Friday, June 29, 2018

వెన్ననీకు వ్యసనము
మన్ను నీకు అశనము
వన్నెల గోపికలు
వెన్నెల వీచికలు
కన్నయ్యా నీకు
కడు ప్రీతికరములు
కృష్ణయ్యా నీకివే
మా ముకుళిత కరములు

1.ఇంటిసొమ్ము పంచుతావు
పరులది ఆశించుతావు
చోరుడ వను పేరునీకు సార్థకమే
కొల్లగొట్ట ప్రతి బ్రతుకు పారమార్థికమే

2.వెదరునూద సుధలు చిలుక
రాసలీల మధురమొలక
యమున తాను స్థాణువవద
బృందావని మురిసిపోద

3.సమాగమాన తాత్వికతను
అంతానీదగు భావుకతను
అడుగడుగున తెలిపినావు
అనిగీత నుడివినావు
లాలిపాట ఇది
జాలిపాట ఇది
జోలపాట ఇది
విధిలీల పాట ఇది
లాలి జో ...జోలాలిజో

1.సమసిపోని వెత ఇది
ముగిసిపోని కథ ఇది
మరపురాని గతమిది
అంతులేని పథమిది
లాలిజో.. జోలాలిజో..

2.గెలువలేని ఆట ఇది
నిలువరాని చోటు ఇది
పలుకలేని మాట ఇది
చెల్లలేని నోటు ఇది

లాలిజో..జోలాలిజో..

3.మందేలేని నొప్పిది
తీర్చలేని దప్పిది
రాయలేని కవిత ఇది
మోయలేని బ్రతుకిది

లాలిజో..జోలాలిజో..

పరాయి వాడివనా నిన్ను నేను పదేపదే ఏమని వరాలు కోరను
ఇలవేల్పువు నీవేకద అడగక ఈడేర్చనూ
పవనాత్మజా నీ పాదాలు కలనైనా వదలను

కొండగట్టుమీద దండిగ కొలువైనావు
గుండెధైర్యమీవె మా గండాలు తొలుగగను

1.నిన్ను నమ్మితే చాలని చెప్పినారు
చిన్ననాటినుండి మా అమ్మానాన్నలు
కంటికి రెప్పవై కాచెద వంటూ
కథలుకథలుగా నీమహిమలు తెలిపినారు
భూతాలు ప్రేతాలు మనోఉన్మాదాలు
నీపేరు పలికినంత తోకముడుచు వైనాలు
కొండగట్టు మీద దండిగ కొలువైనావు
గుండెధైర్యమీవె మా గండాలు తొలగగను

2.అలనాడుసీతమ్మకంగుళీయకమ్మిచ్చి
ముదమార దీవెనలు అందుకొన్నావు
ఎడబాసిన దంపతులకు ఊరట కలిగించి
రామబంటువైనీవు కీర్తిపొందినావు
రోగాలు పీడనలు ఏఈతి బాధలైన
తొలగిపోవునయ్య స్వామి పాడుకుంటె నీ గాథలు

కొండగట్టు మీద దండిగ కొలుమైనావు
గుండె ధైర్యమీవె మా గండాలు తొలుగగను

"పర్యావరణం"

ప్లాస్టిక్కవరు మానండి బాబులూ -
క్లాత్ బ్యాగు వాడండి
పేపర్ ప్యాక్ మేలండి తల్లులూ 
ఇకనైనా కళ్ళుతెరవండి


నశించి పోనట్టి వస్తువేదైనా
వసుధకు భారమె ఏనాటికైనా
మట్టిలో కలిసిపోని దేదైనా
ముప్పే ఈ ప్రకృతికి ఎప్పటికైనా

నదులు సముద్రాలు 
కలుషితమౌతున్నాయి
జీవజాలమెంతో 
అంతరించిపోతోంది

శతాబ్దాల ముందెంతో 
హాయిగా ఉండేది
పర్యావరణమే తానుగ
సమతుల్యత నొందేది

మట్టి, లోహ పాత్రలదే
ప్రముఖ పాత్ర బ్రతుకున
నూలువస్త్రాలతో మేనికి
హానిలేని సుఖపోషణ

రాబోయే తరాలనూ 
భూమి మీద మననిద్దాం
హాని అంటూ లేనేలేని
స్వర్గాన్నిలపై సృష్టిద్దాం


వెదికినా దొరకదు దయ నీ లోన
కనుగొనలేదెపుడు కరుణ నీహృదయాన
భోలా శంకరా మార్చుకో పేరైనా
భక్తవ శంకరా సవరించకో తీరైనా

1.తండ్రివి నీవని తలిచాను ఇన్నాళ్ళు
దాతవు నీవని మొక్కాను మొక్కుళ్ళు
నీకూ ఉన్నారుగా ఇరువురు సుతులు
వారివైన చూస్తావా అతీగతీ స్థితులు
పట్టించుకోకనే ముక్కుమూసుకున్నావా
ఇల్లుచక్కబెట్టలేక దేశద్రిమ్మరైనావా
పరమ దయాళా మార్చుకో పేరైనా
కాళహస్తీశ్వరా మరువకు నీ తీరైనా

