Wednesday, January 1, 2020

నువ్వు పెదవి విప్పితే ఒక పాటే
నువ్వు మూగవోతేనో  నాగ్రహపాటే
మౌనాలు తీర్చలేవు సందేహాలు
హృదయాల కలయికలో మటుమాయం దేహాలు

1.రెండు భావాలదే ఈ స్నేహం
ఆత్మద్వయానిదే ఈమోహం
సంగమించనీయీ అనుభూతులన్నీ
అధిగమించనీయీ భవసాగరాలన్నీ

2.ఛేదించు పంజరాలు స్వేఛ్ఛగా విహరించ
తొలగించు బిడియాలు నిర్లజ్జగా రమించ
చిత్తాన్ని మొత్తంగా పరస్పరం మార్చుకుందాం
గుత్తాధిపత్యంతో మనని మనం ఏలుకుందాం
కదిలించే కలికి ఉంటే ఉరకదా కవిత జలపాతమై
పురికొలిపే పడతి ఎదురైతే ఒలకదా గానం రసగీతమై
అనుభూతి చెందేలా స్ఫూర్తినొసగాలి సంఘటన
పారదర్శకంగా వెలువడాలి భావాలు ప్రతి పాటలోన

1. సుప్రభాత పలుకరింపే కలిగించు ఉత్తేజం
కురిపించే ప్రశంసలే మేల్కొలుపు నా ప్రావీణ్యం
మా కలయిన ప్రతిక్షణం మధురతర కావ్యం
ఎన్నిసార్లు ఎదమీటినా ప్రతిసారీ నవ్యాతినవ్యం

విరహాలు రేగేలా మటుమాయమౌతుంది
ఊహించని వేళలోనా అమనిలా అలరిస్తుంది
గిల్లికజ్జాలతో అల్లరెంతొ చేసేస్తుంది
నవ్వులెన్నొ కురిపించి నవనీతం పూస్తుంది
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఓనమాలు రాకున్నా కవనాలు పండిస్తారు
సరిగమలు నేర్వకున్నా గానాలు కురిపిస్తారు
నిన్నుచూడగానే అన్నులమిన్నా నిలువజాలకుంటారు
మదిర తాగకున్నా మత్తెక్కి పోతారు
చిత్తచాంచల్యమై చిత్తవుతు ఉంటారు

1.కుంచె పట్టరాకున్నా చిత్రాలు గీస్తారు
నిన్ను మెప్పించబూని చిత్రాలు చేస్తారు
నువ్వు ఎదురవ్వగానే ఇందీవరాననా నిశ్చేష్టులౌతారు
అయోమయమైపోయి గుండెజార్చుకుంటారు
ప్రయత్నమే లేకున్నా ప్రేమ నేర్చుకుంటారు

2.బ్రహ్మ చర్య వ్రతమైనా వదిలేసుకుంటారు
సన్యాసదీక్షను సైతం త్యజియించివేస్తారు
నీ క్రీగంటి చూపుకోసం నీరజాక్షీ పడిగాపులు పడతారు
నీ తపనల తమకంలోనే లోకాన్ని మరిచేరు
నీ వలపుల తలపులందే తలమునకలౌతారు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చెప్పుడు మాటలు విననూ
కాకమ్మ కథలూ నమ్మనూ
లేనిపోనివేవీ కల్పించి చెప్పను
షిరిడీసాయీ నీ లీలలెలా వివరించనూ
అనుభూతిచెందనపుడు పదిమందికెలా పంచనూ

1.లెక్కచూపగలవా నీవు ఇడుములెన్ని బాపావో
నొక్కిచెప్పగలవా సాయీ కోర్కెలెన్ని తీర్చావో
చిలువలు పలువలుగా నిన్ను చిత్రించలేను
ఆహా అంటే ఓహో అంటూ  వంత పాడలేనూ
కల్పనలే కాకపోతే నన్ను దయచూడవెందుకు
దండిగా మహిమలుంటే కొండంత వెతలెందుకు నాకు

2.చిన్ననాటి నుండి కష్టాలతొ కలిసే పెరిగా
కనికరించువాడవనే నీపైన భక్తి మరిగా
చరమాంకం చేరుకున్నా సుఖం దాఖలా లేదు
మకరందం తాగుతున్నా బ్రతుకంతా చేదు చేదు
గుడ్డిగా కొలిచేవారు కోట్లమంది నీకున్నారు
వెర్రిగా వేడగా నీవు గాక నాకెవరున్నారు