Sunday, August 1, 2021

 ఎన్ని నేర్చుకున్నానో జీవితాన పాఠాలు

కాలమెన్ని నేర్పిందో అనుభవ గుణపాఠాలు

ప్రేక్షకునిలా చూడడమే ఏ ప్రమేయమూలేక

నదివాలుకు సాగడమే ఎప్పుడూ  ఎదురీదక


1.ఆశించిన ప్రతిసారి ఆడియాసగ మారడమే

ఊహించిన దేదైనా నెరవేరకపోవడమే

జీవితమంటేనే ఇలాగే ఉంటుందని ఎంచడమే

పొందినదల్లా ఆనందంగా అంగీకరించడమే


2.మిన్నుసైతం విగిరి పడింది నా వెన్నుమీద

కనీవినీ ఎరుగునట్టి విధి వైపరీత్యం కదా

అన్నమైనా మన్నుగ మారింది నోరుచేరులోగా

దొరికిందే వరమనుకొనుడే నగ్నసత్యంగా


మరచిపోయిన మధువనాన

మరల ఎందుకు మరులవాన

చితికి పోయిన నా జీవనాన

చిగురులెందుకీ  మోడున


1.నిను కొసరెడి కోరిక కొఱవే,

నెరవేరక నా కన్నుల చెఱువే

తపనల తమకాన నిద్ర కరువే

ఫలించని ప్రతి కల ఇక బరువే 


2.ఏకాంతమే నాది ఏకాకిగా ఉన్నా 

ఒంటరినే కాను ఏ కాంత లేకున్నా

గతం విస్మరించి నాతోనే రమిస్తున్నా

నీవేలేని లోకంనుండి విరమిస్తున్నా


అరెరే ఎంతటి వైచిత్రి మన మైత్రి

ఎంతగానొ పావనము మన స్నేహము

చినుకులా కురిసింది కడలిగా మారింది

ఆది అంతమే తెలియకుంది వింతగా

నీవు నేను  వేరంటేనే అది చింతగా


1. కాంతినిచ్చు దీపమైన ఆరిపోతుంది

తావినొసగు పూవైనా వాడిపోతుంది

అందం తరుగుతుంది గంధం ఇగురుతుంది

చెక్కుచెదరదేనాటికి మన చెలిమి

ఖర్చెంతచేసినా ఒడవనిదీ కలిమి


2.దోస్తంటే నినదించే హృదయము

నేస్తం  పరాయికాదు మన సమస్తము

అనురాగ ప్రతాపము త్యాగపు నిజరూపము 

కలహించదు కుదురుకున్న మన సోపతి

కలనైనా విరహించదు మన సంసక్తి