Monday, October 31, 2022

 https://youtu.be/9uaaq1vM2UI?si=tEuIyKHnLfDjO-UT


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


కైలాసనిలయ కైవల్యదాయా

ఓం నమఃశివాయ

కారుణ్య హృదయ బ్రతుకే నీదయ

ఓం నమఃశివాయ


1.నీభక్తులకు భోలా శంకరుడవు

దుష్టశక్తులకైతే కాల రుద్రుడవు

నిను నమ్మితి కావరా నీలకంఠుడా

గణపతి ప్రజాపతీ ధవళ దేహుడా


2.దోసెడు నీళ్ళకే  పరవశమవుతావు

బిల్వపత్రమర్పిస్తే మా వశమౌతావు

శరణు శరణు శంభో మహాదేవా

శరవణభవ శాస్తా  సాంబశివా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బండరాయి కరుగుతుంది మీ పాటకు

ఏ గుండెకాయ కదలకుంది నా మాటకు ఈపూటకు

శిలాప్రతిమలైనారా అచేతనంగ మారారా

ఏంచేస్తే వస్తుంది చలనము

ఎలా తేగలను చైతన్యము


1.అర్థించినాను అభ్యర్థించినాను

ప్రార్థించినాను ప్రణమిల్లినాను

కొండలనైతే మోయమనలేదు

డబ్బులనైతే ఈయమనలేదు

సహృదయతతో స్పందించమన్నాను

మీ ఆశీస్సులనే అందించమన్నాను

ఏంచేస్తే వస్తుంది చలనము

ఎలా తేగలను చైతన్యము


2.శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః

రసపిపాసులే  కదా ఉన్నది ఈ బృందావని

ప్రాధాన్యత నివ్వకనే సమయం దొరకదని

ప్రోత్సహించినంత మనకు పోయేదేముందని

తరించి తరింపజేయగా వేడుకున్నాను

అంతరాలనే  అంతరింపజేయమన్నాను

ఏంచేస్తే వస్తుంది చలనము

ఎలా తేగలను చైతన్యము


https://youtu.be/T4TpWmpyoS4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మిశ్ర భైరవి


సడలనీ  ముడివడిపోయిన బంధాలు

తెగిపడనీ నను పెనవేసిన బంధనాలు

సాగనీ ప్రభూ నీవైపుగానే నా చరణాలు

ఆగనీ  ఈ జీవికికనైన జనన మరణాలు


1.వెదికితినీ నిను కొండల కోనల

కాంచగ పదపడితి గుడి గుండాల

తిరిగితి యాత్రల మునిగితి నదుల

మరచితి నీ ఉనికినీ హృదయాన


2.మళ్ళించు నను అంతర్ముఖునిగ 

భావించు స్వామీ నీ ప్రియ సఖునిగ

తరియించనీ నను చిదానంద సుఖునిగ

జీవించనీ విషయ వాంఛా విముఖునిగ

Saturday, October 29, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


గోవిందా గోపాలా గోపీలోలా

గోకుల శౌరి గోవర్ధన గిరిధారి 

అధర మందార మరందాల నందరా నందలాలా

మధుర మురళీ సుగంధాల ముంచరా నన్నేవేళా


1.వనమాలి శిఖిపింఛమౌళీ మురారి

యమునాతీర విహారి బృందావన సంచారి

బాలను నేను బేలనురా తాళజాలనురా

ఆపాద మస్తక సమస్తం ప్రభూ నన్నేలవేలరా


2.నామేనను వలువను వలిచేయరా

కనులతోనే నా తపనలు కొలిచేయరా

ఉలి నీవై నా కలతలనిక తొలిచేయరా

ఆగను వేగనూ నను నీవుగ మలిచేయరా

 నీవు లేనిదెక్కడ నొడువుజవ్వని

కనరాని దెన్నడు పలుకుతొయ్యలి

కళలున్నచోట కలకలము నీవే

కవులు సంధించేటి కలము నీవే

అతురత మాకుంటే చేయూత నిస్తావు

మమ్మక్కున జేర్చుకొని ప్రేమగా లాలిస్తావు


1.అక్షరాలు అందెలుకాగా నీపదములు నర్తిస్తాయి

భావాలు పల్లవించగా కృతులెన్నొ ఉదయిస్తాయి

దృక్పథమే నీ పథమైతే పరమ పదము చేర్చేను

నిరంతరం నీ తపమందున పరమానంద మందేను

అతురత మాకుంటే చేయూత నిస్తావు

మమ్మక్కున జేర్చుకొని ప్రేమగా లాలిస్తావు


2.స్వర సప్తక వరమొసగి ధన్యులగావిస్తావు

సప్త చక్రాలయందున ఉద్దీపన ఒనరిస్తావు

గాత్రమనురక్తి సూత్రమై గీతార్చన కోరేవు

గాన రసాస్వాదనలో ఎదన హాయి కూరేవు

అతురత మాకుంటే చేయూత నిస్తావు

మమ్మక్కున జేర్చుకొని ప్రేమగా లాలిస్తావు

Friday, October 28, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్నో తెలుసు అన్నీతెలుసు

అయినా వినదీ పిచ్చి మనసు

తప్పూ తెలుసూ ఒప్పూతెలుసు

అసలే మానదు ఎందుకింత అలుసు

మనసు మాట వినదు

అది నీదై పోయినందుకు


1.నిన్ను తలవగనే పురులు విప్పుతుంది

నిన్ను చూడగానే మరులు గుప్పుతుంది

పరిధులు మీరమని నొక్కి చెప్పుతుంది

ఎడబాటు భారమని ఏడ్చి రొప్పుతుంది

ఈ మనసు మాటవినదు నీదై పోయినందుకు


2.ఎన్నిసార్లు దాటవేసినా నీ వెంటపడుతుంది

గుట్టుగా దాచ జూసినా ఓ కంటకనిపెడుతుంది

కొస ఊపిరి దాకా ఆశ వదలుకోనంటుంది

పట్టువదలక పదేపదే జట్టుకట్ట మంటోంది

నా మనసు మాటవినదు నీదైపోయినందుకు

https://youtu.be/7TiH1v7Marw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:రేవతి


