Monday, November 29, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విసిరేను సవాలు నీ వాలు చూపులు

చూపేను ప్రభావాలు గుచ్చినటుల తూపులు

ముగ్గులోకి లాగకు సిగ్గలొలకబోసి

ముసలి వగ్గుకైనా రేగుతుందిలే కసి

అందాలెన్నెన్నో నీ అమ్ముల పొదిలో

అలజడులను సృజించగా నా హృదిలో


1.ఆపిళ్ళుకాదులే అవి నీ ఊరించే బుగ్గలే

ముక్కైతే గుర్తుకు తెచ్చే సంపంగి మొగ్గనే

చలికాగు కుంపటే మోమునాన్చ నీ మెడవంపు

చెవితమ్మెల దంతక్షతమే కాంక్షకినుమడింపు

అద్భుతాలెన్నెన్నో నీ అమ్ముల పొదిలో

స్వర్గసౌఖ్యాలు సంధింప నా బొందిలో


2.పాలకడలిలో మంచుకొండలుండే తీరు

వైకుంఠం కైలాసం చేరువై కైవల్య తపనేతీరు

మదినెంత మధించాలో సుధాకలశ శోధనలో

మోహించే మోహినీ  నువు పంచే రసాస్వాదనలో

కళలూ మెళకువలెన్నో నీ అమ్ముల పొదిలో

యుగాలుగా వేధించే కలయికల యాదిలో

Sunday, November 28, 2021



మనసును దోచిన హారికవే

నను వదలనీ నిహారికవే

నాకోసం వేచిచూచే అభిసారికవే

ప్రణయగంధం చిలకరించే పవన వీచికవే


1.తేనె కనులు కురిసేను వెన్నెల సోనలు

కెమ్మోవి వర్షించేను సిరి మల్లెల వానలు

ఇంద్రజాలమున్నది నీ క్రీగంటి చూపుల్లో

చంద్రహాసమన్నది నాతో రమ్మని మునిమాపుల్లో


2.ముక్కుపోగు చూడగానే ముద్దుగొలిపింది

చెవి జూకా ఊగుతూనే హద్దునింక చెరిపింది

సొట్టబుగ్గ అంతలోనే లొట్టలే వేయించింది

హరివింటి వంటి ఒంటివిరుపే మదిని తట్టి లేపింది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శుభోదయం సవ్యంగా నిద్రలేచినందుకు

శుభోదయం నవ్యంగా పొద్దుగడిచేందుకు

శుభోదయం దివ్యంగా నవ్వగలుగుతున్నందుకు

శుభోదయం భవ్యంగా బ్రతుకగలుగుతున్నందుకు

శుభోదయం శుభోదయం శుభోదయం


1.నీకు నాకు వంతెనగా మారింది శుభోదయం

పలకరింపు వారధిగా పరిణమించె శుభోదయం

ఎదను ఎదతొ జతజేసే రాయబారి శుభోదయం

భావాలను చేరవేసే పావురాయి శుభోదయం

శుభోదయం శుభోదయం శుభోదయం


2.ఆశలను మోసుకొచ్చే విశ్వాసమె శుభోదయం

స్వప్నం సాకారమయ్యే విజయమే శుభోదయం

వృధాగ గడపని అమృత సమయం శుభోదయం

పరోపకారమె జీవితమైతే ప్రతి ఉదయం శుభోదయం

శుభోదయం శుభోదయం శుభోదయం



రాగం:మాయా మాళవగౌళ


అడవి గాచిన వెన్నెల్లా నీ సోయగాలు

శిశిరాన మోడునై వేచాను నే యుగాలు 

ఎప్పటికి ఒకటయ్యేనో మనలో సగాలు 

నా గొంతు వంతాయే వేదనా రాగాలు


1.అందరాని హరివిల్లువు నీవు

పొందలేని మృగతృష్ణవు నీవు

భ్రమలోన బ్రతికేను ఒక భ్రమరమై

నిశిలోన మిగిలాను నే తిమిరమై


2.చాతకానికి ఎపుడో తీరేను దాహం

చకోరికైనా దొరుకును జాబిలి స్నేహం

ఎన్నాళ్ళని సైచను ఎడతెగని నీ విరహం

జన్మలెన్ని ఎత్తినా తొలగదసలు నీపై మోహం

Saturday, November 27, 2021

 .


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాటాడరా సఖా మాటాడరా 

మనసువిప్పి మరులుగుప్పి

వగపాయే నీతో చెప్పి చెప్పి

ఎరుగవాయే నా గుండెనొప్పి


1.కబురంపితి మబ్బుల బతిమాలి

మతి తెలిపితి తెలిపెనా నీకు జాబిలి

ఒప్పెను  దయగని నీతో చెప్పగ చిరుగాలి

జాలిమాని మౌనివై  సేతువేల  నను గేలి


2.తొలి వలపు చిలిపి మధురిమలు

మరపురాని మన  తీపి కలయికలు

పాడినా వేడినా నీవాలకించవాయే

బిడియము నొదిలేసినా చిత్తగించవాయే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పసిడి కన్న ప్రియం నీ మాటాయెనే-టమాటాయెనే

గుండె కన్న ముఖ్యం నీ వలపాయెనే- అదుల్లిపాయెనే

నువు పలుకకుంటె మనసదోలా-

టమాట లేక ప్రతికూరా చేదులా

నువు కాదంటే నాకన్ను వలవల నా ఎద విలవిల

ఉల్లినికొన్నాకోసినా వలవల ఉల్లిలేని వంట పెంటలా


1.కూరలో కరివేపాకులా నన్ను నీవెంచకలా

సాంబారులో ములక్కాడలా భావించవేలా

ముద్దపప్పు మంచినెయ్యి కలయికలా మన జత

ఆవకాయ గోంగూరలై రుచించాలి మన ప్రేమకత


2.హైదరబాది ధంబిర్యానీ  మన ప్రయణం కానీ

బూరెలు పాయసమై మన ప్రాయం మధురమవనీ

సరసాల విరసాల ఉలవ రసం ఉల్లము జుర్రుకోనీ

కమ్మని గడ్డపెరుగుతో పసందైన విందారగించనీ


PIC:COURTESY: Balineni S V Varaprasad  garu



చిద్విలాసమే నీ విలాసము

చిదానందమే నీ చిన్మయ వేషము

భవపాప హరణ నమోస్తుతే వేంకట రమణ

భవబంధ మోచన మాంపాహి పావన చరణ


1.భవతారకమే నీ గోవింద నామము

భవరోగ హరమే నీ పాదతీర్థము

భవ తిమిరాంతకము నీ ధ్యానము

భవ సాగర తీరము నీ సన్నిధానము


2.ఆనంద నిలయం వేంకటాచలం

అద్వితీయమే నీ మందిర శిఖరం

అలౌకిక అనుభూతిదాయం నీ దర్శనం

అక్షరార్చనం మోక్షకరం అష్టాక్షరి మననం

Friday, November 26, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పసిడి పంజరాన నే రామచిలుకను

