Wednesday, July 31, 2019

కృతయుగమందున నీదరినున్నా
త్రేతాయుగమున నీ వశమైనా
ద్వాపరమందున నీ పరమైనా
కలిలో నీభక్తి పరవశనైనా
కృష్ణయ్యా నన్నూ మరిచావు ఇది భావ్యమా
కన్నయ్యా చెయ్యి విడిచావు ఇది న్యాయమా

1.నిరతము మదినెంచు ప్రహ్లాదుడనే
తపమాచరించిన ధృవుడను నేనే
నారాయణయను నారదుడనే
నిను కీర్తించెడి తుంబురుడినే
నర్సయ్యా నన్నూ మరిచావు ఇది తత్వమా
రంగయ్యా చెయ్యి విడిచావు ఇదె ప్రాప్తమా

2.నది దాటించిన గుహుడను నేనే
ఎంగిలి ఫలమీయు శబరిని నేను
కబురందించిన పక్షిని నేనే
ఎదలో నిలిపిన హనుమను నేనే
రామయ్యా నన్నూ మరిచావు ఇది ధర్మమా
రాఘవయ్యా చెయ్యి విడిచావు ఇది నియమమా

3.అటుకులు పెట్టిన కుచేలుడనేనే
నీ జతకట్టిన గోపిక నేనే
పెదవులు తాకిన మురళిని నేనే
నీతో కూడిన రాధిక నేనే
శ్యామయ్యా నన్నూ మరిచావు ఇది వింతయే
గోపయ్యా చెయ్యి విడిచావు ఇక చింతయే

4.నీ కప్పిచ్చిన కుబేరుడ నేనే
నిను నుతియించిన అన్నమయ్య నేనే
నిను దర్శించిన తొండమాను నేనే
నిన్నే  నమ్మిన నీ రాఖీనే
శీనయ్యా నన్నూ మరిచావు ఇది దోషమే
తిరుపతయ్యా చెయ్యివిడిచావు ఇది ఘోరమే

Tuesday, July 30, 2019

జెండా పండగ వచ్చింది
గుండెలనొకటిగ చేసింది
రంగు రంగుల తోరణాలు
అంగరంగ వైభవాలు
సొతంత్రదినమిది సోదరా
భరతదేశమంత మనదేరా

1.పంజరాన పక్షుల్లాగ ఉండేవాళ్ళము
వేటగాడి వలలో చిక్కి గడిపాము
బ్రిటీషువారిని దేశంనుండి తరిమాము
స్వేఛ్ఛావాయువు హాయిగా పీల్చాము
నేడేసొతంత్రదినమిది సోదరా
భరతదేశమంత మనదేరా

2.ఆజాద్ హింద్ ఫౌజ్ సేనతో
సుభాస్ బాటలొ నడిచాము
ఆంగ్లేయులనెదిరించాము
హైందవ సత్తా చాటాము
సొతంత్రదినమిది సోదరా
భరతదేశమంత మనదేరా

3.సత్యాగ్రహమను శాంతిసూత్రమే
బాపూ చూపగ పాటించాము
తెల్లదొరల చెఱవీడాము
స్వరాజ్యాన్ని సాధించాము
సొతంత్రదినమిది సోదరా
భరతదేశమంత మనదేరా

4.ఒకే ప్రజా ఒకేదేశమను
సర్దార్ పంథా పట్టాము
చిన్నరాజ్యాలు కలుపుకొని
ఇండియన్ యునియన్ ఒనగూర్చాము
సొతంత్రదినమిది సోదరా
భరతదేశమంత మనదేరా

5.సుపరిపాలన స్ఫూర్తినిగలిగి
అంబేత్కరుని ఆశయసిద్ధిగ
రాజ్యాంగాన్నే ఏర్పరచాము
ప్రజాస్వామ్యమున వికసించాము
సొతంత్రదినమిది సోదరా
భరతదేశమంత మనదేరా

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా ప్రేమకు లేనె లేదుకొలమానం
నాప్రేమకు ఊహించలేవు పరిమాణం
కాలానికి అందనిది విశ్వానికి చెందనిది నాప్రేమ
దివ్యానుభూతికి అదేఅదే ఏకైక చిరునామా

1.చెలి పాదం కందిపోకుండా
అందరూ ఉంచుతారు అరచేయి
గుచ్చుకుంటాయేమో చేతికున్న ఎముకలని
నీకై నేనుంచెద ప్రియతమా నా హృదయమే..

2.చెలిని గని తొలిచూపులోనే వలచి
అర్పించెదరు ఎవరైనా మనసుని
ప్రియ సఖీ చంద్రముఖీ నేను సిద్ధపడ్డాను
నా పంచప్రాణాలే ధారబోయగా నీకని

3.జన్మకు సరిపడ ప్రేమను నెచ్చెలిపై
కురిపిస్తారు ఇతరత్రా ప్రేమికులు
ఏడేడు జన్మలకైనా ఓ నా ప్రేయసీ
ఆగిపోదు ప్రణయవృష్టి సృష్టి మునిగినా

Sunday, July 28, 2019

ఎందుకు స్వామీ నీనుండి దూరంగ
నను విసిరివేసావు ఈ భువిని చేరంగ
తలపోసినావా నను నీకే భారంగ
అనాథనైతినే కరుణాంతరంగా

1.నువ్వూ నేనూ ఏకైకంగా
నీవే నాకూ ఒకలోకంగా
కాలము స్థలము కడు శూన్యంగా
ఆనందానికి విలాసంగా
గడిపితినయ్యా నీ సన్నిధిలో
తలచితి నిన్నే నా పెన్నధిగా
ఎందుకు స్వామీ నను వీడితివి
దేనికి స్వామీ నను మరచితివి

2.భవబంధాలను అంటగడితివి
సంసార జలధిలొ నను ముంచితివి
ఊపిరి ఆడక నే మునకలేస్తే
వింతగ నవ్వుతు వినోదిస్తివి
నా తప్పిదములు మన్నించవయ్యా
నా దోషములిక క్షమియించవయ్యా
 నీవేదప్ప ఇతరులనెరుగను
నిన్నే దప్ప పరులను వేడను
నీ మహిమ వినగ రిక్కించని వీనులవి ఏల
నీ మూర్తి కనగ చమరించని చక్షువులవి ఏల
నీ కీర్తి పాడగ గద్గదమవలేని గళమది ఏల
నీధ్యాసలొ రోమాంచితమవని చర్మమేల
పరమ శివా నీ వశమవని హృదయమేల
సాంబ శివా ధ్యానములో శవమవని తనువేల

1.జపతపములు చేసినా చిక్కుట దుర్లభము
యజ్ఞయాగ క్రతువులకూ దక్కదు నీ ఫలము
చిత్తశుద్ధిలేక నీ వ్రతములన్ని వ్యర్థము
ఆత్మతృప్తి కలుగని కర్మలే నిరర్థము
పరమ శివా నీ వశమవని హృదయమేల
సాంబ శివా ధ్యానములో శవమవని తనువేల

2.ఇఛ్ఛయే వీడక నీ తత్వము నెరుగుటెలా
త్యాగమే అలవడక నినుమెప్పించుటెలా
నీమాయను గ్రహియించక మత్తులోన మునిగెదము
నీ పరీక్షలే గెలువక నిన్ను శరణ మనియెదము
పరమ శివా నీ వశమవని హృదయమేల
సాంబ శివా ధ్యానములో శవమవని తనువేల

Saturday, July 27, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

"సర్వేంద్రియాణాం...."

కళ్ళకూ ఉంటాయి నోళ్ళూ
చూపులూ చెపుతాయి ఊసులు
సర్వజనీనమైనది నయన భాష
పదములైన తెలుపలేని హృదయఘోష

నవ్వులు కురిపిస్తాయి నేత్రాలు
అందజేస్తాయి ఎదలిఖించే ప్రేమపత్రాలు
క్రీగంటి చూపులో ఎన్ని ఆత్రాలు
వీక్షణ ఎరుగదు ఏ నియమాలు సూత్రాలు

అలకనొలకబోస్తాయి కన్నులు
ఆగ్రహాన చిమ్ముతాయి జ్వలించేఅగ్నులు
వేదన వెళ్ళగ్రక్కు అశ్రుజలధులు
జ్ఞానేంద్రియాలలోనె లోచనాలు ఉత్తమములు
ఎలా వేగినావో కిట్టయ్యా
ఎనిమిది మందికి పెనిమిటిగా
ఎట్లా కొనసాగినావొ నల్లనయ్యా
వేలమంది గోపెమ్మల చెలికానిగా
రాధమ్మకు  ప్రియుడిగా
మీరా కొలిచే మాధవుడిగా
జంతర్ మంతర్ మాయగాడివే నువ్వు
కనికట్టుతొ పడగొట్టే గారడోడివేనువ్వు

