Sunday, June 20, 2021

https://youtu.be/UZ8ozqDV0kk?si=qNx9B6iFPRRm6tfB

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: మధ్యమావతి

శారదా నా కవన వరదా
ఏల నీ హృదయాన పరదా
నీ నామజపమే నాకు సదా
నా ఊసంటేనే నీకు చేదా?
నువు కనికరించే రోజే రాదా

1.అక్షరమౌ నీ అక్షర సుధ
లక్షణమౌ నీ పద సంపద
ఊతమీయవే మాత నా గీతమందున
చేయూతనీయవే నా జీవితమందున

2.శ్రుతి శుభగమవనీ ప్రతి కృతిని
లయ లయమైపోనీ నీ ఆకృతిని
సుస్వరాలు రవళించనీ మనసుకను రాగమై
గమకాలు పరిమళించనీ ఎదకు శుభయోగమై


 

https://youtu.be/nbTqWezBdCk

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శిరము నుండి దూకేను ఒక విషము

గళము  నందు నిలిచేను ఒక విషము

విషయ వాంఛా రహితుడవు శివుడవు

విషమము నీతత్వము మాకు అర్థమే కావు

శంభోమహాదేవ కైవల్య దాయకా

సాంబసదాశివ శరణము నీవే ఇక


1.మునులెందరు నీకై తపమాచరించిరో

రావణాదులెందరు నీ వరములనందిరో

నందివాహన సచ్చిదానంద ధవళ మోహన

అమర వందిత గంగాధరా నమో పంచానన

శంభోమహాదేవ కైవల్య దాయకా

సాంబసదాశివ శరణము నీవే ఇక


2.ఏ స్థాణువైనా  కనగ లింగ రూపమే

ఏ శబ్దమైనా నాకు ఓంకార నాదమే

భోళాశంకరుడవు శశాంకధరుడవు

సుజ్ఞాన వరదుడవు త్రిపురాసుర హరుడవు

శంభోమహాదేవ కైవల్య దాయకా

సాంబసదాశివ శరణము నీవే ఇక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీలాల మేఘాల నీ కేశాలు

వేసాయి నామదికి పాశాలు

గాలికి చెలరేగుతూ ఆసక్తే  రేపుతూ

అలరించినాయి నీకందమిస్తూ

మురిపించినాయి నా ఎద దోస్తూ


1.కదలాడు మీనాలు నీ సోగనయనాలు

తీస్తాయి చూపులతో నా పంచప్రాణాలు

తాళజాలరెవ్వరు  నీ తీక్షణ సుమ బాణాలు

నినుచూస్తూ  బ్రతికితె చాలు నాలుగే క్షణాలు


2.భూమినైన మించిఉంది నీ ఆకర్షణ

ఎదురుగా నీవుంటే అంతర్గత ఘర్షణ

చెప్పలేను మానలేను అంతఃకరణ

నీ కరుణ గనకుంటే అది మరణ యాతన

 

https://youtu.be/CvOpQYZBchw?si=u2-Uu9BYdsJJv2

(పితృదేవుల దినోత్సవ సందర్భంగా మా నాన్న సంస్మృతిలో)


వాడని గులాబీవి నీవు

కమ్మని జిలేబీవి నీవు

సజీవంగ మెదులుతాయి నీ తలపులు

 వెన్నంటే ఉన్నాయి  నీ మందలింపులు

నాన్నా నువ్వెప్పుడు చిరంజీవుడవే

నాన్నా మాగుండె గుడిలొ నువు దేవుడవే


1.నడవడి నది కట్టడికి ఆనకట్ట నీవు

మా ఉన్నతి అక్కెరలకు తేనెతుట్టెవు

కష్టాలలో సైతం నవ్వే గుట్టునెరుకపర్చావు

ఉన్నంతలొ జీవించే పట్టు తెలియజేసావు

నాన్నా నువ్వెప్పుడు చిరంజీవుడవే

నాన్నా మాగుండె గుడిలొ నువు దేవుడవే


2.అంజయ్యసారు కొడుకన గర్వమే

నీతోటి గడిపిన ప్రతిరోజూ పర్వమే

ఆహారం ఆహార్యం నీవన్నీ రుచికరమే

నీకడుపున పుట్టడం మాకపూర్వ వరమే

నాన్నా నువ్వెప్పుడు చిరంజీవుడవే

నాన్నా మాగుండె గుడిలొ నువు దేవుడవే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూడనీ నను చూడనీ నిను చూడనీ కడతేరనీ

పాడనీ నీ మిసిమి పొగడనీ,నను తరించనీ

మాటాడనీ నను మది తెలుపనీ స్నేహించనీ

తోడవనీ ననునీ నీడవనీ నిను విడువక జీవించనీ


1.చందమామలా నీ మోముని

మిలమిల నక్షత్రాలు నీ నేత్రాలని

కోటేరు సూటి నీ ముక్కెర ముక్కని

పెదాలు పిండుకొనే తేనె తెట్టెలని

ఊహించుకొన్నాను కలలెన్నొ కన్నాను

ఊహ వాస్తవంగా చేయనెంచవే

కలలు నిజం చేయగా కనిపించవే


2.చూపు మరలనీయని నీరూపుని

మధురతరమైన నీ మాట తీరుని

మనోహరమైన నీ చిరునవ్వుని

మెరుపుతీగ వంటి నీ హొయలుని

చిత్రించుకొన్నాను ఆత్రంగ ఉన్నాను

సజీవంగ మారనీ నామనో చిత్రమే

వరమై వరించనీ నా మదిలోని ఆత్రమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


నీ ముక్కుపోగు నన్ను ముగ్గులోకి లాగు

నీ కలువ కళ్ళు నన్ను కదలనీవెలాగు

నీకొంటె నవ్వు నన్ను వెంబడించి సాగు

ఇక నీ ఆరాధన అనుక్షణం కొనసాగు

ఈ కవి తలలో నీవే నా కవితలలో నీవే

నా జతగా చేరిపోవె నా జీవితమీవె కావె


1.మధువలవాటు లేదు మత్తులో ముంచావే

ఒరులను నేనెరుగను కొంగున ముడివేసావే

రేయిలేదు పగలు లేదు ఎప్పుడూ నీధ్యాసే

కవితా నా కవిత యంటు సదా నీ ధ్యానమే

ఈ కవి తలలో నీవే నా కవితలలో నీవే

నా జతగా చేరిపోవె నా జీవితమీవె కావె


2.గులాబీల రెక్కలే నీ లేలేత పెదాలు

తమలపాకు తీరేలే చిగురంటి పాదాలు

ఎక్కడ ముద్దిడినా మధురాతి మధురాలు

హద్దులు  దాటించగలుగు నీ మేని సోయగాలు

ఈ కవి తలలో నీవే నా కవితలలో నీవే

నా జతగా చేరిపోవే నా జీవిత మీవె కావె