ఎలా ఎగిరొచ్చి నీపై ప్రేమ చిలుకను

ఎదగనీ ఎదలోనే అనురాగ'మొలకను

ప్రేమికా మన్నించు నిరంతరం నిను కోరే ఈ ప్రేమికను


1.నీ మురళి పలికించే మంజుల రవళిని

వినినంతనె   మేనుమరచి నర్తించే నెమలిని

ఏజన్మలోనో నీతోనే నడచిన నీ ఆలిని

ఈ బ్రతుకున కేవలం నీకు ప్రియురాలిని

ప్రేమికా అర్పించా  నీకే నా మానస సంచికని


2.నీ ముందు వాలుతాను కాస్త సమయం చిక్కితే

నీ దానిగ మారుతాను  అవకాశమంటూ దొరికితే 

నా బ్రతుకు అద్దాల సౌధం పగులుతుంది రాయి రువ్వితే

మనదైన మధర స్వప్నం కరుగుతుంది అలజడిని రేపితే

ప్రేమికా దాచుకుంటా మన కలయిల  జ్ఞాపికని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ సోగకన్నులు చూడగనే-నే నాగలేనే ఓ ఎలనాగ

నీ వాలుచూపుల బారిన చిక్కి-వేగలేనే వారిజలోచన

కన్నులకు కాటుక దిద్ది చూపులకు కైపును అద్ది

తూపులేవేస్తుంటే తమకాలనాపుట నాతరమా


1.కనులనేగని ముందుకింక కదలనని 

మొండికేసింది నా కలము రాయక భీష్మించుకుని

చూపుల వాడికి వేడికి తడబడి వేసింది పీటముడి

కవిత తా కొనసాగలేక రేపింది నాలో అలజడి


2.కాటుక జన్మ సార్థకమైంది నేటికి

 అల్చిప్పలంటి నీ కనులచేరి ముమ్మాటికి

బలిదానపు ప్రతిఫలంగా వర్తి చరితార్థమైంది

నీ నయనాల నలరించగా సోకు సంతరించుకొంది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొనబోతే కొఱవిరా అమ్మబోతే అడవిరా

చెప్పుకుంటే అయ్యొ సిగ్గురా చెప్పకుంటే బత్కు బుగ్గిరా

వినరా సోదర దిక్కుతోచని రైతు దీనగాథా

సంకనాకిపోయింది సర్కారువారి సాయం

నమ్మి పంటవేస్తేనో చెమ్మగిల్లె రైతు నయనం


1.స్వేఛ్ఛన్నదే లేక ఇఛ్ఛ గాలికొదిలాక

కిసాన్ల జిందగే అయ్ పాయే పరేషాను

వినరా సోదర దిగులుపడ్డ అన్నదాత గాథా

కొంటామంటూ చేసె ప్రభుత పంట  నిర్ణయం

దిగుబడి వచ్చాక చేతులెత్తగా భవితే అయోమయం


1.నాణ్యమైన విత్తనాలు వేళకందజేస్తె చాలు

కల్తీ లేని చౌకైన ఎరువులు కొన్నాదొరికితె మేలు

వినరా సోదర ఆత్మాభిమానపు సైరికుని గాథా

ఉచితంగ విద్యుత్తెందుకు పొద్దుపొద్దంతా ఇవ్వాలి పంటకు

నగదు బిచ్చాలే నగుబాటు రైతుకు=ఋణమైన దొరకాలి పెట్టుబళ్ళకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


*అతను*:పలకరింపులు కరువైతే

 అలకరింపులు మొదలౌతాయి

పులకరింపులకోసం

 ప్రేమ చిలకరింపులు కోరుతాయి

 

*ఆమె*:మనసు తెలుసుకోకుంటే

మగువ బయటపడుతుందా

వద్దు పొమ్మని అనలేదంటే

వలపంతా నీకై వంపినట్టేగా


*అతను*: ఔనా నచ్చానా మనసిచ్చానా

 నీగుండె లోకి సైతం నేసొచ్చానా


*ఆమె*: ఇంకా విడమరచి చెప్పాలా

ఆమాత్రం నన్నర్థం చేసుకోవేలా


1.*అతను*:ముక్కుసూటి వ్యవహారం

 గుంభనాలకు పురుషులు దూరం 

ప్రతిదానికి ఒకటే ఆత్రం అదేకదా సృష్టి విచిత్రం


*ఆమె*:మీటాలి ఏవో మీటలు

మొదలౌను లోలో కదలికలు

కిటుకు తెలుసుకుంటెనే మధురమౌ కలయికలు


2.*అతను*:మురిపాలు కోరడానికి

బ్రతుకంతా చింతగా ఆగాలా

సర్వాన్ని ధారపోసినా ఇంకా అనుమానాలా


*ఆమె*:ఊరింపులొ ఉడుకుతుంది

పరస్పరం మన ప్రణయభావన

విరహమెపుడు వేస్తుంది స్వర్గానికి నిచ్చెన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వాన కురిసి కురిసి అలసి వెలిసిన వేళ

కొబ్బరాకు కొసన నీటి చుక్క మెరిసిన లీల

తెల్లచీరలో నీ రూపమే తోచింది ఎందుకో నాకలా

నిను కౌగిట బంధించగ ఎపుడు తీరునో నా కల


1.నయగరా జలపాత నురగలు నీ నవ్వులా

ఖజురహో శిల్పాల వంపులు నీ తనువులా

కృష్ణవేణి నదిలోని తరగలు నీ కురులలా

సృష్టిలోని సృజనలకు నీవే మూలహేతువులా


2.కవ్వాలు అడవిలో కాసిన వెన్నెల నీలా

పేరిణీ నృత్యంలో భంగిమలే నీ నడకలా

గోదావరి ఇసుకతిన్నె నీ నడుము మడతలా

ప్రకృతిలోని పసిమిలన్ని నీ మేని మిసమిసలా

Wednesday, November 24, 2021



ఒక మెతుకుగ మారి బ్రతకాలి

తీర్చాలి అలమటించువారి ఆకలి

ఆపన్నహస్తమై కాస్తైనా సాయపడాలి

ఆసరాను అందించి భరోసా కలిగించాలి


1.వరదల్లో సర్వాన్నీ కోల్పోయిన వారికి

విపత్తుల్లో విలవిలలాడుతున్న ప్రతి ఊరికి

మానం వదిలి దీనంగా చేయిసాచు అర్తులకు

మానవతను మేలుకొలిపి శిథిలమైన మూర్తలకు


2.ఆధారమంటూ ఏదీలేని నిరాశ్రయులకు

అనాథలై అర్రులు సాచే నిస్సహాయులకు

విధివంచితులై వ్యాధిగ్రస్తులై పొగిలే రోగులకు

దృక్పథాన్ని మలచుకొని పొలుపడాలి పుడిగలకు

Tuesday, November 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక పాట రాయిస్తావా నాతో

ఒకసారి కనిపిస్తావా ఏ కాసింతో

సాధనేదొ చేసే అవసరమే లేదే

మంత్రమేదొ వేసే అక్కరనే రాదే

సాక్షాత్కరిస్తే చాలు లక్షణంగ పాట రాస్తా

ఇచ్చావా దర్శనాలు  గాంధర్వం జతజేస్తా


1.అలవోకగ వస్తుంటాయి నిను చూస్తె భావాలు

అలతి అలతి పదములు పదపడి కడతాయి వరుసలు

చమత్కారాలెన్నో చకిత పరుచగా తయారు

అలంకారాలు సైతం అలరులై అలరించి అలరారు

చిరునవ్వు రువ్వితె చాలు దివ్యమైన గీతి రాస్తా

మారు పలకరిస్తే చాలు  మన్నికైన కవితలొ నినుదాస్తా


2.  సుందర నీ దేహాకృతియే నా కృతికి ప్రేరణ

పొందికైన నీ పోడిమియే నా మతికి చోదన

తీరైన నీ కట్టూబొట్టూ నా కలానికి  కనికట్టు

నువు పాటై పరిణమించగా లిప్తకాలేమే పట్టు

సమయమించుక కేటాయిస్తే రసమయం నాగేయం

నీ చేయి నాకందిస్తే నాకాన్ని దింపెద ఇది ఖాయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వికృతంగ మారుతున్నాయి బర్త్ డే పార్టీలు

