Sunday, February 10, 2019

వెళ్ళిపోయిన ఆవసంతం మళ్ళివస్తుందా
తోటకు మరలి వస్తుందా
మూగవోయిన పికమే ఇకపై మరలకూస్తుందా
మదికే హాయినిస్తుందా
చేజారి పగిలిన అద్దం మామూలుగ ఔతుందా
చెదిరిపోయిన మధురస్వప్నం తనువరిస్తుందా

1.మడమతిప్పదెప్పుడూ ముందుకే సాగేకాలం
గుఱే తప్పదెన్నడూ విధి విధిగ సంధించేబాణం
జ్ఞాపకాలు శూలాలై గుండెనే గుచ్చుతుంటే
అనుభూతులు జ్వాలలై మనసునే మండిస్తుంటే
 ఎలానయమౌతుంది సలుపుతున్న గాయం
ఓర్చుకోలేని వ్యధ కంటే నరకమెంతో నయం

2.ఆ దారం తెగిన పతంగం జారేది ఏ తావో
తుఫానులో చిక్కిన నావ చేరేది ఏ రేవో
రెప్పపాటులోనే జీవితమే కుప్పకూలు
తప్పుమనది కాకున్నా జాతకాలె తారుమారు
ఎవరు మార్చి రాయగలరు నుదుటిరాతను
ఎవరు మాన్పివేయగలరు కడుపుకోతను
రాగము నీవై అనురాగము నీవై
భావము నీవై నా జీవము నీవై
ఏలగరావో వేంకటరమణ
నన్నేలగ రావో సంకటహరణ

1.బండరాయి కూడ కరుగుతుంది నా ఆర్తనాదాల నేవిని
కౄరమృగము దారినొదులుతుంది నా గుండె కోతను తను గని
కరుణ మరచినావేల దయాసాగరా
పట్టించుకోవేలా నను నటశేఖరా
ఏలగరావో వేంకటరమణ
నన్నేలగ రావో సంకటహరణ

2.బంధమెరుగవైతివి పాశశూన్య నిరంజనా
బాధలెరుగవైతివి దేహరహిత పరమాత్మా
తెలుసుకోగ నీ వశమా నా వ్యధ
మాన్పివేయ నీ తరమా రమాధవా
ఏలగరావో వేంకటరమణ
నన్నేలగ రావో సంకటహరణ
మనిషిగ పుట్టి దేవుడివైనావో
దేవుడివైనా ఇలపై మనిషిగ మాకై పుట్టావో
సాయిరాం షిర్డీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయిరాం
1.తప్పటడుగులను తప్పించి చేయూత నిచ్చావు
దారీతెన్నూ తెలియని వేళల దిక్సూచి వైనావు
తీరం దొరకని నావల పాలిటి దీపస్తంభము నీవు
భారం మోసి గమ్యం చేర్చే మార్గదర్శివి నీవు
సాయిరాం షిర్డీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయిరాం

2.అందరు ఉన్న అనాధనీవి అనాధలందరి బంధువువు
బిచ్చమునెత్తే యాచకుడవు కోరినదొసగే దాతవునీవు
బూడిదతోనే వ్యాధులు మాన్పే సిద్ధవైద్యుడవు
మననముతోనే మహిమలు చూపే ఐంద్రజాలికుడవు
సాయిరాం షిర్డీ సాయిరాం
సాయిరాం ద్వారకమాయిరాం
ఎలా తొలగించనూ నీ వేదన
ఎలా మాన్పించనూ నీ రోదన
ఎలా పంచుకోనూ నీ నరక యాతన
ఎలా ఓదార్చనూ ఎడతెగదు గుండెకోత

1.అశ్వినీ దేవతలైనా ఔషదమందించలేదు
సాక్షాత్తు ధన్వంతరే మందుశోధించలేదు
చరకుడు శుశ్రుతుడు చికిత్సేది చూపలేదు
జగతిలోని వైద్యమేది నివారణే చూపలేదు
చేష్టలుడిగి ఉన్నాను నిస్సహాయంగా
అద్భుతాలనాశిస్తూ ఎంతెంతో అతృతగా

2.పులిపాలతొ తగ్గేదైతే అయ్యప్పను వేడుకొందు
సంజీవని సరిపోతేను అంజన్నను ప్రాధేయపడుదు
అమృతమే అవరమైతే మోహినినే శరణందు
వైద్యనాథుడే దిక్కంటేను స్వామితోనె మొరలిడుదు
మహిమలింక చూపాలి మహేశుడైనా
కలవరము తీర్చాలి వరములిచ్చి నేడైనా
"అందరి బంధువు"

అనాధవెన్నటికీ కావునేస్తం
ఏకాకిగ తలపోయకు నీదేఈ సమస్తం
విధాత రాసిన నుదుటి రాత మార్చివేసి
కరువైన కన్నవారి లోటే పూడ్చివేసి
 నిను వెన్నంటి ఉంటుంది మానవలోకం
నీకు చేయూత నందించి మాన్పుతుంది గుండె శోకం

1 .పూర్తిగా చావలేదు  మానవత్వము
అంతరాల్లొ దాగుంది ప్రేమతత్వము
వితరణ చాటుతుంది దాతృత్వము
జాలిని ఆశించక కసిని పెంచుకోక
తీర్చిదిద్దుకో ఉన్నతంగ వ్యక్తిత్వము
నిను వెన్నంటి ఉంటుంది మానవలోకం
నీకు చేయూత నందించి మాన్పుతుంది గుండె శోకం

2.ఆకలికెపుడు లొంగి దొంగగా మారకు
ద్రోహుల చెంతజేరి నేరాలకు పాల్పడకు
తేరగా వస్తుందని బిచ్చగాడివైపోకు
శ్రమనెప్పుడు నమ్ముకో కృషిచేస్తూసాగిపో
ఆత్మవిశ్వాసమే గెలుపుమూలమని మరువకు
నిను వెన్నంటి ఉంటుంది మానవలోకం
నీకు చేయూత నందించి మాన్పుతుంది గుండె శోకం

https://youtu.be/HAs7w-Hr91w?si=ssVWGVr11N01CF5G


విద్యయు విజ్ఞానము-తల్లీ నీ ప్రసాదము
కవనము సంగీతము-నీదయా విశేషము
జగతికి మూలమీవె-మూలా నక్షత్ర జాత
తరగని మేధనీవె -కృపగని మము జగన్మాత
నమోస్తుతే సరస్వతీ-ప్రణతులివే భారతీ

1.వసంత పంచమిన ప్రభవించినావు
విధాత నెచ్చెలివై వరలుతున్నావు
నీవీణా నాదముతో ఊపిరులూనినాము
నీచల్లని చూపులతో రూపుదిద్దుకున్నాము
అనురాగము మాలోన విలసిల్లనీయవే
మానవతను మాలోన పరిమళింపజేయవే
నమోస్తుతే మాతా శారదా-ప్రణుతులివే ధీవరదా

2.కాశ్మీర క్షేత్రాన భువిని వెలసినావు
బాసర పురమందును కొలువుదీరి యున్నావు
శృంగేరి పీఠాన్ని అధివసించియున్నావు
మా ధర్మపురియందున విరాజిల్లుతున్నావు
మాహృదయము సదానీకు ఆవాసము కానీయవె
మావాక్కున నీ విభవము ప్రకటింపజేయవే
నమోస్తుతే జననీశ్రీవాణీ-ప్రణుతులివే పారాయణీ