Thursday, March 10, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతగా పొగిడేను ఇంతీ నీ ఇంతటి  అందాన్ని

దేనితో పోల్చేను సాటిలేని ఈ చినదాన్ని

కొలమానమే లేదు కొలువగ సొగసులని

ఉపమానమే లేదు ఎంచగ  బెళుకులకి

తేరుకోరెవరు  చక్కదనపు నీ నిక్కులకు

ఊరుకోరెవరు  మిక్కిలియగు నీటెక్కులకు


1.జాబిలిదే  సౌందర్యము నినుగాంచ నంతవరకు

వెన్నెలతో ఆహ్లాదము నీ హాస చంద్రిక గనుదాకా

అల్పమైన వాటిని కవులు ప్రామాణిక మనుకొన్నారు

కూపస్థ మండూకాలై భ్రమలు బడసియున్నారు

ఒక్కసారి నిను చూస్తే బిక్కమొకం వేస్తారు

సుందరాంగి నీవేనంటూ అంగలార్చుతారు


2.హిమనగాలు ఎత్తేలే నిన్నమొన్న నిన్ను చూడక

సెలయేళ్ళదే మెలికల నడక నీ హొయలు తిలకించక

మెరుపు తీగ కాంతిహీనమే అంచనాకు నువు అందాక

మంచిగంధమెంతటి వాసన నీ తనువు తావితెలిసాక

ప్రతీకేది నీకై దొరకదు ఎవరెంతగ శోధించినా

సింగారొకతి పుట్టుకరాదు పాలకడలి మధించినా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పలుకే పంచదార పాకం

కులుకే బైర్లుగమ్ము మైకం

ఏంటే నీ సోకుమాడ

ఏడనే కనగ నీజాడ

ఒక్కసారి పలుకవే ఒప్పులకుప్పా

ఒప్పుకొని తీరుతా నీ వంపుల గొప్ప


1.వద్దనబోకే నీవద్దకు వస్తుంటే

కాదనబోకే అదనుకై చూస్తుంటే

మంచిమంచివాళ్ళే మన్ను బుక్కిపోతారు

స్థాయి మరచి నీ చూపుకె బుక్కైపోతారు

మామూలు వాణ్ణి నాకు మతిపోయిందే

మైమరిచి పోయేంతగా శ్రుతి మించిందే


2.చూసీ చూడగనే పడిపోవుట మరి ఖాయం

పరిసరాలు సైతం ఔతాయి మటుమాయం

నీ వెంటబడక పోవడమే నిజమైన అన్యాయం

ముదుసలికీ వస్తుంది నినుగని యవ్వన ప్రాయం

ఫిదానై పోయా నీ పిచ్చెక్కేఅందానికి

సదా నీవే విలాసము పరమానందానికి


PIC courtesy: Sri. AAGACHARYA sir

https://youtu.be/XJexuwGMsCs?si=QEWpYvNPMFWJVJhj


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాఎదయే తిరుమల-మా మతియే తిరుపతి

కనులు మూసుకుంటె చాలు కనిపింతువు శ్రీపతి

ధ్యాస నిలిపినంత వరకు అపారమౌ మనశ్శాంతి

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా


1.అంధకారమే  జగతి సూర్య చంద్రులున్నా

ఏకాకులమే చుట్టూరా బంధుమిత్రులున్నా

నిత్య దరిద్రులమే తరగని సిరి సంపదలున్నా

ఒక్కగానొక్కనీవు ఆత్మజ్యోతివై వెలుగకున్నా

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా


2.తీర్థాల మునిగితేమి మనసున మకిలుంటే

క్షేత్రాలు తిరిగితేమి చిత్తశుద్ది లేకుంటే

పూజాపునస్కార ఫలమేమి భూతదయే లేకుంటే

తపములేక వరమిత్తువు మాలో మానవత్వముంటే

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా

 

https://youtu.be/VqHZdNmrKWE?si=y0hpAbO9jAutfXP_

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరయవె సరగున  జ్ఞాన సరస్వతి

కురియవె వరముల  విద్యా భారతి

సంగీత మందీయి శ్రీ శారదామణి

నా రాత సరిజేయి నమసము శ్రీవాణి


1.పఠనము కొఱవడె దినచర్యలో

సాధన అడుగంటె ఎద రాపిడిలో

అక్షరమొకటే లక్ష్యముగా మారే

జీవిత చక్రపు కక్ష్యయే తారాడే


2.ఐహికపరమౌ మోహము మెండాయే

పరమార్థ చింతన చింతల పాలాయే

నుతుల ముఖస్తుతుల మతి బానిసాయే

సద్గతి నడుపగ సాయ మపసారమాయే