విషాదాంత మౌతున్నాయి జన్మదిన వేడుకలు

సరదాగా జరగాల్సినవి వినోదాన్ని కూర్చాల్సినవి

వెర్రిమొర్రివేషాలతో ప్రాణాంతకమౌతున్నాయి

హద్దుపద్దనేది లేక పెట్రేగుతున్నాయి


1.మరపురాని అనుభవంగ నిలవాల్సినవి

మధురమైన అనుభూతులనివ్వాల్సినవి

వింత వింత పోకడలతొ విసుగునొసగుతున్నాయి

లేటెస్ట్ ఫన్నంటూ లేకిగా తెగబడుతున్నాయి

బర్త్ డే బంప్స్ పేర బండబాదుడెందుకో

తినే కేకు మొకానికి పూసి నాకుడేమిటో


2.పుట్టిన రోజంటే ఒక పండగలా సాగాలి

అమ్మకు నాన్నకు మ్రొక్కి ఆశీస్సులు పొందాలి

కోవెలలో  దైవాన్ని తప్పక దర్శించుకోవాలి

ఇంటి ఆడపడుచులతో హారతి పట్టించుకోవాలి

బంధుమిత్రులందరికీ మిఠాయిలను పంచాలి

దుష్ట వెస్టర్న్ కల్చర్ని  డిస్ట్రాయ్ చేసేయాలి

 

https://youtu.be/Wfy_04KeHA8?si=7bZenETY5-Sw2HSX

రచన ,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమన్న ఉన్నదా శంకరా

నీకంటూ ఒక ఊరూ పేరూ

యాడన్న ఉన్నదా ఈశ్వరా

నీదంటూ చెప్పే ఇల్లూపట్టూ

శివయ్యా నీకు  నేనున్నా

నన్ను నమ్మయ్యా నీవాడిగ తోడున్నా


1. నీకు అవ్వ  అయ్యలు  లేనేలేరు 

మనువాడిన మాయమ్మతప్ప

బువ్వకైతె నీకు దిక్కేలేదు చెప్ప

అన్నపూర్ణమ్మ వండి పెడితే దప్ప

నన్ను కాదంటేనో నేనొప్ప నేనొప్ప

ఏమున్నదయ్యా నీకంటు గొప్ప


2.జగజ్జెట్టీలయ్య జడదారి నీ పుత్ర రత్నాలు

 గణపయ్య కుమరయ్య స్వామి అయ్యప్పలు

తలచినంత మాత్రాన  తీర్చేరు  ఈతిబాధలు

కొలచినంత ఆత్రాన తొలగించి వేస్తారు తిప్పలు

అందరు ఉన్నా అనాథలాగనే   మనతీరు

నాకైతే నీవు నీకంటూ నేనూ అనుకుంటే మన వెతలే తీరు

Sunday, November 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


ఒయాసిస్సు నేనౌతా నీ ఎడారి దారిలో

ఇంద్రధనుసు నౌతా  శ్వేతాంబర వీథిలో

ఒంటరినని ఏమాత్రం దిగులు చెందకూ

తోడెవరూ లేరని ఎపుడూ గుబులునందకు

చిరునవ్వుల వరమిస్తే నీ నేస్తమౌతా

మనసారా స్నేహిస్తే నే సమస్తమౌతా


1.నిత్యనూతనంగా గడపాలి ప్రతి క్షణము

ఏ దైనా స్వీకరించడం ఆనంద లక్షణము

రేపు అద్భుతం అన్నది మన ఊహకైనఅందాలి

స్వప్నమందైనా స్వర్గం మన చేతికందాలి


2.అందంమంటే ఏమిటో హృదయాన చూడాలి

అనుబంధం అన్నది పంచుతు చవిచూడాలి

కలకాదు కలయిక మనది అపురూప సంయోగం

జన్మలుగా వెంటాడే దైవ దత్త సంగమం

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్,రాఖీ


రాగం:కళ్యాణి


వందే సిద్ది వినాయకమ్

వందే అభీష్టదాయకమ్

వందే పార్వతి నందనమ్

వందే ఆనంద వర్ధనమ్


1.ప్రణవ రూపిణం ప్రథమపూజితమ్

ప్రమథ  గణపతిం ప్రణమామి ప్రసన్న వదనమ్

ప్రముఖమ్ సుముఖమ్ కరిముఖమ్

ప్రసిద్ధ ముంబైనగర ప్రభాదేవి స్థలసంస్థితమ్


2.పరమేశ్వర సుతం విఘ్నేశ్వర విఖ్యాతమ్

సతతం స్మరామి తవ నామ స్మరణమ్

 కామితార్థ సత్వర వరదం కాణిపాక విలసితమ్

పరమదయాళ బిరుదం నమామి లంబోదరమ్

 

https://youtu.be/Kg0Acfdzdz8?si=WyaK1nOdGP1G-v_Q

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండె కలచివేస్తుంది

మనసు నలిగి పోతుంది

మన నడుమన ఎవరైనా చేరితే

మన మధ్యన గాలైనా దూరితే

నువ్వున్నది కేవలం నాకోసమే

నాకుమాత్రమే కాకుంటే నీది మోసమే

పచ్చిమోసమే


1.నీకున్న బంధాలు ఎదుటి వారి స్వార్థాలు

నీకొరకే వారను మాటలు నిజ వ్యర్థాలు

ఎంతచేస్తేనేం నీకు జరిగివన్నీ అనర్థాలు 

మనతో మనమున్న క్షణాలే పరమార్థాలు

జీవిత పరమార్థాలు


2.యంత్రమల్లె రోజంతా చేసి అలసిపోతావు

సాయంత్రమైన ఆటవిడుపు కోరుకుంటావు

అచ్చటా ముచ్చటలే అటకెక్కిపోయాయి

ముద్దూముచ్చటలన్నీ మనకు మనవల్లేదక్కాయి

పరస్పరం చిక్కాయి


.