శశిధరా గంగాధరా

జటాధరా నీలకంధరా

భస్మధరా చర్మాంబరధరా

త్రిశూలధరా ఢమరుధరా

ఖట్వాంగధరా పురంధరా

వందనాలు గొనరా సుందరా

నా డెందమందు మనరా మనోహరా

1.రాజధరా విషధరా మృగధరా

కుముద ధరా అజకావగ ధరా

నాగాభరణధరా శితికంధరా

కపాలధరా ఖండపరశుధరా

అనాలంబిధరా అర్ణవతూణీర ధరా

వందనాలు గొనరా సుందరా

నా డెందమందు మనరా మనోహరా


2.పశుపతి గౌరీపతి మదనారి

కపర్దీ ధూర్జటీ ఝర్ఝరీ

పినాకి పురారి భూరీ

విలాసీ ముక్కంటి మల్లారీ

జ్వాలి కపాలి పింగళి

వందనాలు గొనరా సుందరా

నా డెందమందు మనరా మనోహరా

*ఇది నా 3000 వ గీతం🌹😊💐🙏*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శివరంజని


పల్లవి: 

వీణా నిక్వణ మాధురి ఆహ్లాదమే

గమనింతురా తెగిన వ్రేలికొసల గాయాలు

వేణువాద్య వాదన మెంతో హృద్యమే

ఎరుగుదురా ఎవరైనా ఊపిరితిత్తుల ఆర్తనాదాలు

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


చ.1.కమ్మని కవితల కావ్యపఠన కమనీయమే

అనుభూతుల ప్రసవవేదన అనుభవ గ్రాహ్యమే

ఇంపగు దృశ్యపు వర్ణచిత్రాలు రమణీయమే

ఊహకు రూపకల్పనలోని సృజనా అనూహ్యమే

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


చ.2.ఎలుగెత్తి ఆలపించే గానం శ్రవణానందమే

స్వరతంత్రులు పెగిలించగా రేగే యాతన విదితమే

హావభావ విన్యాసాల నాట్యం నయనానందమే

ధరణి తాడనతొ పదముల పీడన వ్యధాబరితమే

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


*ఇది నా 3000 వ గీతం🌹😊💐🙏*

Thursday, October 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మోహన


ఎంకన్న నీకింత మంకెందుకూ

మాకీ సావూ పుట్టుకల లంకెందుకు

సంపనన్న మమ్మేగిర సంపవాయే

సక్కన్ని బతుకైనా ఇయ్యవాయే

గోయిన్ధా గోయిందా గోయిందా గోయిందా


1.సదువూ సందెలు మాకున్న గాని

మరియాదలన్నవి మంటగలిసే

సిరి సంపదల తూగుతున్నగాని

అనుభవించు రాత అస్సల్లేదాయే


2.బండరాళ్ళైనా బస్మమైతయి గాని

పూటకు పట్టెడు మెత్కులే కరువాయే

పదారు కూరల్తొ మస్తు తినుటకున్నగాని

ఒక్కముద్దతిన్న అరుగని వెతలాయే


3.పూరిగుడిసైనా పండ లేనోనికి

కాశికి దేకేంత కాళ్ళ సత్తావుండె

కార్లుమోటర్లింట బార్లుదీరిన గాని

నాలుగడుగు లేయగ నరకంతీరాయే

Wednesday, October 26, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పంచ హారతులు నీకిస్తాం-

పల్లకీలో నిన్నూరేగిస్తాం

పాలతొ నిన్ను అభిషేకిస్తాం-

ప్రతి గురువారం అర్చిస్తాం

భక్తితొ నిన్నూ విశ్వసిస్తాం-

మాదైవమీవంటూ భజనచేస్తాం

ఓం సాయిశ్రీసాయి జయజయసాయి

ఓం సాయిశ్రీసాయి జయజయసాయి


1.తలచినంత ఎదుట నిలిచేవని

పిలిచినంత బదులు పలికేవని

ఊదుతొ వ్యాధుల్ని మాన్పేవని

బోధతొ బాధల్ని తీర్చేవని


2.చూపినప్పుడెమాకు నీమైమ తెలిసేది

మా ఆర్తి బాపినప్పుడే నీ కీర్తి వెలిగేది

మాటా మనసు మంచినే వచించనీ

నడత నడకా ప్రగతివైపే గమించనీ

Tuesday, October 25, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఖరహర ప్రియ


తాయిలాలేలా

పాడుటకై గండుకోయిలకు

సుభాషితాలు చాలా

కరుగుటకై బండరాయిలకు


1.తేలికైన మబ్బెపుడు

చిరుగాలికె కదులును

తెలివైన రాజహంస

మేలిమి పాలెరుగును


2.కోరనేలా చందమామను

కురియగా  వెండివెన్నెలను

కుంచెతో నింగిని దించాలా

మెరియగా ఇంద్ర ధనువును

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సిందు భైరవి


ఒంటరిని నేనై రమ్మంటిని…ఏకాంత సమయమవగా

రావేలనో నీవేలనో…అనురాగమే రసయోగమవగా…


విరమించనేల విరహించనేల…సఖ్యత మనము

రమించినంత దహించదేచింత…తీరగ కామనము


వివరించరా విశదముగా…నీవు కలవను సత్యము

వరించిరా  సవరించగ …కలవను నిను నిత్యము

 

