Friday, October 14, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధు భైరవి


దాచుకున్నదేది లేదు

నీమది దోచుకున్నదీ లేదు

ఏమదీ నను దాటవేతువే

చెలిమికేల చేటు చేతువే


1.మరపు పొరలు పేర్చగా

అనవసరమని నన్నెంచగా

విలవిలలాడితి కలవరమొంది

విలపించితి నాలో కలతచెంది


2.మరలిరావే ఆ తరుణాలు

అరమరికలే లేని క్షణాలు

అరుదెంచె మతితప్పు లక్షణాలు

ఏకరువెట్టకు కలవగ ఏ కారణాలు

 రచన్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కాపి


ముదమున మదవతులై కుముద వదనలు

సుదతులు మదన జనకా నీ ఎదన జేర పదపడిరే

మాధవా నీ అధర సుధలు గ్రోలుటకై మదన పడిరే

మదన గోపాలా ఈ ప్రమదను పాలించగ అదనుజూచి రావేరా

నందబాలా చినదానను వేచినదానను ఆనందమంద జేయరా


1.రాధను కాదనలేను అష్టసతుల వద్దనను

గోపకాంతలెవ్వరితోను పంతము నొందను

అందగత్తెలెందరున్ననూ పందెము కాయను

నీ పద సదనమునిక  వదలనే వదలను

సుందరాకారా బృందావిహారా జాలిమాని నాపై జాగుసేతువేలరా

మందార మకరంద మాధురీ సమనాద మురళీధరా

తరింపజేయగా రారా


2.కుబ్జకున్న విజ్ఞత లేదు మీరాకు నాభక్తి తూగదు

అబ్జలోచనిని కాదు  రసజ్ఞతే నామది ఎరుగదు

అనురాగము అను యోగము కలగనే కలగలేదు

నా మది నిను  సదా తలవక మానను

వనమాలీ శిఖిపింఛమౌళీ వరించిరావా సవరించగ నాజీవన సరళి

కృష్ణామురారి ముకుందా శౌరి మురిపించవేరా నను నీ రాసకేళి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


సర్వేశా శేషశాయి వేంకటేశా

సర్వదా వేడెదా నిను శ్రీనివాసా

పాపనాశా శ్రీశా శ్రిత జన పోషా

నీ సేవకు నా బ్రతుకే  ధారపోశా


1.సరసాలలొ మునిగావా సతులతో

శరణాగతి కోరినా వినవా నతులతో

ఎంతగా ప్రస్తుతించానో సన్నుతులతో

కనికరించవైతివే స్వామి సద్గతులతో


2.విషయ వాసనలు నన్ను వీడవాయే

విషమ పరిస్థితులే ననువెన్నాడెనాయే

విషము  మ్రింగ గళమాగిన సమమాయే

విష్వక్సేన వినుత మనసు నీ వశమాయే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను తలవగ నీగొంతు పొలమారనీ

నీ ఈసడింపులతో గుండె బండబారనీ


ప్రచండాగ్ని కీలలతో రగిలే రవిబింబం

చెలగే  నా విరహాగ్ని గనీ మసిబారనీ


గలగలలతో ప్రవహించే అల్లరి గోదావరి

నా అశ్రుధార కలిసి వరదలై పారనీ


విప్పారే విరిబాలల దరహాస వసంతం

ఆశల ఆకులు రాలి శిశిరంగా మారనీ


క్షణికమైన సుఖానికై శాశ్వత దుఃఖమై

ఇలాగే రాఖీ వగపుతో బ్రతుకు తెల్లారనీ


#Raki 

Gazal