Saturday, December 10, 2022

 https://youtu.be/OYLlnCdeakM?si=GVgohm_lcuyNClgz


15) గోదాదేవి పదిహేనవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: కీరవాణి


చిలుక పలుకుల ఓ చినదానా

గోవిందుని మది దాచినదానా

వేకువాయేను మేలుకొనవే వేగిరాన


కులుకులొలికే నెరజాణలారా

కాకిగోలగ సణిగే రణగొణలేలా

అందరినొదిలి ముందుగ నన్నే లేపాలా


1.మాటలతొ మాయచేసే మానినీ

సరిచూసుకో లేచివచ్చి మన లెక్కనీ

సజావుగా సాగనీవే సిరి వ్రతమునీ

ఎరుగవే రోజూ నీదే జాప్యమనీ


2.మత్తగజమునే వధించిన విధి

కంసుని సంహరించిన సంగతి

లీలామానుష వేషధారి మురారికీర్తి

కీర్తించెదము నోరారా తీరగ మన ఆర్తి

 

https://youtu.be/_hc_kw6Y2to?si=iy0mir6H-WYoXeEj

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కవన ఉషఃసుందరి,

నా మనోజ్ఞ రసమంజరి

నా జీవన బృందా విహారి

తరించనీ నిను నిత్యం ఆరాధించి

ఈ జన్మకు నాకదే రాసాడు విరించి


1.ముట్టుకుంటె మాసిపోవు అందము

పట్టుకుంటె నవనీతపు చందము

నీవున్న తావు పారిజాత గంధము

నీకన్న లేదు మరో పరమానందము


2.సంతూరు సంగతులే నీనవ్వులో

కోయిల గళమాధురి నీ పలుకులో

తటిల్లతలు తళుకులీను నీమేనులో

రాజహంస స్ఫురించును నీ నడకలో


https://youtu.be/qm2pfd_iuzo?si=ktFQqnW8knJWFr2i

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తిరువేంకటగిరి శ్రీహరి

కొలిచితి నీ పదముల చేరి

విసిగితి ప్రతిదీ నిను కోరి కోరి

నేనే నీకొసగెద ప్రాణాలైదీసారి

గోవిందా గోవిందా గోవిందా

పరమదయాళా పాహి ముకుందా


1.స్వామీ నీ నామార్థాలు నిరర్థకాలు

నమ్మితిమా  అవి అజాగళస్తనాలు

పేరుకు మాత్రం వేనకు వేలు అనంతాలు

పేరుకపోయెను తీరని మా విన్నపాలు

గోవిందా గోవిందా గోవిందా

పరమదయాళా పాహి ముకుందా


2.సర్వాంతర్యామివి నా ఎదలో లేమివి

నేననాథను ఐనా జగన్నాథుడ వైతివి

ఘటనాఘటన సమర్థుడివి నే పార్థుడిని

ఆపద మొక్కుల వాడివి నీ శరణార్థుడిని

గోవిందా గోవిందా గోవిందా

పరమదయాళా పాహి ముకుందా

 https://youtu.be/e7KRUZPHbKY?si=-ej45F8KEcPRtkqN


14) గోదాదేవి పదునాలుగవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: హరి కాంభోజి 


కన్యకామణీ యదుకుల కలికి

అదమరిచి నిదురోయావా కలలో కులికి

అలసిపోయినావా కవ్వంతో పెరుగు చిలికి

మునగదీసుకున్నావా మము లేపెదవని బీరాలు పలికి

తయారుకావమ్మా మన సిరి వ్రతమును ఆచరించగా

శంఖచక్రధారి బృందా విహారి శౌరి లీలలాలపించగా


1)బుకాయింపు నీకేల తెల్లవారలేదని

శికాయతే ఊరంతా నంగనాచివేనని

కొలనులో కలువలే ముడుచుకొనే వేకువనేగని

ఎర్రని తామరలే విరియమురిసె రవియేతెంచునని

తయారుకావమ్మా మన సిరివ్రతమును ఆచరించగా

శంఖచక్రధారి బృందా విహారి శౌరి లీలలాలపించగా


2.గుడి పూజారుల అలజడులే వినలేదా

భక్తులు కదలాడే అలికిడి చెవిబడలేదా

నవ్వుకొందురే నలుగురు నీమొండి తనమునకు

గుసగుసలాడుదురే ప్రియసఖీ నీ పెంకె తనమునకు

తయారుకావమ్మా మన సిరి వ్రతమును ఆచరించగా

శంఖచక్రధారి బృందా విహారి శౌరి లీలలాలపించగా

 

