Monday, December 16, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:కానడ

నీ తలపే తొలగించును ఆటంకం
నీ స్మరణే దాటించును సంకటం
సిద్ది వినాయకా అన్ననీ ఏకైక నామం
చేర్చగలదు భక్తులనూ ముక్తిధామం
జై సిద్ది వినాయకా మోక్షదాయకా
జయహో గణనాయక ఆరోగ్య దాయకా

1.ఊపిరి పీల్చినా నిట్టూర్చినా
హృదయ స్పందనలో నాడీకణములలో
తనువులో మనసులో నాలోని అణువణువులొ
సిద్దివినాయకా నీ ధ్యానమే మెలకువలో నిద్దురలో
జై సిద్ది వినాయకా మోక్షదాయకా
జయహో గణనాయక ఆరోగ్య దాయకా

2.నా క్షేమము నీ బాధ్యత నా తండ్రీ వినాయకా
నా మనుగడ నీ చలవే నా స్వామీ వినాయకా
ఏ జన్మలోనైనా నీ పాదం విడనీయకు వినాయకా
జన్మరాహిత్యమొసగి నీ సన్నధి దయసేయి వినాయకా
జై సిద్ది వినాయకా మోక్షదాయకా
జయహో గణనాయక ఆరోగ్య దాయకా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హాయి అంటె తెలిసింది చెలీనీ వల్లనే
అనురాగపు జాడలన్నీ నీ ఎదలోనే
నీ జ్ఞాపకాలన్నీ మధురానుభూతులే
నీ సన్నిధిలో క్షణాలు ఆహ్లాద హేతువులే

1.కవితలేల జవరాలా కావ్యాలు రాయనా
నువునడిచే దారిలోనా పూబాట వేయనా
పున్నమికై ప్రతీక్ష ఏల నీ కన్నుల కనుగొననా
మల్లెలకై వెతకగ నేల నీ నవ్వుల ఏరుకొననా

2.ఏనాడు కలిసావో అదియే సుముహూర్తము
ఏ చోట ఎదురైనావో అది పవిత్ర ధామము
మనసులే వేసుకున్నాయీ విడివడని మూడు ముళ్ళు
చినుకులే రాలి అయినాయి మనకు తలంబ్రాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నువు పాడే ఒకే రాగం అనురాగం
నువు చేసే ఒకే లాస్యం పారవశ్యం
నీ ప్రతి పలుకూ త్యాగరాజ కీర్తనం
నీ ప్రతి కదలిక  కూచిపూడి నర్తనం
కోమలీ కోయిల తుల గాయనీ శ్రవణానందినీ
భామినీ కేసరి సరి గామినీ నయనవినోదినీ

1.సామాన్యులు సైతం నిన్ను చూసి కవులౌతారు
గీతనైన గీయనివారు చిత్రకారులౌతారు
సృష్టిలోని  అద్భుతమంటే నీవే నంటాను
రెప్పవేయలేని మిషతో నే అనిమేషుడనౌతాను
నభూతోన భవిష్యతి నీకు సాటి తరుణీ నీలవేణీ
సుందరనారీ వివిధవర్ణ విరి మంజరీ రసరాగిణీ

2.ఎక్కడ మొదలెట్టాలో నీ అందాలు వర్ణించగా
ఏ రంగులొ ముంచాలో కుంచె నిను దించగా
ప్రకృతికే ప్రతిరూపం ఆరాధకుల కపురూపం
రసిక ఎదల పరితాపం నీ తనువే ఇంద్రచాపం
అంగరంగవైభోగం లలనా నీ సహయోగం
ఓ పగ క్షణమైనా యుగం మనలేను నీ వియోగం