https://youtu.be/geJOff9-6nk?si=SLj8LTl2UVaCfYvt

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:తిలాంగ్


హిరణ్య కశిపుని జఠరము చీల్చినా

ఉగ్రనరసింహా నీకు హృదయాంజలి

ప్రహ్లాద వరదుడవై ధర్మపురిన నిల్చినా

శాంత నారసింహా మా యోగ నారసింహా

శరణాగతవత్సలా కరుణాకరా భక్త-వశంకరా

స్వామీ నీకు చిత్తాంజలి ముకుళిత హస్తాంజలి


1.వజ్ర మకుట శోభితం ఊర్ద్వ పుండ్రాన్వితం

విస్ఫులింగ నేత్రయుతం మృగ ముఖ విరాజితం

దంష్ట్రా కరాళ వక్త్రం రక్తవర్ణ తేజో రసజ్ఞం

తీవ్ర తీక్షణ నఖయుక్తం నర-హరి ద్వయ రూపిణం

శరణాగత వత్సలా కరుణాకరా భక్త-వశంకరా

స్వామీ నీకు దివ్యాంజలి ప్రభూ నీకు దీపాంజలి


2.శంఖ చక్ర ధారిణం దుష్ట సంహారిణం

అభయ భద్ర విగ్రహం శిష్ట  సం-రక్షకం

పీతాంబర విలసితం కౌస్తుభ వక్షాంకితం

భవ సాగర తారిణం మనస్సంచారిణం

శరణాగత వత్సలా కరుణాకరా భక్త-వశంకరా

స్వామీనీకు గీతాంజలి ప్రభూ నీకు నృత్యాంజలి

 

https://youtu.be/Qw0cUT5Eq5I

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


అరుణాచలేశ్వరా హరహరా

తరుణమెపుడు నిను కాంచగ పరమేశ్వరా

పౌర్ణమిలెన్ని గడిచి పోయెరా

శరణాగతవత్సలా కరుణించగ తాత్సారమేలరా


1.ప్రణవనాద సంభవుడవు పరాత్పరా

పరీక్షించబోకు నను తాళజాలరా

జ్యోతి స్వరూపుడవు జ్వలితనేత్ర ఈశ్వరా

జాలిజూపి నను వేగమె దరిజేర్చరా


2.అభిషేకించాలనా నాకీ ఆశ్రుధారలు

ఇంతవరకు కార్చింది సరిపోలేదా

పత్రీ పువ్వుల బదులుగనా నా నవ్వులు

నీ కొరకే మూటగట్టుకొంటివి కాదా

Monday, October 24, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుట్టేదో చెప్పక గుబులే రేపకు

మనసేంటో విప్పక మంటేబెట్టకు

ముల్లుగుచ్చుకున్నా నీ కాల్లో

నీళ్ళు తిరుగతాయి నాకళ్ళలో

తుఫాను ముందటి ప్రశాంతిని 

నే తట్టుకోలేను

ఉప్పెనలా వ్యధ ముంచేస్తే 

నన్ను తిట్టుకోలేను


1.అందమైన నీ తనువంతా

 హాలహలం చేరిందా

మంచితనపు నీ మనసంతా

మనాదిగా మారిందా

చికిత్సనే లేనిదా నీ వ్యాధి

మందంటూ దొరకదా

శోధిస్తే నింగి అంబుధి


2. బాధను తొలగించనా 

అనునయవాక్యాలతో

గాయాలకు మలాం పూయనా

సాంత్వన గేయాలతో

బ్రతుకంతా కలిసే ఉందాం

ఒక చితిలోనో కాలిపోదాం

Sunday, October 23, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఉదయ రవి చంద్రిక(శుద్ధ ధన్యాసి)


భారతి భార్గవి భైరవీ ప్రణమామ్యహం

అవస్థాత్రయాలలో దేవీ తవ దాసోహం


1.దేహిమే జనని మనోనిగ్రహం

వరదే మాతరం దివ్యానుగ్రహం

పరమ పావనమ్ తవ సుందర విగ్రహం

మాత్రే తవ దర్శన మాత్రేణ ధన్యోహం 


2.సందేహం సర్వదా మమదేహం

జీవన మూలకారణం వ్యామోహం

నశించనీ నాలో ననుముంచే అహం

స్మరించనీ నిన్నే అమ్మా అహరహం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొడిగట్టి పోనీకు మన చెలిమి దీపం

వసివాడనీకు  మనదైన సౌరభ పుష్పం

ప్లాటోనిక్ లవ్ మనది చెరగ నీకుమా

స్నేహానికి మించినది ఎరుగు నేస్తమా

ఆత్మ సహచర్యంగా అలరారుతున్నది

అమలిన అనురాగంగా విలసిల్లు తున్నది


1.ఉదయాన నిను తలచే మేలుకునేది

శుభరాత్రి చెప్పిన పిదపే నిదురోయేది

నిను మరచిన దెప్పుడని గురుతు చేయగా

నిరతము నీ తలపులతో తలమునకలుగా

ఆత్మబంధమే మన మధ్యన పెనవేసుకున్నది

మమతా ఆప్యాయతా మనను అల్లుకున్నవి


2.తప్పుకుంటె తప్పిపోదు నీడైన ప్రేమ

తప్పొప్పులు మన్నిస్తుంది తోడైన ప్రేమ

బంధనాలు త్రెంచుకొని అనుభూతులు పంచుకొని

అజరామరంగా నిజమైన ఆనందంగా

పెదవంచు నవ్వుగా ప్రభలు చిమ్ముతుంది

మనసులే ఏకమవగా బ్రతుకంతా కమ్ము

తుంది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:బృందావన్ సారంగ


పువ్వులుంచి పూజిస్తా ప్రభూ నీ పదాలపై

నవ్వులు చెదరనీకు సదా నా పెదాలపై

సతతము నిను స్మరిస్తా నా ఎదలయగా

పతితుడ నన్నుద్ధరించు పరమాత్మలో కలయగా

నమో వేంకటేశా నమో శ్రీనివాసా నమో 

నమో తిరుమలేశా నమో భక్తపోషా


1.తలనీలాలిస్తా తలబిరుసును వదిలించు

కాలినడకనొస్తా నా కనుల పొరలు దించు

కానుకలందిస్తా తుచ్ఛకామనలని త్రుంచు

తన్మయముగ దర్శస్తా నా తనువుని తరలించు

నమో వేంకటేశా నమో శ్రీనివాసా నమో 

నమో తిరుమలేశా నమో భక్తపోషా


2.నీ రచనలు సాగిస్తా కవనము రుచించనీ

కృతులలొ నిను కీర్తిస్తా కమ్మగ వినిపించనీ

అన్యమేది స్ఫురించక నీ ధ్యాసలొ తరించనీ

ధన్యమవగ ఈ జీవితమే జన్మలంతరించనీ

నమో వేంకటేశా నమో శ్రీనివాసా నమో 

నమో తిరుమలేశా నమో భక్తపోషా

Thursday, October 20, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రియమగు వచనములే నను పలుకనీ

