Monday, March 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


తామరాకు మీది నీటిబొట్టు నీ గుట్టు

బ్రహ్మకైన బోధపడదు నీ తాత్విక పట్టు

చూడబోతె ఇరుపత్నుల సంసారివి

వాడవాడ బిచ్చమెత్తు సన్యాసివి

ఎంతవింతదయ్య నీమాయ సదయ్య

చింత మాయ  నీ చింతన హాయి కదయ్య


1.ఆది అంతమే అసలులేనివాడివి

అనాదిగా దైవమైన పరమశివుడివి

ఇల్లూ వాకిలీ నీకంటూ పట్టవేవి

ఏనుగుతోలునే ఎపుడూ కట్టితివి

నిన్నుచూస్తె తెలియదా నిరాడంబరమేంటో

అడిగిందల్లా ఇచ్చే నీవల్ల త్యాగమంటేమిటో


2.అందాలను ఏమాత్రం నువు ఆశించవు 

బంధాల వలలోన ఎన్నడూ చిక్కవు

సత్రపు భోజనం మఠంలో నీ నిద్ర

నాకు తోడు నీవేరా కరుణా సముద్ర

నీ కంటె సుఖపురుషుడు ఎవ్వరీ లోకంలో

నిన్నుమించి స్థితప్రజ్ఞులున్నారా ఈ ఇలలో


Pic courtesy: Agacharya Artist

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


పట్టీలతొ మది కట్టేసే నీ పాదాలకు ముద్దు

పట్టుచీర అంచుకు నే పెట్టెదనొక ముద్దు

పట్టపురాణిగ చేకొని చేసితి నినుముద్దు

పట్టుగొమ్మ పరువాలకీవేనని ఇచ్చితినొకముద్దు


1.పట్టుతేనెకాటపట్టు నీపెదాలపై ముద్దు

పట్టుబట్టిపెట్టితి నీ నుదుటిపైన ముద్దు

పట్టరాని ఆనందం నీవిచ్చే ప్రతి ముద్దు

పట్టిపట్టి నువుపెట్టే ప్రతిముద్దూ నాకు ముద్దు


2.పట్టువిడుపు ఉన్నప్పుడు బెట్టైనా ముద్దు

పట్టించుకోనప్పుడు చేదౌను పెట్టే నా ముద్దు

పెట్టకుంటెమానె నన్ను తిట్టుకుంటు నువు ముద్దు

పెట్టేబేడా సర్దుక పుట్టింటికెళ్ళకుంటే బతుకంతా ముద్దు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కుప్పబోసిన అచ్చర ముత్తెము లసలేకాదు

ఏర్చికూర్చిన పదముల పగడములైతే కాదు

తలకూ తోకకు పొంతనలేని వాక్యాలు కాదు

పటాటోపమై వింతనుగొలిపే శైలి శిల్పం కాదు

కవితంటేనే హృదయ జన్యమౌ భావుకత

కవితంటేనే మనసును మనసుతొ కలిపే గీత


1.ఉల్లాసానికి నిలమైయ ఉద్వేగానికి ఆలవాలమై

నవరస సుసంపన్నమై ప్రకృతితో మమేకమై

శివజటాఝూటమౌ ఆకాశగంగయై

అర్జున శరాఘాతజనిత పాతళగంగయై

కవి మనమున ఉద్భవించు బ్రహ్మకమలమే కవిత

కవితంటేనే మనసు మనసుతో పలికే భాష


2.అందరి అస్పష్టానుభూతి అందరికిష్టమైన విభూతి

సరస్వతీమాతృ స్తన్యమే సాహితి ఇది మేధోసంపతి

జానపదుల శ్రమజీవన సౌందర్యమై

సమసమాజ నిర్మాణ సాధనమై

కవి కరమున తిరుగులేని ఆయుధమే కవిత

కవితంటేనే మనసుకు మనసుకు అనుసంధానత