Saturday, August 1, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మాయామాళవ గౌళ

పదునాల్గు భువనాల్లొ ప్రథమ పూజలు నీకే
ముక్కోటి దేవతల తొలి దైవమూ నీవె
గణనాథ కరుణించు మము ప్రేమ మీర
విఘ్నేశ దయజూడు సంకటములే తీర

1.గుంజీలు తీసేము తప్పులను మన్నించు
చెంపలేసుక వేడ దోషాలు పరిమార్చు
సాష్టాంగదండాలు ఇష్టంగ పెట్టేము
కష్టాలు నష్టాలు తొలగించి కాపాడు

2.ఏవేవొ రోగాలు ఎడతెగని వ్యాధులు
ఊపిరాడని తీరు ఉద్విగ్న బాధలు
నిమిషంలొ తీరేను నువు తలచుకుంటే
జాగేలనయ్యా నీవే శరణంటుంటే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:నట భైరవి

చెప్పనలవి కాదు నీ తిరుమల శోభ
నుడువతరముగాదు నీ లీలా ప్రభ
పట్టించుకోవేలా నను పద్మనాభా
పద్మావతి వల్లభా హే భక్త సులభా

1.మనసు పెట్టి నిన్ను మ్రొక్కలేదా
ఏనాడో అది నీ వశమాయెకదా
చిత్తమందు నేను నిన్నుంచలేదనా
ఎప్పుడో నీ పదముల అది చేరేనా
నాదికానిది నాలొ లేనిది ఏమిచ్చేను స్వామీ
పుష్కలమౌ అజ్ఞానముంది ఒడువగొట్ట వేమి

2.పూలతోని నిన్ను సేవించలేదనా
వాడని నా హృదయ కమలమది నీదే
దీపాలనైన వెలిగించలేదనా
కొడిగట్టిన మెదడున్నది నీకై వెలగనీవదే
నీవిచ్చిన ఫలములన్ని నీకే సమర్పయామి
విత్తొకటి చెట్టొకటి ఎలా కుదురుతుంది స్వామి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఇన్నేళ్ళు వచ్చినా  ఓనమాల పసినే
కవితలెన్ని రాసినా కవన పిపాసినే
కడలి ఒడ్డున కడుతున్నా
భావనల పిచ్చుకగూళ్ళు
ఎలా ఈది చేరెదనో సాహితి తీరం
మునకలేస్తూ నములుతు నీళ్ళు

1.ఏ కవితరాసినా ఎదలోన బెరుకేదో
ఇన్నాళ్ళ కృషిలోనూ ఎరుగనైతి ఎరుకేదో
ఆచితూచి అడుగేస్తున్నా ఇంకానే తడబడుతున్నా
మనసుబెట్టి రాస్తున్నా మదిచూరగొనకున్నా
ఎలా ఈది చేరెదనో సాహితి తీరం
ఎలా దించుకోగలనో నా గుండెభారం

2.వరిగడ్డి మంటలాగా మండి ఆరితే ఎలా
నింగిలో వెలిగే రవిలా నిరంతరం వెలుగీనాల
యుగాలెన్నిమారినా నా పాట మారుమ్రోగేలా
ఒక్కగీతమైనా జన్మకు చిరంజీవి కావాలా
ఎలా ఈది చేరెదనో సాహితి తీరం
ఎలా దించుకోగలనో నా గుండెభారం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కవికెపుడు ఆర్తి
పొందాలి స్ఫూర్తి
కవితనే వెలయిస్తే
అమితమైన సంతృప్తి

1.ప్రకృతే ప్రేరణ
ప్రశంస ఉద్దీపన
పెల్లుబికిన భావన
గీతరూప కల్పన

2.నిత్యదైవ ప్రార్థన
నిజ సమాజోద్ధరణ
ప్రేమా ఆరాధన
విరహమూ వేదన