Friday, October 15, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చీర జన్మ ధన్యమైంది నువుకట్టుకొంటే

అబ్బురపడిపోయెమది ఆ కనికట్టుకంటే

నగలమెరుపుతగ్గింది నువ్వు నవ్వుతుంటే

ఇంతకంటె ముదమేముంది నా బ్రతుకే నీదంటే


1.మబ్బు మురిసిపోయింది నీ జుట్టువంటిదంటే

పువ్వు పరవశించింది నీ పరిమళాన్ని పోల్చుతుంటే

పసిడి మిడిసి పడిపోయింది నీ మేనిరంగు తనదంటే

సింగిడి తలవంచింది నీ తనువు వన్నెలుచూస్తుంటే


2.సిందూరం రవిబింబమైంది  నుదుట దిద్దుకుంటే

ముక్కెర ధృవతారయ్యింది దృష్టి తగులుతుంటే

కేణా వడ్డాణమైంది నీ నడుముకెట్టుకుంటే

సంగీతం తరించింది అందెలసడి మంజులమంటే


తలమునకలుగా ఉన్నావు  తిరుపతి బాలాజీ

నీ దృష్టిని మరలించగ పాడెదను రాగమిదే వలజి

నీకెంతో ప్రియమని చల్లెద పరిమళమీ జవ్వాజి

నా బ్రతుకు తీరు మార్చివేయి కాకుండా గజిబిజి

వందనమిదె వేంకటేశ నను దయజూడు

వేడెద నిను వేదాత్మా వేగిరముగ కాపాడు


1.రాదాడి పోదాడిగ నీకడ భక్తుల తాకిడి

వింత వింత విన్నపాలు తీర్చగ నీకెంత ఒత్తిడి

ఏరోజు చూసినా నీగుడిలో సందడే సందడి

అలసినాను నినుజూడ పడిగాపులు పడిపడి

వందనమిదె వేంకటేశ నను దయజూడు

వేడెద నిను వేదాత్మా వేగిరముగ కాపాడు


2.కోరలేదు నిన్నెప్పుడు గొంతెమ్మ కోరికలు

అడగలేదు అప్పనంగ నాకు కీర్తిచంద్రికలు

మనశ్శాంతి లేక నాకు ఎన్నాళ్ళీ లుకలుకలు

ఆరోగ్యపరచు స్వామి ఇఛ్ఛలే మరీచికలు

వందనమిదె వేంకటేశ నను దయజూడు

వేడెద నిను వేదాత్మా వేగిరముగ కాపాడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎవరిగోల వారిదే ఎవరి శైలి వారిదే

ఎవరికోసమో తెలియక ఎగజిమ్మడం

ఎందుకోసమో ఎరుగక  మోసెయ్యడం

ఎక్కడెక్కడివో ఏరుకొచ్చి తోసెయ్యడం

మినహాయింపులే లేవు సామాజిక మాధ్యమాన

వెర్రివాళ్ళమే అంతా ఈ వింత మిథ్యా జగాన


1.పుంఖాను పుంఖాలు పోస్టులు పోస్టుతాం

జన్మహక్కుగా భావిస్తాం స్పందనలెన్నోఆశిస్తాం

స్క్రోల్ చేస్తూ పరులవైతే చూడడమూ మానేస్తాం

పరిచయస్తులవి మొక్కుబడిగా లైకేస్తాం ట్యాగేస్తాం

మినహాయింపులే లేవు సామాజిక మాధ్యమాన

వెర్రివాళ్ళమే అంతా ఈ వింత మిథ్యా జగాన


2.వ్యక్తిగతపు స్పర్శనెపుడో చిత్రంగా కోల్పోయాం

హృదయంలో ఆర్ద్రతనే సమూలంగ తుడిచేసాం

యాంత్రికతను మనసుగా మార్చేసుకున్నాం

సరికొత్త బంధాలను ఆతృతగా అలుముకున్నాం

మినహాయింపులే లేవు సామాజిక మాధ్యమాన

వెర్రివాళ్ళమే అంతా ఈ వింత మిథ్యా జగాన

https://youtu.be/4hpQbsD9sdM?si=Z6BY7HBMvzK6k3J4

సరదాల కలబోత దసరా ఇది

దసరాన సరదాల సంబరాలివి

తెలంగాణకంతటికీ పండగంటె ఇదే ఇదే

బంధుమిత్రులందరికీ నా శుభకాంక్షలివే ఇవే


1.దేవీ నవరాత్రులకిది ఆలవాలం

శ్రీరామ విజయోత్సవ భవ్య కాలం

తిరుమల బ్రహ్మోత్సవ సముజ్వలం

ఆటపాట బతుకమ్మల కోలాహలం


2.ఆయుధ వాహన పూజలు  ముందు

దైవ దర్శనాలతో  మనసానందం పొందు

విందులు మందులే పండగలో బహు పసందు

బంధుమిత్ర సమాగమాన సంతసాలె చిందు


3.జయముల సమకూర్చు జమ్మి చెట్టు

శాంతి శుభాలకూ సంకేతం పాలపిట్ట

అలయ్ బలయ్ ఆలింగన ఆత్మీయత

పెద్దల దీవెనలందగ బంగారు భవిత


తేయాకు చూర్ణేన కాళీమాత

క్షీరధార మిళితేన లక్ష్మీదేవి

పంచదార సంయుతేన సరస్వతి

త్రయిమాత్రేన సమన్వితం 'టీ పరమ పవిత్రం


1.సక్రమ కాలకృత్య ఉత్ప్రేరకం

కుశాగ్రబుద్ధి జాగృత ద్రావకం

శిరోవేదన ఉపశమన ఔషదం

ఏతత్ గుణ త్రయేన చాయ దైవరూపకం


2.క్షీర రహిత హరితమై ఆరోగ్య దాయం

మసాలాపూరితమై లాలాజలోదయం

బహువిధ రుచిపూతమై రసన రసమయం

ఆబాలగోపాలం సదా తేనీటి సేవన ప్రియం


 

గ్రామదేవతవైనా సంగ్రామ విజేతవైనా

మహిషమర్దినివైనా దనుజ హారిణివైనా

జగన్మాతవు ఐనా జగన్మోహినివైనా

సర్వంసహా విశ్వమంత నీవే నీవే జనని

మము చల్లగ చూడవే నీ పిల్లలమే భగవతి భవాని


1.బ్రహ్మ విష్ణు మహేశ్వరులు  నీ భృత్యులే

ఇంద్రాది దేవతలు నీ పరిచారకులే

సప్తమహా ఋషులు సైతం నీ సేవకులే

అఖిలాండకోటి బ్రహాండనాయకివి నీవే జనని

మము చల్లగ చూడవే నీ పిల్లలమే భగవతి భవాని


2.నీ ఆనతిలేక ఈ లోకమే నిశ్చలము

నీ కనుసన్నలలో జననము మరణము

బుద్ధి యశస్సంపదలన్నీ నీ అధీనాలే 

మణిద్వీపవాసినివి మందహాసినివీ నీవే జనని

మము చల్లగ చూడవే నీ పిల్లలమే భగవతి భవాని