Wednesday, April 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టించుకుంటే వెంట పడుతున్నమంటరు

పట్టించుకోకుంటే లోన బెంగపడుతుంటరు

చిక్కొచ్చి పడ్డదే ఈ చక్కని చుక్కలతొ

చిక్కిపోక తప్పదు ఆ చిక్కనైన దృక్కులకు


1.సోగ కన్నులతో చేస్తుంటారు సైగలను

సొట్ట బుగ్గలతో వేయిస్తారు లొట్టలను

పంటినొక్కులతొ తెప్పిస్తారు తిప్పలను

మూతి విరుపులతొ కలిగిస్తారు ముప్పులను


2.పరేషాన్ చేస్తారు పదేపదే పైట సవరింపుతో

తమాషానే చూస్తారు చీర నాభి అమరింపుతో

మషాలా గుప్పిస్తారు గుంభనాల పలవరింపుతో

నిషా ఎక్కేలా చూపిస్తారు అందాలు చిలకరింపుతో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కవితకు కంటకం నీ ఎడబాటు

నా పాటకు సంకటం నిన్నుగనని లోటు

పదపదమున కదలలేక నా కలపు తడబాటు

ఏ క్షణమూ నను వదలక నీ తలపుల చొరబాటు

పరిచయమైతివేల గుండెను మండించ

ప్రేమను కురిపించవేల కలలను పండించ


1.కలిసిన మన అభిరుచులు కలిపెనులే మనసులు

కలవరమొందిగా ఊరటనిచ్చె నీ ప్రియ వచనములు

అలసిన తరుణాన వింజామరలాయే నీ చిరునగవులు

నీకదలిక నీమెదలిక నా కవనపు మేలి బిగువులు

చెలిమిని చేసితివే నా స్ఫూర్తిదాతగా

వేదన రేపితివే వరమీయని దేవతగా


2.నీవు మాత్రమెరుగవనా నా ఊపిరి నీవని

నా హృదయ చలన సూత్రమై మారితివీవని

కవిత సంగతేమొ గాని జీవితమిక దుర్భరము

సడలుతోంది నువు లేని బ్రతుకుఎడల నిబ్బరము

నీ చేతిలొ నా మనుగడ నిష్కమణ

చేయబోకె నెచ్చెలి నన్ను నిరాదరణ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిన్ను దీవించాలి నింగి దేవతలంతా

శతమానం భవతియని

ఆశీర్వదించాలి సకల మానవులంతా

చిరంజీవ చిరంజీవాయని

అందించాలి బంధుమిత్రులు శుభాకాంక్షలు

వర్ధిల్లాలి దినదినమూ ఆయురారోగ్యాలు

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  భరద్వాజ

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ


1.నరదృష్టి పడకుండా నరసింహుడు కాచనీ

పరఘాత సోకకుండా  పరమేశుడు సాకనీ

అండగా ఉండనీ కొండగట్టు ఆంజనేయుడు

నిను ముందుకు నడపనీ వర  సిద్ది వినాయకుడు

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ


2.మనస్థైర్య మీయనీ నీకు శ్రీ మణికంఠుడు

నవ్వులు చిగురింనీయనీ షిరిడి సాయినాథుడు

సిరులతొ తులతూగనీయనీ శ్రీ మహాలక్ష్మి

మేధకు బలమీయనీ మాతా బాసర సరస్వతి

పుట్టినరోజు శుభాకాంక్షలివిగో హరీష్  భరద్వాజ

పెద్దల దీవెనాక్షతలివిగో గొల్లపెల్లి వంశ తేజ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మూగయే నాకన్నా ఎంతో మేలు

నిను పాడని నాగొంతు కంతను పోలు

నీపదములు నేనొదలను అమ్మా శారదా

నీపదముల సాధనలో తరించనీ నను సదా


1.మృదు మార్ధవ గళమునకై  

మరిమరి నే జన్మిస్తా

మధుర గాత్ర మరయగనే

తక్షణమే మరణిస్తా

ప్రాధేయపడితినమ్మా నిన్ను పదేపదే

పలుచన చేసితివే పరితపించ నామదే


2.కారునలుపు నీయనుంటివి

కోయిల గళమును వరమిచ్చి

గాయాలే చేయనుంటివి

వేణువుగా నన్నే మలచి

ఉరితీగలు భరింతును వీణగ నను మార్చివే

ఊపిరి నర్పింతును గొంతులొ సుధ చేర్చవే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతటి వాడినని ననింతగ జేసినావు

అంతరంగమెరిగి నటుల ఆశలు దీర్చినావు

పొంతనలేదునా పనితనముకు ఫలితముకు

ఉన్నతంగ ఉంచినావు చింతనురానీక నా చెంతకు

శ్రీకాంత శ్రీహరి వేంకటాచలపతి

సతతము నే  నిలిపెద నిన్నే నా మతి


1.తండ్రివి నీవయి నను నడిపించినావు

తప్పులు చేసినపుడు దండించినావు

నాగుండెను నీదండలొ గుచ్చి మెడలొ వేసినాను

అండదండ నీవేయని దండిగ నిను నమ్మినాను

కొండెక్కి నినుజేరెద కొండలరాయా

కొండెక్కనీయకు నాభక్తి డంబునీయ


2.చిరునవ్వును నాటితే సిరుల పూలు పూసినావు

సాయమునందీయగ ఎందరికో బంధువుజేసినావు

సిద్దపరచు నా బుద్దిని సత్కర్మలు చేయునట్లు

పద్దులనెంచని మంచివిద్దెనీయి నీపదములు చేరునట్లు

ఇచ్చినదంతా నీదే స్వామి నీ ఇచ్ఛమేరకు

నచ్చినట్లు నను నడుపు చివరిశ్వాస వరకు