Sunday, September 6, 2020


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:వకుళాభరణం


శివోహం శివోహం శివోహం
శివపరమైతే నా ఆత్మదేహం
శివోహం శివోహం శివోహం
నేనే నాలో లయమై అహరహం
ఓం ఓం ఓం ఓం ఓం-ఓం ఓం ఓం ఓం ఓం

1.నే మేలుకొనగన సుప్రభాత సేవగ శివోహం
నా కాలకృత్యాలే అర్ఘ్యపాద్యాలుగా శివోహం
ఆచరించు స్నానమే అభిషేకంగా శివోహం
భుజియించే ఆహారం నైవేద్యమవగా శివోహం
ఓం ఓం ఓం ఓం ఓం-ఓం ఓం ఓం ఓం ఓం

2.నా నయన దీప్తులే హారతులై శివోహం
నా మాటలన్నీ మంత్రపుష్పాలై శివోహం
నా నడకలన్నీ చండీ ప్రదక్షణాలై శివోహం
నేనే నిదురించగా పవళింపు సేవగా శివోహం
ఓం ఓం ఓం ఓం ఓం-ఓం ఓం ఓం ఓం ఓం

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎపుడూ ఒకటే తపన
నవ్యత కొరకే మథన
అనుక్షణం నా శోధన
వైవిధ్యమే ఆలంబన

1.కవన వస్తువే ప్రతి ఘటన
సమస్యలతో  ప్రతిఘటన
నేనెరుగని పదమే నటన
కలమే  కదులును ప్రగతి బాటన

2.మదిలో మెదిలిన భావన
మలవగ వెలసిన కవిత
మనోధర్మ సంగీతాత్మిక
ప్రభవించగ అభినవ గీతిక


గర్వమే హెచ్చిందో గాఢతే తగ్గిందో
గిరిగీసుకున్న తావుకు గీతమే రాకుందో
గుండెలోతులోన గుబులు గూడుకట్టింది
గృహసీమలోనూ గెలుపు గేలిచేసింది

1.గైరికము కావాలి నా గేయము
గీటిచూసుకోవాలి సాహితీలోకము
గొణుక్కుంటె లాభమేమి గొప్పగా రాయాలి
గోష్ఠులే జరిగేలా నా కవిత వెలగాలి

2.గౌరవాలు పొందాలి గడిచే కాలానికి
గంధమే అబ్బాలి నా కవనానికి
గాంధర్వం అమరాలి నా గాత్రానికి
గణపతి నను చేర్చాలి నా గమ్యానికి