణ్ణౌతున్నా

Thursday, March 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రేపల్లియ నీ కిట్టమైతె కిట్టయ్యా

మా పల్లెని రేపల్లెగ జమకట్టయ్యా

పావనమౌ నీ పాదమిచట పెట్టయ్యా


గోవులు నీకిట్టమైతె కిట్టయ్యా

నను గోవుగ ఇపుడే  జమ కట్టయ్యా

నను నిమురగ మేను కాస్త ముట్టయ్యా


1.మన్ను నీకు ఇట్టమైతె బుర్రనిండ ఉన్నది

మొత్తమంత నీవే తినిపెట్టయ్య

వెన్న నీకు ఇట్టమైతె మనసంతా ఉన్నది

తలపుతలుపు తీసా దోచిపెట్టయ్య


2.నటనలు నీకిట్టమైతె వేసాను ముసుగులు

అహం మమకారాలు కట్టానయ్యా

నగ్నత నీకిట్టమైతె విప్పాను బట్టలు

నన్ను నన్నుగా  నిలబెట్టానయ్యా


3.యమున నీకిట్టమైతె నాకన్నుల ఉన్నది

ఎన్నటికీ ఎండిపోదు  వెతలున్న నా నది

రతము నీకిట్టమైతె అభిమతము నాకున్నది

అనంగమే నిను సంగమించ విహంగమైనది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అధర హాసం మధుర హాసం

కులాసాల బాసకే విలాసం

హాస్యానికి స్పందించే మోవి లాసం

ఓష్ఠాకాశం వర్షించే మౌక్తిక హర్షం

మోము సీమ పల్వల్వ కనుమ చంద్రవంక

పెదవి మిథున మథన అమృతావతారిక


1.పసితనాన్ని ప్రస్ఫుటించే లేత సంతకం

తొలివలపు తెలుపుటలో మూలకారకం

నవ వధువుకు నులిసిగ్గుల సరస సాధకం

అతిథుల ఎడ ఇల్లాలి ఆహ్వాన సూచకం

వెతలకు వేసిన జలతారు మేలి ముసుగు

వదన గ్రంథానికి  ముఖచిత్రమై పొసగు


2.గోదావరి గలగలలా మంజులమై నినదించు

ప్రత్యూష శకుంతాల కువకువగా రవళించు

విచ్చీవిచ్చని విరిరేకుల పరిమళమై ప్రవహించు

ఘనాఘన ఘనతాడన పరిఘోషమై ఘోషించు

సంతూర్ వాద్య స్వన ఆహ్లాద వాదము

సుస్వర తరంగవ్యాప్త మంగళకర వేదము

Wednesday, March 3, 2021

 *నా  సాహిత్యాభిమాన పాఠక బంధుమిత్రులకు కృతజ్ఞతాభి వందనములు..!!*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఋణం తీరిపోదు ధన్యవాదాలతో  

మొక్కుచెల్లిపోదు కృతజ్ఞతా ప్రకటనతో

ఎన్నాళ్ళ అభిమానమో మన సాహితీ గంధం

ఎన్నేళ్ళ సావాసమో మన కవన బాంధవ్యం

మనసా వచసా శిరసా మీకు అభివందనాలు

నిన్నా నేడూ రేపూ మీకు మైత్రీ   చందనాలు


1.అడుగు అడుగులో మీ శుభాకాంక్షలు

అలుపు అలుపులో మీ స్ఫూర్తీ ప్రేరణలు

మలుపు మలుపులో తెలిపే మీ ప్రశంసలు

గెలుపు గెలుపులో మీ శుభాభినందనలు

ఇంతకన్న ఏంకావాలి ప్రోత్సాహకాలు

ఇవేకదా ఉత్సాహానికి ఉత్ప్రేరకాలు


2.పెద్ద మనసు గలవారు మీరు పాఠక శ్రేష్టులు

విశాల రసహృదయులు నా పాటల ఇష్టులు

నాకు పరిపూర్ణత కూర్చగ మీరే నా స్రష్టలు

నా ఉన్నతి సంకల్పించే నిజమైన ద్రష్టలు

ఇదేకదా జీవితానికి అసలైన పరమార్థం

మీ ఆదరాభిమానంతో నా జన్మ చరితార్థం

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆ కళ్ళు వేస్తాయి కదలనీక సంకెళ్ళు

ఆ కళ్ళు రేపుతాయి చూపులకే ఆకళ్ళు

ఆ కళ్ళే అందానికి ఆనవాళ్ళు

ఆ కళ్ళే అనురాగపు లోగిళ్ళు


వదన సరసు మీనాలై ఒప్పారును ఆ కళ్ళు

ఆనన కాననాన విహ్వలించు పసి లేళ్ళు


1.ఆ కళ్ళు అంగాలలో అనుంగు వ్యంజనాలు

ఆ కళ్ళు ముఖపుస్తక  సమీక్షకే నీరాజనాలు

ఆ కళ్ళు మది గది వీక్షింపజేయు దీపికలు

ఆ కళ్ళు భావ పుష్ప సౌగంధికా వీచికలు


మోము కొలను కలువలై అలరారు ఆ కళ్ళు

లలనకు లాల నూరించెడి అల్లనేరేడు పళ్ళు


2.ఆ కళ్ళు ఒలికించు అలవోకగ నవరసాలు

ఆ కళ్ళు అచ్చతెనుగు ఇచ్చకాల సమాసాలు

ఆ కళ్ళు కురిపించును నచ్చక కడు వడగళ్ళు

ఆ కళ్ళు అతివల అలకలందు పారే సెలయేళ్ళు


కాటుక పుట్టుకకే కారణాలు ఆ సోగ కళ్ళు

సైగల భాషలో వెలయించే కైతల పుట్టిళ్ళు