Wednesday, June 15, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తరించిపోయింది నీ పాదాలు కడిగిన కడలి

పరవశించిపోయింది నీపై వెన్నెల కురిసిన పున్నమి జాబిలి

వయ్యార మొలికింది  నీ మేను తాకిన చిరుగాలి

అపురూపమైన నా నెచ్చెలి 

నీవు నాదానివన్న ఊహకే మనసు ఎగిరిపోతోంది దూదిపింజలా తేలితేలి


1.తహతహలాడుతుంది గులాబీ

నీ జడలో తానొదిగి గుర్తింపు పొందాలని

తపనేపడుతుంది పచ్చలహారం

నీ ఎదపై  చేరగ హెచ్చరిల్లు తన అందాలని

తానేం తక్కువతింది కోక నిను చుట్టుకోక 

తన బ్రతుకే వృధా కనుక నీకే చెందాలని

తన్మయమొందుతోంది మనసు అనుక్షణం తలపోస్తూ నీతో పొందు ఆనందాలని


2.గోదారి గట్టున ఉన్న ఇసుకతిన్నెలన్ని 

వేచిచూస్తుంటాయి మన కబుర్లకోసమని

రాదారి పక్కనున్న తురాయిపూవులన్ని 

దారి కాస్తుంటాయి  మనపై కురుద్దామని

పావురాలు బ్రతిమాలుతాయి 

ప్రేమరాయబారాలు   తాము నెరపు తామని

ఎరిగితివా ప్రియా గొప్పకవుల కలాలు సైతం 

మన ప్రణయం కావ్యాలుగా రాయ గోరాయని

 సౌందర్య నిధినీవే

నా జీవన కౌముదివే

నిశీధులన్ని నీవల్లే ప్రకాశించినాయి

మధురానుభూతులెన్నో సంప్రాప్తమైనాయి

కొనసాగింతునే…నా ప్రేమ ఏడు జన్మలదాకా

క్షణమైనా మనలేనే చెలీ నీతోడు లేక


1.నిర్జన ఎడారులే  నిన్నటి నా బ్రతుకంతా

బ్రహ్మజెముళ్ళే నే నడిచిన దారంతా

అలమటించి పోయాను ప్రేమరాహిత్యంతో

పరితపించిపోయాను నే తీరని దాహంతో

శ్రావణ మేఘమై అనురాగం కురిసావే

శరదృతువు చంద్రికవై ఆహ్లాదం పంచావే


2.నిండైన జాబిలికి చెట్టుమచ్చనే అందం

 నీ నగు మోముకు మోవి పుట్టుమచ్చ అందం

అందాలన్ని ఒక్కదిక్కే కుప్పబోస్తె నీ చందం

కనుగిలుపక నిన్ను చూస్తే అంతులేని ఆనందం

రాయంచలు వయార మొలుకు నీ కులుకులు నేర్వంగా

రాచిలుకలు పలుకులు చిలుకు గురువు నీవని గర్వంగా