Friday, February 18, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముందేంది వెనకేంది అందానికి హద్దేంది

ఎత్తేంది కురచేంది కొలతలకొక పద్దేంది

ముద్దే కదా ముగ్ధ మురిపెము అనాదిగా

తనివే తీరునా ఎంతగ చూసినా ఎగాదిగా


1.వర్ణించారు కవులందరు అతివను ఆపాదమస్తకం

అధ్యయనమెంతచేసినా పడతే ఒడవని పుస్తకం

కురులైనా కుచములైనా పెదాలు పాదాలు సైతమైనా

ఉత్తేజమే గొలుపుతాయి చిత్తాలనే లాగుతాయి


2.రాసిచ్చారు రాజ్యాలైనా  ఘన సార్వభౌములు

మానొచ్చారు తపములనైనా మహా మహా మునులు

ఇంద్రులైనా చంద్రులైనా సాక్షాత్తూ ఆ త్రిమూర్తులైనా

దార్తిగొన్నారు తెఱగునకు దాసోహమన్నారు తరుణులకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్నదగినవెన్నెన్నో చేయగలుగు దానాలు

చేయిసాచనేల ఒరులు వదిలి అభిమానాలు

అతి ముఖ్యమైనది మన నేత్రదానం

అత్యవసరమైనదెపుడు రక్తదానం

దానాలెన్ని ఉన్నా సులభమైనదొకటే దానం

అన్నదాతా సుఖీభవా అను దీవెన పొందే దానం

అన్నిదానాలకెల్లా మిన్ననే అన్నదానం

 ఇక చాలనిపించి తృప్తి నిచ్చే అన్నదానం


1.ధనిక పేద భేదమేది ఉండబోదు ఆకలి బాధకు

కులమతాల తేడా ఉండదు కడుపు కాలు వేళకు

దొరికిన దేదైనా సరే పరమాన్నమె నకనకలాడే పొట్టకు

అన్నం పరబ్రహ్మ రూపంగా కానవచ్చు కట్టెదుటకు

అన్నదాతా సుఖీభవా అను దీవెన పొందే దానం

అన్నిదానాలకెల్లా మిన్ననే అన్నదానం


2.పదో పరకో ఇవ్వజూస్తే వందలు వేల మీద ఆశ

సువర్ణము మణుల నొసగినా మరలదు ఆ ధ్యాస

దశదానాదులెన్ని చేసినా అంతకు మించినదాని నస

పట్టెడన్నం పెడుతున్నప్పుడు అన్నదాతలో దైవాంశ

దానాలెన్ని ఉన్నా సులభమైనదొకటే దానం

 ఇక చాలనిపించి తృప్తి నిచ్చే అన్నదానం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కళావతి


అరుణిమలొలుకుతాయి నీ అరచేతులు గులాబి పూలై

గుభాళిస్తాయి నీ చేతులు కమ్మగ మత్తిడు విరితావులై

ఏనాడు చెలి సంకటాల కంటకాలు నువు తొలగిస్తావో

బంగారు భవితకు చెదరని నమ్మిక తనలో చివురింపజేస్తావో


1.కళ్ళెదుట నిలుస్తాయి కన్న కలలన్ని కనుపాపగ తనని కాచుకుంటే

వెన్నెలలు కురుస్తాయి నెలలో రాత్రులన్ని తన పెదాలు నవ్వులొలుకుతుంటే

పురివిప్పును నెమలే చిన్న మెప్పుకే తన మేన పరవశమొందగా

పోటెత్తును కడలే మాట గుచ్చితే తన కంటినుండి నీరు చిందగా


2.కంబళి కంటే వెచ్చనిహాయే పదిలంగా అర్ధాంగిగ పొదువుకుంటే

వ్యాహళి వంటి స్వాదనమగును పదపదము తనతో కదలుతుంటే

తలపించును తనతో గడిపే ప్రతి క్షణము స్వర్గ సౌఖ్యంగా

మురిపించును మరులొలుకగ ప్రియుడే తన ఏకైక లోకంగా


నువ్వంటే కాదు అభిమానం

నువ్వంటే కాదు అనురాగం

నువ్వంటే కాదు ప్రణయం

నువ్వంటే కాదు హృదయం

నువ్వంటే కాదు దేహం

నువ్వంటే కాదు ప్రాణం

నువ్వంటేనే జీవితం

నువ్వుంటేనే జీవితం

నా చెలీ సఖీ ప్రేయసీ

నా సఖా ప్రియా ప్రియతమా


1.నువ్వంటే కాదు స్నేహం

నువ్వంటే కాదు మోహం

నువ్వంటే కాదు  ఇష్ట దైవం

నువ్వంటే కాదు ప్రేమభావం

నువ్వంటే కాదు స్వప్నం

నువ్వంటే కాదు స్వర్గం

నువ్వంటేనే జీవితం

నువ్వుంటేనే జీవితం

నా చెలీ సఖీ ప్రేయసీ

నా సఖా ప్రియా ప్రియతమా


2.నువ్వంటే నా మానసం

నేనంటూ ఉన్నదె నీకోసం

నువ్వంటే ఆకసం

నీవెంటే ఆశయం

నువ్వే నా లక్ష్యము

నువ్వే నా మోక్షము

నువ్వంటేనే జీవితం

నువ్వుంటేనే జీవితం

నా చెలీ సఖీ ప్రేయసీ

నా సఖా ప్రియా ప్రియతమా