అతల వితల సుతలాది లోకాలెరుగనిది

నా తల వెతల గతుల కతల మరుగన్నది

నీవు మాత్రమే గ్రహించిన నా మది వేదన

నీవే అనుగ్రహించకుంటే నా బ్రతుకే నివేదన

జనార్ధనా మధుసూధన జగన్నాథ శ్రీనాథా

తిరుమలేశ భక్తపోశ కలికల్మష నాశ శ్రీశా


1.పాలకడలి ఉప్పెన పాపుల కడతేర్చ ముంచెనా

నీ పాదాల సురగంగ ఉప్పొంగ సప్తగిరులేతెంచెనా

నా కన్నీటి కన్న మిన్నకాదు వసుధలోని ఏ వరదా

నను కరుణించగ తాత్సారమేలనయ్యా కరివరదా

శరణిక మరి వేరెరెగను సిరివల్లభ పద్మనాభ

సరగున నీ వరుదెంచి నును గావర నిజ దేవర


2.అన్యమతాల ఆక్రమణలకు మిన్నకుందువెందుకు

అభిమతాలు మారసాగె హరీ నీవేమరినందుకు

నామనోభీష్టమెప్పటికీ నీ పదములు చేరేందుకు

సుస్పష్టమే నీ మహిమలు  అందించవు నాకెందుకు

శరణిక మరి వేరెరెగను సిరివల్లభ పద్మనాభ

సరగున నీ వరుదెంచి నును గావర నిజ దేవర

Wednesday, November 17, 2021

 కృతజ్ఞతాభివందనాలు మిత్రులకు,మైత్రి మాత్రులకు

ధన్యవాద సహస్రాలు హితులకు మహా  మహితులకు

అభినందన తెలిపినందుకు-శుభకామన కోరినందులకు

నా మనోభావాలు పంచుకున్నందుకు

నను ముందుకు నడుపుతున్నందుకు


1.ఒకింత  వంచించినా కించిత్ కించపరచినా

వినోదాన్ని పంచేందుకు నన్నేమార్చినా

సరదాను పెంచేందుకు  పావుగ మార్చినా

క్రీడా స్ఫూర్తిగా పరిగణ చేసాను

పోనీ లెమ్మని  తేలిక పడినాను

వందనాలు నా ఎడల మీ ఆసక్తులకు

పబ్బతులివె నా పట్ల మీ యుక్తులకు


2.అభిమానించినా  అభిశంసించినా

నా ఉన్నతి ఎల్లపుడు మీరు కాంక్షించినా

నా సోపతి ఎన్నడైన మీరాశించినా

అది మీ ప్రేమగానె భావించినాను

ఆత్మీయ స్నేహితులని ఎంచినాను

నమస్సులివే మీ విశాల మనస్సులకూ

దండాలు మీకివే మీఅండదండలకూ

మన్నించగ వేడుకోలు నా దోషాలకి

పదవీ విరమణ వీడ్కోలు టిజిబికి



ఎందరిలోనో ఒకడిగ నేను మనలేను నీ దరిలో

చిందరవందర చేయకు నా మది సుందరీ తొందరలో

పొందుకొరకు సందడాయే నా డెందములో

విందారగించనీ నను అందాలపందేరంలో


1.నా నడకలు నీతోనే ఏడడుగులు నీతోడే

నీచేతిని వెచ్చ వెచ్చగా పట్టుకుంటి ఆనాడే

నా మనసెన్నడో ప్రేమమీర  నిను మనువాడే

అలుమగలమైనాము భావాలు కలిసిననాడే


2.ఊహల్లో కాపురం మన స్వప్న సౌధం స్వర్గం

చూపుల ఆలింగనం పలుకులతొ చుంబనం

సంగమించు తరుణాలు కురిపించు హర్షవర్షం

కాలాన్ని కరిగించే ప్రణయ తంత్రం మనసొంతంP



శుభోదయం నా హృదయమా

నా జీవితం రసమయం చేయుమా

సుప్రభాతం ఓ నా ప్రియతమా

నా దేహం ప్రాణం నీవేలే సర్వస్వమా


1.తెల్లవారిపోదు నువు పలకరించకుండా

నిద్దురైతె రాదు నువ్వు శుభరాత్రి చెప్పకుండా

కలలెన్నో కంటుంటా నీకై మెలకువలోనూ

ఊహించుకుంటుంటా మన కలయికనూ

నన్నావహించినావే తీయనైన మైకంలా

శిరసావహించుతానే నీ మాటే హుకుంలా


2.కనీవినీ ఉండవు ఎపుడు నావంటి ప్రేమికుణ్ణి

నిను చూసిన మరునిమిషాన ఐపోయా పిచ్చోణి

గుండెలోను నిండావే మెదడునాక్రమించావే

నువ్వుకాదన్న రోజు మిగిలేది నాకిక చావే

పువ్వలాంటి నిన్ను నీవు అర్పించుకొంటావో

నవ్వులాటగా నాతో నువ్వు నడుచుకుంటావో





నాటు పాట నాటు పాట నాటు పాటనే ఇది

ఎద ఎదలో మది మదిలో సూటిగా నాటు పాటనే ఇది

ఘాటు ఘాటు మసాలాతో పోటెక్కించే హాటు పాట

స్వీటెస్టు స్వీటువంటి బెస్టిన్ బెస్టై ట్విస్ట్ చేసే నీటు పాట

విన్నవెంటనే  వెంటాడి మత్తుజల్లు సెంటువంటి పాట

మాటమాటలో హార్టును టచ్చేసే సెంటిమెంటు పాట

ఈ పాట మీ నోట పూటపూటా


ట్యూన్ సైనైనంతలోనే టంగ్ మీద హమ్మింగయ్యే పాట

సాంగ్ స్టార్టైనంతనె ఊపులూపి స్టెప్పులేయించేటి పాట

కిడ్స్ వెటరన్స్ సీనియర్ సిటిజెన్స్ లని డాన్స్ చేయించు పాట

యూత్ మొత్తానికే చిత్తం వెర్రెక్కించేలా కిక్కిచే ఝలక్కు పాట

మాస్ నుండి క్లాస్ దాక మనసు మనసు ఖుషీగా మార్చుపాట

మైకెల్ జాక్సన్నైనా ఫోక్ స్టైల్లొ చిందేయించే పసందైన పాట

ఈ పాట మీ నోట పూటపూటా


బీజియంతొ బీజుంగ్ నే ఖంగు తినిపించే భంగులాంటి పాట

బీటుబీటు  ఫీటులనే సర్కస్ ఫీట్ లు చేయించే  జోష్ పాట

ఫీలింగ్ తో ఫ్రాన్స్ ని రైమింగ్ రోమ్ ని రచ్చరచ్చ చేయుపాట

పబ్బుల్లో క్లబ్బుల్లో డే అండ్ నైట్ పెండ్లి బారాతుల్లో మ్రోగు పాట

యూస్ లో ఫ్రెష్షుగా యూకేలో క్రేజీగా  వరల్డంతా  వైరల్  అయ్యేపాట

కూచిపూడి కథాకళీ కొత్తగా మొలకెత్తి చిత్తుచిత్తు చిత్తడయ్యే పాట

ఈ పాట మీ నోట పూటపూటా

Monday, November 15, 2021



ఆపాదమస్తకం నీవద్భుత పుస్తకం

వదలక చదవాలీ నీలో ప్రతి అక్షరం

ఆ పాతమధురం నీ అమృత దేహం

తీర్చేను గతజన్మల నా తీరని  దాహం

చెలీ నువు తలపుకొస్తె ఎదకే  కలవరం

సఖీ నువు దయతలిస్తె ప్రతీకల వరం


1.శీర్షిక మొదలెడుదునా శిలలా మారుదునే

పదాల తలపెడుదునా ముద్దిడ మానుదునే

అపురూప వర్ణమయం పూలతంటి నీకాయం

పుటను తిప్పనీయదు నీ ప్రతి అధ్యాయం

ఆమనివే నీవు సౌదామినివే శారద యామినివే

మోహినివే నీవు సురభామినివే సరస వాహినివే


2.ఏ వాక్యమైనను రతి నిరతిని కలిగించు

నీ లౌక్య గరిమతో మతి ద్వ్యర్థిని తలపించు

నవ్యాతి నవ్య కావ్యమై నీమేనలరించు

ప్రబందాల ప్రమాణమై నీ తనువు ప్రభవించు

భావ మంజరివే బాణ మంజులవే బాను మంజూషవే

జాజి మాలికవే  జ్వలిత దీప కళికవే నాజీవన ఏలికవే

Sunday, November 14, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మౌనం ఎందులకూ- కాదని చెప్పలేక 

