Tuesday, October 15, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:సింధుభైరవి

దుఃఖానికి ఎన్నిముఖాలూ
వేదనలకు ఎన్ని కారణాలు
ఎదగుమ్మానికి వెతల తోరణాలు
ఏచరిత్రచూసినా వ్యథార్థ భరితజీవితాలు

1.పుట్టుకలో మొదలైన రోదన
చితివరకూ వెంటాడును నీడగ
జన్యు వైకల్యాల పీడన
తరతరాలు కొనసాగే యాతన
వేదాంత మొక్కటే సాంత్వన
గత జన్మల దుష్కర్మల చింతన

2.చికిత్సలేని రోగాల ఆక్రమణ
తీరలేని సమస్యలతొ ఘర్షణ
కొనితెచ్చుకొన్నవి కొన్నికొన్ని
పనిగట్టుకొని కల్పించగ కొన్ని
నరజాతి చరిత్ర సర్వం సమస్తం
పరపీడనాన్విత పరాయణత్వం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రెచ్చగొట్టి రేతిరంతా నిద్రదోస్తావు
ఎదకుకాస్తా చిచ్చుపెట్టి వినోదిస్తావు
అందాలు కుప్పబోసి కంచె పెడతావు
ప్రాణాలుతీయకుండా పాతిపెడతావు
పైశాచికత్వమే పడతీ నీవైనం
ఊగిసలాడుతుంది ఆత్మాభిమానం

1.సౌందర్య కేంద్రమేదో కరతలామలకం నీకు
ఆకట్టుకోవడమంటే ఉగ్గుపాలవిద్యనీకు
నీకున్న వనరులన్ని ఫణంగా పెడతావు
మరులుగొలుపు మారణాయుధం మరిమరీవాడుతావు
సయ్యాటనే సుదతి వలపువలతొ చేపలవేటా
దొంగాటలేలనే మదిగదికి తలపుతలుపు చాటా

2.కంటిసైగతోనే బాసలెన్నొ చేస్తావు
పెదవి విరుపుతోనే ఆహ్వానమందిస్తావు
కడకొంగుతోనీవు కథాకళి చేయిస్తావు
నడుమొంపులోనీవు  నయాగరా సృష్టిస్తావు
మనసులో ఉంటేనే మచ్చిక చేసుకో
మారాము చేయకుండ మెచ్చిన దిచ్చుకో
నరకేసరీ నీకెవరు సరి
లోటేది నీ చెంతనుండ మాయమ్మ సిరి
మనసారా పొగడెదను నిన్ను మరిమరి
జగతి ఖ్యాతినొందనీ దయతో మా ధర్మపురి

1.వేదశాస్త్రాలకు నెలవైనది
వేదనలకేలా నిలయమైనది
సంగీత సాహిత్య కళలకు పట్టుగొమ్మ
కీర్తి చంద్రునికేల సుదీర్ఘ గ్రహణము
పావన గోదావరి అపరగంగానది
కలుషితాలకేల ఆలవాలమైనది
కినుక ఏల మాపైన నరహరి నీకు
నీ పదసన్నధిలో వెతలేల మాకు

2.పరిశుభ్రత పాటించని భక్తబృందాలు
ఏమాత్రం స్వఛ్ఛతే ఎరుగని యాత్రికులు
దారినాక్రమించుకొన్న వ్యాపార వర్గాలు
అడుగడుగున ఎదురయ్యే అవినీతి  దందాలు
గుడినీ నదినీ భ్రష్టుపట్టించిన వైనాలు
నీవెరుగనివా స్వామీ ఈ నిదర్శనాలు
చందనలేపనతో కాస్త చల్లబడిపోయావా
ఉగ్రమూర్తి సమగ్రంగ నా ఊరిని చక్కబఱచు