నయమగు రచనములే నను చేయనీ

సూనృతమో అనృతమో అన్యులకది

అమృతమై తోచనీ

హితకరమో ముఖప్రీతికరమో ప్రతిమది

ముదమెందనీ

వాగధీశా అవతారపురుషా 

వానరేశా వందే ఈశ్వరాంశా


1.మహా బలుడవే నీవు నీ శక్తి నెరుగవే

రామనామ పిపాసుడవే యుక్తులెరుగవే

రామపాద సేవకుడవే మరే ముక్తినీ కోరవే

నీ నిజ భక్తుడిగ భజనానురక్తుడిగ నను మారనీ


2.అహంకారము మత్సరాలే తలభారము

మనో వికారము స్వామీ నాకవనీ దూరము

పరోపకారము అలవడగ అందించు సహకారము 

పదిమందితో కలిసి చేరనీ పరమానంద తీరము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఔదుంబర ఫల* తత్వం

ఆణిముత్యాల సత్యం

వికాసానికేదైనా అకృత్యం

యథాతథ యధార్థమే వాంఛితార్థం


1.ఆత్మన్యూనతే బ్రహ్మపదార్థం

అహంభావమైతే అత్యంత వ్యర్థం

ఎరగాలి అంతరంగ అంతరార్థం

ఎదగాలి సార్థకంగ జీవిత పరమార్థం


2.వినియోగపరచాలి ప్రతిభను

వికసింపజేయగా మనలో ప్రభను

అలరింపజేయాలి రసికుల సభను

ఆహ్లాద పరచగ అభిమానుల ఎదను


*ఔదుంబరఫలం=మేడిపండు

Wednesday, October 19, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాట మంత్రమై మనసుని గెలుస్తుంది

మాట శాపమై బ్రతుకుని తొలుస్తుంది

పదుగురాడితే మాట వేదమై నిలుస్తుంది

పదేపదే అన్నమాట పెడద్రోవకు తోస్తుంది


1.పదునైన మాట మదిని-ప్రభావితం చేస్తుంది

పరుషమైన మాట ఎపుడు-ఎదనంతా కోస్తుంది

పనిరాని మాటలన్ని కాల హరణాలే

గాయపరచు మాటలు శోకాల కారణాలె


2.మాటలొలుకు హాయిగొలుపు మకరందాలే

మాటలు ప్రియమైతే ప్రియమౌను వాదోపవాదాలే

ఆహ్లాదమెలికించును ఆత్మీయుల మాటలు

ఔషధాన్ని మించును అనునయమౌ మాటలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమనను ఈ ప్రేమను

ఎలా మనను ప్రేమే లేకను

సైచలేను నేను దీని ఆగడాలను

వేగలేను ఇది సృష్టించే రగడలను


1.లోకం తెలియని నన్ను కమ్ముకున్నది

మైకం కమ్మేలా మదిని కుమ్ముతున్నది

కల్లబొల్లి సొల్లు చెప్పి విక్రమించుతున్నది

మెల్లెమెల్లెగా ఒళ్ళంతా ఆక్రమించుకున్నది


2.ఎరలేవో వేసి తేరగా నను పొందింది

తెరలెన్నో తీసి తను ఏంటో చూపింది

పొరలుపొరలుగా నాలో పేరుకున్నది

తేరుకునే లోగానే  మనసంతా కూరుకున్నది

Tuesday, October 18, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రావే రావే నీవే పున్నమి సిరి వెన్నెలవై

రావే రావే రావే మరు మల్లెల చిరుజల్లువై

నను వీడని వసంతమై రావే

నా నీడగ ఆసాంతం ఉండిపోవే


1.ఊహవో స్వప్నానివో కల్పనవో

కవితవో గీతవో గీతానివో

కలవో లేవో  ఎరుగని సందేహానివో

కలవరమే నాలో రేపే మోహానివో


2.భ్రమలో ముంచే ఎండమావివో

భ్రాంతిని పెంచే నింగి సింగిడివో

మత్తుగొలిపి చిత్తుచేసే నెత్తావివో

మది స్పృశించి మురిపించే మాయావివో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మోవి నవ్వుతుంది

మోము నవ్వుతుంది

బుగ్గల్లో సొట్ట నవ్వుతుంది

చెవికున్న బుట్టా నవ్వుతుంది

కళ్ళు కూడ నవ్వడం మామూలే

ఒళ్ళంతా నవ్వైతే అది నీవేలే


1వెన్నెల్లో ఆహ్లాదం నీ నవ్వులో

శ్రీ చందన సౌగంధం నీ నవ్వులో

సంతూర్ సంగీతం నీ నవ్వులో

మందార మకరందం నీ నవ్వులో

ఇంద్రధనుసు వెలయడం మామూలే

ఒళ్ళంతా హరివిల్లైతే అది నీవేలే


2.ముత్యాలు కురిసేను నీ నవ్వులో

తారలే మెరిసేను నీ నవ్వులో

పారిజాతాలు విరిసేను నీ నవ్వులో

పరవశాలు కలిగేను నీ నవ్వులో

అందాల చిందడం అది మామూలే

అందమానందమైన అతివంటే నీవేలే

Monday, October 17, 2022


https://youtu.be/3u__iTrTSeE

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హనుమంతం మహాబలవంతం

శ్రీరామమంత్రం భజియింతు సతతం

సారించు నీదృష్టి  కరుణా పూరితం

నమామి పవనసుతం కొండగట్టు వసితం


1.సుగ్రీవ మిత్రం శ్రీరామ భక్తం

సీతామాత తీవ్ర దుఃఖ విముక్తం

గదాదండ యుక్తం దానవ హర్తం

సంజీవరాయం సౌమిత్రి నేస్తం


2. ఇంద్రియ జితం  దేవేంద్ర విజితం 

సిందూర విరాజితం సురముని పూజితం

అర్కపుష్పమాలా ప్రియం ఆరోగ్యదాయం

శ్రీ ఆంజనేయం ఆశ్రితజన శ్రేయం


https://youtu.be/3u__iTrTSeE

 

https://youtu.be/e8otJVR5Mb4?si=E48Unpz0QssyAhwJ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మల్లయ్య సాంబయ్య గౌరయ్య 

