Friday, November 11, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్రకౌఁస్


దేహ పంజరాన నను బంధించినావు

మోహపు జలతారు తెరను దించినావు

ప్రలోభాల తాయిలాలు అందించినావు

ఇంతగనను వంచించి ఏమి సాధించినావు

తిరుమలేశ వేంకటేశ శరణు శరణు స్వామీ

చేరనీ నీ సన్నిధి నను అంతర్యామీ


1.వనిత వలపు వలగా చిక్కుల పడవేస్తివి

ధన సముపార్జనతో బ్రతుకును ముడివేస్తివి

కీర్తి కొరకు ఆర్తినొందు బేలగనూ మారిస్తివి

తగునా  నీకిది నమ్మిన  నను ఏమారిస్తివి

తిరుమలేశ వేంకటేశ శరణు శరణు స్వామీ

చేరనీ నీ సన్నిధి నను అంతర్యామీ


2.నామరూప రహితునిగా నీ సన్నిహితునిగా

జనన మరణ జీవన వలయాతీతునిగా

పరమాత్మా నీలో లయమయే ఆత్మగతునిగా

పరమానందమొంద త్రోసితివే నను పతితునిగా

తిరుమలేశ వేంకటేశ శరణు శరణు స్వామీ

చేరనీ నీ సన్నిధి నను అంతర్యామీ