1.భరించినావు బామ్మర్దిని నూరుతిట్లకాడికి
మితిమీరినంతనే మితికి ఒప్పజెప్పావు
దరమందప్పని అత్త కుంతి కొడుకులైన
పాండవులకెప్పుడు అండగ నిలిచావు
జంతర్ మంతర్ మాయగాడివే నువ్వు
కనికట్టుతొ పడగొట్టే గారడోడివేనువ్వు

2.చీరలెత్తుకెళ్ళావు గొల్లభామలెందరివో
 బుద్ధి చెప్పినావు దేహచింత వదలమని
నిండుకొలువునందు నిను వేడగ పాంచాలికి
కోకలిచ్చి కాచావు తనమానం పదిలమని
జంతర్ మంతర్ మాయగాడివే నువ్వు
కనికట్టుతొ పడగొట్టే గారడోడివేనువ్వు




Friday, July 26, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అలవాటుగ మారింది నాకు
ప్రతివారం నీ పాటరాయడం
ఆనవాయితయ్యింది స్వామి
పదేపదే నిన్ను కీర్తించడం
నేను రాయగలనా నావెర్రిగాక పోతే
పదమైనా కదులుతుందా నీ ఇచ్ఛలేకపోతే
వందనాలు  వేంకటేశ తిరుమలేశ గోవిందా

1.శనివారం వచ్చిందంటే
శ్రీనివాస నీదే మననం
ఏమి మిగిల్చాడు స్వామి
అన్నమయ్య నీకవనం
కొత్తగా ఏమి లిఖించను  నీగురించి
తనకూ అసాధ్యమనడా ఆ విరించి

2.రూపు రేఖలన్నిటినీ
వర్ణించినాను ఇదివరకే
గుణగణాలనన్నీ స్వామీ
కొనియాడితి నే శక్తి మేరకే
ఎరిగినంత నీ చరితము నుడివితిని
నా ఈతి బాధలను నివేదిస్తిని
కోరికలీడేర్చమని నిన్ను వేదిస్తిని౹
శక్తియుక్తులు ఎంత మేటివో
బలహీనతలూ ఏపాటివో
అవకాశాలు ఎంతమేరకో
ఆటంకాలూ ఎంతటి వాడివొ
తెలుసుకొంటె వ్యక్తిత్వం తేజరిల్లు నేస్తమా
అధిగమిస్తె విజయతీరం నీకుచేరువే సుమా

1.శిఖరాన్ని ఎక్కుటలో ఎందరు నీమెట్లౌతారో
గమ్యాన్ని చేరుటకొరకు దారెవరు చూపుతారో
ఏమరుపాటుగ ఏమాత్రమున్నా కాలులాగుతారు
దృష్టితమను దాటేలా నిన్నే బద్నాము చేస్తారు
తెలుసుకొంటె వ్యక్తిత్వం తేజరిల్లు నేస్తమా
అధిగమిస్తె విజయతీరం నీకుచేరువే సుమా

2.నోరునిన్ను మెచ్చుకున్నా నొసలువెక్కిరిస్తుంది
పెదవినవ్వు రువ్వుతున్నా చూపువిషం చిమ్ముతుంది
మమకారం మాటునా వెటకారం దాగుంటుంది
నిన్ను అణగద్రొక్కుటకే కుటిలయుక్తి ఒకటుంటుంది
తెలుసుకొంటె వ్యక్తిత్వం తేజరిల్లు నేస్తమా
అధిగమిస్తె విజయతీరం నీకుచేరువే సుమా

Thursday, July 25, 2019

రైతే రాజు-పండితె మహరాజు
ఎండితె ఒట్టి బూజు
ఎన్నడైనా పాపం నిలకడే లేని తరాజు

1.లేచింది మొదలుకొని రైతు లేంది బ్రతుకేది
ఆకలన్నది తీరదెపుడు రైతుచెమట వడపనిది
ఎండకూవానకూ చిక్కిశల్యమౌతున్నా
అన్నదాత తానై తిండిపెట్టు పెద్దన్నా

2.ప్రకృతే కన్నెర జేస్తే కర్షకునికి ఏది భరోసా
చీడపీడ పట్టుకుంటే ఏది తనకు దిక్కు దెసా
దళారీల దగామాయలో కృషీవలుడు బానిస
అమ్మబోతె అడవితీరు కొనబోతె కొరవే రేటు

3.సాగు నీటికోసము రైతు కంట నీరేలా
దుక్కిదున్ని ఎరువేయ పెట్టుబడికి కరువేల
అప్పుల్లో కూరుకొని  ఆత్మహత్యలవి ఏల
ప్రభుత్వాలు ఉండి సైతం చోద్యంగా చూడనేల
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:సింహేంద్ర మధ్యమం

ఆదిశక్తివి నీవె గదమ్మా
అబలగా బెదురెందుకమ్మా
భద్రకాళివి నీవె గదమ్మా
స్త్రీకి అభద్రత ఎందుకమ్మా
మంగళమిదిగో మంగళదాయిని
ఆదుకోగదె అభయప్రదాయిని

1.అష్టభుజములు ఆయుధమ్ములే
నవదుర్గల రూపులున్నవే
దుష్టమహిసాసురులెందరెందరొ
ధూర్త నరాధములింకెందరో
ధరన తరుణుల పీడించగనూ
కదలిరావే దండించగనూ

2.మూగజీవుల బలికోరుదువా
మత్తు మధిరలు ప్రియమనదగునా
గుట్టుగ ఉంచెడి సృష్టి క్రియలు
బట్టబయలు చేయగ ఉచితమ
మనిషి మెదడును కట్టడిసేయవె
మహిళకికపై రక్షణ నీయవె

Wednesday, July 24, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అవతరించేరు సద్గురువులు జగాన
వినిన తరించేరు జనులు వారి బోధన
ఉద్ధరించేను గురువు కంకణబద్ధుడై శరణన్న
అల్పబుద్ధి శిశ్యుడైన జ్ఞానిగమారేను గురుదేవుని కరుణయున్న

1.అత్రి అనసూయలకు శ్రీ దత్తుడిగా
శ్రీపాదవల్లభుడు  నృసింహ సరస్వతిగా
గురుమహిమలు తెలిపినాడు నాడు
గురులీలలు ఎన్నెన్నో కనబరచినాడు

2.షిరిడిలోన వెలిసాడు సాయిబాబగా
అక్కల్కోటలోన స్వామి సమర్థగా
షేగాఁవ్ లొ గజానన్ మహరాజ్ గా
ధరను వెలిగినారు దయను పంచగా

3.మహావతార్ బాబాగా మహిని ఉన్నాడు
అవతార్ మెహర్ బాబాగా కీర్తిగొన్నాడు
పుట్టపర్తి సాయిగా  ప్రేమనుకురిపించాడు
శ్రీరమణ మహర్షిగా సమభావం చూపాడు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఎన్నికారణాలో ఏడ్వడానికి
కంటిఊటలన్నవీ ఇంకిపోవు ఎన్నటికీ
తిండి దొరకక కొందరి ఏడుపు
తిన్నదరగక ఎందరి ఏడుపు

1.ఓర్చుకోలేని బాధ ఒక ఏడుపు
ఓర్వలేని తనమైతే వింత ఏడుపు
తోచకున్న సమయమంతా అదో ఏడుపు
కరిగిపోయే కాలంతో ఎంత ఏడుపు

2.ఓడిపోయి ఏడిస్తే గొడవేలేదు
గెలిచికూడ ఏడ్చే దుర్గతి ఎంతటి చేదు
ఏడ్వడానికోసమే అన్ని జీవితాలు
ఏడుపూ మనిషెపుడు చితిదాక నేస్తాలు

3.మౌనంగా రోదిస్తారు మనసులోనే
వెక్కివెక్కి ఏడుస్తారు రెప్పలవెనకే
బావురుమని ఏడుస్తేనే తీరుతుంది భారం
విషాదాన్ని పలికేరాగం ఆనందతీరం

Tuesday, July 23, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మందస్మిత వదనారవింద వర్ణ మాతృక
మంద్రస్వర వీణానునాద వాద్య ప్రేమిక
సంగీత సాహిత్య సంగమ ప్రియ గీతిక
సత్వరమే వరమీయగ తల్లీ నీవె శరణిక

1.సంపూర్తిగ నీదయ ఉన్నదని నుడువను
ఏ మాత్రము లేదనీ ఎపుడు వక్కాణించను
అందలాలనందుకొనగ తొందరపెడతావు
అంతలోనె ఆశలన్ని అడియాసలు చేస్తావు
తగనివాడనైతే పురికొలిపెద వెందులకు
అర్హత నాకున్నచో ఫలితమీయ వెందులకు
సంగీత సాహిత్య సంగమ ప్రియ గీతిక
సత్వరమే వరమీయగ తల్లీ నీవె శరణిక

