Thursday, January 23, 2020

స్ఫురించనీ చప్పున నీ నామం
నీ మెప్పునొందనీ  గొప్పగ నా గానం
హరహర హరహర మహదేవా
శంభోశంకర సదాశివా
నమః పార్వతీ పతయే ఈశా
గంగాధరహే సాంబశివా


1.సతీదేవినే వరియించి ప్రేమకు అర్థం తెలిపితివి
అవమానముతో ఆహుతికాగా ధర్మపత్నికై విలపించితివి
యజ్ఞశాలనే భగ్నముజేసి వీరభద్రుని నర్తించితివి
ఆగ్రహమ్ముతో రుద్రరూపమున దక్షుని తలనే త్రుంచితివి
ఎరిగించరా  నీతత్వము ఎరుకగలిగినా పరమశివా
రాగద్వేషము నీకూ కలవా నీవూ మా వలె మనిషివా

2.గౌరీసంకల్పమూర్తినీ ప్రియమౌ మానస పుత్రుని
బాలకుడని నీవెంచకనే తొందరపాటున దునుమాడితివి
విగతజీవునకు గజశిరమతికి ప్రాణంపోస్తివి గణపతికి
తారక సంహార కుమరునికై ఏమార్చిన మరుడిని కాల్చితివి
ఎరిగించరా  నీతత్వము ఎరుకగలిగినా పరమశివా
రాగద్వేషము నీకూ కలవా నీవూ మా వలె మనిషివా

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మరువని జ్ఞాపకమా
వరమైన శాపమా
దినదినమొక నూరేళ్ళుగా
గడుపుతున్న జీవితమా

1.గుడిలోని ధ్వజస్తంభ
చిరుగంటల సాక్షిగా
సనసన్నని నీ నీవ్వులు
నా వీనుల మ్రోయునే

కూలిన ఆ గడిగోడల
ప్రాభవాల మాటుగా
మనకలయిక కుడ్యమై
ఎప్పటికీ నిలుచులే

జారిన అశ్రుకణమా
విగతమైన ప్రాణమా
కొడిగట్టిన దీపికగా
మలిగే భవితవ్యమా

2.గోదావరి అలలునేడు
మన గురుతులనే పాడు
గున్నమావి గుబురుతోట
మన గాథలనే తెలుపు

కోనేటి మెట్లుకూడ
అనుభూతులనెన్నొ పంచు
విధి వింత గారడితో
బ్రతుకులేలనో త్రుంచు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నీటి బుడగ జీవితము
పాము పడగ ప్రతి నిమిషము
నీ సాయము లేనిదే సాయీ
మనుగడయే గగన గండము
అండదండనీవే అఖిలాండనాయకా
సాష్టాంగ దండము నీకు బ్రహ్మాండ పాలకా

1.ముంచెత్తే కెరటాలు-ఆటంకాలు
మ్రింగజూచే తిమింగలాలు జరామరణాలు
ఈతరాని నాకు చేయూతనీవె సాయీ
చతికిలపడు నాకు విశ్వాసమీవె సాయీ
అండదండనీవే అఖిలాండనాయకా
సాష్టాంగ దండము నీకు బ్రహ్మాండ పాలకా

2.భవ జలధిని దాటించే సరంగునీవే
అనుభవ గుణపాఠాల గురువు నీవే
కడదాకా తోడుండే మిత్రుడ వీవే సాయీ
కన్నీళ్ళను తుడిచేటి ఆప్తుడవీవే సాయీ
అండదండనీవే అఖిలాండనాయకా
సాష్టాంగ దండము నీకు బ్రహ్మాండ పాలకా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అచూకి చెప్పండి మిత్రులారా
కనుమరుగైపోయిన మానవత్వానిది
వెదకి కాస్త కనిపెట్టండి నేస్తాల్లారా
మిగిలుందేమో ఆర్ద్రత హృదయాల్లోనా
నరులుగ ముసుగేసుకున్న పైశాచిక మూకలు
మనుషులుగా పిలువబడే నరరూప రాక్షసులు

1.ఎవరికి వారైనతీరు అత్యంత హేయమై
కన్నవారినొదిలేయగ కడుదయనీయమై
ఎక్కడికక్కడ బ్రతుకులు స్వార్థపూరితమై
అనుబంధాలన్నవే పూర్తిగా  అర్థరహితమై
మాయమైపోయింది మనుషుల్లో మానవతా
అడుగంటిపోయింది గుండెల్లో ఆర్ద్రతా

2.స్త్రీ అన్నది కేవలం ఒక భోగ వస్తువై
విచ్చలవిడి తత్వమే జనులకు అనురక్తియై
వావి వరస వయసెంచని మృగత్వకృత్యమై
ఆకాశంలో సగమన్నది ఊహకు పరిమితమై
తప్పిపోయెనెక్కడో లోకంలో మానవత
ఇంకిపోయిందీ మనసుల్లో ఆర్ద్రతా

3.కులం మతం కత్తెరలై బంధాలను కత్తిరిస్తు
భాషలూ  ప్రాంతాలూ సరిహద్దుల గీతగీస్తు
జాతీయభావననే అనుక్షణం గేలిచేస్తు
సమైక్యతా రాగాల పీకలు నులిమేస్తూ
చరిత్రగా మారింది ప్రపంచాన మానవత
ధరిత్రలో కరువైంది చెమరించగ ఆర్ద్రత
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:భూపాలం

వేకువ జామాయే వేంకటేశ్వరా
వేగిరమే మేలుకొనీ మాకు మేలుకూర్చరా
అలమేలు మంగమ్మ అపుడే లేచిందీ
ఇల జనులకు సిరులనొసగ తలమునకలుగానుంది

1.నారదాది మునులంతా బారులు తీరారు
ఇంద్రాది దేవతలూ ఆత్రుతతో నిలిచారు
వాగ్గేయకారులంత గీతాలతొ పొగిడేరు
నీ భక్తవరులూ గోవింద ధ్వానాల మునిగారు

2.అభిషేకమొనరించ గంగమ్మ వేచింది
పట్టుపీతాంబరాల పద్మావతి పట్టుకొంది
పారిజాత పుష్పాలను శచీదేవి తెచ్చింది
హారతినీకీయగా భారతియూ వచ్చింది

3.శుభములనొనగూర్చరా జగమునకెప్పుడు
కలతల పరిమార్చరా కలివరదా ఇప్పుడు
మాపై కురిపించరా నీ కరుణను గుప్పెడు
మానవతే నినదించనీ మా గుండె చప్పుడు