Wednesday, August 4, 2021


నమ్మేకద రాసాను సాయి నీపై వందల పాటలు

మమ్మేలెడి వాడవనే బాబా చేసాము నీకు పూజలు

వమ్ముచేయగా నీ మహిమలాయె ఒట్టి గాలి మాటలు

సొమ్మసిల్లెగా నా మది నీ బోధలవగ నీటిమూటలు

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం


1.సాయిరాం అంటూ సదా నీ నామమె పలుకుదునే

ఆర్తితో దీనంగా నిను చిత్రపటములందు కాంచెదనే

వెతికి వెతికిమరీ నీవున్న మందిరముకు చనుదునే

గురువారము ఉపవసించి నీ ధ్యానమె చేయుదునే

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం


2.మామూలు నరుడవో సద్గురుడవో అది మాకేల

మాయల మరాఠీవొ గారడి వాడివో చూపునీ లీల

ఆశలెన్నొ ఉన్నవి నీఎడ అవి  అడియాసలు కావాలా?

నెరవేరక మా కోర్కెలు కడదాకా నేనిలాగే చావాలా

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం


నీ సిగలో నను మందారమవనీ

నీ నుదుట సిందూరమై మనని 

నీ పాదాల పాంజేబునై పరవశించనీ

నీ ఎదపై తాళినై ఎపుడూ నివసించనీ

ప్రియా ప్రియతమా నా జీవన మధురిమ

సదా నినదించే నా హృదయ గీతమా


1.నీ పెదవుల ఎల్లపుడు అల్లలాడె పేరు నాదిగా

నీ తలపుల  అల్లరిగా కదలాడుతు నే మనాదిగా

నీ బడలిక పోకార్చే నినుసేదదీర్చే అమృత ఔషదిగా

నిను లాలించి పాలించి మురిపించగ నే అమ్మ ఒడిగా

ప్రియా ప్రియతమా నా జీవన మధురిమ

సదా నినదించే నా హృదయ గీతమా


2.అడగకనే వసతుల నమరించే నీ వరునిగా

పరకాంతల కలనైనా కాంచబోని ప్రవరునిగా

పడకటింట పరిమళాలు ప్రసరించే మరునిగా

నా తనువున నువు సగమను అపర శంకరునిగా

ప్రియా ప్రియతమా నా జీవన మధురిమ

సదా నినదించే నా హృదయ గీతమా


నల్లంచు తెల్లచీర నవమోహిని

కురులలో నెలకొంది కృష్ణయామిని

పలుక పరవశింపజేయు రసరాగిణి

గాలం వేసావు నా గుండెకు భామామణి


1.క్రీగంటి చూపులో ఊరించే కొంటెదనం

మందార పెదాలలో ఉడికించే జాణతనం

చెప్పకనే చెబుతోంది ప్రేమకు సుస్వాగతం

తెలుపుతోంది ప్రణయానికి ప్రియమారగ ఆహ్వానం


2.మత్తెక్కి పోతోంది మల్లెమాలతో సాంతం

కైపు నింక పెంచుతోంది బిగుతైన అంగాంగం

ఊహలు తూనీగలై సెగలు రేపు సంగమం

కౌగిలిలో కడతేరగ స్వర్గమే పాదాక్రాంతం



మది మెచ్చింది నీ పెదవిమీది పుట్టుమచ్చ

ఎద వేగం హెచ్చింది ఎలా ఎరుకపరుచను నా ఇచ్ఛ

అందానికి విలాసం నీవే నీవేనని మనసిచ్చా

కనికరించగా ప్రేయసీ నా మీద నీకెందుకంతటి కచ్చ


1.కన్నులతో చేసావు నను కట్టడి కనికట్టుగా

పెదవులలో దాచావు పుట్టతేనె పట్టు గుట్టుగా

నవ్వుల్లో కురిసావు ఆణిముత్యాలనే గుట్టగా

నడుమొంపులొ దించావు హరివిల్లును బెట్టుగా


2.జాబిలి జాలిగొంది చంద్రిక నీవుగా విరియగా

మల్లిక తల్లడిల్లె  నెత్తావి తననువీడి నిన్ను చేరగా

గులాబీ గునిసింది సుకుమారం నీ మేనిగ మారగా

సెలయేరు తడబడె నీ నడకలు అనుసరించగా