2.స్వరజ్ఞానము మాతా నువు పెట్టిన భిక్షనే
గరళగళము నువునాకు వేసిన శిక్షనే
స్వరకల్పన విద్యయూ అమ్మా నీ చలవనే
గాత్రశుద్ధి గఱపగ నేను నీకు చులకనే
కీర్తి ఎడల ఆర్తిమాన్పి నను శ్రుతిచేయవే
తడబడని పదములతో చక్కని లయకూర్చనే
సంగీత సాహిత్య సంగమ ప్రియ గీతిక
సత్వరమే వరమీయగ తల్లీ నీవె శరణిక
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అద్దరాతిరి నిద్దురలేపి  సుద్దులేలనో
లలనా ఈ ముద్దుముచ్చటలేలనో
కలలొ వచ్చి కలతను రేపగ గిచ్చుడేలనో
సుదతి అచ్చికబుచ్చికలేలనో
మేలుకొంటే ఊరుకోక ఊహల్లొ చొరబడతావు
నిదురబోతే వీడలేక స్వప్నాల్లోను సాధిస్తావు

1.ఉషోదయం చూడగ నీ- సింధూరం అగుపిస్తుంది
చిరుగాలి తాకగనే నీ స్పర్శనె అనిపిస్తుంది
కొలనులో కలువలు కనబడినీ కన్నులుగ తోస్తాయి
మందారాలు కోయబోతే నీ బుగ్గలు గురుతుకొస్తాయి
మేలుకొంటే ఊరుకోక ఊహల్లొ చొరబడతావు
నిదురబోతే వీడలేక స్వప్నాల్లోను సాధిస్తావు

2.సాయంత్రం ఇంద్రధనుసులో నీ అందం స్ఫురియిస్తుంది
పున్నమి జాబిల్లి సైతం నీ మోమును పోలుతుంది
దూరాన కోయిల కూసినా నీ గొంతే వినిపిస్తుంది
గగనాన మెరిసే ప్రతి తారా నీ తళుకే చిమ్ముతుంది
మేలుకొంటే ఊరుకోక ఊహల్లొ చొరబడతావు
నిదురబోతే వీడలేక స్వప్నాల్లొ సాధిస్తావు
ఏమీరాకపోత ఎంత బాగుండు
ఆన్నీ వచ్చిఉంటే మరెంత బాగుండు
తెలిసీ తెలియని జ్ఞానము
ఉండీలేని పాండిత్యము
కాబోదు మనిషిజీవితం సంతృప్తికరము
బుద్ధికి మనస్సుకు తప్పదుగా నిత్యఘర్షణం

1.కడుపులో చల్ల ఎపుడూ కదలకూడదు
ఉన్న ఊరునెప్పుడూ వదలకూడదు
నా చిట్టి బొజ్జకు శ్రీరామ రక్ష
ఫలితాలు ఏమైతేమి ఎదుర్కోనేల పరీక్ష
కాబోదు మనిషిజీవితం సంతృప్తికరము
బుద్ధికి మనస్సుకు తప్పదుగా నిత్యఘర్షణం

2.కాగల కార్యమేదో గంధర్వులె తీరుస్తారు
కాలమే కలిసొస్తే కొడుకులే నడిచొస్తారు
తిన్నామా పడుకున్నామా బ్రతుకంటే ఇంతేగా
ఆశయమేలేనివాడికి భవితెపుడూ వింతేగా
కాబోదు మనిషి జీవితం సంతృప్తికరము
బుద్ధికి మనస్సుకు తప్పదుగా నిత్యఘర్షణం

Monday, July 22, 2019

సంకట హర చతుర్థి వ్రత దీక్ష పూని 
ఆరాధించాలి శ్రద్ధగ శ్రీ సిద్ధి గణపతిని
నియమ నిష్టలన్ని పాటించాలి
వరసిద్ధి వినాయకుని కరుణ పొందాలి
జైజై వినాయకా జయగణనాయకా
జయ లంబోదరా పాశమంకుశ ధరా

1.అమావాస్య పిదప వచ్చు చవితి నాడు
సంకష్టి వ్రతము ఆచరించ తగినది
అది మంగళ వారమైతె విశిష్టతే ఆనాడు
అంగారకి గా మరింత విశేషమై భాసిల్లు
జైజై వినాయకా జయగణనాయకా
జయ లంబోదరా పాశమంకుశ ధరా

2.గణేశోపనిత్తుతొ అభిషేకించాలి
రక్త వర్ణ వస్త్రాన్ని సమర్పించాలి
మందార పూలతో అలంకరించాలి
కుడుములు నివేదించి సేవించాలి
జైజై వినాయకా జయగణనాయకా
జయ లంబోదరా పాశమంకుశ ధరా

3.దినమంతా ఉపవసించి తీరాలి
విఘ్నేశుని నామాలే భజించాలి
చంద్రోయమైనంత స్వామిని పూజించాలి
దీక్షను విరమించి భుజించాలి
జైజై వినాయకా జయగణనాయకా
జయ లంబోదరా పాశమంకుశ ధరా

Sunday, July 21, 2019

తలకునీళ్ళోసుకున్న నీలవేణి
నా తలపులలో దూరుట ఎందుకని
కురులార బెట్టుకున్న తరుణీమణి
మరులురేప మాయజేయుటేలయని
ఎన్నివన్నెలున్నాయో నీకడ అన్నులమిన్నా
నీవెన్ని వలలు పన్నావో నీపై వలపులు గొన్నా

1.వాలుజడే కోడే త్రాచులా వయ్యారమొలుకుతుంది
మల్లెచెండే వెన్నెలమంటలా పరువాన్ని కాల్చుతుంది
అలకలో విసిరిన నీ కీల్జడ ఎంతో రుసరుసలాడుతుంది
శిరమున తురుముకున్న చూడామణి మిసమిసలాడుతుంది
ఎన్నివన్నెలున్నాయో నీకడ అన్నులమిన్నా
నీవెన్ని వలలు పన్నావో నీపై వలపులు గొన్నా

2.ముడిచిన నీ కొప్పుముడి మది చిత్తడిరేపుతోంది
చుట్టిన చేమంతి దండ ఎద తపనలు పెంచుతోంది
నుదుటిపైన ముంగురులు సింగారాలు పోతున్నయ్
పాపిట బిళ్ళ తాను సయ్యాటలాడుతోంది
ఎన్నివన్నెలున్నాయో నీకడ అన్నులమిన్నా
నీవెన్ని వలలు పన్నావో నీపై వలపులు గొన్నా




సాహిత్యం సంగీతం మేలుకలయికే గీతం
ఆత్మా పరమాత్మలాగా ఐక్యమైన బంధం
అనుభూతి అనుభవాల సారం
ఎంతగ్రోలినా తనిదీరని అమృతకాసారం

1.ఆలాపనగా అంకురిస్తుంది భావన
ఆస్వాదనలో చిగురిస్తుంది  తపన
కలమూ గళమూ పాలుపంచుకునేదీ పోటీ
నిర్ణయించ తరమా ఏదో మేటీ
అనుభూతి అనుభవాల సారం
ఎంతగ్రోలినా తనిదీరని అమృతకాసారం

2.అక్షరాలు మెదులుతాయి లయనే శ్వాసగా
పదాలు కదులుతాయి లక్ష్యందిశగా
పల్లవి అనుపల్లవి జోడుగుర్రాలుగా
చరణాలే చక్రాలై గీతరథం  ప్రగతి పథంగా
అనుభూతి అనుభవాల సారం
ఎంతగ్రోలినా తనిదీరని అమృతకాసారం

చిన్నపాటి వెన్ను చఱుపులే బలవర్ధకాలు
ఊహించని మెచ్చుకోళ్ళే ఉత్ప్రేరకాలు
ఖర్చువెచ్చమే లేని అపురూప కానుకలు
మనస్ఫూర్తి స్పందనలే ఎనలేని బహుమానాలు
అల్ప సంతోషి మనిషి పొంగుతాడు పొగడ్తకు
పల్కు ఎదన గుచ్చుకుంటే జారుతాడు అగడ్తకు

1.ఇల్లాలి సేవలెన్నో గుర్తిస్తె పరవశాలు
వంటకాలు రుచిచూసి కీర్తిస్తే పదివేలు
కట్టుబొట్టు అందాలు చీరకట్టు చందాలు
ప్రశంసిస్తె రోజంతా స్వర్గ సౌఖ్యాలు
అల్ప సంతోషి మనిషి పొంగుతాడు పొగడ్తకు
పల్కు ఎదన గుచ్చుకుంటే జారుతాడు అగడ్తకు

2.విద్యార్థి కృషి గమనించి గుప్పించు అభిందనలు
పరీక్షా ఫలితాల్లో జరుగుతాయి అద్భుతాలు
ఓటమి గెలుపుల్లో వెన్నంటి ఉంటె చాలు
మాయమై పోతాయి అన్ని ఆత్మహత్యలు
అల్ప సంతోషి మనిషి పొంగుతాడు పొగడ్తకు
పల్కు ఎదన గుచ్చుకుంటే జారుతాడు అగడ్తకు

