Thursday, October 3, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శుభ పంతువరాళి

ఏమి సేతునే మనసా నిన్నెటులోర్తునే
సతతము మతిమాలి చరియింతువే
కట్టిడిసేయగ  బెట్టుసేతువే
నిన్నట్టి పెట్టగా కట్టజాలనైతి  సేతువే

1.వానర సరియగు చపలత నీది
ఖేచర సమతుల చంచల బుద్ధి
నిలకడ మెదలవె కదలక నాకడ
కుదరదు విచ్చలవిడి రాకడపోకడ

2.చదువగనెంచిన కుదురుగ నుండవు
సంగీతముతో సాంత్వన నొందవు
కాంతా కనకాల చింతన చేతువు
శ్రీకాంతు చరణాల చెంతయె ఇకపై నీతావు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:కామవర్ధిని

కాత్యాయనీ కాత్యాయన ముని వందిని
కారుణ్యరూపిని కరుణాంతరంగిణి
మృగరాజవాహిని నగరాజ నందిని
దేహిమే దేవీ దివ్య దర్శనం
నిరంతరం తవ పాద సన్నిధానం

1.ప్రకృతి వ్యాపిణి హరిత వర్ణశోభిని
దీనజనోధ్ధరాణ కంకణ ధారిణీ
రోగనివారిణి ఔషధ సంజీవని
ఆయుర్వర్ధిని అభయప్రదాయిని
దేహిమే దేవీ దివ్య దర్శనం
నిరంతరం తవ పాద సన్నిధానం

2.కమల ఖడ్గ కరభూషిణి దాక్షయణీ
పీతాంబరాలంకార భవ్య ప్రకాశినీ
దురితదూరిణీ దుఃఖపరిహారిణీ
మందసుహాసినీ మంజుల భాషిణీ
దేహిమే దేవీ దివ్య దర్శనం
నిరంతరం తవ పాద సన్నిధానం

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:షణ్ముఖ ప్రియ

స్కందమాత వందనం
ఖంబువదన వందనం
లోకమాత వందనం
శోకహారీ వందనం

1.అతులిత  ప్రేమభరితం
నీ నయనకౌముది వీక్షణం
వర్ణసంయుతం గిరి సుతం
లక్ష్యలక్షణ మోక్ష లక్షితం

2.చతుర్భుజే చతుర్ముఖు సేవితం
హరిహరనుతే షణ్ముఖ మాతరం
సింహవాహినీం  పద్మయగ్మహస్తినీం
కరుణామృతవరదం సుఖదాయినీం

"ఆ-పన్నులు"

పన్నులు పన్నులు పన్నులు
సామాన్యుడి నడ్డిమీద ప్రభుత తన్నులు
మూలకోతపన్నులు సమూలంగా పన్నులు
ఎరుకపరచి కొన్నీ ఏమార్చి కొన్నీ
తప్పులు చేయించి మరీ జరిమానా వసూళ్ళుకొన్నీ
ఆ పన్నుల బారినుండి ఆపన్నుల కాపాడేదెవ్వరో

1.ఆదాయం మీద పన్ను ఆలస్యంమీద పన్ను
ఎగవేతమీద పన్ను సమర్పించకున్న పన్ను
కొనుగోలుమీద పన్ను అమ్మకాలమీద పన్ను
వస్తువులకు సేవలకు అడుగడుగున పన్ను
పన్నే కదా పాలనకు ఎన్నదగిన వెన్నుదన్ను
పన్నులూడగొట్టేలా ఉన్నపుడే బ్రతుకు మన్ను
ఆ పన్నుల బారినుండి ఆపన్నుల కాపాడేదెవ్వరో

2.వసతులకెప్పుడు ఉండబోదు అతీగతి
అన్నివర్గాల జనుల మనుగడే అధోగతి
పన్నుంటుందిగాని రాదారి బాగోదు
పన్నుంటుందిగాని మంచినీరు రాబోదు 
ముక్కపిండి ఒక్కసారే లాక్కున్నా పర్లేదు
గుచ్చిగుచ్చి చంపునట్లు పన్నుమీద పన్ను పోటు
ఆ పన్నుల బారినుండి ఆపన్నుల కాపాడేదెవ్వరో