https://youtu.be/cVEtXJB8iZo

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కలమొలికే ప్రతిగీతం

నీ తలపుల కది సంకేతం

నాదంటూ ఉండిన జీవితం

ఎపుడో చేసా నీకు అంకితం


1.విరిసిన విరులాయే 

ఉదయాన మరులన్నీ

రేయిన తారకలాయే

నే కన్న స్వప్వాలన్నీ


2.అలరించెను పరిమళమేదో 

అది నీ కురులదే  చెలీ

పులకించెను నా ఒళ్ళంతా

స్పృశించింది నిను తాకిన గాలి

 

https://youtu.be/3o5toGOulyo?si=EKCkBVq3SKdBtuej

13) గోదాదేవి పదమూడవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: కర్ణరంజని


జాగృతి జాగృతి జాగృతి 

జాగిక సేయకు ఓ గోప పడతి

పద్మవదనా హరిణ నేత్రీ

ముగిసెను సుదీర్ఘ రాత్రి

జలకములాడే ఈ సమయాన

దుప్పటి ముసుగేయ తగునా

తిరుప్పావై నోమునోచగ-వేళమించునే

కపట నిదురమాని మా-మాట మన్నించవే


1.రావణుడి ప్రాణహారి రామ గుణ గాన లహరి

బకరాక్షస సంహారి యదునందన ముకుంద శౌరి

కీర్తనలే పాడుకొంటూ కన్యకలు చేరారు వ్రతస్థలి

పానుపింక వదిలేసి వేగిరముగ రావేమే నెచ్చెలి

తిరుప్పావై నోమునోచగ-వేళమించునే

కపట నిదురమాని మా-మాట మన్నించవే


2.గురుగ్రహం కనుమరుగై వేగుచుక్క పొడచింది

గూళ్ళు వదిలి పక్షిసమూహం నింగివంక ఎగిరింది

మిత్రుడి తొలికిరణం తూరుపింట మొలిచింది

శుభోదయం అంటూ నీకై గుడిగంటా మ్రోగింది

తిరుప్పావై నోమునోచగ-వేళమించునే

కపట నిదురమాని మా-మాట మన్నించవే

https://youtu.be/PSZ7WvdEPKM


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కురులు నవ్వుతాయి-గాలికి చెలరేగి

కనులు నవ్వుతాయి- క్రీగంట కవ్వించి

పాపిటి సిందూరమూ గర్వంగా నవ్వుతుంది

పెదాలు నవ్వితే వింతేముంది 

నవ్వు మత్తుజల్లితే కొత్తేముంది

మహిమ గలదిలే చెలీ అందమైన నీ నవ్వు

మహిలోన సాటిరాదు నీ నవ్వుకు ఏపువ్వు


1.చెవి జూకాలు నవ్వుతాయి-చెక్కిళ్ళు నవ్వుతాయి

కెంపుల చెంపల సొట్టలు సైతం నవ్వుతాయి

నాసికా నవ్వుతుంది-చుబుకమూ నవ్వుతుంది

చుబుకానికున్న చిన్ననొక్కూ నవ్వుతుంది

నవ్వుకు నిలువెత్తు రూపం నీది

నవ్వుకు సరియైన విలాసం నీమది


2.నవ్వుల పాలైతాయి -లోకంలో ఎన్నోనవ్వులు

జీవమే లేక పూస్తాయి కొన్ని ప్లాస్టిక్ పువ్వులు

జలతారు ముసుగులవుతాయి-మోముకు కొన్ని నవ్వులు

ఎద వేదన పదిలంగా కప్పిపుచ్చుతూ నవ్వులు

మహితమైన మణిరత్నం అపురూపపు నీ నవ్వు

మహిళలంత కుళ్ళుకునేలా కాంతులెన్నొ రువ్వు