Friday, April 10, 2020

https://youtu.be/BPW8t05I3rw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

ఎక్కడ కొలువుంచనూ ముక్కంటి దేవరా
ఏ తావున నిలుపనూ ఓ తిక్క శంకరా
తిరుగ మరిగినోడివి
ఒక పట్టే పట్టనోడివి
నిన్నెలా పట్టేయనూ ఎదకెలా కట్టేయనూ

1.గుండె నుండమనలేను
పాడుబడినదెప్పుడో
మనసున బస చేయమనను
మసిబారిందెన్నడో
నీళ్ళంటే నీకిష్టము గంగాధరా
నా కళ్ళలొ పుష్కలము మునిగితేలరా

2.ఇంటికింక పిలువలేను
ఇక్కట్లే ఆక్రమించుకొన్నాయి
ఒంటిలోన స్థలమీయ లేను
రోగాలే పీడించుతున్నాయి
అక్షరమే నీతత్వము సదాశివా
అక్షరముల బంధింతును నిను సదా శివా

OK
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నారు పోసిన నీవు-నీరు పోయగ లేవా
ఈత నెరుగని మమ్ము-ఏరు కడపగ లేవా
ఏడు కొండల సామి-బదులు పలుకవేమి
మము గన్న మాతండ్రి-దారి చూపవదేమి

1.ఎలుగెత్తి అరిచింది ఏనుగు ఆనాడు
ఆదర బాదరగా - ఆదుకొంటివిగాదా
దీనంగా వేడింది ద్రౌపది శరణంటూ
చీరలనందించి మానము కావగలేదా

2.నీకున్న పని ఏమి లోకాలేలే సామీ
మంచిని పెంచడము -చెడ్డను తుంచడమే
పడక వేసినావొ పడగ నీడలోన
కునుకే తీసినావో లిప్తపాటులోన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నువ్వొక్కడివే దిక్కు
నీపైనే నమ్మిక మాకు
జగమేలే పరమాత్మా
నువ్వొక్కడివే రక్ష మాకు

1.నరజాతి నశించడాన్ని
కాచే ప్రభుడవు నీవే
ఘోరక(లి)రోనా ఆగడాన్ని
ఆపే యోధుడవల్లా నీవే

2.ముక్తకంఠంతో మేము
నిన్నర్థిస్తూనే ఉన్నాము
గుణపాఠం నేర్చుకున్నాము
పద్ధతులను పాటిస్తాము

https://youtu.be/5TIZYliGxxw?si=wXeQOkD_LjOnhOtf

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:దేవగాంధారి

జననం మరణం సహజాతి సహజం
జన్మకారణం కానేల (అను)నిత్య రణం
జగమే మాయని ఎరిగినగాని
జనులేల జగడాల కడతేరనేల
ఈచక్ర భ్రమణము నాకేలనమ్మా జ్ఞాన సరస్వతి
జననీ జగజ్జననీ కోరితి మరిమరి నీశరణాగతి

1.సతతము మరువక  నెరనమ్మితి భారతీ
మనమున మననము దినమానము జేసితి
మనసేల వచ్చెనే ఇల నన్నొదలగ అనాధగ
అక్కునజేర్చవే చక్కని మాయమ్మ ననువేగ
ఈచక్ర భ్రమణము నాకేలనమ్మా జ్ఞాన సరస్వతి
జననీ జగజ్జననీ కోరితి మరిమరి నీ శరణాగతి

2.తుఛ్ఛమైన ఇఛ్ఛల తీర్చి మోసపుచ్చకే జగన్మామాత
నిత్యానందము నీ పదసన్నిధి దయసేయవె దాక్షాయణీ
ఆప్తుడగానా నీ కృపా ప్రాప్తికి లిప్తపాటైన వృధాపరచక
పరసౌఖ్యదాయిని నిజ శ్రేయకారిణి శృంగేరీ శారదాంబికా
ఈచక్ర భ్రమణము నాకేలనమ్మా జ్ఞాన సరస్వతి
జననీ జగజ్జననీ కోరితి మరిమరి నీ శరణాగతి

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎడారిలో తడారిన గొంతును నేను
తుది మెదలు తెగిపోయిన వంతెన నేను
ఊహల స్వర్గానికి నిచ్చెనపై నేను
ఉద్ధరించువారికై ఎదిరిచూస్తున్నాను

1.భగీరథుడనయ్యాను గాత్రగంగ కోసం
గాధేయుడనయ్యాను బ్రహ్మత్వం కోసం
నత్తగుల్ల నయ్యాను స్వాతిచినుకు కోసం
బీడునేల నయ్యాను వానధార కోసం

2. చకోరినయ్యాను కార్తీక వెన్నెల కోసం
చాతకపక్షినైతి మృగశిర కార్తి కోసం
మయూరమైనాను ముసిరే మబ్బుకోసం
శిశిరమై మిగిలాను రాని ఆమని కోసం