మౌనం మరి ఎందులకు వాస్తవమొప్పలేక

మౌనమింకెందులకూ సమాధానమెరుగక

మౌనం ఎందులకూ విధానమింక నచ్చక


1.మౌనేన కలహం నాస్తి- మౌనంతో మనశ్శాంతి

  భాషే చాలని భావానికి మౌనమే  వారధి

  మౌనం పరిణితినొందిన మనః స్థితి

  మౌనం అంతర్ముఖమైతే చేరగలుగు సదాగతి


2. బ్రతుకు పాడె చరమగీతి మౌనమే

మరణాంతర సంతాప సూచి మౌనమే

విశ్వాంతరాళమంతా వినిపించు మౌనమే

తాపసుల ఉపానంతా తలపించు మౌనమే


రాగం:మాయామాళవగౌళ


కడుపునొచ్చినోడే ఓమ బుక్కుతుంటడు

కష్టమొచ్చినోడే నిన్ను మొక్కుతుంటడు

అందుకా ఈశ్వరా నాకిన్ని ఈతిబాధలు

అవేకదా సదాశివా నీ పురాణ గాధలు

ముక్కంటే తలచుట్టూ తిప్పెందుకు చూపుడు

ముక్కంటి శరణంటి అక్కున ననుజేర్చుకొ ఇప్పుడు


1..కడుపు చీల్చుకున్నాడు నీకై నాడు గజాసురుడు

ప్రాణభయం పెట్టావు నీ పదాల పట్టగ బాలుడు

కన్ను కోరుకున్నావు తను పెకిలించీయగా తిన్నడు

తిండి పెట్టినాడు నీకై సుతుని వండి  శిరియాలుడు

ఇన్ని చేయు తెగువలేదు నిను తలుచుడు దప్ప

నన్ను కూడ బ్రోచినపుడె ఎరుకౌను నీ గొప్ప


2.శ్రావణమాసాన దండిగా అభిషేకాలు

కార్తీక మాసాన  విశేష మానస పూజలు

ప్రతి సోమవారం ప్రదోష కాల అర్చనలు

శివరాతిరి జాగారం ఉపవాస దీక్షలు

ఇన్నిచేసినా గాని నన్ను జాలిగొనవాయే

పరమదయాళువీవన్నది మరచితివాయే

 రచన,స్వ కల్పన&గానం :డా.రాఖీ


చుట్టూరా గట్టే కనరాని సంద్రం

లోతెంతో అంతే తెలియని అగాథం

అనుభవాన ఛిద్రమైన వాస్తవ జీవితం

కన్నీరు తుడిచే చేయి దొరికెనా ఒక అద్భుతం

ఆశావహ దృక్పథమంటే నాకు హాస్యాస్పదం

యథాతథ స్వీకారమే చేర్చును ఆనంద పథం


1.కాళ్ళక్రింద నేలనే కంపించిపోతుంటే

గగన గండమాయే నిలువడమైనా ఉన్నచోటున

పక్కా భవంతులే కుప్పకూలిపోతుంటే

మేడలెలా కట్టగలను వింతగా గాలిలోన

ఆశావహ దృక్పథమంటే నాకు హాస్యాస్పదం

యథాతథ స్వీకారమే చేర్చును ఆనంద పథం


2.పాంథునికి ముగిసేనా పయనమెన్నడైనా

చేరాల్సిన గమ్యమన్నది మిథ్యా దిక్చక్రమైతే

తడారినగొంతే తడిసేనా ఎడారిలో బాటసారికి

ఎదురైన ఎండమావినే మంచినీరని ఎంచితే

ఆశావహ దృక్పథమంటే నాకు హాస్యాస్పదం

యథాతథ స్వీకారమే చేర్చును ఆనంద పథం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఔను నిజం ఔను నిజం 

నా ఊహే నీవై వెలిసావన్నది నిజంగా నిజం

వలపు నిజం తలపు నిజం 

నా మనసే నీదన్నది నీవెరిగిన అసలు నిజం


1.కొలను నిజం కలువ నిజం 

జాబిల్లిని కన్నంత మురియుట నిజం విరియుట నిజం

మబ్బు నిజం గాలి నిజం

గాలి తనని తాకినంత కరుగుట నిజం కురియుట నిజం


2.వెదురు నిజం పెదవి నిజం

మోవి స్పర్శతో నే పిల్లన గ్రోవై మ్రోగుటే తీపినిజం

నా రాధవె నీవునిజం నీ బాధయు నిజం నిజం

మనసంగమ ప్రతిసమయం రసమయమగునన్నదే కదా నిజం


3.నీవు నిజం నేను నిజం

ఒకరిలో ఒకరున్నది మనమొకరికి ఒకరన్నది నిజం

నీ అందం నిజం మన బంధం నిజం

నీతో జీవిత బంధమే ఆనందమన్నది పరమ నిజం



ఎవరికైనా పెట్టావా ఇంతటి క్లిష్ట పరీక్షలు

ఎవరికైనా వేసావా నాకన్న నికృష్ట శిక్షలు

చదవలేదు నేనే ఇతిహాసాన

వినలేదు ఏ పురాణ మందున

వేంకటేశ సంకటనాశా ఏమిటీ తమాషా

నా వెతలను భరించడం హమేషా ఆషామాషా


1.వేలు నొప్పి తగ్గేలోగా కాలు మెలిక పెడతావు

మెడపట్టు వదిలినంతనే నడుం పని పడతావు

కన్నుమూసి తెరిచేలోగా వెన్నపూస నలిపేస్తావు

నువు తలపుకు రాకుండా తలనొప్పులెడుతావు

వేంకటేశ సంకటనాశా ఏమిటీ తమాషా

నా వెతలను భరించడం హమేషా ఆషామాషా


2.మందులేని రోగాలన్ని నాకై కనిపెడతావు

ఊపిరాగి పోయేలాగా కఫం గొంతునింపుతావు

వాతం మితిమీరజేసి సతమత మొనరించుతావు

బ్రతుకు కన్న చావేమరి మేలనిపించుతావు

వేంకటేశ సంకటనాశా ఏమిటీ తమాషా

నా వెతలను భరించడం హమేషా ఆషామాషా

Friday, November 12, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గీటురాయి కెరుక పసిడి చొక్కదనమెంతో

కలహంసకే ఎరుక పాల చిక్కదనమెంతో

గులకరాయి కెరుక గరగ గట్టిదనమెంతో

నాకు మాత్రమే ఎరుక చెలీ మిక్కిలైన నీ చక్కదనమెంతో


1.కొలవడానికేదో కొలమానముంటుంది

తూచడానికైతేనో తూనికరాళ్ళుంటాయి

విశ్వవ్యాప్తి ఎంతటిదో కాలానికే ఎరుక

శ్రీకృష్ణుని బరువెంతో తులసిదళానికే ఎరుక

నీ చక్కదనం ఎక్కడుందొ నాకు మాత్రమే ఎరుక  


2.చీరకున్న మన్నికను చేతపట్టి చూడాలి

తేనెలోని నాణ్యతను నిప్పు పెట్టి చూడాలి

కాపురం నిబద్ధత సర్దుబాటు కెరుక

ప్రేమలోని స్వచ్ఛత త్యాగానికే ఎరుక

నీ చక్కదనం ఎక్కడుందొ నాకు మాత్రమే ఎరుక

Thursday, November 11, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పరిచయాన పరిమళాలు-వెదజల్లినావె

స్నేహితాన సౌరభాలు-విరజిమ్మినావె

మైత్రీ మధురిమలే-కురిపించినావె

నా లోన ఊహలొన్నొ మొలిపించినావే


 1.మధురోహల రోదసిలో-విహరింపజేసావె

అనుభూతుల మరుమల్లెలు-వికసింపజేసావె

మంత్రమేదొ వేసి నన్ను –మాయజేసినావె

నన్ను నేనె మఱచులాగ-మైకంలో ముంచావే


2.నువ్విచ్చిన వరమెకటే –తీయనైన ఈ విరహం ....

