Saturday, September 12, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అవినీతే మీకు ఆనవాయితీ
ఆమ్యామ్యాకు బానిసాయె మీ మతి
చట్టాలెన్నిచేసినా చుట్టమాయే లంచం
లంచమే ఊపిరిగా మీదైన ప్రపంచం

1.జీతమే ఇస్తుంది సౌకర్యవంత జీవితం
గీతానికెందుకు కక్కుర్తి పడుతు బ్రతకడం
శాపనార్థాలతో బావుకున్న సంపద
పిల్లాపాపలకెపుడో కొనితెస్తుంది ఆపద

2.దర్జాను పోగొట్టునొకనాడు అక్రమార్జన
గౌరవాన్ని మంటగలుపు వక్ర సంపాదన
ఎదుటివారి కన్నీరే దాహమార్పుతుందా
శవాలపై పేలాలే మీ  కడుపు నింపుతాయా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:సరస్వతి

నా పదాలు సాగుతాయి నీ పదాలవైపుగా
నా భావాలు పరిణమిస్తాయి పదాలుగా
భారతి నీ కృతిగా  మార్చివేయగా
నా పయనం సాహితీ పథముగా
నా గమ్యం పరమ పదముగా

1.వివిధ వర్ణాలనే మేళవించుకొనగ
విరి పదములు ఏరేరి తెచ్చుకొనగ
కుసుమాలమాలగా గుచ్చుకొనగ
కవితలనలంకరించ మెచ్చుకొనగ
భారతి నీ కృతిగా  మార్చివేయగా

2.కలం పరసువేదై వస్తువు వసువుగా
సహానుభూతి ఉలితొ అపూర్వ శిల్పంగా
ఓషధీభూతమైన అలకనంద శైలిగా
నా కవనగంగతో జగతి పావమవగా
భారతి నీ కృతిగా  మార్చివేయగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

బొంకొక వంక ఎందుకో జనానికి
బొంకు వంక పోనేల నిజానికి
బొంకి బొంకి జంకడం అవసరమా
బొంకే వంకర బ్రతుకూ బ్రతుకన తరమా

1.ప్రాణ మాన హాని లేనివేళనైననూ
విత్తభంగ ఘటన ఎదురుకాకున్ననూ
మంచినీళ్ళ ప్రాయంగా బొంకెదరు రివాజుగా
బొంకు కొరకు మరిమరి బొంకెదరూ తేలికగా

2.ఆడిన మాటకై ఆలినిబిడ్డను అమ్మొద్దు సరే
ఇచ్చిన మాటకై ఏళ్ళుగా అడవులకెళ్ళొద్దు మరే
ఆచితూచిఅడుగేయక అందలాలకై అర్రులు సాచాలా
ఉన్నంతలొ సగపెట్టుక మనగలిగితె అది చాలా చాలా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:షణ్ముఖ ప్రియ

వలపు కొలుపుకు వేళాయె మోహనుడా
మాన్పర ఇంక నా బిగువుల రగడ
నా మేనే చిక్కని పాల మీగడ
ఉట్టిగట్టిపెట్టాను నీకై నందనందనుడా

1.కొట్టినపిండేనీకు కొల్లగొట్టడమూ
కుదరదింకా కాయమాగబెట్టడమూ
దోరదోరగా పచ్చిపచ్చిగా నచ్చునోలేదో
ఇచ్ఛదీర్చు నటుల పండగ జేయగ రాదో

2.చిలకనైతి పాలకుండలిక నీపాలే
ఒలకబోయకవి మిన్నగా వెన్నగావలె
పలకగ నీ పిల్లనగ్రోవి ఆడెద నెమలివలె
చిలకర జల్లులు గాలేసిన కరిమబ్బల్లే

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసధ్వని

అన్నపూర్ణమ్మ నీవే కొలువుండగ మా నేలను
అన్నమో రామచంద్రా ఆర్తనాదమేలను?
అన్నదాతే వెన్నెముకైన మా దేశాన
అన్నార్తుల ఆకలి చావులు ఇంకానా

1.పంచభక్ష్య పరమాన్నాలమాట పక్కనపెట్టు
పట్టెండంత అన్నాకైనా దీనులు నోచుకుంటె ఒట్టు
షడ్రుచుల మాటన్నది నీ పతి శంకరుడెరుగు
లవణమన్నమైనగాని మ్రింగగలుగ సొబగు

2.అమ్మతెలుసుకోలేదా కొడుకు కడుపువెలితి
ఆర్చగతీర్చగ నీవుండగా వేరెవరమ్మా మాకుగతి
అన్నంపరబ్రహ్మ స్వరూపమని నెరనమ్మితి
ఆహారారోరాగ్యముల నెల్లరకిమ్మని వేడితి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మాళవి(-శ్రీ)

నీ పదములు నమ్మితిని ఆపదమొక్కులవాడా
గుడ్డిగ నిను వేడితిని వడ్డి కాసుల వాడా
ఏవిధినను కాచెదవో ఏడుకొండలవాడా
వేరెవరూ దిక్కులేరు నాకిక వేంకటేశ్వరుడా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా

1.కోట్లాది భక్తుల మాదిరి కానా నేను
కోరికలే నెరవేర్చగ సత్వరముగాను
కొట్లాడైనా నీతో హక్కుగ సాధించగను
కొండలరాయా నిను తండ్రిగా ఎంచెదను
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా

2.అరిచిగీపెట్టాలా అంతర్యామీ నీ ముందు
ప్రతిదీ వివరించాల సర్వజ్ఞుడా ఏమందు
ఎప్పటికెయ్యది ఉచితమో ప్రసాదించగా వరము
భారము నీదైనప్పుడు స్వామి నాకేల కలవరము
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా