Wednesday, February 24, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అ:)పువ్వుల్లో లవ్వులు-

ఆ:)లవ్ వల్లే నవ్వులు

అ:)నవ్వుతు సాగే తొవ్వలు-

ఆ:)తొవ్వల వెంటే గువ్వలు

అ:)గువ్వలై ఎగిరే ఆశలు-

ఆ:)మువ్వలై మ్రోగే గుండెలు


అ:)1.సత్యాలుగ తోచే స్వప్నాలు

స్వప్నాల్లో నిత్య స్వర్గాలు

స్వర్గాల్లో సర్వ సుఖాలు

సుఖాలే మనకు వరాలు


ఆ:)వికసించే వసంత పుష్పాలు

పుష్పాల్లో మరంద మధురాలు

మధురాలై కోయిల గీతాలు

గీతాల్లో ప్రణయ సరాగాలు


ఆ.)2.హర్షాలై కురిసే వర్షాలు

వర్షంలో మెరిసే కిరణాలు

కిరణాల్లో సప్తవర్ణాలు

సప్తవర్ణాల్లో మన జీవితాలు


అ:)రేయంతా పరిచిన వెన్నెలలు

వెన్నెల్లే రేపె విరహాలు

విరహాలే వింత దాహాలు

దాహాలు తీరేలా దేహైక్యాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పడరాని పాట్లుపడే  పతులారా

భార్యాబాధిత సోదరతతులారా

కక్కలేని మ్రింగలేని పశుపతిలారా

పరస్పర హితులారా మహితులారా

భూమాతను మించింది మన సహనం

అంపశయ్య మీదే మన జీవనం-సహజీవనం


భర్తలుగా మన బతుకులు నిత్యం చితుకులు

సంసారపు అతుకులు,ఏవో నాల్గు మొతుకులు 

గతకలేక గతుకులు పెనిమిటులెంత మెతకలు


1.తాము పడేదే కష్టమనీ-ఇంటి చాకిరే కఠినమనీ

లేనిపోని నలతలనే సాకుగా అడుగడుగున మేకుగా

ఎడాపెడా రొదచేసే డబ్బా రేకుగా ముల్లునే విరుచు ఆకుగా

మాటిమాటికీ మాటమాటకీ చిరాకుగా

మనమన్నదేదైనా మతి పెట్టక పరాకుగా


2.నానా  గడ్డేదో కరిచైనా- మనం కాళ్ళావేళ్ళా పడైనా

ఆర్జించిన సొమ్మంతా దోపిడిచేసి-సంపాదన సాంతమే'దో'చేసీ

ఎంతైనా చాలదని ఎద రాపిడి చేసి-ఏమన్నా అనబోతే ఎదురుదాడి చేసి

పండచోటిస్తే మనబతుకే దండుగైనట్టు 

ఉండ తావిస్తే మన ప్రాణ గండమైనట్టు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దుఃఖమే నిండింది నా గుండెనిండా

కన్నీరే పారుతోంది నర నరాలగుండా

నెత్తురుకిక తావేది హృదయాన కొలువుండ

ఎప్పుడోఆవిరైంది ఆశలు అడియాసలై మండ


1.నలువైపులా వెతల మహా సాగరం

కనుచూపు మేరలోనా కనరాదే తీరం

పుండుమీది పుట్రలా మ్రింగే తిమింగలాలు

శిథిలమైన ఈ పడవను ముంచెత్తే కెరటాలు


2.అల్లంత దూరంలో అగుపించెను భూఖండం

ఊరట చెందునంత తెలిసెను అది హిమగండం

ఇంతలో లాగివేసె  నా నావను సుడిగుండం

కొస ఊపిరి మిగిలిన కుడి అయ్యింది ఖండఖండం

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండె గాయపరచకు మాటల శూలంతో

మదిని వేటువేయకు భీకర కరవాలంతో

చేయనైతె మలాంపూయి దెబ్బతిన్న తరుణంలో

చేయిపట్టి దారిచూపు  గాడితప్పు క్షణంలో


1.గుళకలు చేదైతే చక్కెర పూతపూయి

కోత తప్పదన్నప్పుడు మత్తుమందునీయి

మృదువుగాను చెప్పడం గొప్ప చాకచక్యము

నొప్పింపక తానొవ్వక అన్నదె కద లౌక్యము


2.శాశ్వత ప్రయోజనం ఆశించదెపుడు జనం

తబ్బిబ్బుగ పొగడుతూ పట్టాలి నీరాజనం

దోషాలే మరి లక్ష్యంగా వేయకు ఏ అంజనం

ఆత్మీయ బంధాలను చేయబోకు నిమజ్జనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కదలదేం నా చెలీ 

జాలి మాని రాతిరి

ఎదిరిచూపులాయెనే

ఇలా చకోరి మాదిరి


1.తెచ్చివ్వ రాదే

ఎత్తుకెళ్ళిన నా ఎదే

అంతులేని ప్రేమనంతా

కనులమోసుకు రావే


2. కురిసింది వాన జల్లు

తడిపింది  నా వొళ్ళు

నిలువెల్లా వికృత చలి

నువువినా ఎలా  మదిలోగిలి