Tuesday, October 26, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పసిడి వన్నెల చినదానా

పసిడి పలుకుల నా మైనా

పసిడి నగలే అణువణువున  నీ మేన

పసడివిలువే సున్నా నీకన్నా


1.తూరుపింటి ఆ పసిడి అరుణిమే

నీ బుగ్గల నునుసిగ్గు

పొద్దుగ్రుంకు సంజె కెంజాయే

నీ మోవికి తల ఒగ్గు

చుక్కల చెమ్కీల నిశి చీర 

ఆర్తిగా నిన్ను పొదువుకున్నది

చక్కని శశిబాల నీఅందంతో

తన మోమును పోల్చుకున్నది


2.కొలనులొ కాంతులీను కలువభామ 

కలతచెందె నీ కనులు గాంచి

కడలి చెలగు మెరుగుల అలల నురుగు 

మిన్నకుంది నీ నగవుల వీక్షించి

దోచుకుంది ఒకింత పారిజాతమే

నీ తనువు తావిని పులకించి

సంతరించుకుంది ప్రకృతి చిత్రమే

నీ సొగసుల శోభ కాస్తైనా అనుకరించి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాకోసం స్పందించే ఒక గుండె ఉన్నది

నా స్నేహం ఆశించే ఒక మనసు ఉన్నది

నా కోసం కారేటి అశ్రువొక్కటున్నది

నా కంటి చెమ్మను తుడిచే చేయి ఒక్కటున్నది


1.అందరున్న అనాథగా బ్రతుకు సాగుతున్నది

ఆదరణే నోచుకోక  దినమేదో గడుస్తున్నది

ఒయాసిస్సు ఎదురైనట్టు ఓదార్పు తానిచ్చింది

ఎడతెగని నా రాతిరికి ఉషస్సుగా వెలుగిచ్చింది


2.లోకమంత పగబూనినా నాతోడుగ నిలిచింది

శోకం నా దరి రానీకుండా ఆనందం పంచింది

నవ్వులెన్నొ రువ్వుతూ సాంత్వన కలిగించింది

నీకోసం నేనున్నానని భరోసా కలిపించింది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ పూవు చూసినా నీ మోమే కనిపిపిస్తోంది

చిరుగాలి తాకినా నీ స్పర్శే  అనిపిస్తోంది

ఎంతగా నిండిపోయావే నా గుండెలోనా

వింతగా ఉండిపోయావే నా మెదడులోనా


1.చంద్రవంక వంక చూస్తే చిరునగవు నీదనిపించె

వాగు వంక ఏదెరొస్తే నీ నడుము వంపుగా తోచె

ఏ వంకా లేని పొంకమా  నా వంక రావింకేలా

శంకలింక మొత్తం వదలి నా అంకము చేరవేలా


2.గుంభనంగ ఉంటావెందుకు తెలుపవే నీ గుట్టు 

సంబురమా నన్నుడికించగ ఎందుకే నీకా బెట్టు

తిరుగుతూనే ఉంటానూ సూర్యకాంతినై నీ చుట్టూ

నిన్నంటి పెట్టుకునేలా  నేనౌతా నీ నుదుటన బొట్టు