3.కవులూ కళాకారుల మనసులే సున్నితాలు
కరతాళధ్వనులే వారికి ఘనమైన సత్కారాలు
కండువా కప్పినా అదియే  కాశ్మీరుషాలు కవులకు
కవితను కొనియాడితే జ్ఞానపీఠే వారి చెవులకు
అల్ప సంతోషి మనిషి పొంగుతాడు పొగడ్తకు
పల్కు ఎదన గుచ్చుకుంటే జారుతాడు అగడ్తకు
నువ్వే నాప్రాణం నువ్వే నా గానం
ప్రతిక్షణం నువ్వే నా జీవనం
నువ్వే నా మౌనం నువ్వే నా ధ్యానం
నువ్వేగా చెలీ నాదైనలోకం

1.ఊపిరి నిలిపే ఆక్సీజన్ నువ్వే
ఉద్వేగం నింపే చైతన్యం నువ్వే
ఊహలు గొలిపే మాధుర్యం నువ్వే
ఉల్లాసం పెంచే ప్రేరణ నువ్వే నువ్వే

2.కలనూ వదలని కవనం నువ్వే
నా తొలిచూపు ప్రణయం నువ్వే
జన్మలు వీడని బంధం నువ్వే
జగమే ఎరుగని సత్యం నువ్వే

Saturday, July 20, 2019

చీరకట్టు నుదుట బొట్టు
ఆకట్టుకుంటాయి చూపరులను
నా అందం నా ఇష్టం అంటూ
పట్టించుకోకపోతె ఎలా పరులను

1.బొంత పురుగు వింతగా
రంగులు సంతరించుకొని
సీతాకోకచిలుకవగా
కాంతలంత ఎందుకో
విదేశీవస్త్రాల మోజులో
కోక కట్టుకోక కులుకుదురుగా
దాగీ దాగనిదే కదా సౌందర్యము
విప్పికుప్పబోసాక ఏమున్నది మర్మము

2.సిగలోన మల్లెపూల చెండు
మతినే మత్తిలజేయుచుండు
పాపిట ధరియించిన సింధూరము
ఇనుమడింపజేయును స్త్రీ ఎడ గౌరవము
నగవులే పసిడి నగలు
క్రీగంటి చూపుల్లో వగలు
భారతీయ సంస్కృతి తెలుగు సంప్రదాయరీతి
జగతిలోనె గడించెను ఎనలేని ఖ్యాతి

Friday, July 19, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

వెన్నంటి వస్తాడు వెన్నదొంగ
కన్నెపిల్ల మనసూ దోచుకొనంగ
రంగ రంగా వీడినెలా తప్పుకొనంగా
పంచప్రాణాలే అదుపుతప్పంగా
హరిహరి నారాయణా
అనవరతం ప్రేమపారాయణ

1.మురళీ గానమే నాదస్వరమై
తనువూగిపోతుంది పరవశమై
నీలినీలిదేహమే ఘనమేఘమై
పురివిప్పి ఆడుతుంది మదిమయూరమై
ఏమీ ఎరుగనట్టు వగలుపోతాడు
చక్కనయ్య వేస్తాడు ముక్కుతాడు
హరిహరి నారాయణా
అనవరతం ప్రేమపారాయణ

2.కనుసైగలోనే ఏదో కనికట్టూ
వద్దనివారించినా బుద్ధి వాని చుట్టూ
ఆచిరునవ్వే వెన్నెల కురిసేట్టూ
గోముగ పిలిచాడా అది తేనె పట్టూ
మైకం కమ్మనిదెవరికి మరునిగన్నవానిగని
శోకమె దరిచేరదుగా కమ్మని తన కౌగిలిని
హరిహరి నారాయణా
అనవరతం ప్రేమపారాయణ
గోవిందా గోవిందా విఠల విఠల గోవిందా
గోవిందా గోవిందా పాండురంగ గోవిందా
గోవిందా గోవిందా పండరినాథ గోవిందా
గోవిందా గోవిందా పుండరీక వరద గోవిందా

1.గోవిందా గోవిందా పరమ పురుష గోవిందా
గోవిందా గోవిందా పరంధామ గోవిందా
గోవిందాగోవిందా రుక్మిణివల్లభ గోవిందా
గోవిందా గోవిందా రాధికా ప్రియగోవిందా

2.గోవిందా గోవిందా దీన బంధో గోవిందా
గోవిందాగోవిందా జ్ఞాన సింధో గోవిందా
గోవిందా గోవిందా పాహిపాహి ముకుందా
గోవిందా గోవిందా దేహిదేహి సదానందా

బొజ్జ నింపుతుంది మా అమ్మా
బజ్జోబెడతాడు మా నాన్న
నవ్వులముంచెత్తుతాడు మా అన్న
కావలిసిందేముంది ఇంతకన్నా

1.పొద్దున్నే అమ్మ బూస్ట్ పాలు పోస్తుంది 
తీరొక్క టిఫిన్లతో బ్రేక్ ఫాస్ట్ పెడుతుంది
ఇష్టపడే వంటకాలు లంచ్ లో తయారు
స్నాక్స్ లూ డిన్నరూ తల్చుకుంటె నోరూరు

2.చిక్కులన్నీ ఇట్టే నాన్న తీర్చేస్తాడు
అడగక ముందే అన్నీ కొనిపెడతాడు
నా మూడ్ మార్చేలా పాటలు వినిపిస్తాడు
సాఫీగా సాగేలా తగు బాటలు వేస్తాడు

3.వింత వింత వార్తలన్ని అన్న మోసుకొస్తాడు
చాక్లెట్లు పిజ్జాలు కొని తీసుకొస్తాడు
సినిమాల కబుర్లెన్నొ చెపుతుంటాడు
క్రికెట్ మ్యాచ్ మజా ఏంటొ చూపెడతాడు

Thursday, July 18, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఊరట దొరకని ఊరట
స్మార్ట్ఫోన్ వాడని వాడే లే(డ)దట
ప్రతి ఇంట మౌనమేనంట
బంధాలు బాధ్యతలూ
మాయమౌతున్నవంట

1.సాధలనాలెన్నో మింగేసెనంట
సాధ్యాలనెన్నో చేసేసె నంట
నెట్టింట తానంట నట్టింట తానంట
పగటికీ రేయికీ భేదమే లేదంట
ప్రాథమ్యాలనన్నీ హరియించె నంట
గుప్పిట్లో ప్రపంచ మంట
ప్రపంచమంతా తన గుప్పిట

2.పిచ్చిగా మారినా సెల్ఫీల ముచ్చట
ముచ్చట్లె పిచ్చిగా మారేను ఇచ్చట
మోసాలవాసమైనా కుక్కతోక వంకరా
స్వార్థలె పరమార్థం  స్నేహాలు  వంక రా
మిథ్యా ప్రపంచమే వాస్తవాన్ని ముంచెరా
పరివార బంధాలెన్నో తెగతెంచెరా
వాడేలా వాడకుంటే వాడిముళ్ళకంచెరా

3.ఫేస్ బుక్ టిక్ టాక్ ఫేమసై పోయాయి
వాట్సప్ ట్విట్టరూ వ్యసనంగ మారాయీ
టెలిగ్రాం ఇన్ట్సాగ్రాం ఇష్టాలైపొయినాయి
యూట్యూబ్ గూగుల్ దినచర్యలైనాయి
కరెన్సీ కరువై ఈ-వాలెట్లు వెలసాయి
భీము పేటీయం ఫోన్పే చెల్లింపుచేస్తున్నాయి
జగమే మారెనో ప్రగతి ఏమారెనో ఏగతిని చేర్చునో
కదన కుతూహల రాగం

నీ జడ కుప్పెగా ఒప్పారనీయవే
పాపిటిబిళ్ళగా నన్ను ఒదగనీయవే
నుదుటన సింధూరమై వెలుగనీయవే
బుగ్గన చుక్కనై దిష్టి కాచనీయవే
అంగాంగాన నీకు ఆభరణమై
నీ అందాలకు నను మెరుగులు దిద్దనీ
నీమేని వర్ణాలు ఇనుమడింపజేయనీ

1.చెవులకు జూకాలై గుసగుసలాడనీ
ముక్కున ముక్కెరనై జిలుగులు చిమ్మనీ
కంఠాభరణమై కనికట్టుచేయనీ
ఎదమంగళసూత్రమై బంధం బిగియించనీ
నీ అందాలకు నను మెరుగులు దిద్దనీ
నీమేని వర్ణాలు ఇనుమడింపజేయనీ

2.కటివడ్డాణమై ననువగలొలుకనీ
కాంచన కేణా నై దృష్టినా కట్టుకోనీ
గాజుల సోయగమై సరిగమలే పలకనీ
మువ్వల పట్టీలనై పదములు ముద్దాడనీ
నీ అందాలకు నను మెరుగులు దిద్దనీ
నీమేని వర్ణాలు ఇనుమడింపజేయనీ


Wednesday, July 17, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:దేశ్

నీ రూపమే నయనానందము
నీ నామమే రసనానందము
నీ తలపులే హృదయానందము
నీ సేవలే సాయి పరమానందము
జయజయసాయి సద్గురు సాయీ
జయజయ సాయీ జగద్గురు సాయీ