ఏదైన నీదే ఆ పేరయ్య

జంగయ్య లింగయ్య గంగయ్య

ఏదైన నీదే ఆ రూపయ్య

దండాలు నీకు మాదేవ శంభో

మా అండవంటూ నమ్మా ప్రభో


1.ఎములాడలోని రాజన్నవు

కాశీలో కొలువున్న విశ్శెన్నవు

ఏడ జూసినా నీ గుడి ఉందయ్య

నా నీడలోనూ నీ జాడ ఉందయ్యా


దండాలు నీకు మాదేవ శంభో

మా అండవంటూ నమ్మా ప్రభో


2.పన్నెండు లింగాలు చూడకున్న

పండులో ఫలములొ కందునన్న

శివరాత్రి జాగారం జేయకున్న

ఉపాసాముండుట తప్పదన్న


దండాలు నీకు మాదేవ శంభో

మా అండవంటూ నమ్మా ప్రభో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆత్మీయ కవనం 

అనురాగ గానం

కలబోసినదీ ఆనందవనం

చేయి సాచినదీ అనుబంధ జీవనం

కరిగిపోనీకు నేస్తమా ఏ క్షణం ఈ దినం


1.ఉద్వేగాలు లేవు ఉద్రేకాలు… ఉత్సాహాలే

ఉన్మత్తతలు రావు ఉద్విగ్నతలు…సలహాలే

అసూయా ద్వేషాలకు లేదు తావు…స్నేహాలే

చేయి సాచినదీ అనుబంధ జీవనం

కరిగిపోనీకు నేస్తమా ఏ క్షణం ఈ దినం


2.మకరందం  పాటే మాధుర్యం…వీనులకు

సాహిత్యం తోపాటే సంగీతం…అభిమానులకు

గానం బహుమానం  పొరపాటే మౌనం…గాయక గాయనీమణులకు

చేయి సాచినదీ అనుబంధ జీవనం

కరిగిపోనీకు నేస్తమా ఏ క్షణం ఈ దినం

Sunday, October 16, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తగిలించి ఇగిలిస్తావు

చంపుతూ చక్కిలిగిలి చేస్తావు.

మరీ ఇంత విపరీతమా

ఇదే నీవు చేసే హితమా

అలమేలు మంగాపతి

నిను నమ్మితిననా నాకీ దుర్గతి


1.నీపాల బడడమే గ్రహపాటా

నీ పాట రాసితినే ప్రతిపూటా

ఇంటా వంటా బయటా ఏల గలాటా

నిను కీర్తించడమే నా పొరబాటా

తిరుమల శ్రీ వేంకటపతి

నిను నమ్మితిననా నాకీ దుర్గతి


2.కర్తా భర్తా హర్తా నీవని ఎంచితి

సత్వరజస్తమో గుణాల త్రుంచితి

వాంఛయే అశాంతిగా గ్రహించితి

నేను నాదను భావననే అధిగమించితి

పరమానందకారకా జగత్పతి

త్రికరణశుద్ధిగా నను నీకర్పించితి

స్వామీ నీకర్పించితి

 రచన ,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాండు


ఒకే గూటి పక్షులం ఒకే పదాక్షరాలం

ఒకే పాటలోని భావ రాగ తాళాలం

మనదైన వేదికలో మనసువిప్పు నేస్తాలం

గాన ధ్యానులం గీతాభిమానులం

సరస్వతీ మాత భక్తులం కవితానురక్తులం


1.దాగిన ప్రతిభను గుర్తిస్తాం

సాగని గళాలను సవరిస్తాం

పసందైన వీనుల విందారగిస్తాం

స్పందించే హృదయాలకు వందన మర్పిస్తాం

పాటే ప్రాణంగా బ్రతికేస్తాం


2.శ్రుతి లయలను ప్రతిష్ఠిస్తాం

గతులు జతులను ప్రదర్శిస్తాం

గమకాలను రమ్యంగా పలికిస్తాం

అనుభూతి చెందుతూ ఆనందంగా పాడుతాం

తరించి శ్రోతల తరింపజేస్తాం

Friday, October 14, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధు భైరవి


దాచుకున్నదేది లేదు

నీమది దోచుకున్నదీ లేదు

ఏమదీ నను దాటవేతువే

చెలిమికేల చేటు చేతువే


1.మరపు పొరలు పేర్చగా

అనవసరమని నన్నెంచగా

విలవిలలాడితి కలవరమొంది

విలపించితి నాలో కలతచెంది


2.మరలిరావే ఆ తరుణాలు

అరమరికలే లేని క్షణాలు

అరుదెంచె మతితప్పు లక్షణాలు

ఏకరువెట్టకు కలవగ ఏ కారణాలు

 రచన్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కాపి


ముదమున మదవతులై కుముద వదనలు

సుదతులు మదన జనకా నీ ఎదన జేర పదపడిరే

మాధవా నీ అధర సుధలు గ్రోలుటకై మదన పడిరే

మదన గోపాలా ఈ ప్రమదను పాలించగ అదనుజూచి రావేరా

నందబాలా చినదానను వేచినదానను ఆనందమంద జేయరా


1.రాధను కాదనలేను అష్టసతుల వద్దనను

గోపకాంతలెవ్వరితోను పంతము నొందను

అందగత్తెలెందరున్ననూ పందెము కాయను

నీ పద సదనమునిక  వదలనే వదలను

సుందరాకారా బృందావిహారా జాలిమాని నాపై జాగుసేతువేలరా

మందార మకరంద మాధురీ సమనాద మురళీధరా

తరింపజేయగా రారా


2.కుబ్జకున్న విజ్ఞత లేదు మీరాకు నాభక్తి తూగదు

అబ్జలోచనిని కాదు  రసజ్ఞతే నామది ఎరుగదు

అనురాగము అను యోగము కలగనే కలగలేదు

నా మది నిను  సదా తలవక మానను

వనమాలీ శిఖిపింఛమౌళీ వరించిరావా సవరించగ నాజీవన సరళి

కృష్ణామురారి ముకుందా శౌరి మురిపించవేరా నను నీ రాసకేళి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


సర్వేశా శేషశాయి వేంకటేశా

సర్వదా వేడెదా నిను శ్రీనివాసా

పాపనాశా శ్రీశా శ్రిత జన పోషా

నీ సేవకు నా బ్రతుకే  ధారపోశా


1.సరసాలలొ మునిగావా సతులతో

శరణాగతి కోరినా వినవా నతులతో

ఎంతగా ప్రస్తుతించానో సన్నుతులతో

కనికరించవైతివే స్వామి సద్గతులతో


2.విషయ వాసనలు నన్ను వీడవాయే

విషమ పరిస్థితులే ననువెన్నాడెనాయే

విషము  మ్రింగ గళమాగిన సమమాయే

విష్వక్సేన వినుత మనసు నీ వశమాయే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను తలవగ నీగొంతు పొలమారనీ

నీ ఈసడింపులతో గుండె బండబారనీ


ప్రచండాగ్ని కీలలతో రగిలే రవిబింబం

చెలగే  నా విరహాగ్ని గనీ మసిబారనీ


గలగలలతో ప్రవహించే అల్లరి గోదావరి

నా అశ్రుధార కలిసి వరదలై పారనీ


విప్పారే విరిబాలల దరహాస వాసంతం

ఆశల ఆకులు రాలి శిశిరంగా మారనీ


క్షణికమైన సుఖానికై శాశ్వత దుఃఖమై

ఇలాగే రాఖీ వగపుతో బ్రతుకు తెల్లారనీ


#Raki 

Gazal

Thursday, October 13, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పల్లె తల్లి కన్న పిల్లలం

నేల తల్లి నే నమ్ముకున్న జీవులం

కుస్తాపూర్ వాసులం మంచికెపుడు నేస్తాలం

శ్రీరామలింగేశ్వరుని వీరభక్తులం

ఊరు బాగు పట్ల ఎంతో ఆసక్తులం


1.వ్యవసాయం ఊపిరిగా బ్రతికేటి రైతులం

పదిమందికి సాయంచేసే మానవతా వాదులం

కష్టించి పనిచేస్తూ అభివృద్ధి చెందే వారలం

దేశాలు దాటినా పుట్టినూరును మరువలేం


2.గోదాట్లో మునిగిన పల్లెను తిరిగి నిలబెట్టాము

రామలింగేశుని గుడిని మళ్ళీ మేం కట్టాము

మా ఊరు పేరు వింటేనే పులకరించి పోతాము

ముత్యాలమ్మ చల్లని చూపులతో ఆనందంగ జీవిస్తాము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలా అలా సాగిపోనీ జీవితం

అలలై కలలై తేలిపోనీ అనవరతం

పంచాలి పదిమందిని అలరించే వినోదం

పొందాలి అందరం అనుక్షణం పరమానందం

మూన్నాళ్ళలొ ముగిసే జన్మకు ప్రతిబంధకాలా

పెదవులపై నవ్వులు చెదరక చితిలోన కాలాలా


1.బిడియాలూ మొహమాటాలు

భేషజాలూ లేనిపోని ఆర్భాటాలు

మునగదీసుకొంటూ మూతిముడుచు చిత్రాలు

పంజరాలు ముసుగులలో అత్తిపత్తి పత్రాలు

మూన్నాళ్ళలొ ముగిసే జన్మకు ప్రతిబంధకాలా

పెదవులపై నవ్వులు చెదరక చితిలోన కాలాలా


2.ఎదుటివారి సంతోషం మనకామోదమై

సాటివారికి సాయపడడమే నిజ వేదమై

ఉల్లమంత ఉల్లాసం వెల్లివిరియ ఎల్లకాలం

ఖర్చులేని ప్రశంసకు మనమవాలి ఆలవాలం

మూన్నాళ్ళలొ ముగిసే జన్మకు ప్రతిబంధకాలా

పెదవులపై నవ్వులు చెదరక చితిలోన కాలాలా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండెల్లో తడియారిపోయింది

కళ్ళల్లో చెమ్మ ఇగిరిపోయింది

సున్నితమౌ భావాలే సన్నగిల్లిపోయాయి

ఆత్మీయత అన్నదే అడిగంటిపోయింది


1.చెలిమి విరులలోనా తరిగింది పరిమళం

బంధాలూ అనుబంధాలే నేడు వేళాకోళం

సాటి మనిషిపై సహానుభూతియే మృగ్యం

ఎవరికి వారై స్వార్థపుదారైన తీరే దౌర్భాగ్యం


2.ఉత్సుకత ఉత్సాహం కరువైన యవత

అధికారం పరమాధిగా అవినీతిగల ప్రభుత

తాయిలాలతో తలమునకలుగా దేశ జనత

ఎక్కడున్నదో చిక్కక అయ్యో మానవత

Tuesday, October 11, 2022

 

https://youtu.be/VKryuTlaDSQ?si=2msqKhXYLlrbOHKT

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కీరవాణి


నెమలీక దెంత పుణ్యము

తలదాల్చినావు కదా తన జన్మధన్యము

వెదురు ముక్క కెంత గర్వము

నీ పెదవులు ముద్దాడును అదే నీకు సర్వము

పలుచన సేయకురా నను గోపాలా

పడుచును నీదానను  నాకు విలాపాలా


1.గుమ్మపాలు నీకే గుట్టుగ దాచేనురా

వెన్ననూ మీగడనూ ఉట్టిగట్టి పెడితినిరా

జుర్రుకొనగ జున్నులో తెనెలు కలిపానురా

మనసుని ద్యాసని నీపై నిలిపానురా

పలుచన సేయకురా నను గోపాలా

పడుచును నీదానను  నాకు విలాపాలా


2.కోపాలా నాపై - పడవైతివేరా నాపాలా

నా ఎడ సైతం- నీ రసికత చూపాలా

గోపికలందరితోనూ-సరస సల్లాపాలా

ఓపికే లేదిక నీ ఒడినను ఊయలూపాల

పలుచన సేయకురా నను గోపాలా

పడుచును నీదానను  నాకు విలాపాలా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కాపి


