Thursday, May 21, 2020


ఏమ్మాయ చేసావో-ఏ మంత్రమేసావో
వలపువలల తో నన్ను పట్టేసినావు
కడకొంగుతోనన్ను కట్టేసినావు
నీవులేని జీవితం నిస్తేజము
నిన్నుపొందలేకుంటే మనస్తాపము

వదనారవిందము-చందమామ చందము
మృదుమధుర దేహము-పారిజాత గంధము
అధరాలు గ్రోలితే-అమృత సదృశ్యము
ముంగురులు రేగితే మేఘమాల దృశ్యము
ఏరీతిగా నిన్ను వర్ణించనే చెలీ
ఏమిచ్చి నేనిన్ను చేర్చేను కౌగిలి

తీయని నీ పలుకులలో కురియునులే తేనియలు
గలగల నీ నవ్వులలో దూకేనే జలపాతాలు
కోకిలలే నిను కోరి పాట నేర్చుకున్నాయి
హంసలు నిను బ్రతిమాలి నడక నేర్చుకున్నాయి
జగదేకసుందరీ అందుకోవె వందనాలు
అర్పించినానే నీకు నా ఏడు జీవితాలు