1.నీ చరితయే పఠనానందము
నీ లీలలే శ్రవణానందము
నీ సన్నిధే దివ్యానందము
నీ బోధలే సచ్చిదానందము
జయజయసాయి సద్గురు సాయీ
జయజయ సాయీ జగద్గురు సాయీ

2.నీ భజనలే బృందానందము
నీ పాటలే ఆత్మానందము
నీ ధ్యానమే యోగానందము
నీ తత్వమే మోక్షానందము
జయజయసాయి సద్గురు సాయీ
జయజయ సాయీ జగద్గురు సాయీ
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అందని వాడివో-అందరి వాడివో
వందనాలనందుకో-నందలాలా
నీదరిజేర్చగా ఆనందలీల

1.మన్ను తిన్న వైనము వెన్నదొంగిలించడము
నీకొంటె చేష్టలతో అదే గోకులము
.అదె యమునానది అదే బృందావని
వందలాది గోపికలతొ అదే రాసకేళి
జయదేవుడు ఆదిగా రాసారు ఎందరో
విసుగన్నదేరాదు అదిఏమి చిత్రమో
భాగవతసుధలో ఇమిడున్న సూత్రమో
వందనాలందుకో శ్యామసుందరా
పదములనందీయరా మురళీధరా

2.ప్రహ్లాద చరితము వామనావతారము
గజేంద్రమోక్షము ద్రౌపది సంరక్షణము
ఆవతారమేదైనా ఆర్తత్రాణపరాయణము
సందర్భమేదైనా గీతామకరందము
పోతనకలమందలి హృద్యమైన పద్యాలు
తనివేదీరదూ అదిఏమి వింతయో
కలతలుతొలగించెడి వైష్ణవ మాయయో
వందనాలందుకో హే దీనబాంధవా
భవబంధము తొలగించర ప్రేమసింధువా

Tuesday, July 16, 2019

ఆశలకెక్కడిది పేదరికం
ఊహలకుండదుగా బీదతనం
మధ్యతరగతిదో విచిత్రమైన ఆర్తి
ఉట్టికి స్వర్గానికీ అదో వింత వారధి

1.ఎంతమేత మేసినా గొర్రె తోక బెత్తెడు
ఎంతగా తోమినా బర్రెనలుపు వీడదు
సంపాదన సంగతేమొ సరదాలకు కొదవలేదు
అప్పులపాలైతెనేమి బడాయిజోరు తగ్గదు
మధ్యతరగతి  తిరిగినా జరగని గానుగ
మీసాలకు సంపెంగనూనె తీరుగ

2.లూనా ఉన్నాచాలు అదే బెంజికారు
పరివారమంతా దానిమీదె షికారు
సండే(చుట్టం) వస్తే ఇకచూడు మటన్ బిర్యానీలు
వారమంత  కారంతో బుక్కెడంత తిన్నాచాలు
మధ్యతరగతి అది ప్రత్యేక సంస్కృతి
సగటు భారతీయకు అదేకదా హారతి
పల్లె గొల్లుమన్నది తన గోడుచెప్పుకున్నది
వాడ వాడ నడయాడు జనమే లేదన్నది
ప్రేమతోటి పలకరించు నరుడే లేడన్నది
ఆప్యాయత చిలకరించు ఎదనే లేదన్నది

1.సందెల కడ అంబలితో సంబరమేదన్నది
గట్కకూ గంజికీ జాడలెరుగ నన్నది
చేసుకున్న కూరల అదల్బదలు ఏదన్నది
బుక్కెడంత తినిపొమ్మను కొసరుడెక్కడన్నది
కడుపారా వడ్డించెడి మమతే లేదన్నది

2.కచ్చరాల మాటేమో ఎద్దుజాతి ఏదన్నది
సవారి బండ్ల పైనం మచ్చుకైన లేదన్నది
గోచికట్టు చీరలతో పడుచందం ఏదన్నది
మాయదారి నాగరికత తనమనుగడ కీడన్నది
పండగొస్తె మాత్రమే యాదికొస్తె ఎట్లన్నది

3.పొలాలు మేడలైతే కూడుకేది గతియన్నది
రైతే ఇక మాయమైతె బ్రతుక్కు చేటన్నది
పచ్చదనం తరిగిపోతె ప్రకృతి విలయమన్నది
వ్యవసాయం కుంటుబడితె సంకటమేనన్నది
పల్లెకు బలమీయకుంటె మనిషికి ముప్పన్నది
నీటి వెతుకులాటలో జాబిలిపై రాకెట్లు
మంచి నీటికటకటలో చచ్చేంతగ ఇక్కట్లు
సంకలోని పాపగతి పట్టించుకోని ప్రభుతా
సందమామ నందుకొంటె  అసలది ప్రగతా

1.మానిని మానానికి ఎక్కడుంది భద్రత
నడపడానికైతే స్కూటీల బహుమతా
ప్రపంచకప్పుకై చెప్పరాని తహతహ
గంజి కైన నోచుకోని నిరుపేద దేశప్రజ

2.చలువరాతి భవంతికై ..ఉన్నవేమొ కూల్చుడట
నిలువనీడలేనివారి వ్యధకుఎపుడొ  ఊరట
విశ్వనగర గగనాల రైళ్ళరాకపోకలట
రాదారుల గుంతల చింతలింక వీడవట

3.అడుగడుగున మద్యమింక చోద్యమే ఇట
తాగుబోతు చోదకుల భరతం పట్టుడట
అన్నపూర్ణ పథకాల ఆడంబరాలట
అన్నదాత గోడేమో అరణ్యరోదనమిట

Monday, July 15, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా జీవితమొకవైపు
నా తనయుడి మనుగడ ఒకవైపు
బదులుగా ఏదైనా నానుండి తీసుకో
నా సుతుని భారమింక నువు చూసుకో
ఓ విశ్వకవి మిత్రుడా ఓ విచిత్ర చిత్రకారుడా

1.జన్మలే దాటివచ్చే కర్మలను పరిమార్చు
ఈజన్మలొ చేసినట్టి దోషాల తెగటార్చు
అనుభవించితీరాలంటే ఖాతాను నాకు మార్చు
శిక్షనే ఖరారు చేస్తే అది నాకే జతకూర్చు
ఓ న్యాయమూర్తీ విశ్వచక్రవర్తీ

2.ఇంద్రియాలు నీవశమై ఇకనైనా సాగనీ
నీ ఇంద్రజాలాలు మాపైన ఆగనీ
ఆడిఆడిమేమెంతో అలసిపోయనాము స్వామీ
విసుగూ విరామమే నాకథలో లేదా ఏమీ
నటన సూత్రధారీ ఓ ధర్మాధికారీ

3.దారి తప్పువేళలో నీదరికి మము జేర్చు
మాచీకటి బ్రతుకుల్లో వెలుగుపూలు పూయించు
మానవతా విలువలను మనిషిమనిషిలోన పెంచు
ప్రేమానురాగాలు మాకింక బోధించు
ఓ సద్గురునాథా జగద్గురుదేవా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

బ్రతుకు భారమై-ముదిమి నేరమై
చేయిసాచలేక-ప్రేమనోచలేక
ఆత్మాభిమానమే ఆభరణమై
దినం దినం అనుక్షణం  రణమై

1.రెక్కల కష్టాన్నే నమ్ముకొని
చిక్కులనెన్నో దాటుకొని
బాధ్యతలన్నీ నెరవేర్చుకొని
చరమాంకానా విశ్రాంతి కోరుకొని
బడుగుజీవి మనుగడ తృణమై

2.ఎండావానలకు ఓర్చుకొని
గుండెను బండగా మార్చుకొని
బంధాల గుణపాఠం నేర్చుకొని
చేసిన పొదుపూ చేజార్చుకొని
జీవితాంతం సాంతం మరణమై
అది తెలుసు ఇది తెలుసు
అది ఇది ఏలా అన్నీ తెలుసు
ఉన్నది తెలుసు లేనిది తెలుసు
ఉండీలేనిది ఏదో తెలుసు
ఎంతతెలిసినా మరెంత మరచినా
తెలియనిదెంతెంతొ ఉందని తెలుసు
అది ఒక వింతనీ తెలుసు

1.మనసొకటుందని మరిమరి తెలుసు
మనిషీ మనసూ  వేరని తెలుసు
మనసులేని మనుషులు తెలుసు
మనిషిలేక మనలేక ఏమనలేక
మనసు దుర్గతి తెలుసు
ఎంతతెలిసినా మరెంత మరచినా
తెలియనిదెంతెంతొ ఉందని తెలుసు
అది ఒక వింతనీ తెలుసు

2.ప్రేమ సంగతి పూర్తిగ తెలుసు
ప్రేమ అంటెనే ఆర్తిగ తెలుసు
ఆకర్షించే అయస్కాంతం ప్రేమని తెలుసు
త్యాగం భోగం మధ్యన ఊగే
లోలకం ప్రేమని తెలుసు
ఎంతతెలిసినా మరెంత మరచినా
తెలియనిదెంతెంతొ ఉందని తెలుసు
అది ఒక వింతనీ తెలుసు

