Wednesday, March 25, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:దర్బార్ కానడ

సాగర కెరటాలై నీ కరములు
నర్తించువేళల ఉత్తుంగ తరంగాలు
జలపాత ధారలై నీ పదములు
కదలాడు సమయాన ఉరకల తురంగాలు
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ తనువే సప్తవర్ణ  ఇంద్రధనువు

1.మనోజ్ఞమై విలసిల్లు నీ అపూర్వ నృత్యము
రసజ్ఞులను అలరించగ నయనానందకరము
ప్రవర్ధమానమై ఒప్పారు నీ అనన్య నాట్యము
ప్రసిద్ధ నర్తకీమణులకైన అనితర సాధ్యము
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ మేనే నేల దిగిన విద్యుద్ధామము

2.లాస్యబ్రహ్మ నటరాజ ప్రియపుత్రిక నీవే
నాట్య శాస్త్ర భరతమునికి శిశ్యురాలి వీవే
అప్సరసల తలదన్నే హావభావ భంగిమలు
ఆంగిక వాచిక నేత్రాంకిత  నటన ప్రకటనలు
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ గాత్రమే ప్రతి పాత్రకు బ్రాతిపాత్రము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రణయాలలీలలెరిగిన జాబిలీ జాలిగనవా
అందించు  ప్రియసఖునికి నా అహరహర విరహ వేదన
పరిమళాలు విరజిమ్మే అరవిరిసిన జాజిబాలా
జవరాలి కెరిగించు నా అహరహర విరహ వేదన

1.చేసుకున్న బాసలన్నీ మరచిపోయెనేమో తానూ
తట్టిచెప్పవే కాస్తా నా అహరహర విరహ వేదన
చెప్పుకున్న ఊసులన్నీ చెదిరిపోయెనేమో మదిలో
మొక్కిచెప్పవే ప్రియునికి నా అహరహర విరహ వేదన

2.ఆకుఅలికిడైనా తానని ఆరాట పడుతున్నాను
ఓపలేను నేస్తమా నా అహరహర విరహ వేదన
ఏ మువ్వల సవ్వడివిన్నా తానేనని భ్రమపడుతున్నా
తాళలేను నా ప్రియతమా ఈ అహరహర విరహ వేదన

3.సందేశాలనందించే అందాల మేఘమాలా
చేరవేయి నా చెలునికి ఈ అహరహర విరహ వేదన
ప్రేమలేఖలందించే ఓ చిట్టి పావురమా
వివరించు నెచ్చెలికి ఈ అహరహర విరహ వేదన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నిన్నే చూస్తు ఉండగలను  ఒక యుగము
నిన్నే చేసుకున్నాను నాదైన జగము
ఇల్లునసలు కదలను రెప్పలైన గిలుపను
దృశ్యారాధనయే జీవితాంతము
సౌందర్యో పాసనయే అనుక్షణము

1.పిడుగులైన పడిపోనీ కుంభవృష్టి కురియనీ
వరదలు తూఫానులు ఎన్నైనా ఇక రానీ
ఇల్లునసలు కదలను దేనికింక బెదరను
చీకటైతె నీ కన్నుల వెన్నెలనే కంటాను
ఆకలైతె నీఅందమునాస్వాదిస్తాను

2.కరోనాను రాకుండా కట్టడియే చేసాను
జ్వరమైన దూరకుండ జాగ్రత్త పడినాను
ఇల్లునసలు కదలను ఇతరములే తలచను
చేదోడుగ నీకెపుడూ నేనుంటాను
నీవాడిగ కడదాకా తోడుంటాను
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసధ్వని

సరిహద్దుకు వెళ్ళి కంచెను కాచే పనిలేదు
అవసరమొస్తే యుద్ధం చేసే అగత్యమే లేదు
ప్రపంచమంతా మృత్యు విపత్తుతొ విలవిలలాడే
జగత్తుమొత్తం కౄర కరోనా కోరలలోన చిక్కుబడే
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

1.పెడచెవిన పెట్టకు ప్రభుత సూచనలు ఎప్పటికప్పుడు
అతిక్రమించకు చట్టాన్నెపుడు తప్పవు ముప్పుతిప్పలు
సంయమనం పాటించాలి కష్టకాలన బాధ్యతగా మనం
అంటక మెంటక మెలగాలి అంటువ్యాధితో ప్రతిక్షణం
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

2.మనిషికి మనిషికి మధ్యన  తగిన ఎడంగా ఉండాలి
పదేపదే చేతులు కడుగుతు పరిశుభ్రపరచుకోవాలి
తుమ్ము దగ్గు తుంపర్లుకు అడ్డుగ గుడ్డను వాడాలి
ముక్కుమూతి కన్నులను విధిలేనప్పుడె తాకాలి
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

3.కట్టడి చేద్దాం కరోనాను సమిష్టికృషితో మనమంతా
నశింపజేద్దాం వైరస్ ను నామరూపాలు లేకుండా
పొరపాటొక్కరిదైనా భారీ మూల్యం అందరికీ
తీవ్రత గ్రహించకుంటే చరమగీతమే మననరజాతికి
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం