Thursday, December 9, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:యమన్


అదేం గమ్మత్తో -పలుకులు పంచదార చిలుకలవుతూ

అదేం మత్తో-చూపులు పారిజాత చినుకులవుతూ

తలపులు వలపు తలుపులు తడితే

తలగడలు తమకాల పడగలవుతూ…

మనసులు పరస్పరం రమిస్తే

యుగాలే ఫఠేల్మనే బుడగలవుతూ…


1.ఎదిరిచూపులు- ఎదను చీల్చే తూపులవుతూ

రేపులు మాపులు- మునిమాపునకు సైతం రిపులవుతూ

ప్రాపుకోసం దాపుకోసం ప్రాయపుతాపపు తహతహలవుతూ

మనసాకలికి ప్రతీకలవుతూ కనే ప్రతీకల హాయిగొలుపు నెమలీకలవుతూ

అంతలోనే కడువింతగా తనువంతా చింతరేపు మరీచికలవుతూ


2. గంధర్వఅందాలు- మేను మేనంతా మకరందాలే

ప్రవరుణ్ణీ మునివర్యుణ్ణీ రెచ్చగొట్టే ఇందుకళిక గంధాలే

వదనారవిందము పాదారవిందము నయనారవిందాలే

డెందమరవిందచందమై మరుల భ్రమరాలకు రసవిందులే

మధురోహలే ప్రణయ వీణియ మీటగా జీవితమే పసందులే

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:మధ్యమావతి


నాకు కీర్తి నిను కీర్తన చేసినప్పుడే

నాకు తృప్తి నువ్వు  ప్రాప్తించినప్పుడే

నా ఆర్తి నీ పదములు చేరుటొక్కటే

తల్లీ భారతీనను చప్పున బ్రోవుమిప్పుడే


1.తుచ్ఛమైన ఇచ్ఛల ఎడ నా మది మళ్ళించకు

స్వఛ్ఛమైన యోచనలను సమకూర్చవె నా మేధకు

అచ్చెరమొందెడి అచ్చరమవనీ తిరముగ నను జగతీ

మచ్చరమే లేకుండగ మెచ్చనీ సహకవులిల సరస్వతీ


2.రామకృష్ణ కవిని నాడు కనికరించినావటా

రామకృష్ణ పరమహంస ఎదన నిలిచినావటా

రామకృష్ణ నామముతో వరలుచుంటి నీ ఎదుటా

పరమతృష్ణ నిను చేరుట మన్నించవె వాణీ నా మాటా