నామదికిక పని ఒకటె-నిను తలచుట అహరహం...

నువ్వు కలవని కాలం-వర్షమాయె

నిను చూడక నా కనుల-వర్షమాయె

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాగనంపు వేళసైతం 

కనులనుండి పారెడిది నదే అలనాడు సాంతం

వల్లకాటిలో చితి కాలితేనేం 

తడి జాడ మదిలోనూ కనిపించని నేటి వైనం

స్పందనే మరచిన గుండె స్థాణువై పోయింది

బ్రతకడానికే అన్నట్టు మొక్కుడిగ ఆడుతోంది


1.కడుపు చించుక కన్నారు తల్లులంత ఆనాడు

కడుపు చించడం మినహా కనుట కుదరదీనాడు

చనుబాలు అమృతమై బొజ్జనింపె శిశువులకు

బలవర్ధక పోషక పాలే గతి నేటి పసికూనలకు

గోరుముద్ద చందమామ బువ్వలో వినోదమే

అమ్మ బుక్క నాన్నబుక్క దొంగబుక్క ఆనందమే


2.బాగోగుల పరామర్శలు  ప్రేమచిలకరింపులు

పరిచయం లేకున్నా చిరునవ్వుల పలకరింపులు

అవసరాలు గుర్తెరిగీ అందజేయు చిరుసాయాలు

ఎవరికి వారైన ఈ తరుణాన వెదకినా మృగ్యాలు

ఒలకదు కన్నీటి చుక్క నవ్వులైతె అతికిన లెక్క

మానవత్వం మనుషుల్లో తానో ఎడారి మొక్క

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టరాని సంతోషం పసిడి గాజులకు

పట్టుకుంది అదృష్టం మట్టి గాజులకు

ఏ పుణ్య ఫలమో చెలీ  నీ పాణిగ్రహణం

ధన్యమైంది గాజు జీవనం నీచేయి చేరిన మరుక్షణం


1.మంజుల స్వని చేస్తాయి నీకదలికల కచ్ఛేరికి

అందంగా మ్రోగుతాయి పదపడు నీ చిందులాటకు

మంత్రముగ్ధులౌతాయి నీ మృదువైన కరస్పర్శకు

తెగనొచ్చుకుంటాయి పడకన సడిచేసినందుకు


2.మెరుపులరువు గొంటాయి నీమేని చక్కదనానికి

ఆవురావురంటాయి పోటీగా నీ చేతినెక్కడానికి

ఏ రంగు కోకోయని బెంగపడతాయి తమరంగు వంతుకై

గుండెప్పుడు పగులునోయని గుబులే తమ బ్రతుకై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆచితూచి అందుకే మాటలాడ మన్నది

మాట ఇచ్చి ఎప్పుడూ తప్పకూడదన్నది

చేయగలిగితేనే చెప్పాలి 

ఒకసారి చెప్పామా చేసితీరాలి

మనమీద మనకైన లేకపోతె అదుపు

మన మాట గడ్డిపోచకూ తూగదు

పోతేమాత్రమేమి ప్రాణం

తప్పకూడదెప్పటికీ వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం


1. వీథులపాలైనారు ఇచ్చిన మాటకొరకు

ఆలినైన అమ్మినారు ఆలాపమన్నందుకు

రాజ్యాన్నీ వీడారు ఆడిన నుడుగు కొరకు

పోరినారు తనవారని ఎరగినా చివరకు

పోతేమాత్రమేమి ప్రాణం

తప్పకూడదెప్పటికీ వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం


2.వెసులుబాటు చూసుకొనే ఇవ్వాలి మాట

మన మాట నమ్మితే ఎదుటివారికి అరట

తప్పిన మాటకై పదే పదే వాయిదాలొకటా

సాకులనే  సాకుతూంటె ఎంతకూ ఒడవదట

పోతేమాత్రమేమి ప్రాణం

తప్పకూడదెప్పటికీ వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం

Tuesday, November 9, 2021

 

అంగడిలో దొరకని దొకటే -అమ్మ పంచే అనురాగం

సాధించగ అసాధ్యమే-గడిచిన కాలం పోయిన ప్రాణం

విలువ తెలుసుకోవాలి  కాస్తైనా ఇక  నేస్తం

ఒడిసి పట్టుకోవాలి  చేయిజారనీక జీవితం

 

1. కనుమరుగై పోవడమే క్షణం లక్షణం

అనూహ్యమే మనిషికెప్పుడూ మరణ కారణం

చక్కదిద్దుకోవాలి వెలిగినంతలోనే ఆశాదీపం

మసకబారి పోకముందే మనదైన ప్రతిరూపం

 

2 అక్షరమై నిలవాలి  కవితల్లో ప్రతీ అక్షరం

హృదయాలను గెలవాలి  కదిలించగ  పదం పదం

పాటనై... నడిచేందుకు బాటనై...  చేరుస్తా  గమ్యం  

మాటనై పసిడి పలుకుల మూటనై పంచేస్తాఆనందం

Sunday, November 7, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:రేవతి


ఈశ్వరా పరమేశ్వరా విశ్వేశ్వరా

నశ్వరమౌ ఈ దేహము పై నాకెందుల కింతటి వ్యామోహం

రామేశ్వరా రాజేశ్వరా భీమేశ్వరా

విశ్వసిస్తినిను  త్రికరణశుద్ధిగ భస్మము చేయర నాలో అహం


1.కాలకాల హే కామారి కామేశ్వరా

నలిపేయర హర బలీయమై నను కబళించే కామాన్ని

ఫాలనేత్ర ప్రభు గరళకంఠ గంగాధరా

కట్టడి సేయర అట్టుడుకుతు నా విజ్ఞత చెరిచే క్రోధాన్ని


2.మహాదేవ నమో భోలాశంకర మహేశ్వరా

నాదీ అన్నది  ఏదీలేదిట వదిలించర నా లోభాన్ని

జటాఝూట జంగమదేవర చoద్రమౌళీశ్వరా

భవబంధాలలొ బంధీనైతిని సడలించర నా మోహాన్ని


3.సాంబ సదాశివ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరా

విర్రవీగి నేగర్వించగ అణిచివేయరా నామదిలోని మదాన్ని

వైద్యనాథ జయ మల్లికార్జున త్రయంబకేశ్వరా

పరుల ఉన్నతిని భరించలేను హరించు నాలో మత్సరాన్ని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండెలోన గుచ్చుకుంది గులాబి ముల్లు