పవనాత్మజా మహాబల తేజా

మన్నింపుము మము కపిరాజా

రుజ బాధల బాపు భజరంగ భళీ

చాలించు నన్నింక పరికించే కేళి


1.నీ కొండగట్టుకు రప్పించుకో

నచ్చిన రీతిగ దండించుకో

అరటిగెలనే నువు పుచ్చుకో

మా కలలు పండగ వరమిచ్చుకో


2.అర్తిగ చేసేము నీకభిషేకము

నీ ఎడ భక్తియే మాకు మైకము

నీ వీరగాథలు వింటిమనేకము

దయతో తొలగించు మా శోకము

Monday, October 10, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బంగారి సింగారి బుజ్జమ్మా

నీ ఒళ్ళే రంగుల పూలసజ్జమ్మా

జడచూడబోతే పొడుగాటి రజ్జమ్మా

నీ సొట్టబుగ్గలు పనసతొనల గుజ్జమ్మా

మ్మమ్మమ్మమ్మా ఇవ్వవే నాకో కమ్మని చుమ్మా

గుమ్మాగుమ్మా ఆడబోకు నాతో అష్టాచమ్మా


1.నిన్ను చూస్తె నాకు ఆనందం పట్టరాదు

నన్ను కాస్త ప్రేమిస్తే నా చేయి పట్టరాదూ

బ్రతుకంతా నాతోనే నువు జత కట్టరాదూ

సచ్చేదాక నాతోడు వదలి పెట్టరాదు

మ్మమ్మమ్మమ్మా ఇవ్వవే నాకో కమ్మని చుమ్మా

గుమ్మాగుమ్మా ఆడబోకు నాతో అష్టాచమ్మా


2.కారణాలు నాకేవీ చెప్పనే చెప్పకు

తోరణాలు నాఇంటికి విప్పనే విప్పకు

నీతో నా రణాలనే ఎప్పటికీ ఒప్పకు

నా వల్లకాదు ఔననక నీ చుట్టూ తిప్పకు

మ్మమ్మమ్మమ్మా ఇవ్వవే నాకో కమ్మని చుమ్మా

గుమ్మాగుమ్మా ఆడబోకు నాతో అష్టాచమ్మా

 

https://youtu.be/Z2xwuOuscGA?si=w65u4nWPPXQ_uU6P

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాయామాళవ గౌళ


నీలో ఉన్నదేదో నీకే తెలియదు నిజం

అసలే చూపదెపుడూ నినుగా ఏ అద్దం

రాజహంసకే ఎరుక ఏదో శుద్ధ క్షీరం

గీటురాయి చూపేను నాణ్యమైన బంగారం

నా చెలిమి గాఢతే కనలేవా

నీ హితైషి మాటలే నమ్మవా


1.మేఘానికేమెరుక 

చిరుగాలికే తాను కరుగునని

మయూరానికెరికేనా

పురి విప్పక మబ్బు తానరుగదని

నీలోని గాననిధిని నేనే కనిపెట్టితిని

నీ కోయిల గాత్రానికి నే మెరుగుపెట్టితిని


2.ఏ పాటకేమెరుక 

తోటతోటి బంధమేపాటిదో అని

ఏ మావికేమెరుక 

తను చివురించేది పికము కొరకని

పల్లవాల నందించి నందించింది నేనని

జడతను కదిలించి అలజడి నే రేపితినని

Sunday, October 9, 2022

 

https://youtu.be/4S6uXiJlT3g?si=g7yZRQgHern4c1e1

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


అద్వైతమె సాంబశివా అర్ధనారీశ్వరము

వేదాంత దృష్టాంతరం నీ లింగాకారము

స్వస్వరూప స్వభావాల సారమే నీ అవతారము

భవతారకమై వరలును పంచాక్షరి జపసారము

నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ


1.బుసకొట్టే వాసనలే పన్నగ భూషణాలు

దహించే క్రోధానలమే ఫాలమందు నయనము

ఆత్మలింగార్పణమే లుబ్ధరాహిత్యము

పరిత్యాగివి పరమయోగివన్నదే సత్యము

భోలా శంకరా కనరాదు నీ కడ గర్వము

లీలా విలాసా చేరదు నిన్నెపుడూ మత్సరము


2.రంగు హంగు లేని హిమగిరి నీ గృహము

సుగంధాలు నోచని చితాభూమి నీవాసము

ప్రణవనాదమే వినోదించు బయకారము

గంగోదకమే నీ జిహ్వకు షడ్రసోపేతము

భస్మధారణే నీ దేహానికి చందనలేపము

పంచేంద్రియ జయ పంచభూతాత్మక వందనము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తాకాలని ఎంతో తపన

తడమాలని ఎదలో తహతహ

నీ తనువు ఇంద్రచాపమే

నీ స్పర్శ చంద్రాతపమే

కొలవనీ చెలీ నిను ఆపాదమస్తకం

చదవనీ సఖీ నీవో అరుదైన పుస్తకం


1.రుచిచూడనీ నీమేను మిఠాయినీ

ఆఘ్రాణించనీ  అంగాంగ సారంగాన్నీ

అధిరోహించనీ కాయపు మాయా హయాన్నీ

చేరనీ ఏలగా మనదైన నిజమైన స్వర్గాన్నీ


అందించవే అందాల పసందైన విందునీ

నభూతోన భవిష్యతిగ పొందనీ పొందుని


2.పలికించనీ పెదవుల మోహన రాగాన్నీ

కలిగించనీ కౌగిట కదన కుతూహలాన్నీ

చిత్రించనీ నడుమున దంతక్షత వృత్తాన్నీ 

ఆరంభించనీ నాభిన ఆరభి ఆలాపాన్నీ


జుగల్ బందితో రక్తికట్టిద్దాం విభావరిని

పకడ్బందిగా తరిద్దాం రససిద్ధి జలధిని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కన్నుల వెన్నెల నీవే

