Thursday, January 6, 2022

 కంటికి రెప్పగ కాచుకునే మముకన్నతల్లివి నీవే

కడుపు నిండా అన్నం పెట్టేటి మాకల్పవల్లివి నీవే

మట్టినైనా  బంగారంగా మార్చే పరసువేదివే

పుట్లకొద్దీ ధాన్యం పండేటి పురిటి గడ్డ నీవే

నేలమ్మ నేలమ్మ నేలమ్మా మా ఇలవేలుపు నీవమ్మా

చేలమ్మ చేలమ్మ పంటచేలమ్మా మా మాగుండె సవ్వడి నీవమ్మా

నిన్నే నమ్ముకున్నాము నీవే సొమ్మనుకున్నాము

మా దమ్ము ధైర్యం నీవుగా  నిబ్బరంగా మేమున్నాము

అంబరాన్ని తాకుతున్నాము సంబరాలతేలుతున్నాము 


1.ఏడాది పొడుగునా మూడు పంటల నిచ్చేవు

ఏరువాక సాగేవేళ మా వెన్నుతట్టి నడిపేవు

సారవంతమైన నీ ఒడిలో సాగుతుందిలే మా సాగు

నువు సాయమందిస్తుంటే వ్యవసాయం కొనసాగు

నాగళ్ళతో దున్నినంత మా వెన్నదన్నుగా ఉంటావు

కొడవళ్ళతొ కోసినంత మా గాదెలనంతా నింపేవు

కుప్పలు తెప్పలు పంటపండగా రోజూ మా ఇంట పండగ

అప్పుల బాధలు ఉండనట్లుగా ఉంటావు నీవే మాకు అండగ


2.పల్లె కాస్త పట్నమైతుందని కన్నతల్లి నిన్ను వదులకొన్నాము

బేరాలు సారాలు పెద్దయాపారాలు పెంపైతవనుకున్నాము

కర్మాగారాలు కంపెనీలు ఎన్నెన్నొ పెడతారనుకొన్నాము

చదువుకున్న మా సంతతికి కొలువులొస్తయని నమ్మాము

ఉన్న ఈ బ్రతుకునింకెంతో ఉన్నతంగ ఊహించుకొన్నాము

రైతే రాజై రాజ్యాలేలినట్లు మేము పగటి కలలే కన్నాము

కన్నుమూసి తెరిచేలోగా ఉన్నది ఆ కాస్తా ఊడిపోయేనే

అనుకున్నదొకటి అయ్యింది ఒకటై పంట పొలమే బీడాయే

ఊరు ఊరే వల్లకాడాయే