మనసు నిండిపోయేలా కురిసింది ప్రేమ జల్లు

లేలేత పెదాలే రెక్కలుగా నవ్వు పువ్వు విచ్చుకుంది

అప్సరసల అందాలను అంగాంగం పుణికి పుచ్చుకుంది


1.వసంత వన్నెలనే వలపన్నింది

కోయిల తానై పాటే వలపనింది

మనసునే మల్లెమాలగా మార్చి నా ఎద నలరించింది

పలుకుల తేనెలనే వడ్డించి పసందైన విందుల నిచ్చింది


2.పంజరాన్ని వదిలేసి ముంగిట వాలింది

మంజుల గానాలతో రంజిలజేసింది

తాను నేను చెరిసగమౌ రంగుల చిత్రమొకటి గీసింది

మా ఇరువురి కాపురపు లోకానికి తలుపు మూసింది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలల వాకిట వేచి ఉంటా

తరలిరా నా నేస్తమా

మరులనెన్నో దాచి ఉంచా

జాగు సేయకు ప్రియతమా


1.తెరిపి లేని ఒరిపిడాయెను

పగలు మదిలో సెగలు రేపెను

వగరు వయసున వగపు లేల

వలపు పిలుపుకు బదులు పలుక


2.తలుపు తట్టెను తలపులన్ని

గెలుచుకొమ్మని ముద్దుగుమ్మని

ఊహలే ఊరించ సంగమ హాయిని

ఉల్లమేల చెలియకై  ఊపిరే ఇమ్మని

 రచన్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:అమృత వర్షిణి


నను నడిపించరా నా అడుగులు తడబడె

చేయందించరా బ్రతుకు కడలి సుడిబడె

ఎందరిలోనో నేనొకడినని సందియమెంతో ఉండెడిది

అందరిలోను నినుగనినంత నా డెందమానంద మొందినది


1. కలివిడిగా నీవిచ్చినవే స్వామి నా కష్టసుఖాలు

ఇబ్బడిముబ్బడిగా ఎందుకు అందులొ కష్టం పాలు

నా లోపాలు పాపాలు కోపాలే కారణాలై ఈ శాపాలు

తాళజాలనీ పరితాపాలు తీర్చరా ప్రభూ భవతాపాలు


2.అన్నీ ప్రసాదించావు స్వామీ నాకు ఆఒక్కటి దప్ప

పరమదయాళా ప్రభో ఇదియేనా  నీదైన గొప్ప

దయచేయి దయచేసి నాకినైన  మనశ్శాంతి

నా హృదయాన దయచేసి వరమీయి నివృత్తి

Saturday, November 6, 2021


కన్ను చెదిరె సన్నజాజి తీగవంటి నీ ఒంటి వంపులే చూసి

రెప్పలార్చనైతినే  మెరుపుతీగ తెన్ను మేను జిలుగుకే భ్రమిసి

జీడితీగలోని తీపి నీ పెదాల మాధురి

సంతూర్ తీగలమ్రోగు తీపి నీ పలుకుల మాదిరి


1.కాంచనగంగా ప్రవాహంగ నీ తనువు తోచే

నీ అంగాంగం మోహనంగ సారంగమై పూచే

మదన కదనరంగాన శృంగార శృంగజమై వేచే

కందవాహనమే ఆవాహనమై నా మనమే నర్తించే


2.మితిమీరే రతి పదాల నిఘంటువులు  నీ బిగువులు

మతి కోరే సమ్మతి తెలిపెడి చాటువులు నీ నగవులు

ప్రతినాయకి గతిసాగెడి కవ్వింపుల నీపయ్యెద పొతవులు

శ్రీమతిగా నిను గొనమని తథాస్తు దేవతల హితవులు


చెప్పారు ఎందరో-స్నేహితానికి నిర్వచనం 

అనుభూతి చెందారు మైత్రిలోని మాధుర్యం

సృష్టిలోనే తీయనిది స్నేహమన్నది

చెలిమిని మించి ఏమున్నది పెన్నిధి


1.నీకు తెలియని కోణాలెన్నో నీలో లోలో

నీవు చూడని పార్శ్వాలెన్నో నీ వ్యక్తిత్వంలో

ఏ అద్దమైనా-చూపలేని నీ ప్రతిరూపం-చూపే దీపం సౌరభం

దిద్దుబాటుకోసం-నీలోని ప్రతి లోపం-తెలిపే కటకం నేస్తము


2. పరకాయ ప్రవేశం చేస్తుంది నీలోకి నేర్పుగా

పరసువేదితో పసిడిని చేస్తుంది నిన్ను ఓర్పుగా

నీ నుండి విడివడిన-ఆ రెండో నీవే-నీ మిత్రుడు చిత్రంగా

శ్రేయస్సును కూర్చే-ఏకైక లక్ష్యమే-మైత్రికి తగు సూత్రంగా

Friday, November 5, 2021



అక్షరాలతోనే సచ్చిదానందాలు

పదాల పోహణింపులో ఆహ్లాదాలు

భావాలు కవితలైతే తనివి దీరి మోదాలు

కల్పనాలోకంలోనే పండుగలు పర్వదినాలు


1.విడివడుతూ ఉన్నాయి ఇలలోని ముడులన్నీ

సడలుతూ ఉన్నాయీ సంసార బంధాలన్నీ

కర్తవ్య పాలన కొరకే కాలాన్ని కరిగించేది

విద్యుక్త ధర్మానికే కట్టుబడుతు జీవించేది


2.మురిసి పోవడానికీ గతమించుక మిగిలుంది

సేద దీరడానికి గీతమక్కున జేర్చుకుంది

సాంత్వననే పొందడానికి మిథ్యాజగత్తొకటుంది

చేదు నిజం మరిపించేలా గమ్మత్తులొ ముంచుతుంది


https://youtu.be/hqe2Rb3k0WA?si=vRlF_Xw4SDvGxByI


కనకమహాలక్ష్మి కాలి అందియల లయ

జ్ఞానభారతి కఛ్ఛపి వీణియ శ్రుతి కలయ

ఆదిపరాశక్తి ఖడ్గ కాంతులు వెలయ

కావాలి మీ గృహమే కోటి కాంతుల నిలయ

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


1.ప్రియమగు వాక్కులే  రసనలు పలికేలా

హితమగు యోచనలే  మేధలు చిలికేలా

జనరంజకమౌ సాహితీ సంగీతములొలికేలా

వర్షించాలి శ్రీవాణి కరుణాదృక్కులే నిలువెల్లా

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


2.నరదృష్టి దోషాలనన్నటినీ పరిమార్చగా

శత్రు పీడ నీడ కూడ సమూలంగ తీర్చగా

ఆయురారోగ్యాలే సర్వదా సమకూర్చగా

రక్షించాలి భగవతి నిత్య శోకాల నోకార్చగా

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


3.పరుల నడుగ చేయిసాచు గతి ద్రోయక

ఋణము కోరు తరుణమెపుడు రానీయక

అవసరాలు తీరునటుల సొమ్ముల నొసగగ

అనుగ్రహించాలి సిరియే సంతృప్తి మీరగ

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


https://youtu.be/mUD-pKKx5us?si=NqEA22i3ftJZaoOa

కనుల ప్రమిదల కరుణ దీప్తుల వెలిగించు

హృదయమందున మమత చమురును నించు

మనిషి మనిషిలొ బాంధవ్య కాంతులను కాంచు