3.దైవం ఏమిటోతెలుసు
నమ్మిక అంటేను తెలుసు
నమ్మితేనే దైవమని తెలుసు
దైవం దర్పణమని తెలుసు
ఆత్మసమర్పణే ఆతత్వమని తెలుసు
ఎంతతెలిసినా మరెంత మరచినా
తెలియనిదెంతెంతొ ఉందని తెలుసు
అది ఒక వింతనీ తెలుసు

Sunday, July 14, 2019

అలమేలుమంగకు పతియతడు
అలపద్మావతి ప్రియసఖుడతడు
ఇరువురు సతుల నిజవల్లభుడు
తిరువేంకటాచల మురిపెమువాడు

1.నారదాది మునిజనవరదుడు
నమ్మికొలిచెడి భక్తసులభుడు
గరుడవాహన గమనకాముకుడు
క్షీరసాగర ఆదిశేషశయనుడు
కలియుగమందున సరిదేవుడు
తిరువేంకటాచల మురిపెమువాడు

2.కమలలోచనుడు కరుణాత్ముడు
వైజయంతి మాలాశోభితుడు
శంఖచక్రయుత కరభూషణుడు
ఆపన్నహస్తమునందించువాడు
అన్నమయ్యకే నెయ్యము వాడు
తిరువేంకటాచల మురిపెమువాడు

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

గంగను వదలరా-బెంగను తీర్చరా
జంగమదేవరా-సరగున బ్రోవరా
గౌరీమనోహరా-అర్ధనారీశ్వరా

1.సంతత ధారగ నీకభిషేకమునొనరింతుము
నమకచమక స్త్రోత్రాలతొ నినుకీర్తించెదము
గోవర్ధన గిరిధారిని నీ సరిపూజించెదము
ఋష్యశృంగుడిని పరవశునిగ చేసెదము
తాగునీటి కష్టాలు కడతేర్చరా
సాగునీటి వనరులన్ని పొంగిపొరలనీయరా

2.కప్పల పెళ్ళిచేతుము తిప్పలు తప్పించరా
మేఘమథనమూ జేతుము వానలు రప్పించరా
పెద్దయ్య గజాలనే ఊరేగింతుమురా
ఇంటింటికి చెట్లుపెంచి ఇలస్వర్గము చేతుమురా
తాగునీటి కష్టాలు కడతేర్చరా
సాగునీటి వనరులన్ని పొంగిపొరలనీయరా

3.అన్నపూర్ణ కడుపునింపు గతినిక గానరా
అన్నదాత పంటపండు తెరువిక చూడరా
పాతాళ గంగను పెల్లుబుక జేయరా
ఆకాశగంగను నదుల పారనీయరా
తాగునీటి కష్టాలు కడతేర్చరా
సాగునీటి వనరులన్ని పొంగిపొరలనీయరా
మోయలేని తీయదనం నీ ఆలింగనం
ఓపలేని కమ్మదనం నీ చుంబనం
తనవులోని అణువణువు
తాకినంత  మ్రోగు వేణువు
చెఱకువింటి వేలుపు చూడని
నీ మేనే  సుమధనువు

1.ముట్టుకుంటె కందిపోయే
నీ అందచందాలు
పట్టుకుంటు జారిపోయే
నవనీత చందాలు
పెదాలలో జాలువారే
మందార మకరందాలు
మెడవంపు వెచ్చదనంలో
శ్రీ చందన గంధాలు

2.చెవితమ్మెలు రసనకు
 పుట్ట తేనె పట్లు
చెక్కిలిపై  పల్లే ఉలులై
చెక్కేటి మెత్తటి గాట్లు
గుట్టు విప్పడాని కొరకు
పడరాని వింతపాట్లు
ప్రావీణ్యం ఎవ్వరిదైనా
నెగ్గుతాయి ఇరుజట్లు

Saturday, July 13, 2019

జోహారు జోహారు జవానన్న నీకూ
వీరమరణమొందితివా దేశంకొరకూ
నీ జన్మ చరితార్థమేనాటికీ
భరతమాత ముద్దుబిడ్డ నువ్వే ముమ్మాటికీ
జై జవాన్ జయహో జవాన్- జైజవాన్ జయహో జవాన్

1.జన్మించి చితిలోగతించేరు అందరూ
చావుతోనె చెలిమిచేయ పుట్టినారు మీరూ
ఎదిరించుటకేనాడు బెదిరింది లేదు
పోరునుండి వెనకడుగే వేసిందిలేదు
విజయమో వీరస్వర్గమో వరించేరు
చావో రేవో దేనికైన మీరెప్పుడు తయారు
జై జవాన్ జయహో జవాన్- జైజవాన్ జయహో జవాన్


2.వీరమాత నినుగన్న తల్లి
దేశమాతకందించె నిన్ను ఆ కల్పవల్లి
యోధులై పోరుతారు ప్రాణమే ఫణంగా
అమరులై వెలుగుతారు అజరామరంగా
మీశౌర్యం మీ త్యాగం మీ తెగింపు ఫలితంగా
రెపరెపలాడుతోంది నింగిలో తిరంగా-మన భారత పతాక
జై జవాన్ జయహో జవాన్ -జైజవాన్ జయహో జవాన్
పాండురంగా పాండురంగా-భక్తాంతరంగా
పాండురంగా పాండురంగా-కరుణాంతరంగా
పండరి పురవాస హేపాండురంగ
చంద్రభాగనదీ తీర శ్రీపాండురంగ

1.నిలవమని ఇటుకవేయ-కదలక నిలుచున్నావు
తలిదండ్రుల సేవయే-మనిషికి తగునన్నావు
కన్నవారి కన్నమిన్న-మరిలేదని అన్నావు
భక్తుని ఆనతియే-శిరోధార్యమన్నావు
పాండురంగా పాండురంగా-నీ సన్నిధె స్వర్గంగా
పాండురంగా పాండురంగా-నీ స్మరణే ముక్తికి మార్గంగా

2.కొలువై ఉన్నావు-రుక్మిణీ సహితంగా
పండరిపురమేదక్షిణ -మథురానగరంగా
దోచుకోవయ్యా-వెన్నలాంటి మా ఎదలు
కాచుకోవయ్యా-గోవులె మా బుద్ధులు
పాండురంగా పాండురంగా-నీ నామమే అమృతంగా
పాండురంగా పాండురంగా-నీ గానమే మకరందంగా
మనసుకు మెదడుకు ముడిపడదెన్నడు
మమతా నియతీ జత పడవెప్పుడు
అవధులేలేనిది అనురాగము
పరిధిమించనీయదు అధికారము

1.తర్కాలు రచియిస్తుంది వాదనలు నిర్మిస్తుంది
గెలుపుకోసమే ఎపుడు మేధ కృషిసల్పుతుంది
లాభాలునష్టాలు బేరీజువేస్తుంది
ఆచితూచి అడుగేస్తూ జాగ్రత్తపడుతుంది

మూర్ఖంగ స్పందిస్తుంది మౌనంగ రోదిస్తుంది
తనదృష్టికోణంలోనే ప్రపంచాన్నిచూస్తుంది
అనుచితాలు ఉచితాలు పట్టించుకోదు హృదయం
బంధాల ఆరాటంలో తాను బలియౌతుంది

2.ఋజువులే కోరుతుంది  వాస్తవాల్నె నమ్ముతుంది
ఆచరణ సాధ్యాలనే అమలుపరచబూనుతుంది
ఎదరొదను ఏమాత్రం బుద్ధి లెఖ్ఖచేయదు
లక్ష్యాన్ని సాధించుటలో విలువలకూ విలువీయదు

కలలెన్నొ కంటుంది కల్పనలో బ్రతికేస్తుంది
అనిర్వచనీయమైన అనుభూతికి లోనౌతుంది
మేధస్సు బోధలను మది ఖాతరె చేయదు
మానవీయనైజాన్ని మాటవరుసకైన మరువదు
అయోధ్యలో పుట్టాడు  శ్రీ రఘురాముడు
మహు లో జన్మించాడు  అంబేద్కర్ భీముడు
మానవ జాతికే ఆదర్శం ఆ రాముడు
భారతభూమికే మార్గదర్శి ఈ భీముడు

రాజ్యాన్నే త్యజించాడు ఆ రాముడు
పదవి కాలదన్నాడు ఈ భీముడు
సకల ప్రాణికోటిని ఆదరించినాడు ఆరాముడు
నిమ్నజాతుల నుద్ధరించారించాడీ భీముడు

రామరాజ్యమంటే అపురూపం ఏనాడు
భారత రాజ్యాంగమె స్ఫూర్తి జగతికీనాడు
ప్రజారంజకంగా పాలించెను రాజ్యాన్ని రాముడు
ప్రజామోదకంగా తీర్చిదిద్దె రాజ్యాంగం అంబేద్కరుడు
అనుదినమూ ఉగాది వేళనే
మదిమదిలో వసంత హేలనే
మావితోటల్లో కోయిలల పాటలే
మేను మరచి పాడే  కూని రాగాలే