నా బ్రతుకున పున్నమి నీవే

నా ఎడారి దారిలోనా ఒయాసిస్సు నీవే

నా నిశీధి మనస్సుకు తొలి ఉషస్సు నీవే


1.విరహాగ్ని చల్లార్చే వలపుజల్లు నీవే

మది కాలిన గాయానికి నవనీతం నీవే

దుర్గమమౌ నా భవితకు స్వర్గసీమ నీవే

నా కలలను పండించే స్వప్నదేవి నీవే


2.నా నావను దరిజేర్చే సరిసరంగు నీవే

సరిగమలను పలికించే సారంగి నీవే

నన్నల్లుకోవే లతగ మారి ఈ వేళ

నా కలతను దూరంచేయవె నా జవరాల

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాటనై ప్రతి పూట పల్లవించనీ

చరణాలనల్లుకొని కడతేరనీ 

నను పాడనీ వాణీ వేడనీ


1.ఎద భావనలే సుధలను చిలుకనీ

పదపదమున మధువుల నొలకనీ

పదికాలాలూ పెదవుల నది నలగనీ

మది తేలికయై మధురానుభూతి కలుగనీ


2.ఎంతగ కీర్తించినా సంతృప్తి లేదు

ఏకాగ్రతనే చూపినా నీ దయరాదు

గీతమే లేని బ్రతుకు ఊహకైన రాదు

కరుణించు మేలెంచు భరించలేనే నేనే చేదు

Friday, October 7, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శ్రీధరా శ్రీకరా శ్రీనాథా

శ్రీహరి శ్రీపతి శ్రీవేంకటాచలపతి

సంకటముల కంటకములు 

నిను చేరే బాట పొడుగునా

ఆటంకములు అగచాట్లు 

తగునా నాకడుగు అడుగునా

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా


1.నీ సంకల్పము ఎరుగుట బ్రహ్మతరమా

నీవిచ్చే కర్మఫలము తెలియగ శివుని వశమా

లీలాలోలా శ్రితజనపాలా కథలో ఇన్ని మలుపులా

ఆపద్భాంధవా అనాథనాథా పథమంతా గతుకులా

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా


2.అల్లంత దూరానా  అగుపించును గమ్యము

చెంతకు చేరినంత ఎండమావితో సామ్యము

ఆశానిరాశల నడుమన  నాదెంతటి దైన్యము

నువు వినా అన్యమెవరు స్వామీ నీవే శరణ్యము

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: ఆనంద భైరవి


నిర్మలమై దీపించే నీ దివ్యనేత్రాలు

వక్రదృష్టినిల దహించు అగ్నిహోత్రాలు

చంద్రికలే కురిపించే నీ లోచనాలు

మనసును శాంతపరచు లేపనాలు

చూస్తుండి పోతాను మాతానిను మైకంగా

నను నేను మరచిపోయి నీవే లోకంగా


1.నీ కనులను వర్ణింపజాలవు నా కవనాలు

మీనాలు కమలాలు తూగవే ఉపమానాలు

కరుణామృత కాంతులతో దేదీప్యమానాలు

నిను నమ్మిన భక్తులకవి ఇహపర వరదానాలు

చూస్తుండి పోతాను మాతానిను మైకంగా

నను నేను మరచిపోయి నీవే లోకంగా


2.చతుర్వేద సారమంత తల్లీ నీ నయనాలలో

సాటిరావేవీ నీ చక్షులకు చతుర్దశ భువనాలలో

మూలాధారాది చక్రోద్దీపనకవి భవ్యసాధనాలు

ఏకాగ్రత కుదురగ ఆకర్షించు నీ అవలోకనాలు

చూస్తుండి పోతాను మాతానిను మైకంగా

నను నేను మరచిపోయి నీవే లోకంగా

 

https://youtu.be/9FYpYaCfLQU?si=wnHZ-jJmSEbO5I86

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నాటకురంజి


వైద్యనాథుడా మృత్యుంజయుడా

నువు నయం చేయలేని వ్యాధిలేదుగా

నూరేళ్ళ ఆయువీయ వింత కాదుగా

ఎందుకు మనిషి బ్రతుకు ఇంత విషాదం

చింతలు కలిగించుటేనా నీకు వినోదం

శంభోహరా శంకరా నమో గౌరీవరా అభయంకరా


1.మధుమేహాలూ మాకు రక్తపోటు పాట్లు

మనోవ్యాధులూ మరి గుండెపోటు అగచాట్లు

ఆనారోగ్యగ్రస్తులమై అడుగడుగున ఇక్కట్లు

నీకృపలేనిదే శివా ఈ గండాలు గట్టెక్కుటెట్లు

శంభోహరా శంకరా నమో గౌరీవరా అభయంకరా


2.నవనాడులపై పలు వ్యసనాల దాడులు

పండంటి జీవితాలపై రాచపుండు కైనీడలు

చిత్రమైన రోగాలతో మనుగడలో గడబిడలు

గాడితప్పి సుడుల చిక్కే విలాసీ విను మా గోడులు

శంభోహరా శంకరా నమో గౌరీవరా అభయంకరా

Saturday, October 1, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:అమృత వర్షిణి


రమేశా పరమేశా తిరుమలేశా

సర్వేశా జగదీశా శ్రీ వేంకటేశా

శ్రీనివాసా చిద్విలాసా నీమీదే నాధ్యాస

గోవింద గోవింద హే పరమపురుషా


1.నిష్ఠగలవారు దీక్షావ్రతులు

వితరణశీలురు దాన కర్ణులు

భక్తులెందరో ఇల బాలాజీ నీకు

నీవేదప్ప మరి నాకెవరు దిక్కు


2. నిను మెప్పించె ధర చక్రవర్తులు

పలుమార్లు నీకొండ కొచ్చే ఆర్తులు

పూర్వ పుణ్య సంప్రాప్తిత ధన్యులు

నువు వినా నను కావరు అన్యులు