Wednesday, February 26, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తిలక్కామోద్

బాబా నువు చాటిన బోధలేమిటి
సాయీ నువు తెలిపిన తత్వమేమిటి
అంతరార్థము నొదిలి ఆర్భాటలకై వెంపర్లాట
పరమార్థమే మరచి ఐహిక సౌఖ్యాలకై వింతవేట

1.వెలిసాయి ఎన్నెన్నో నీ మందిరాలు
తిలకించగ గుడులన్నీ బహు సుందరాలు
దర్శించినంతనే కోవెల ప్రతి గురువారాలు
దక్కునా పిచ్చిగాని కోరే గొంతెమ్మ వరాలు
మనశ్శాంతి దొరికేదే బాబా నీ ఆలయం
ముక్తిదారి చేర్చునదే సాయీ దేవాలయం

2.అభిషేకమేలా ఆదరించమన్నావు దీనులను
హారతులవి యేలా ఆచరించమన్నావు నీ సూక్తులను
పల్లకీ సేవకంటె పట్టెడంత పెట్టమన్నావన్నార్తులకు
భజనకీర్తనకంటే భుజంతట్టమన్నావాపన్నులకు
మానవత్వమే బాబా నీ దివ్య బోధన
ప్రేమతత్వమే సాయీ నీ తత్వ సాధన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వ్యక్తిగా ప్రతిమనిషికీ ఎంతో మంచితనం
ఏ రంగులో పులుముకుంటేనే నీచగుణం
మారుతాడు అవసరాలకై ఊసరవెల్లిలాగా
అవకాశవాదౌతాడు గోడమీది పిల్లిలాగా

1.భూతద్దం తోటి వెదికినా గోచరించదు మానవత
ఆశిస్తే ఎంతటి వింత ఎదల్లో భారతీయత
మతం బురఖాలోనా అభిమతం గొంతునొక్కి
కులం బంధిఖానాలో వ్యక్తిత్వం తొక్కిపెట్టి
బ్రతుకీడ్చుతుంటారు మర మనుషులుగా
మనగలుగుతుంటారూ  జీవశ్చవాలుగా

2.శీలవర్తన ఫణం పెట్టి దిగజారుతారు పదవి కోసం
విలువలన్ని పక్కనెట్టి ఎగబాకుతారు పడతి కోసం
కూడబెడతారు సంపద ఏ దొంగ గడ్డో కఱచి
కీర్తి బడసేరు తేరగా అడ్డదారులనెన్నొ కడచి
కొండంత కోరుతారు గోరంత కృషితోనే
స్వర్గానికెగసేరు ఉట్టైనా కొట్టని శ్రమతోనే