1.తీపి చేదు ఏదోఒకటి
నిరీక్షణకు సార్థకంగా
గెలుపు ఓటమేదైనా
పరీక్షలకు ఫలితంగా
అనుభూతుల ఆస్వాదనలో
షడ్రసోపేతంగా
నవరసాల కలబోతే
రమ్యమైన జీవితంగా

2.ఉషోదయం ఆమనిగా
మధ్యాహ్నం వేసవిగా
సాయంత్రం చిరుజల్లుగా
రేయంతా శరత్తుమత్తుగా
చెలిసావాసమే చలికాలంగా
విరహాలు రేగా శిశిరంగా
ఆరుకారులే అరుదెంచంగా
రోజంతా బ్రతుకే మధురంగా

Monday, July 8, 2019

మాట లేని లోకమెంతో మధురమైనది
పలుకెరుగని ప్రపంచమే ఫ్రశాంతమైనది

ఈటెలూ తూటాలూ చీల్చబోవు గుండెలని
గాయపడని హృదయాలకు నిలయమైనది

అసత్యాలు బొంకడాలు తార్చబోవు వాస్తవాన్ని
స్వచ్ఛమైన మనసులకు  నెలవైనది

ద్వందార్థ భాషణలు కూల్చబొవు బంధాల్నీ
ఎద పెదవుల మధ్యదూరం లేనెలేనిది

భావాల్ని తెలుపుటకు చిక్కేది లేదు రాఖీ
చూపైనా స్పర్శైనా మదిని మీటుతుంది


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కలువలే విస్తుపోయినాయి
కమలాలూ బిత్తరపోయాయి
అల్లనేరేడు పళ్ళు గొల్లుమన్నాయి
మీనాలన్నీ సరితూగనన్నాయి
నీనయనాలు అనుపమానాలు
నీ నేత్రాలు అపురూప చిత్రాలు

1.కాటుకసైతం పోటీపడనంది నీకనుపాపలతో ఇక
చీకటి కూడ దాక్కుందెక్కడో కని నీ కనీనిక
రవి ఎపుడూ కనలేదు ఇటువంటి లోచనము
కవులెవరూ నుడువలేదు ఈగతి అవలోకనము
నీ నయనాలు అనుపమానాలు
నీ నేత్రాలు అపురూప చిత్రాలు

2.వెన్నెల వెలవెలబోయింది ఈక్షణము కాంతిగని
దివ్యత్వం గూడుకట్టుకుందినీ చక్షువు తగినదని
నాలికచాపితే అపర కాళికలా తోస్తావు
నవ్వులు సోకితే నీవే ఆమనివని పిస్తావు
నీనయనాలు అనుపమానాలు
నీ నేత్రాలు అపురూప చిత్రాలు

Sunday, July 7, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శివరంజని

నీకిదే నా అంతిమ నివేదన
ఇకనైనా తొలగించు నా వేదన
ఈ చరాచరజగత్తుకే కారణమైన దేవి
కరిగిన నా ఆనందాన్ని తిరిగి అందించవేమి

1.వేదాంత వాక్యాలు వల్లించబోనమ్మా
అద్వైత సూత్రాలు నాకింక వలదమ్మా
నీవుదప్ప పరులెవరూ పట్టించుకోరమ్మా
ప్రతిగా ఏమీయాలో నన్నిపుడె కోరవమ్మా
దుఃఖాలకు సంతోషాలకు మూలమైన దేవి
కరిగిన నా ఆనందాన్ని తిరిగి అందించవేమి

2.వీణ పట్టుకున్నపుడు వాణిగా నిను కొలిచేను
సిరులు ధారబోయునపుడు శ్రీలక్ష్మిగ అర్చించేను
ధైర్యమే దిగజారినపుడు శక్తిగా పూజించేను
చావోరేవో తేల్చుకొనగ చాముండిగ అర్థించేను
సకల జీవులన్నిటికీ తల్లివైన దేవీ
కరిగిన నా ఆనందాన్ని తిరిగి అందించవేమి

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అందమె ఆనందమనీ అన్నారు ఆనాడు..
ఆనందమె అందమనరా నిను చూసిన ప్రతివారు
స్వచ్ఛమైన నీ నవ్వు మనసుకెంత ఉల్లాసం
హాయిగొలుపు నీ నవ్వు కనినంతనె ఆహ్లాదం
నిన్నుచూస్తు గడిపేస్తాను ఈ జీవితాంతం
రెప్పవాల్చలేకున్నాను లిప్తపాటుకాలం

1.కన్నులూ నవ్వుతాయని నీవుకదా తెలిపింది
వెన్నెల్లు రువ్వుతాయనీ ఇపుడె కదా ఎరుకైంది
హరివిల్లు విరిసిందీ నీ కనుబొమ్మల్లోనా
సింధూరం మెరిసింది నీ నుదుటి కనుమల్లోనా
నిన్నుచూస్తు గడిపేస్తాను ఈ జీవితాంతం
రెప్పవాల్చలేకున్నాను లిప్తపాటుకాలం

2.ముక్కుపుడక నవ్వుతుందా ఎక్కడైనా
సంపంగి నీముక్కున అది సాధ్యమేగా
పలువరుసలోనా ముత్యాల వానా
నీఅధర దరహాసం వర్ణించ నాతరమౌనా
నిన్నుచూస్తు గడిపేస్తాను ఈ జీవితాంతం
రెప్పవాల్చలేకున్నాను లిప్తపాటుకాలం

Friday, July 5, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మాల్కోస్

ప్రతి స్పర్శలోనూ పరవశాల జల్లు
ఎదకుహత్తుకొనగ ఆత్మీయత విలసిల్లు
అంగాంగ సంగమాన అనురాగం పెల్లుబుకు
కరచాలనమందైనా అభిమానమే ఒలుకు

1.తొలి స్పర్శ మనిషికి అమ్మ ఒడి
నాన్న పొదువుకున్నప్పుడు హాయిదూకు మత్తడి
చెట్టాపట్టాలే బాల్యంలో  చెలిమికిపడే ముడి
చెలి స్పర్శ యవ్వనాన వింతైన అలజడి

2.అలయ్ బలయ్ అల్లికే తెలంగాణ అనుబంధం
తలనిమిరే  అనునయమే జబ్బుకెపుడు ఔషధం
గురువు పాదస్పర్శనమే శిశ్యుల అభివాదము
జాతీయ స్ఫురణయే పౌరుల అభివందనం

Thursday, July 4, 2019

చిరునవ్వు స్థిరవాసము నీ అధరము
ప్రణయానికి ఆహ్వానము నీ నయనము
పున్నమి వెన్నెలకే విలాసము నీ వదనము
కవి కలమున ఉదయించే సుప్రభాత గీతము

1.జడ చూడగ యమునయే స్ఫురణము
మెడవంపున మందాకిని సౌందర్యము
తీయని నీ పలుకుల్లో గంగావతరణము
అణువణువున తొణుకుతోంది లావణ్యము

2.గిరులనుండి జారే కోకే జలపాతము
కటి చీకటిలో దాగే నాభే ఘనకటకము
పాదాల పట్టీల నాదమే రసభరితము
నిలువెత్తునీ అందం కననివినని చరితము
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:జయంత శ్రీ

అనిమేషుడనే నినుచూడ
ఏడుకొండల వాడ
నీ దాసుడనేనైతిని
కోనేటిరాయా నినువీడ

1.కొడిగట్టక వెలుగనీ
గర్భగుడిలొ నను దివ్వెగ
వసివాడక నిలువనీ
నీ పదముల పువ్వుగ
అనిమేషుడనే నినుచూడ
ఏడుకొండల వాడ
అన్నమయ్యనేనౌదు
మరిమరి నినుపొగడ

2.దినమైనా దీపించని-నీ
నుదుటన తిరు నామమై
క్షణమైనా వ్యాపించనీ
సాంబ్రాణి ధూపమై
అనిమేషుడనే నినుచూడ
ఏడుకొండల వాడ
పురంధరుడ నేనౌదు
కమ్మని నీకృతులు పాడ
రాగం:శుద్ధసీమంతిని

శివనామమే సంగీతమూ
శివగానమే ఆనంద జనితము
శివతత్వమే అద్వైతము
శివమంత్రమే భవతారకం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

1.పరవశమున శివశివయనగా
నరుని వశమగును హరహరుడు
విశ్వాసముగా విశ్వేశ్వరా యనగ
కరమందీయడ శంకరుడు
కపోతమునకే కైవల్యమొసగెను
శ్రీశైల  మల్లికార్జునుడు
గిరి పరిక్రమతో పరసౌఖ్యమీయడ
అరుణాచలేశ్వరుడు
అరుణాచలశివా అరుణాచలశివా అరుణాచలశివా

