Thursday, August 19, 2021

 

https://youtu.be/LCvtbFpw4ps

*శ్రావణమాస  వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రావమ్మా వరలక్ష్మీ  క్షీరాబ్ధి ప్రియ పుత్రి

అందెలు ఘల్లనగా అడుగిడవే అంబుజనేత్రి

కరుణజూడవమ్మా వరమహాలక్ష్మి

శుక్రవార శుభవేళ అమ్మా సౌభాగ్యలక్ష్మి


1.నీ చలవనే తల్లీ సిరిసంపదలన్నీ

నీ వరములే జనని హోదాలు పదవులన్నీ

ఇచ్చినట్టె ఇచ్చినవన్నీ దూరం చేయకమ్మా

ఉన్నంతలొ పరమానందం ప్రసాదించవమ్మా


2.కలతలు రాకుండా సాగనీయి కాపురం

వెతలేవి కలగకుండా గడపనీ జీవితం

నలతలు సలపకుండా కాపాడు ఆరోగ్యం

నగవులు నిండేలా చెలఁగనీ మా గృహం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


స్వాగతం ప్రియతమా కలల లోకంలోకి

హాయిగా తీయగా మాయగా అచట మన ఉనికి

దైహిక బాధలు మరచి ఐహిక కాంక్షలు విడిచి

ఆత్మలుగ ఏకమవగా సంగమిద్దాం కాలాలు కడచి


1.తెల్లారిలేస్తూనే చుట్టు ముట్టు జంజాటాలు

మెడకుబడిన పామల్లే బరువులు బాధ్యతలు

తప్పించుకోలేని మూణ్ణాళ్ళ భవబంధాలు

వెంటాడి వేధించే దుర్భరమౌ దుర్గంధాలు


2.ఆకలీ దప్పులమాట లేనె లేదు ఇచ్చోట

ఆంక్షలు కట్టుబాట్లకు అవకాశం ఉండదిట

నాకు నీవు మహరాణి నీకు నేను రారాజు

నిదురించిన సమయమంతా స్వర్గమే మనకేరోజు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీకోసం నేనున్నాను

నీకోసమే నేనున్నాను

ఊపిరిలో ఊపిరిగా

ఎద చేసే సవ్వడిగా

కన్నీరు తుడిచే ఆప్తుడిగా

నీ నలతను తీర్చే వైద్యుడిగా


1.కబురంపే పనిలేదు ఏకాకితోనో

వ్యధ చెందే పనిలేదు ఏకాకివీవనో

అడగాల్సిన పనిలేదు బాధ్యతే నాదంటాను

తలుచుకోనక్కఱలేదు తెలుసుకొంటాను

నిరంధిగా నీవుండు భారమంత నాకొదిలేసి

నిశ్చింతగా నువు బజ్జుండు భరోసా నాపైనవేసి 


2.ఏపనిలో నేనున్నా ఆలోచన నీగురించే

ఎంత నిదురలోనైనా మదినిన్నే కలవరించే

నీకెలా ఉందోగాని నీవు నేను వేరేకాదు

నీవులేక ఏనిమిషం బ్రతుకు నాకు చిరుచేదు

దేహమైతె నీదైనా ప్రాణంలో ప్రాణంనేను

నేనంటు లేనేలేను నీవుగా ఎపుడో మారాను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందంగా తగిలించుకుంటారు

ముందో వెనకో సాయీ నీ పేరు

నీవంటే ఎంతటి భక్తి తమకుందో

లోకానికంతటికీ ఆసక్తితో తెలిపేరు

ఒకసారి నిన్ను నమ్మితే నీకుదాసులౌతారు

సాయీ సాయీ బాబా బాబా అని స్మరించుతారు


1.ఏ పని చేసినా బాబా దయ అంటుంటారు

ఫలితం ఏదైనా సాయి దయే అని వాపోతారు

లీనమైపోతారు బాబా నీ మైకంలో 

మునిగితేలుతుంటారు సాయీ నీ లోకంలో

ఒకసారి నిన్ను నమ్మితే నీకుదాసులౌతారు

సాయీ సాయీ బాబా బాబా అని స్మరించుతారు


2.సాయిరాం అంటూ మాటలు మొదలెడతారు

చీటికి మాటికి బాబా అంటూ కదలాడుతారు

ఎప్పుడు చూడు నీదే ధ్యాసగ ధ్యానం చేస్తారు

తప్పనిసరిగా పలికే దైవం నీవని భావిస్తారు

ఒకసారి నిన్ను నమ్మితే నీకుదాసులౌతారు

సాయీ సాయీ బాబా బాబా అని స్మరించుతారు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉలుకూలేదు పలుకూలేదు 

కులుకూలేదు అలకా లేదు

మతలబు  ఏంటో నాకు చెప్పమ్మో

మందహాసం కాస్తైనా గుప్పమ్మో

ఎరిగించవే ప్రియా ఓ నా చెలియా

చూపించవేలనే  నామీద నీదయా


1.ముల్లుగుచ్చుకున్నదా గులాబీలు త్రెంచుతుంటే

వేలుకోసుకున్నదా  వెన్నకోయబోతుంటే

వేడిసెగ తాకిందా దీపంవత్తి ఎగదోస్తుంటే

నడుంపట్టివేసిందా దిండు సవరిస్తుంటే

ఎరిగించవే ప్రియా ఓ నా చెలియా

చూపించవేలనే  నామీద నీదయా


2.లాఘవంగ తీయనా నొవ్వకుండ ముల్లుని

మలాంనే పూయనా వేలికైన గాయానికి

నవనీతం రాయనా కాలిన వేళ్ళ కొసలకు 

నూనె మర్ధన చేయనా నాజూకు నడుముకు

ఎరిగించవే ప్రియా ఓ నా చెలియా

చూపించవేలనే  నామీద నీదయా

 2422 పాటల వరకే ముద్రణ కోసం సంగ్రహించడమైనది

వీటిలో అత్యుత్తమమైనవి 108X11= 1188 పాటలు ప్రచురించడం జరుగుతుంది