పరిసరాలలొ పరికించి చూచి పరవశించు

అనుదినం ఈ లోకమంతా దీపావళి భాసించు


1.బోసినవ్వుల పాపలు

విరజిమ్ము రుచులు మతాబులు

పసిడి పసి పలుకులందు

చిటచిటల పేలు టపాసులు

పరిసరాలలొ పరికించి చూచి పరవశించు

అనుదినం ఈ లోకమంతా దీపావళి భాసించు


2.అర్ధాంగి శ్రమని గుర్తిస్తె చాలు

ఆలి ఎద ఎగసేను చిచ్చుబుడ్డీగా

పత్నికందిస్తేనో కాసిన్ని ప్రశంసలు

ఇల్లాలి కన్నుల్లో పూసేను వెన్నెల తీగలు

పరిసరాలలొ పరికించి చూచి పరవశించు

అనుదినం ఈ లోకమంతా దీపావళి భాసించు



ప్రతి నిత్యం దీపావళే నా ఇంట నువ్వుంటే

బ్రతుకంతా సౌదామినే నాకంట కొలువుంటే

నీ కన్నులు మతాబులు నీ నవ్వులు తారాజువ్వలు

మిసమిసలతొ తిరుగాడితే వెలుగు వెన్నెల తీగలు

రుసరుసగా మాటలు రువ్వితె అవ్వే  సీమటపాసులు


1.దుబారా నరకుని దునుమాడె సత్యభామవే

గుట్టుగ ఖర్చులు నెట్టుకవచ్చే విజయలక్ష్మి వే

నీ నడకలు భూచక్రాలు నీ ఆజ్ఞలు లక్ష్మీ బాంబులు

చెరగని నవ్వుల సంపదలొసగే ధనలక్ష్మి నీవే

పండుగ సందడి నిండుగ నిలిపే వైభవలక్ష్మివే


2.ఆనందాల అతిథుల కళ్ళే వెలిగే దివ్వెలు

తృప్తితొ  అభ్యాగతులిచ్చే దీవెనలే  రవ్వలు

మువ్వల సవ్వడి వాద్యాలు గాజుల సడి మంత్రాలు

తీరగు రుచులతొ కమ్మని విందిడు ధాన్యలక్ష్మివే

గుండెలొ దండిగ కొలువై ఉండెడి నా గృహలక్ష్మివే

తెల్లారిందా లేచామా-పళ్ళుతోముకున్నామా

చాయో కాఫో తాగామా-ఇడ్లీ ఉప్మా తిన్నామా

ఆఫీసుకి బయలెళ్ళామా-సాయంత్రం తిరిగొచ్చామా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా


1బ్రేక్ ఫాస్ట్ మెనూ ఏమిటో-లంచ్ లోకి స్పెషల్ ఏమిటో

నోరూరించుకొంటూ చాట్ చేసుకుందామా

జోకుల్ని నంజుకుంటూ కబురులాడుకుందామా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా


2.గ్యాసిప్పులనే సిప్ చేస్తూ-గోల్డెన్ డ్రీమ్స్ నెమరువేస్తూ

ఊకదంపుడు సోది పంచుకుందామా

ఉత్తుత్తి అనుబంధాలే పెంచుకుందామా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా


3.సామాజిక మాధ్యమం వేదికగా-ఆచరణకు సాధ్యంకాని ప్రణాళికగా

ఉల్లిపొరలు విప్పడమే  ప్రహేళికగా-ఊహల్లో కాపురముందాం సరదాగా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా

Wednesday, November 3, 2021



దీపాలు వెలిగించినావు సాయి

పేలికలే వత్తులయి నీరే చమురయి

గాలిలో శయనించినావు బహువిచిత్రమై

చెక్కబల్ల తల్పమయి ఇటుకనీకు తలగడయి

నీ మహిమలనన్యము నీ లీలలు కడురమ్యము

సచ్ఛరిత్ర పారాయణ పుణ్యము బ్రతుకు ధన్యము


1.పిల్లలతో గోళీల ఆటలాడినావు

బల్లి భాషలోని మర్మమెరిగినావు

పిండి జల్లి మశూచిని పారద్రోలినావు

లెండీ వనములో పూమొక్కలు పెంచినావు

నీ మహిమలనన్యము నీ లీలలు కడురమ్యము

సచ్ఛరిత్ర పారాయణ పుణ్యము బ్రతుకు ధన్యము


2.మహల్సాపతితో మైత్రిని సలిపినావు

హేమాద్పంతుతో స్నేహము చేసినావు

తాత్యాని నీవు మేనఅల్లుడని ఎంచినావు

ధునిమంటలొ చేయుంచి పసిబిడ్డని  కాచినావు

నీ మహిమలనన్యము నీ లీలలు కడురమ్యము

సచ్ఛరిత్ర పారాయణ పుణ్యము బ్రతుకు ధన్యము


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ప్రణతులు నీకివే ప్రభో ధన్వంతరి

వినతులు గైకొనుమా సాక్షాత్తు శ్రీహరి

వైద్యశాస్త్రానికే ఆది మూల పురుషుడవు

వైద్యలోకమంతా కొలిచే భగవంతుడవు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు


1.పాలకడలి చిలికినపుడు పుట్టినావు

విష్ణుమూర్తి అంశతోటి జన్మించినావు

గౌతమినది తీరాన స్థిరముగా వెలసినావు

చింతలూరు గ్రామాన కొలువుదీరి యున్నావు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు


2.సుందర మూర్తిగా ప్రత్యక్షమౌతావు

చతుర్భుజాకారునిగా దర్శనమిస్తావు

శంఖ చక్రాలను  హస్తాల  ధరించినావు

అమృతకలశము జలగను పూనినావు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు


3.ఆయుర్వేదమును ఆవిష్కరించినావు

శుశ్రుత చరకాదులకు గురుదేవుని వైనావు

వేపా పసుపుల నొసగిన దివ్య వైద్య శ్రేష్టుడవు

మొండి వ్యాధులన్నింటిని  తొలగించే ఘనుడవు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు

 

ప్రత్యూష తొలి కిరణం 

నునువెచ్చగ నను తాకిన వైనం

పూరెక్కల పైని  తుషారం

నా కన్నుల మెరిసే ప్రతిబింబం

నిన్ను తలపిస్తుంటే మేను రోమాంచితం

నువు గుర్తుకొస్తుంటే హాయి వర్ణనాతీతం


1.పడమటి సంధ్యారాగం పలకరింపులు

గోదావరి ఇసుక తిన్నెల పరామర్శలు

మబ్బుచాటు జాబిలి దోబూచులాటలు

తళుకు తారలు మేలిముసుగుతొ వలపు పిలుపులు

నిన్ను తలపిస్తుంటే మేను రోమాంచితం

నువు గుర్తుకొస్తుంటే హాయి వర్ణనాతీతం


2.కోనేటి మెట్ల సాక్షిగా మధురానుభూతులు

నీటి అలలు నీ పదాల ముద్దాడిన స్మృతులు

ధ్వజస్తంభపు జేగంటల మంజుల శ్రుతులు

గోపురాన పావురాల జత పాడే ప్రేమకృతులు

నిన్ను తలపిస్తుంటే మేను రోమాంచితం

నువు గుర్తుకొస్తుంటే హాయి వర్ణనాతీతం