Thursday, March 19, 2020

అందం సంగతి సరేసరి
ఏర్చి కూర్చాడు విరించినీకై  కొసరికొసరి
అంతకుమించి ఏదో ఉంది
చూసీచూడగానే ఆహ్లాదమాయే నా మది
మంజుల విరి మంజరి నువ్వు
మంజుల శింజినీ సవ్వడి నీ నవ్వు

1.అమావాస్య నాడూ విరిసే కౌముదివే
మృగతృష్ణలోనూ పారే మందాకినివే
నింగికి రంగులు వెలయగజేసే సింగిడివే
బీడును తడిపెడి  తొలకరి  చినుకువు నీవే
మంజుల విరి మంజరి నువ్వు
మంజుల శింజినీ సవ్వడి నీ నవ్వు

2.సుధలు రంగరించిన అనురాగ రాగిణివే
మూర్తీభవించిన అపర సౌందర్య లహరివే
ఆరాధనకే అర్థము నేర్పిన ఆ రాధనీవేలే
ప్రణయానికే భాష్యము రాసిన సూర్యకాంతివే
మంజుల విరి మంజరి నువ్వు
మంజుల శింజినీ సవ్వడి నీ నవ్వు



రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చేతితో మూతిఅన్నది నను తాకరాదనీ
పాణితో నేత్రమన్నది ననుతాకరాదనీ
ముక్కుతనను ముట్టవద్దనీ హస్తంతోఅన్నది
నేడు కరోనాను కట్టడిసేయమని మోము కరమునన్నది

1.పరిశుభ్రత పాటిస్తే కరోనా ఏపాటిది
తగు జాగ్రత వహియిస్తే లక్ష్మణ గీటది
సానిటైజర్లనే పరిపరి వాడితీరాలి
పదేపదే చేతులను గిచగిచా తోమాలి
చికిత్సకన్నా ఉత్తమం ముందుజాగ్రత్తలే
నిర్లక్ష్యం చేస్తేనే తప్పవింక తిప్పలే

2.దగ్గినా తుమ్మినా అడ్డుగ దస్తీనుంచాలి
చిన్నసుస్తి చేసినా డాక్టర్ కడకేగాలి
జ్వరమేదైనా సరే నియంత్రింప జేయాలి
ఇతరులతో వేరుగా ఇంటిలోనె ఉండాలి
సూచనలను పాటిస్తే కరోనాకు అంతమే
బెంబేలు పడిపోతే అగమ్యగోచరమే

3.ప్రతి నలతకు కారణం కరోనా ఐపోదు
ప్రతిజలుబూ కరోనాకు దారితీయనే తీయదు
స్వచ్ఛదనం కావాలి మన జీవన విధానం
పరిశుభ్రతె చెప్పుతుంది రోగసమాధానం
రోగనిరోధక వ్యవస్థ వృద్ధి పర్చుకోవాలి
విషమపరిస్థితెదురైనా నిబ్బరంగ ఉండాలి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మకరి బారి కరిగాచిన శ్రీహరీ
డింభకు బ్రోవగ స్తంభాన వెలసినా నరహరీ
వ్యాధుల పరిమార్చే శ్రీ ధన్వంతరీ
కరోనాను కడతేర్చర కనికరించి మురారీ

1.ఎత్తినావు ఎన్నెన్నో అవతారాలు
తీర్చినావు పలుమార్లు మానవ సంకటాలు
దిక్కుతోచకున్నది మానవజాతి అంతరించు దిశగా
దిక్కికనీవన్నది కరోనా మహమ్మారి నణచగ ఆశగా

2.ఆచారాలన్నీ తగు శాస్త్రీయమైనవే
సంప్రదాయాలూ మనుగడకుపయుక్తమైనవే
నాగరికత మోజులో దిగజారిపోయాము
విచ్చలవిడి స్వేఛ్ఛలో ఉచ్ఛనీచాలవిడిచాము

3.తప్పిదాలు మావెన్నో తలచక మన్నించు
పద్ధతులను అలవరచి మమ్ముద్ధరించు
ఇకనైనా మేల్కొనీ పాటింతుము క్రమశిక్షణ
నిను నమ్మినవారికీ ఇంతటి మరణశిక్షనా