2.సైకతమైనను లింగాకృతి నర్చించ
భవజలధిని దాటించును రామేశ్వరుడు
సుమమేకాకున్ననూ మారేడునర్పింప
ముక్తిని దయసేయడా ముక్తీశ్వరుడు
తలమీదగంగమ్మ కాపురమున్ననూ
చెంబుడునీటికే చేరదీయు కాళేశ్వరుడు
కోడెనుకట్టినంత గోడే వినగలడు
వేములవాడ రాజేశ్వరుడు
మహాదేవ మహాదేవ శంభో సదాశివా

Wednesday, July 3, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:తిలక్ కామోద్

మ్రొక్కి మ్రొక్కి నేనూ చిక్కినాను,నీకే చిక్కినాను
వెక్కి ఎక్కి ఎంతగానొ ఏడ్చినాను,నిన్నే మాడ్చినాను
అమ్మవేనా అసలు నువ్వు,మాయమ్మవేనా
ఆలనపాలన వదిలీ ఎందుకు,ఊళ్ళేలనా
పట్టించుకోవమ్మ పిసరంతైనా,తల్లీ సరస్వతీ
కన్నబిడ్డనొదిలేసే కసాయివా మాతా భారతీ

1.మెదడులోని ప్రతికదలిక నీ చలవేకాదా
కణములు మరణిస్తే మరలా పుట్టించగ రాదా
చితికిపోతె ప్రతి బ్రతుకూ చితికే పోతుందా
నీ ఆనతి విస్మరించి దుర్గతి పాలౌతుందా
ఓపిక అను పదానికే ఓపిక లోపించింది
ఒకే ఒక్క లోపానికి భవిత శూన్యమయ్యింది

2.మారాము చేయుటలో కానిదేమి కోరాము
అరచిగీపెట్టినా అనుచితమేమడిగాము
పరులెవ్వరు తీర్చేదరూ కన్నతల్లి మినహా
పడిన తిప్పలికచాలు నిత్యం నరకం తరహా
నిర్ణయమేదైనా సత్వరమే అమలు పరచు
కర్ణపేయమైన వరమె  జీవితాలు బాగుపరచు
ఎందుకో ఏడుస్తోంది వాయులీనము
ఎందుకో మరి వెక్కుతోంది వేణుగానము
కళ్యాణి రాగమైనా కాంబోజి రాగమైనా
రేవతియే అనిపిస్తోంది,శివరంజని వినిపిస్తోంది

1.బావురుమని దుఃఖిస్తే మదిభారం తీరుతుంది
వెతను కథగ వివరిస్తే గుండె తేలికౌతుంది
ఊరడించు వారుంటే మనసు కుదుట పడుతుంది
దిగమింగితేనె వ్యథతో బ్రతుకు నరకమౌతుంది
మోహనే వీణియపైన ముల్తాను పలుకుతోంది

2.తల్లికీ బిడ్డకూ పుట్టుకలో యాతనా
అప్పగింతలెప్పటికీ తెగని వేదనా
అడుగుగున మనిషిజీవితం-అంతులేనిబాధేనా
అంతిమ యాత్రలోను అశ్రునయన రోదనా
అభేరినే పాడినా శహనాయే శహనాయ్ వాదనా
ముడిచిన పెదవులు ముద్దొస్తుంటే
ముందుకొచ్చి మరిమరీ ముద్దిస్తుంటే
ఆగడం తరమా చెలియా ఆనాటి ప్రవరునికైనా
నిలువవశమౌనా ఏ ముని వరునికైనా

1.ఆకళ్ళు పెంచేనూ ఆ సోగ కళ్ళు
చూపులే పంపేనూ ప్రణయలేఖలూ
ప్రపంచాన్ని పాదాక్రాంతం చేస్తె తప్పేముంది
జగమంత దాసోసం అనడంలొ గొప్పేముంది
ఒక్కనవ్వుకోసం లక్షసార్లు చావొచ్చు
చిన్ననవ్వుకోసం జన్మలెన్నొ ఎత్తొచ్చు

2.నీ చెలిమి కోసం అందరిని వీడొచ్చు
నీ స్పర్శకోసం సంద్రాలు ఈదొచ్చు
నీ పొందు ముందర స్వర్గసౌఖ్యం దండగ
నువు చేయినందిస్తే బ్రతుకంతా పండగ
ఊరించకేచెలీ  ఊహలోనైనా
వారించకే నన్ను స్వప్నమందైనా
రాగం:ఖమాస్

మనుజునివై పుట్టినావు సాయీ
మమతను పంచగా-నడతను బోధించగా
కరుణకు మారు పేరు నీవేనోయీ
దయకురిపించగా-హృదయం మురిపించగా
సాయీ సాయీ సద్గురు సాయీ
సాయీసాయీ జగద్గురు సాయీ

1.వైద్యునిగా మారినావు సాయీ
రుజలను మాన్పగా-రుగ్మతలను ఆర్పగా
సిద్ధునిగా వెలసినావు సాయూ
విద్దెలచూపగా బుద్ధులు గఱపగా
సాయీ సాయీ సద్గురు సాయీ
సాయీసాయీ జగద్గురు సాయీ


2.బంధువే అయినావు సాయీ
బంధాలను తెలుపగా-బాధ్యతలను నేర్పగా
సేవకుడివి నీవైతివి సాయీ
అహమును బాపంగా-మానవతా రూపంగా
సాయీ సాయీ సద్గురు సాయీ
సాయీసాయీ జగద్గురు సాయీ

Monday, July 1, 2019

మత్తడి దాటెను పరువాలు-పుత్తడి బొమ్మకు
చిత్తడాయెను సింగారాలు-సొగసుల కొమ్మకు
ఊరించే సోయగాలు-ఉడికించే నయగారాలు
వాటంగా కవాటాలు  పోటెత్తిన నయాగరాలు.

1.తడిసిన కోక చూసాక -తహతహ దప్పిక
మడి ముడి వీడగ ఆరైక-తమకపు దుప్పిక
జడివానలు మడినేతడుప-ఎగవడి దడి సిగ్గే విడువ
తొరపడి వలపుల వలబడి-దిగబడింది ఊబి చొరబడి

2.నాలుకే నాగలై-మేను చేను దున్నింది
అధరమే గుంటుకై-మోము కలుపు తీసింది
ఒకరికొకరు సాయం చేయగ-వ్యవసాయం సాగింది
నారుపోసి నీరు పెట్టగ కలల పంట పండింది
సొట్టా బుగ్గలా పిలగాడా
సోకూ నవ్వులా పిలగాడా
కొంటే సూపులా సినవాడా
కోఱా మీసమూ ఉన్నవాడా
అందమంటె నీదేర సుందరూడ
నెల్లాళ్ళు నిండైన సెందురూడ

1.రోడెంట నువుబోతె-పోరిలెంట బడతారు
కాలేజికోతుంటె-కన్నె లెంట బడతారు
నీతోటి సెల్ఫీకి-బతిమాలుకుంటారు
టింగురంగ డేటింగు-కెన్కెకబడ్తారు
లక్కంటె నీదేర-సక్కానోడా
లైఫంటె నీవెంటె-ఓ లౌకుమారా
సిక్స్ పాక్ నీదేర ఓ డ్రీమ్ హీరో
సెక్సి లుక్కు నీదేరా అరె దిల్కీ యార్

2.షాపింగ్ కంటూ-సోకులే పోతారు
అబ్బబ్బ రమ్మంటు-పబ్బుతీసుకెల్తారు
లాంగ్ రైడ్ కోసమూ లైన్లే కడతారు
హోటెల్కి తీస్కెళ్ళి నీకుదినవెడ్తారు
లక్కంటె నీదేర-సక్కానోడా
లైఫంటె నీవెంటె-ఓ లౌకుమారా
సిక్స్ పాక్ నీదేర ఓ డ్రీమ్ హీరో
సెక్సి లుక్కు నీదేరా అరె దిల్కీ యార్

3.పేరెంట్స్ నెదిరించి పెళ్ళిచేసుకుంటారు
జిందగంత నీసేవ చేసుకుంటమంటరు
పేచీలు పెట్టమంటు పూచికత్తులిస్తరు
రాజీకి తామెపుడు సిద్ధమంటుంటరు
లక్కంటె నీదేర-సక్కానోడా
లైఫంటె నీవెంటె-ఓ లౌకుమారా
సిక్స్ పాక్ నీదేర ఓ డ్రీమ్ హీరో
సెక్సి లుక్కు నీదేరా అరె దిల్కీ యార్

ఆధిపత్యమెరుగని దాంపత్యం
సరసమే సారమైన సంసారం
ప్రేమకే గోపురం మీకాపురం
వర్ధిల్లనీ నిరంతంరం వికసించనీ అనవరతం

చిలకా గోరింకలు చిన్నబుచ్చుకుంటాయి
కలువా నెలవంకలు కాస్తనొచ్చుకుంటాయి
కన్నుకుట్టుకుంటుంది మిముచూసి ప్రతిజంట
మీ మిథునం జగతికే కన్నుల పంట

రాధాకృష్ణుల అనురాగ రూపమై
సీతారాముల జతలా అపురూపమై
శివపార్వతుల అర్ధనారీశ్వరమై
మీఅన్యోన్యతయే అజరామరమై