2.పగవాడు కూడ పెట్టడయ్య ఇంత హింస
మరణమే మేలని భరించక ఈవింత గోస
విషం మ్రింగి కాచినావు లోకాలను సైతం
విషమైనా ఈయలేవ తీర్చకుంటె నా దైన్యం
చక్కదిద్దలేకుంటే నీ పిల్లల జీవితాలు
మన్నుబుక్కనా స్వామినీ కిన్నిగుళ్ళుగోపురాలు

గోకర్ణేశ్వరా ఇదేనా నీ భూకైలాసం
ఎంతకాలమయ్యా నీ ఈ కౄరవిలాసం

Sunday, June 17, 2018

రచన:రాఖీ

నటియించలేనురా నీయంత చతురతన
నేనాడలేనురా నీ రీతి నిపుణతన
జగన్నాటక సూత్రదారీ
జగన్నాథ హే మురారీ
హద్దంటు లేదా ప్రభూ నీ సయ్యాటకు
తెరదించవేలరా ఇకనైనా నా బ్రతుకు ఆటకు

1.అడుగడుగున సుడిగుండాలు
పథమంతా కడుగండాలు
ఊహించని ఎన్నో మలుపులు
ఉత్కంఠతొ ఓటమిగెలుపులు
రసకందాయమయ్యేలా నా కథను
అనుక్షణమూ పెంచేయాలా నా వెతను

పద్ధతే లేదా స్వామీ నీ దొంగాటకు
నిచ్చెనల ఊసేలేకా బలేనా పాముకాటుకు

2.కష్టాల కడలిన నను తోస్తే
శరణంటా ననుకున్నావా
వేదనల ఊబిలో పడవేస్తే
వేడెదనని భావించావా
ముంచినా తేల్చినా దిక్కెవ్వరు నువ్వు వినా
ఇచ్చింది ఏదైనా పొగడగ నే ఘన కవినా

వెంటాడి క్రీడించకు చదరంగ బంటును
సుధామధురమాశించకు నేను చొప్పదంటును

https://www.4shared.com/s/ft4HLZH5uee

Tuesday, June 5, 2018

బాధ్యతలను పంచుకొని బంధనాలు తెంచుకొని
ఎగిరిపోతుందిగా చిలుకా
దీని మర్మమేమిటో ఎవరికి ఎరుకా

1.ఉన్నంతకాలమే
ఐనవాళ్ళు కానివాళ్ళు
నాదినాదనుకుంటూ
ఈ ఇళ్ళూ వాకిళ్ళూ
నూలుపోగైన వెంట
తేలేదని మరచిపోయి
గడ్డిపరకైన మోసుకెళ్ళమనే
నిజం విడిచి

ఆరాటమెంత,ఎంత చింతరా
అద్దెకొంప దేహమెంత వింతరా
వదలాలని లేకున్నా నిస్సహాయంగా
ఎంతగింజుకున్నాగాని
గత్యంతరమేలేకా

ఎగిరిపోతుందిగా చిలుకా
ఏడవాలుతుందో ఎవరికి ఎరుకా

2.వచ్చిన పని ఏమిటొ
ఎంతకూ గ్రహించక
సాటిమనిషి నిలలో
ఎందుకో ప్రేమించకా
ఉఛ్ఛ నీచాలస్థాయి
నసలే మరి ఎంచక
కూడనివన్నిచేసి
తప్పని తానొప్పక

ఎదుటివారు బాగుపడితె
ఏమాత్రం ఓర్వక
మంచికొరకు ఇంచుకైన
సమయం వెచ్చించక
చేయగలుగు సాయమైన
ఏనాడూ చేయక
రేపు చూద్దామనుచు
వాయిదాల నొదలక

ఎగిరిపోతుందిగాచిలుకా
బ్రతుకు వృధా అయ్యిందని తెలియకా
ఏటేటా జరుపుకో ఆనందంగా
నూటొక్క పుట్టినరోజులు
అందిస్తున్నానూ అందుకో
మనసారా నా శుభాకాంక్షలు
హ్యాప్పీ బర్త్ డే టూ యూ
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

1.అమ్మా నాన్నలకు పేరెంతొ తేవాలి
వంశానికి నీవే కీర్తి,స్ఫూర్తి కావాలి
నిన్ను చూసి బంధుజనం ఎంతో పొంగిపోవాలి
సాటివారు కాసింత నీపై అసూయ చెందాలి

దైవం నీమీద దయా దృష్టి నిలపాలి
చల్లనైన దీవెనలు సదా కురియ చేయాలి
హాప్పీ బర్త్ డే టూయూ
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

2.తలలో నాలుకగా జనులతో మెలగాలి
ఇలకే ఏలికగా నిను కొనియాడాలి
కల్మషమే లేని ప్రేమ సర్వులకూ పంచాలి
నీ పుట్టినరోజుకై ప్రజలు ఎదిరిచూడాలి

బంగారు కలలన్ని పండించుకోవాలి
బ్రతుకంతా కోరికోరి
విజయం నిను వరించాలి
హ్యాప్పీ బర్తడే టూయూ
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